Monthly Archives: ఫిబ్రవరి 2014

రామాయణం

ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా
పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ

తే గత్వా దూరమధ్వానం గతేర్ద్వదివసే తథా
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్ముని సేవితాం

తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారస సేవితాం
బభూవుర్ముదితాః సర్వే మునయః సహరాఘవః

విశ్వామిత్రుని పలుకులు విన్న మహర్షులు , చుట్టూ ఉన్న వనాల అందాలను చుస్తూ తమ ప్రయాణం సాగించారు . అపరాహ్ణ సమయానికి చలా దూరం ప్రయాణం చేసి పావన గంగా తీరాన్ని చేరారు . గలగలా పారుతూ పుణ్యోదకాలతో మనస్సులను పులకరింప జేసేలా పారుతోంది సురగంగ . ఆ నీటిమీద తేలియాడుతున్నాయి హంస సారస పక్షులు . అందమైన ఆ దృశ్యాన్ని చూసిన రామలక్ష్మణులూ , మునులూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు .

IMG_1928

 
పావన గంగా జలాలు . త్రివేణీ సంగమం . ప్రయాగ . గంగా యమునల సంగమస్థానంలో నీటిరంగులోని మార్పు గమనించండి .

 

 

 

రామాయణం

అయం శోణః శుభజలో గాధః పులినమణ్డితః
కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం
ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రో బ్రవీదిదం
ఏష పంథా మయోపద్దిష్టో యేన యాంతి మహర్షయః

” బ్రాహ్మణోత్తమా ! శోణా నదీ శుభ జలాలు ఇసుకతిన్నెలతో ప్రకాశిస్తున్నాయి . నదీ జలాల లోతు కూడా తక్కువే . ఏ మార్గాన్ననుసరించి  ఈ పుణ్యనదిని మనం దాటాలి  ” అని ప్రయాణానికి సిధ్ధమయిన రాముడు  మహర్షిని అడిగాడు . ” మహర్షులు ఏ మార్గంలో వెడుతున్నారో ఆ మార్గాన్నే మనం కూడా అనుసరిద్దామని ” బదులిచ్చాడు  విశ్వామిత్రుడు .

పెద్దలు చూపిన బాట రాచబాట అని అందరికీ తెలిసిన విషయమే కదా . దాన్నే మహర్షి రాముడికి చెప్పాడు .

IMG_1617

రామాయణం

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోభ్య భాషత

సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయాభిరోచయ

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియాం
గమనం రోచయామాస వాక్యం చేదమువాచహ

శోణా నదీతీరంలో రాత్రిసమయం గడిచిపోయింది . ఆకాశాన అరుణకిరణాలు కనిపించాయి . ప్రభాత సమయంలో నిదురలేచాడు మహర్షి . లేవగానే ” రామా ! పూర్వ సంధ్యా సమయం ఆసన్నమయింది . బాలమరీచి మాలికలు ఆకాశాన్ని అలముకున్నాయి . నీకు భద్రమగుగాక . నిదుర లేవవయ్యా . ప్రయాణానికి సమయమాసన్నమవుతోంది ” అని రఘుకుల తిలకుడిని సుమధురమైన పలుకులతో నిద్ర లేపాడు . చక్కనయ్య నిదుర లేచాడు . స్నాన సంధ్యవందనాదులను పూర్తి చేసుకుని పయనానికి సిధ్ధమయ్యాడు .

సుప్రభాత సమయాన సౌమ్యంగా , మంజులమైన పదాలతో నిదుర లేపాలి . ప్రభాత సమయాన మనసు ప్రశాంతంగా ఉంటే ,తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది . సర్వం మంగళమయమవుతుంది .

DSC01500

 

రామాయణం

ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః
సాధు సాధ్వితి తం సర్వే మునయోహ్యభ్యపూజయన్

