రామాయణం

దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః
తతో దేవాసురాస్సర్వే మమంథూ రఘునందన
ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతోనఘః
తతో దేవాః సగంధర్వా స్తుష్టువుర్మధుసూదనాం
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్తిథః
పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః
పర్వతాగ్రే తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః
దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమః

హాలాహలాన్ని పానం చేసాడు పరమశివుడు . దేవదానవులు తిరిగి సముద్ర మథనాన్ని మొదలు పెట్టారు . ఇంతలోనే ఇంకొక విఘ్నం తటస్థించింది .సముద్రమథనానికి కవ్వంగా వాడుతున్న మందర పర్వతం సముద్రంలో బుడ బుడా మునిగిపోయింది . దిక్కుతొచని దేవ దానవులు హరిని ఆశ్రయించారు .” స్వామీ ! సర్వ భూతాలకూ నీవే దిక్కు . సముద్రంలో మునిగిన మందరాన్ని పైకెత్తి మేము తలపెట్టిన కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించడానికి సహకరించవా ” అని వేడుకున్నారు . శరణన్న వారిని వదలడా వేదవేద్యుడు . మందరగిరిని సముద్రం పైకి చేర్చడానికి కూర్మావతారమెత్తాడు . ఆ మహాకూర్మం మందర పర్వతాన్ని తన మూపుపై మోస్తూ పాలకడలి అడుగు భాగాన పవళించింది . అంతే కాకుండా సకలలోకాలకూ ఆత్మ , పురుషోత్తముడైన ఆ మహానుభావుడు దేవతలో మధ్యలో నిలిచి పర్వతాగ్రాన్ని పట్టుకొని సముద్రాన్ని మథించాడు (రెండురూపులు ధరించాడని అర్థమేమో?) . ఒక వైపు మందరాన్ని మూపున పెట్టుకున్నాడు ఇంకొక వైపు సముద్రమథనంలో పాలు పంచుకున్నాడు .
ఆలోచన:

ఏదైనా పెద్దపని తలపెట్టితే విఘ్నాలు కలగడం సహజం . అమృతం సాధించాలంటే విఘ్నాలు కలగకుండా ఉంటాయా ? కానీ విఘ్నాలకు భయపడి తల పెట్టిన కార్యాలను ఆపవద్దని సందేశమిస్తున్నది ఈ కథ . అంతే కాకుండా దైవబలాన్ని సమకూర్చుకుంటే ఎటువంటి విఘ్నమైనా తొలగిపోక తప్పదని స్పష్టం చేస్తున్నది .
భాగవతం :

కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో నౌ నౌగదే ! బాపురే!
కమలాక్షా ! శరణంబు భూదిశలు నాకాశంబునన్ మ్రోయగన్ .

విష్ణువు లక్ష యోజనాల వెడల్పైన వీపుతో ఉన్న మహాకూర్మంగా అవతారమెత్తాడు . పెద్ద నోరూ , అంతకంటే పెద్దదైన కడుపూ , విశ్వమంతా మీద పట్ట కదలకుండా ఉండే కాళ్ళూ కలిగి అద్భుతంగా కనిపించాడు . సుందరంగా కనిపిస్తున్న కమలాల వంటి కన్నులు ఆ మహా కూర్మం స్వంతం . స్వామి కమలాక్షుడు కదా.

తాబేలుగా మారిన ఆ మహనీయుడు సముద్రంలోకి ముత్తెపు చిప్ప ప్రవేశించినంత సులువుగా ప్రవేశించాడు . బ్రహ్మాది దేవతలు” ఔను ! ఔనౌను ! బాపురే ! కమలాక్షా శరణం”! అని ముక్త కంఠంతో ప్రస్తుతిస్తూండగా
సముద్ర జలాలనుండి వాసుకినీ , మందర పర్వతాన్నీ పైకి లేపాదు .
తరిగాండ్రలోన నొకడట , తరి కడవకు గుదురు నాక త్రాడట చేరుల్;
దరి గవ్వంబును దా నత , హరి హరి ! హరి చిత్రలీల హరియే యెరుగున్
సముద్రమనే కడవకు కుదురు అయిన హరి , సముద్రాన్ని చిలికే వారిలో ఒకడుగా కూడా ఉన్నాడు . చిలికే కవ్వమూ , కవ్వానికి చుట్టిన త్రాడూ తానే అయినాడు (” సర్పానా మస్మి వాసుకిః” అని భగవద్గీత వాక్యం ) . హరి లీలలు హరికే తెలుస్తాయి .

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి