Monthly Archives: అక్టోబర్ 2017

సుందరకాండ

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి .

తతో అంటే అటుపిమ్మట , రావణుడు తనతొ కొనిపోయిన సీతాదేవిని అన్వేషించడానికి చారణులు చరించే ఆకాశ మార్గంలో ప్రయాణించడానికి పూనుకున్నాడు శత్రువులను సంహరించే హనుమ .

 

వానరులూ  ,జాంబవంతుడూ , యువరాజైన  అంగదుడూ హనుమతో , వారధిని లంఘించి సీతమ్మను వెదకమని కోరారు . హనుమను ఎంతో ఉత్సాహ పరిచారు . హనుమ అంగీకరించి సముద్రాన్ని ఆకాశ మార్గాన అధిగమించడానికి పూనుకున్నాడు . ప్రయాణానికి ముందు హనుమ ఏ విధగా ప్రవర్తించాడో , ఏవిధంగా కనిపించాడో వాల్మీకి మహర్షి మన కనులముందర సాక్షాత్కరింప జేస్తారు . రామాయణం ఇచట ఒక దృశ్య కావ్యంగా మలచబడింది .

IMG_0735.JPG

రామాయణం : సుందర కాండ

IMG_5021

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి

ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయం

“బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్”

సుందరకాండ రామాయణానికి తలమానిక మైనది . రామాయణానికి ఆయువు పట్టు హనుమంతుడనే విషయం అందరికీ తెలిసిందే . సుందరకాండలో ఎటు చూసినా అంజనేయస్వామే కనిపిస్తాడు . బుద్ధి , బలము , యశస్సు , ధైర్యం , నిర్భయత్వం , వాక్పటుత్వం ఆంజనేయ స్వామికి సహజ గుణాలు . ఈ గుణాలను అతిసుందరంగా వర్ణించారు ఆదికవి వాల్మీకి . అందుకే ఈ కాండ సుందర కాండ .

రామాయణం పారాయణం చేయాలంటే మొత్తం రామాయణమైనా చదవాలి లేకుంటే సుందరకాండ పారాయణమైనా చేయాలి .రామాయణంలో ఏ ఇతరకాండకూ ఈ గౌరవం దక్కలేదు . సుందర కాండలో ప్రతి సర్గా “స ” లేక “త ” అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది . స ,త లను మాతృమూర్తి సీతమ్మకు ప్రతీకగా భావించ వచ్చు . సీత లో ఉన్నవి ఈ రెండక్షరాలే కదా !

నిజానికి సుందర కాండను మంత్ర శాస్త్రంగా భావించ వచ్చు . బ్రహ్మాండపురాణం ఈ కాండాన్ని ” సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః” అని, “బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి” అని, “అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే . ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్” అని ప్రశంసించింది .( This para is from wikepedia ).

సుందరమైన సీతమ్మ దుఃఖాన్ని హనుమ ఆగమనంతో తొలగించే కాండ సుందర కాండ . ఆంజనేయ స్వామి సుందర భక్తికి అద్దం పట్టే కాండ సుందర కాండ . బీజాక్షరాలతో నిండి చదివిన వారి మనస్సులను పరిప్లుతం చేసే మంత్ర కాండ ఈ సుందర కాండ .  ” త కారో విఘ్న నాశకః, త కారో సౌఖ్య దాయకః” అని పెద్దల సూక్తి . ఈ కారణం చేతనే రామాయణాన్ని , సుందరకాండను “త” అనే బీజాక్షరంతో ప్రారంభించారు వాల్మీకి మహర్షి . “స” కారం సీతమ్మనూ, సౌందర్యాన్నీ సూచిస్తుంది కనుక  సుందరకాండ ప్రతి సర్గ ప్రారంభంలో ఈ అక్షరాలను ప్రయోగించారు రచయిత . అంతేకాక  అద్భుతమైన ఉపమలూ , అంత్యానుప్రాసలూ గంగా ఝరిలా జ్రాలు వ్రాలినవిచట . అందుకే అత్యంత రమణీయం సుందర కాండ

సుందర కాండలో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం కార్య సాధన . ఆంజనేయ స్వామి సీతమ్మను వెదకడంలో ఎన్నో కార్యాలను సాధించవలసి వచ్చింది . సముద్రాన్ని లంఘించడం హనుమకు తప్ప ఇతరులెవరికీ సాధ్యమయే పనికాదు . రాముని మీద భక్తితో తన శక్తి యుక్తులతో ఈ కార్యాన్ని సాధించాడు హనుమ . లంకా ప్రవేశం చేయగానే అడ్డు తగిలింది లంఖిణి . సామ దానాలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు కనుక దండోపాయంతో లంఖిణి పీచమడిచాడు . సీతమ్మను వెదకడానికి రావణుని అంతఃపురంలో దూరవలసి వచ్చింది . అపురూపమైన ఐశ్వర్య రాసులూ , కనులు మిరుమిట్లు గొలిపే లావణ్యవతులూ కొల్లలుగా కనిపించినా  కార్యసాధనలో నిమగ్నమై ఉన్న హనుమ దృష్టిని ఆకర్షించలేదు . అర్జునుడి దృష్టికి బాణం ఎక్కుపెట్టినప్పుడు లక్ష్యమైన పక్షి తప్ప ఇతరాలేవీ కనిపించలేదు .అలాగే ఆంజనేయ స్వామి దృష్టి అంతా సీతమ్మను వెదకడం మీదనే . అందుకే స్వామి తలపెట్టిన కార్యం సఫలమైంది .  తలపెట్టిన కార్యాన్ని సాధించేవరకూ ఏకాగ్రతతో ఉండడం హనుమకే చెల్లింది . మనకు మార్గదర్శక మయింది . కార్య సాధకుడికుండవలసిన ప్రథమ లక్షణం ఏకాగ్రత . ప్రతి చిన్న పని మొదలు పెట్టే ముందు ఆ పని చేయడం వల్ల కలిగే సాధక బాధకాలను వివరంగా ఆలోచించి మొదలు పెడతాడు . మొదలు పెట్టాక అది సాధించే వరకూ వదలడు . ఇది సాధకుడి లక్షణం . కార్యసాధనకు అవసరమైన విషయాలను నేర్చుకోవాలంటే సుందరకాండ దోహద పడుతుంది . అనుకున్నది సాధించినప్పుడే జీవితం సుందర తర మవుతుంది . అనుకున్న పనిని సాధించే పద్ధతిని ఉదాహరణలతో సహితంగా తెలియజేసే కాండమిది . అందుకే ఈ కాండం సుందర కాండమయింది .

రామాయణానికి మొట్టమొదటగా “సీతాయాశ్చరితం” అనే పేరు పెట్టాలనుకున్నారు వాల్మీకి . సీతమ్మ శీలమూ , నడవడికా , చరిత్రా , రామాయణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి . సుందర కాండలో సీతమ్మ ప్రవర్తనా , మనోభావాలూ అచ్చెరువొందించక మానవు . మధుర మంజుల కోమలాలు సీతమ్మ పలుకులు . సుందరకాండను అవి అతి సుందరంగా మారుస్తాయి .

వివరిస్తూ వెడుతూంటే ఈ కాండకు , వాల్మీకి సుందర కాండ అనే పేరు ఎందుకు పెట్టారో అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉదాహరణలతో సహా వివరించవచ్చు . ఇచట కొంత మాత్రం చేప్పడం జరిగింది .

IMG_0584.JPG