Monthly Archives: మార్చి 2015

రామాయణం

ఏష దేశస్స కాకుత్థ్స మహేంద్రాధ్యుషితః పురా
దితిం యత్ర తపః సిద్ధామేవం పరిచచార సః

ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః
అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః

విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః
సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాదనంతరః

సుచంద్ర తనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః
ధూమ్రాశ్వ తనయశ్చాపి సృంజయః సమపద్యత

సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్
కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః

కుశాశ్వస్య మహాతేజా సొమదత్తః ప్రతాపవాన్
సోమదత్తస్య పుత్రస్తు కాకుత్థ్స ఇతి విశ్రుతః
తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమాం
అవసత్య అమరప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః

శ్రీరామా ! అసురమాతయైన దితి తపస్సు చేసే సమయంలో దేవేంద్రుడు ఆ మాతకు సేవలు చేసిన స్థల మిదే .ఈ ప్రదేశంలోనే ఇక్ష్వాకు మహారాజుకు అలంబస అనే స్త్రీ ద్వారా విశాలుడుగా ప్రసిధ్ధి కెక్కిన తనయుడు జన్మించాడు . ఆత్డు విశాలపురమనే నగరాన్ని నిర్మించినదీ ప్రదేశంలోనే .

విశాలుని కుమారుడు హేమచంద్రుడు , అతని కుమారుడు సుచంద్రుడు . సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుదు , మనుమడు సృంజయుడు . సృంజయుని కొడుకు సహదేవుడు . ధార్మికుడైన కుశాశ్వుడు సృంజయుని కుమారుడు . కుశాశ్వునకు సోమదత్తుడు , ఆతనికి కాకుత్థ్సుడు జనించారు .

కాకుత్థ్సుని పుత్రుడు సుమతి . దేవతలకు దీటైనవాదు , దుర్జయుడు అయిన సుమతి ప్రస్తుతం ఈ నగరానికి రాజు .

Note : 

ప్రస్తుతం విశాల నగరం బీహార్ రాష్ట్రంలో వైశాలి అనే పేరుతో విరాజిల్లుతున్నది . బౌధ్ధులకూ , జైనులకూ ఈ ప్రదేసం పుణ్యక్షేత్రం . జైన మత స్థాపకుడు మహావీరుడు జన్మించిన స్థలమిదేనని శ్వేతాంబర జైనులు చెబుతారు .

తన శిష్యుడైన ఆనందుని కోరిక ప్రకారం బుధ్ధుడు స్త్రీ బౌధ్ధబిక్షువులను సంఘంలోకి మొట్టమొదటగా అనుమంతించిన ప్రదేశమిదే .

ఆరవ శతాబ్దిలో లిచ్ఛవీ రాజుల రాజధానిగా వర్ధిల్లిన ప్రదేశమిది .

రామాయణం

బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపరః
దివి వాయురితి ఖ్యాతాస్తృతీయోపి మహాయశాః
చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్
సంచరిష్యంతి భద్రం తే దేవభూతా మమాత్మజాః

త్వత్కృతేనైన నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః

తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః
ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః

సర్వమేతద్య్ధోక్తం తే భవిష్యతి న సంశయః
విచరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః

ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే
జగ్మతుస్త్రి దివం రామ కృతార్థావితి నః శ్రుతం
తన గర్భలో ఏడు భాగాలుగా ఛేదింపబడిన పిండాన్ని  ఏడు మారుత స్థానాలకు (లేక వాయు స్కంధాలకు) అధిపతులుగా చేయాలని  దితి ఇంద్రుణ్ణి కోరింది . ఆ ఏడు మారుత స్థానాలు వరుసగా

1. ఆవహము, 2. ప్రవహము, 3. సంవహము, 4. ఉద్వహము, 5. నివహము, 6. పరివహము, 7. పరావహము

అనేవి . ఈ మారుత స్థానాలే నక్షత్ర మండలాలకు ఆధారం అని మన పూర్వీకుల నమ్మకం .