కుశికానామయం వంశో మహాన్ ధర్మపరస్సదా
బ్రహ్మోపమా మహాత్మనః కుశవంశ్యా నరోత్తమాః

విశేషేణ భవానేన విశ్వామిత్ర మహాయశః
కౌశికీ సరితాం శ్రేస్ఫ్ఠా కులోద్ద్యోతకరీ తవ

శ్రీరామచంద్రునికి కుశవంశ వృత్తాంతం చెప్పాడు మహర్షి . తన కథా , స శరీరంగా స్వర్గానికి వెళ్ళిన సోదరి కౌశికీ నది కథా అందంగా చెబితే విన్న రామలక్ష్మణులూ , మునులూ ” సాధు , సాధని ( బాగు , బాగని )” మెచ్చుకున్నారు . కుశవంశం పూజ్యమైనది , కుశవంశానికి చెందిన వారు నరులలో ఉత్తములు , మహాత్ములు , బ్రహ్మదేవునితో సమానమైన వారు . నిజంగా చెప్పాలంటే కుశవంశంలో జన్మించిన వారందిలో తమరు మహాత్ములు , బ్రహ్మతుల్యులు . తమ సహోదరి కౌశికి మీ కులాన్ని ప్రకాశింపజేసింది .

ఇతి తైర్ముని శర్దూలైః ప్రసస్తః కుసికాత్మజః
నిద్రముపాగమచ్ఛ్రీమాన్ శ్రీమానస్తమివాంసుమాన్

రామోపి సహసౌమిత్రిః కించిదాగయవిస్మయః
ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే

మునులు ఆవిధంగా పొగుడుతూ ఉండగానే , బ్రహ్మవర్ఛస్సుతో వెలుగిపోతున్న విశ్వామిత్ర మహర్షి , సూర్యభగవానుడు అస్త్రాద్రిని చేరిన విధంగా నిద్రాదేవతను వరించాడు ( నిద్రపోయాడు ) . మహర్షి కమనీయ గాధను విన్న రామలక్ష్మణులు కొంత సమయం విస్మయం చెంది , పిదప నిద్రపోయారు .

ముప్పది నాలుగవ సర్గ సమాప్తం

వివరణ :
విశ్వనాథ సత్యనారాయణ గారు తమ కల్ప వృక్షంలో ఈ సందర్భంలో చెప్పిన పద్యం

చిన్నకథ జెప్పి నీకు , నీ చేత నొక్క
యే మహాకార్యమేను జేయింతు నింత
యల్ప సంతోషివేమె రామాయటంచు
నవ్వె ఋషి , యెల్ల ఋషులును నవ్వినారు .

” చిన్న చిన్న కథలను చెప్పి , విశ్వామిత్ర మహర్షి , రామునిచే ఘనమైన కార్యాలను చేయిస్తాను ” అని సరదాగా , హాస్యముట్టిపడేవిధంగా చెప్పారు . నిజానికి మంచి మాటలతో మనుష్యులనూ , వారి మనసులను  వశపరచుకొని , అద్భుతాలను సాధింపవచ్చు అన్నది నాయకులందరికీ తెలిసిన రహస్యం , విజయపథంలో పయనించడానికి మనమలవరచుకోవలసిన విద్య . రామాయణంలో మంచిమాటలతో పనులు సాధించిన సందర్భాలు కోకొల్లలు .

river Koshi

( photo taken from  http://gkamesh.wordpress.com/tag/koshi )

రామాయణం

నిష్పందాస్తరవః సర్వే నిలీన మృగపక్షిణః
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన
శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావ్ర్తం
నక్షత్ర తారాగహనం జ్యోతిర్భిరవభాసతే
ఉత్తిష్టతి చ శీతాంసుః శశీ లోకతమోమదః
హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో
నైశాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః
యక్షరాక్షస సంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనా

రామా ! పొద్దువాలి పోయింది . సాయంసంధ్య తొలగిపోయింది . కారు చీకట్లు కమ్ముకున్నాయి . వృక్షాలు చలించడం లేదు . మృగాలు , పక్షులు తమ తమ స్థానాలలో కదలకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి . అశ్విని , భరణి లాంటి తారలతో ఆకాశం  ప్రకాశిస్తోంది . మిలమిలా మెరిసి పోతున్న తారలు అంబరాన్ని ఆక్రమించాయి . ఆ తారలు మిన్ను కు   కన్నుల  లాగా  కనిపిస్తున్నాయి . శీతల కిరణాలతో చంద్రుడు లోకాల చీకట్లు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు .కథలు చెబుతూ ఉండగానే అర్ధరాత్రి గడచిపోయింది . ఇక నిదురపో . నీకు మంగళమగుగాక . మన ప్రయాణం సజావుగా సాగిపోవాలి . మార్గ మధ్యంలో  మనకు  విఘ్నాలు  కలుగకుండుగాక .

DSC00991