తన కుమారులు ఈ మారుత స్థాలలో సంచరిస్తూ వాటికి పాలకులుగా ఉండాలి అన్నది దితి కోరిక . అందునా ఒకడు బ్రహ్మ లోకంలో , రెండవవాడు ఇంద్రలోకంలో , మూడవ వాడు వాయువనే నామధేయం కలిగి అంతరిక్షంలో సంచరించేలా వరమీయమని కోరింది దితి .

మిగిలిన నలుగురు కుమారులు నీ ఆజ్ఞ వలన దేవతలై ( దేవభూతాలై ) నాలుగు దిక్కులలో సంచరించాలి . వీరిని సంహరించే సమయంలో నీవు ” మా రుదః” ( ఏడవ వద్దు ) అని పలికావు . అందుచేత వీరు ” మారుత ” అనే పేరుతో పిలవబడాలి ” అని ఇంద్రుని కోరింది దితి .

మాత అయిన దితి ముందు అంజలి ఘటించి ” అమ్మా ! అంతా నీ కోరిక ప్రకారమే జరుగుతుంది . నీ కుమారులు దేవతలై అంతరిక్షంలో సంచారం చేస్తారు . నీకు భద్రమగు గాక ” అని వరమిచ్చాడు . ఈ వాయువులే మరుత్తులు లేక మరుద్గణాలు .

” ఈ విధంగా  తపోవనంలో దితి , ఇంద్రుడు నిశ్చయించుకొని కృతార్థులైనారు . అటుపిమ్మట వారిరువురూ స్వర్గానికి వెళ్ళారని నేను విన్నానని ” విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలిపాడు .

DSC04556

రామాయణం

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాబ్రవీత్

మమాపరాధాద్గర్భోయం సప్తధా విఫలీకృతః
నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన

ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే

నాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః
దితి తన గర్భ ఫలాన్ని నాశనం చేసిన దేవేంద్రుణ్ణి ఏ విధంగానూ ఎదుర్కొనడానికి సామర్థ్యం లేనిదని గ్రహించింది . దుఃఖ భాజనురాలైన దితి దేవేంద్రునితో ” బలసూదనా ! ( బలాసురుని సంహరించినవాడా ) నా అపరాధం వలన నా గర్భం ఏడు ముక్కలయింది . దీనిలో నీ అపరాధమేమీ లేదు . నేను అనుకున్నది ఒకటయితే జరిగింది వేరొకటి . నీవు నాకోసం ఒక ప్రియమైన పని చేయవలసింది . నా గర్భ ఖండాలు ఏడూ , ఏడు మారుత స్థానాలకు పాలకులయే విధంగా నాకు వరాన్ని ప్రసాదించు .

సీతారాముల నివాసమైన గుహ

సీతారాముల నివాసమైన గుహ

రామాయణం

భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా
రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత

మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోభ్య భాషత
బిభేద చ మహాతేజా రుదంతమపి వాసవః

న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్
నిష్పపాత తతః శక్రో మాతుర్వచన గౌరవాత్

ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోభ్యభాషత
అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా

తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే
అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి

DSC06106

రామా ! వంద అంచుల వజ్రాయుధంతో గర్భాన్ని ఏడు భాగాలుగా ఛేదించాడు ఇంద్రుడు . ఆ విధంగా ఛేదిస్తునప్పుడు గర్భం పెద్దగా ఏడ్చిందట . ఏడవద్దు , ఏడవద్దు అని పలుకుతూనే ఆ గర్భాన్ని ఛేదించాడు ఇంద్రుడు . ఆ ఏడుపు విన్న దితికి నిద్రాభంగ మయి లేచింది . ఇంద్రుడు తనకు పుట్టబోయే బిడ్డను నాశనం చేస్తున్న విషయం గమనించి న హంతవ్యో , న హంతవ్యో ( చంప వద్దు , చంపవద్దు ) అని దీనంగా వేడుకున్నది . మాతృ దేవి మాట మీది గౌరవంతో దితి గర్భాన్నుండి బయటకు వచ్చాడు దేవేంద్రుడు .

బయటకు వచ్చి ” అమ్మా ! నీవు తల వెండ్రుకలు కాళ్ళకు తగిలేలా పడుకున్నావు ( దానితో నీకు వ్రత భంగమయింది ) . ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను . యుధ్ధంలో నన్ను సంహరించగలిగే ఈ బాలుని నేనే ఏడు ఖండాలుగా ఛేదించాను . నన్ను క్షమించు ” అని పలికాడు .

రామాయణం

ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే
నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాథ శీర్షతః

దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం
శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ

తస్యాః శరీర వివరం వివేశ చ పురందరః
గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్
అటుపిమ్మట అదితి మధ్యాన్న సమయంలో తలవైపు పాదాలు పెట్టుకొని పడుకున్నది . ఈ విధంగా పడుకోవడం వ్రతభంగానికి కారణమవుతుందట . ( తలవైపు పాదాలు పెట్టుకోవడం అంటే కూర్చున్న చోటే తల వంచి తల వెంట్రుకలు పాదాలమీద పడేలా పడుకోవడమేమో ? ఏది ఏమైనా దితి పడుకున్న విధానం ఆవిడను అపవిత్రురాలిని చేసింది . ఆవిడ వ్రతం భంగమయింది) .

అపవిత్రురాలైన దితిని చూసి దేవేంద్రుడు తనలో తానే నవ్వుకున్నాడు . ధైర్యంగా దితి గర్భంలో ప్రవేశించాడు . మాతృమూర్తి గర్భాన్ని ఏడు ఖండాలుగా ఖండించాడు .

నోట్ : దేవేంద్రుడు తనకు శత్రువైనా తన దగ్గరకు చేర్చుకున్నది దితి . ఆతని సేవలను సంతోషంతో స్వీకరించింది .ఇది దితి చేసిన పెద్ద తప్పు . అవకాశం కోసం ఓపికగా ఎదురుచూసాడు ఇంద్రుడు . అవకాశం దొరకగానే పుట్టబోయే శత్రువును ఖండించాడు .

శత్రువు ఎంత కావలసిన వాడైనా దగ్గరకు రానివ్వకూడదని ఈ కథ ద్వారా సందేశమిస్తున్నాడు వాల్మీకి .

IMG_4964

రామాయణం

గతే తస్మిన్నర శ్రేష్ఠ దితిః పరమహర్షితా
కుశప్లవన మాసాద్య తపస్తేపే సుదారుణం

తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార హ
సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా

అగ్నిం కుశాన్ కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ
న్యవేదయత్ సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితం

గాత్ర సంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా
శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ
వరమిచ్చి వెళ్ళిపోయాడు కాశ్యప మహర్షి . తనకోరిక తీరగలదని సంతోషించింది దితి . కుశప్లవనం అనబడే ప్రదేశానికి చేరి దారుణమైన (తీవ్రమైన ) తపస్సు చేయడానికి ఉపక్రమించింది .తపస్సు పవిత్రంగా ఉండడానికి దోహద పడుతుంది కదా

దితి తపస్సు చేస్తున్న విషయం ఇంద్రుడికి తెలిసింది . తపస్సు చేస్తున్న దితికి అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవ చేయడానికి పూనుకున్నాడు ( ఇదంతా మోసపూరితమైన ఆలోచనతొనే) . అగ్ని , కుశగ్రాసాలు , సమిధలు , తీర్థం (నీళ్ళు ) , ఫలాలు ,కంద మూలాలు సమకూర్చి దితి తపస్సు నిర్విఘ్నంగా కొనసాగడానికి సహాయం చేసాడు . అంతే కాకుండా ఆవిడ శ్రమ తగ్గించడానికి గాత్రసంవహనం ( మసాజ్ ) లాంటివి చేసాడు .

నోట్ : ఇంద్రుణ్ణి సంహరించడానికి తపస్సు చేస్తున్న దితి ఇంద్రుని సహాయాన్ని ఎందుకు స్వీకరించిందో అర్థం కావడం లేదు . తనెందుకు తపస్సు చేస్తుందో ఇంద్రునికి తెలియదని అనుకుందేమో ? ఇక ఇంద్రుడి మోసమంటారా . ఏ కథ చూసిన అది అర్థమవుతుంది . తన పదవి పోతుందని ఎంతమంది ఋషుల తపస్సులు పాడుచేసాడో తెలిసిందే కదా .

అథ వర్ష సహస్రే తు దశోనే రఘునందన
దితిః పరమ సంప్రీతా సహస్రాక్ష మథాబ్రవీత్

యాచితేన సురశ్రేష్థ తవ పిత్రా మహాత్మన
వరో వర్షసహస్రాంతే దత్తో మమ సుతం ప్రతి

తపశ్చర్యంతా వర్షాణి దశవీర్యవతాం వర
అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః

తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం
త్రైలోక్య విజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః
దేవేంద్రుడు సేవ చేస్తూ ఉండగా దితి తొమ్మిది వందల తొంభై సవత్సరాలు తపస్సు చేసింది . ఇంద్రుడు చేసిన సేవలకు చాలా సంతసించింది . ” సురులలో శ్రేష్ఠుడా ! నా కోరిక ప్రకారం నీ తండ్రి నాకొక వరమిచ్చాడు . వేయి సంవత్సరాల తపస్సు చేసాక నాకొక పుత్రుడు పుడతాడని . ఇక పది సంవత్సరాలు గడిస్తే వేయి సంవత్సరాలు పూర్తి అవుతాయి . నీకు సోదరుడు ఉదయిస్తాడు . నీకు మంగళమగుగాక . నాకు పుట్టబోయే కుమారుడికి జయాభిలాషను కలిగిస్తాను . అతదు మూడు లోకాలను జయిస్తాడు . అతనితో కలిసి నీవు మూడు లోకాల మీదా ఆధిపత్యం సంపాదించగలవు ” అని ఇంద్రునితో పలికింది .
నోట్ : ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు కావాలని కోరి , తపస్సు చేసిన రాక్షస మాత , ఇంద్రుని సేవలకు సంతోషించి , అతనికి త్రైలోక్యాధిపత్యాన్నిస్తానంటోంది .ఇది విచిత్రంగా లేదూ .

రామాయణం

సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి
ఈశ్వరం శక్రహంతారం య్వమనుజ్ఞాతుమర్హసి

తస్యా స్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా
ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితాం

ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే
జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే

పూర్ణే వర్ష సహస్రే తు శుచిర్యది భవిష్యసి
పుత్రం త్రైలోక్య భర్తారం మత్తస్త్వం జనయిష్యసి
ఏవ ముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జతాం
సమాలభ్య తతః  స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ

మరీచి మహర్షి కుమారుడు కాశ్యపుడు .తనయులను కోల్పోయిన దితితో ” తపోధనే ! భద్రం ! నీకు క్షేమమగుగాక . యుధ్ధంలో దేవేంద్రుని సంహరించగల  పుత్రుణ్ణి కనగలవు . వేయి సంవత్సరాలు పవిత్రంగా ఉంటే , మూడు లోకాలకూ ప్రభువు కాగక్ల కుమారుడు నావలన నీకు కలుగుతాడు” అని పలికి దితిని తన హస్తంతో స్పృశించి నీకు క్షేమం కలుగుగాక అని ఆశీర్వదించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు .

note: ఇక్కడ గమనించవలసింది పవిత్రంగా అన్న పదం .

IMG_5006

Almond blossoms

రామాయణం

హతేషు తేషు పుత్రేషు దితిఃపరమ దుఃఖితా
మారీచం కాశ్యపం రామ భ్ర్తారమిదమబ్రవీత్

హతపుత్రాస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘ తపోర్జితం

సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి
ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతు మర్హసి

అమృతాన్ని ఆరగించి అమరులైన దేవతలు యుద్ధంలో రాక్షసులను సంహరించారు కదా !

మహాబలవంతులైన తన కుమారులు చనిపోవడం సహించలేక పోయింది ” దితి “. ఆ మాతృమూర్తి మది శోకంతో నిండి పోయింది . మరీచి మహర్షి కుమారుడూ , తన భర్త అయిన కాశ్యప మహర్షితో ” మీ కుమారులైన దేవతలు నా కుమారులను యుద్ధంలో సంహరించారు . నేను తపస్సు చేసి , దీర్ఘమైన ఆ తపస్సుకు ఫలితంగా దేవేంద్రుని జయించగల పుత్రుణ్ణి కంటాను .తపస్సు చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి . ఇంద్రుని నిర్జించగలిగే పుత్రుణ్ణి ప్రసాదించే వరమివ్వండి ” అని ప్రార్థించింది .

రామాయణం

జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
దగ నురమందు దాల్చె ; నట దత్కరుణా రస దృష్టిచే బ్రజల్
మగుడగ దొంటి భంగి నతిమంగళ సాధ్వి పతిత్వ సంపదన్
నెగదిన లోకముల్ గని; రనేక శుభంబుల బొంది రత్తఱిన్

తండ్రి నారాయణుని వక్షస్థలం చేరిన మాత  ప్రజలను చల్లని చూపు చూసింది . ఆ తల్లి చల్లని చూపులు పడిన జనులు ఎన్నో శుభాలు పొందారు .

ఆనందంతో బ్రహ్మాది దేవతలు పుష్ప వర్షం కురిపించారు .లక్ష్మిని ధరించిన విష్ణుమూర్తిని మంత్రాలతో స్తోత్రం చేసారు .మళ్ళీ అమృతమథనం మొదలు పెట్టారు దేవ దానవులు .

పాల సముద్రాన్ని చిలుకగా చిలుకగా చివరగా వచ్చాడు ధన్వంతరి , అమృతకలశం చేతబట్టుకొని . ఆజానుబాహు విగ్రహం , శంఖం వంటి కంఠం , అరుణ వర్ణంతో ఉన్న కన్నులు , విప్పారిన వక్షస్థలం , నల్లని కేశాలు , మేఘం వంటి రంగుతో కనిపించాడు. చూచువారలకు చూడముచ్చటగా  పీతాంబరాలు  ధరించి , మణికుండల ధారుడై , విష్ణువు అంశతో జన్మించిన ఆ ధన్వంతరి వైద్య  విద్యకు  ఆద్యుడు . దేవ వైద్యుడు .

అమృతభాండం కనిపించగానే ఆతని మీద పడి  అమృత కలశాన్ని లాక్కొన్నారు  దైత్యులు . ఆ విధంగా అమృత కుంభం వారి వశమయ్యింది . దేవతల కష్టమంతా వ్యర్థమయ్యింది .

అథ తస్య కృతే రామ మహానాసీత్కుల క్షయః
అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రావసూదయన్

ఏకతోభ్యాగమన్ సర్వే హ్యసురా రాక్షసైః సహ
యుధ్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్య మోహనం

దేవతలు రాక్షసులతో యుధ్ధం చేసి ఎంతో మంది దైత్యులను సంహరించారు .

ఇంతలో దానవుల మధ్యలో వివాదం మొదలయింది . దేవతలు తమతో సమానంగా కష్టపడ్డారు కాబట్టి వారికి కూడా భాగమివ్వాలని కొందరు రాక్షస ప్రముఖులన్నారు . వీరి మాటలను లెక్క చేయలేదు ఇంకొందరు రాక్షసులు . ఈ విధంగా వారిలో అంతః కలహం మొదలయింది .

అటుపిమ్మట అమృతం చేయి జారిపోయిందని విష్ణువుతో మొఱ పెట్టుకున్నారు దేవతలు .

యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః
అమృతం సోహరత్తూర్ణం మయామాస్థాయ మోహినీం

యే గతాభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమం
సంపిష్టాస్తే తదా యుధ్ధే విష్ణునా ప్రభ విష్ణునా

అదితేరాత్మజా వీఅర దితేః పుత్రాన్నిజఘ్నిరే
తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్య యోర్భృశం

నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందర ః
శశాస ముదితో లోకాన్ సర్షిసంఘాన్ సచారణాన్

భక్తుల కోర్కెలు నెరవేర్చే వాడు కనుక నవ్వుతూ మోహినీ రూపాన్ని ధరించాడు . ఆ అతివ అందాన్ని చూసి మైమరచిపోయారు అదితి బిడ్డలు . అమృతాన్ని దేవదానవులకు సమంగా , న్యాయంగా పంచిపెట్టమని కోరారు .

సభయై యుండెద మిందఱ , మభయంబున వచ్చుకొలది నమృతంబును నీ
విభరాజగమన ! తప్పక , విభజింపు విపక్షపక్ష విరహిత మతివై

రాక్షసులకు అమృతం ఇవ్వడం పాములకు పాలుపోసిన విధమవుతందని నిశ్చయించుకున్న మోహిని దేవతలనూ , రాక్షసులనూ రెండు వరసలలో కూర్చోబెట్టి చిరునవ్వుతో దేవతలకు అమృతం ఇచ్చింది . రాక్షసులను తన అందాలతో మోహపరిచి , మైమరపింపజేసి లొంగ దీసుకున్నది .

ఒక్క బొట్టు జిక్కకుండగ , సకల సుధారసము నమర సంఘంబులకుం
బ్రకటించి పోసి హరి దన , సుకరాకృతి దాల్చె నసుర శూరులు బెగడన్ .

అమృతాన్ని దేవతలకు ధారబోసి హరి తన స్వస్వరూపాన్ని ధరించాడు . విష్నువును శరణని ప్రార్థించిన దేవతలకు అమృతం దక్కింది . శుభం కలిగింది . శక్తీ , తెలివీ , ధనమూ , ఆత్మగౌరమూ కలిగి కూడా రాక్షసులకు అమృతం దక్కలేదు .” విష్ణువును శరణు కోరని వారు శుభాలను పొందలేరు ” అని భాగవతం వక్కాణిస్తోంది .

విష్ణువు చేసిన మోసం తెలుసుకున్న రాక్షసులు దేవతలతో యుద్ధానికి దిగారు . అమృతం తాగిన అమరులు యుద్ధంలో వారిని సులభంగానే ఓడించారు . అటుపిమ్మట దేవేంద్రుడు స్వర్గానికి అధిపతియైనాడు .

స్వస్తి

రామాయణం

అటుపిదప పాలసముద్రంలోనుండి  అవతరించింది శ్రీ మహా లక్ష్మి .

పాల మున్నీటి లోపలి మీది మీగడ , మిసిమి జిడ్డున జేసి మేను వడసి
క్రొక్కారు మెఱుగుల కొనల తళుక్కుల మేనిచే గల నిగ్గు మెఱుగు సేసి
నాడు నాటికి బ్రోది నవకంపు దీవల నును బోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలకుల బ్రొద్దున బొలసిన వలపుల బ్రోది వెట్టి

పసిడి చంపక దామంబు బాగు కూర్చి , వాలుకన్నుల చెలువున వాడి దీర్చి
జాణతనమున జేతుల జడ్దు విడిచి , నలువ ఈ కొమ్మ నొగి జేసినాడు నేడు
పాల సముద్రం పైన పేరిన మీగడ తరక లాంటి మిసిమితో , వర్షాకాలంలోని మేఘాలలో దాక్కొని తళుక్కుమని మెరిసే మెరుపు తీగ అంచు కాంతిని జొప్పించి , బంగారు సంపెంగ పూలదండల అందాన్ని చేర్చి , సూర్యుడుదయించే వేళ ఎఱ్ఱ తామరపూల సరసులో గుబాళించే సువాసనలను ప్రోగు చేసి , బాలచంద్రుని  సోయగం  సమకూర్చి తయారు చేసాడేమో చతుర్ముఖ బ్రహ్మ ఈ కొమ్మను అనే విధంగా పాల సముద్రంలోనుండి
బయల్వెడలింది శ్రీ మహా లక్ష్మి .

పాలకడలిలో  ఉదయించిన మహాలక్ష్మికి మంగళ స్నానం చేయించారు దేవతా ప్రముఖులు  . ఇంద్రుడు మణిమయ పీఠాన్ని సమకూర్చాడు . అమర ముత్తైదువులు విమల తోయాలతో నిండిన కడవలు తీసుకొని వచ్చారు . వసంతుడు తేనె నిచ్చాడు . మునులు సంకల్పం  చెప్పారు . మంగళ   వాద్యాలు మనసు పులకించేలా వినిపిస్తుండగా , మహా పండితులు మంగళాశీస్సులు పలుకుతున్న సమయంలో అష్ట దిగ్గజాలు తమ తొండాలతో పుణ్య  జలాలను మాతృమూర్తి మీద చిలికి స్నానం చేయించాయట .
మాతృమూర్తికి  పట్టుపుట్టాల నిచ్చాడు సముద్రుడు . వైజయంతీ మాలికను సమర్పించాడు వరుణుడు .అమూల్య రత్నాభరణాలను  సమకూర్చాడు దేవ శిల్పి విశ్వకర్మ . ముత్యాల హారాన్నిచ్చింది చదువుల తల్లి సరస్వతి . కమలాన్ని కానుకగా ఇచ్చాడు  విధాత . శ్రుతులు చేసాయి భద్రమైన నుతులు (స్తోత్రాలు ) .” లోకాలను ఏలుకోవమ్మా ” అని దిక్కులు దీవించాయట .

క్షీర సముద్ర రాజతనయ పలుకరించిన వాడికి బ్రహ్మ పదం వస్తుందట .  ఎవరినైతే వరిస్తుందో అతదే లోకాలకు వల్లభుండు . ఆవిడ కాపురం చేసే ఇల్లు వైకుంఠం . ఆమె చిరు నవ్వు ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది . అటువంటి మాతృమూర్తి 
చంచరీక నికర ఝంకార నినదంబు , దనరు నుత్పలముల దండ బట్టి
మేఘకోటి నడిమి మెఱుగు బుత్తది మాడ్కి ,సురల నడుమ నిలిచె సుందరాంగి
కలువ పూల దండ చేతులతో పట్టుకొని దేవతల మధ్యలో నిలిచింది . తనకు తగిన వరుడెవరా అని ఆలోచనలో పడ్డది . కనిపించాడు కరుణా సింధువు విష్ణుమూర్తి .

అమర ముత్తైదువునై యుండ వచ్చును వరుసకు సతులెవ్వరును లేరు
వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు శ్రంగార చందన శీతలుండు
గలగ డెన్నడు ఉధ్ధకారుణ్యమయ మూర్తి విమలుండు గదిసి సేవింప వచ్చు
నెఱి నాడి తిరుగడు నిలుకడ గలవాడు సకల కార్యములందు జడత లేదు :

సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు , నాథుడయ్యెనేని నడప నోపు
నితడె భర్త యనుచు నింతి సరోజాక్షు , బుష్ప దామకమున బూజ సేసె

అని భావించి మహావిష్ణువు కంఠాన్ని వరమాలతో అలంకరించింది . తన నివాసంగా పరమాత్మ వక్షస్థలాన్ని చేసుకుంది . పెల్లుబికిన ప్రేమతో పరమాత్ముని వంక చూడడానికి తల యెత్తింది . అంతలోనే ముంచుకొచ్చింది సిగ్గు .

హరి సూచిన సిరి సూడదు , సిరి సూచిన హరియు జూడ సిగ్గున్ బొందున్
హరియునున్ సిరియును దమలో , సరి చూపుల జూడ మరుడు సందడి వెట్టెన్

ఈ విధంగా అందానికే భాష్యం చెప్పే లోకమాత పరమాత్మను వరించింది . పరమాత్మ కడలికి అల్లుడయ్యాడు . కౌస్తుభ మనబడే రత్నాన్ని సముద్రుడు మహావిష్ణువుకు కానుకగా ఇచ్చాడు . శ్రీవత్స , కౌస్తుభ వైజయంతీ వనమాలికలతో కూడి విష్ణు వక్షస్థలంపై నివాసమేర్పరుచుకుంది శ్రీ మహాలక్ష్మి .