Monthly Archives: మార్చి 2012

రామాయణం

అందువలన ,  మహారాజా !  మారీచ , సుబాహుల    మదాన్ని   అణగించడానికి

స్వపుత్రం  రాజశార్దూల  రామం  సత్య పరాక్రమం
కాకపక్షధరం  శూరం  జ్యేష్ఠం  మే  దాతుమర్హసి .
శక్తో  హ్యేష  మయా గుప్తో  దివ్యేన  స్వేన  తేజసా
రాక్షసా  యే  వికర్తారస్తేషామపి  వినాశనే

” పరాక్రమంతో  అలరారుతున్న  రామచంద్రుని  నాకప్పగించు .  నిజమైన  వీరత్వం కలిగి , జునపాలతో   ముచ్చటగా  ఉన్న  నీ కుమారుని  నా వశం చేయి .  నాచేత  రక్షింపబడి ,  తన దివ్యమైన  తేజస్సుచే   దుష్ట  రాక్షసుల  ఆటను  తుదముట్టించగల    సమర్థుడు , రామచంద్రుడు “.

న చ తౌ  రామమాసాద్య  శక్తౌ  స్థాతుం  కథం  చన
న  చ తౌ  రాఘవాదన్యో  హంతుముత్సహతే  పుమాన్
వీర్యోత్సిక్తౌ  హి  తౌ  కాలపాశవశం  గతౌ
రామస్య  రాజశార్దూల  న  పర్యాప్తౌ  మహాత్మనః
న చ  పుత్రకృతస్నేహం  కర్తుమర్హసి  పార్థివ
అహంతే  ప్రతిజానామి  హతౌ  తౌ  విధ్ధి  రాక్షసౌ

“రాజశార్దూలా !  రాముడు  తప్ప  వారిని  వేరెవరూ  చంపలేరు . నీచులైన   మారీచ సుబాహులు  రామునితో  యుధ్ధం  చేసి  గెలవలేరు .  నేను  ప్రతిజ్ఞ   చేసి చెబుతున్నాను  .   వారు   కాలుని   పాశానికి(యమ  పాశానికి) పట్టుబడే  కాలం  వచ్చింది .  తనయుని   మీది   ప్రేమతో   ఇచ్చినమాట    తప్పవద్దు . ఆ రాక్షసులు  రాముని  చేతిలో  హతులయినారన్నది  నిశ్చయం”

అహం  వేద్మి  మహాత్మానం  రామం  సత్యపరాక్రమం
వసిష్ఠోపి  మహాతేజా  యే  చేమే  తపసి స్థితాః
యదిహ్యనుజ్ఞాం  కాకుత్స్థ   దదతే  తవ  మంత్రిణః
వసిష్ఠప్రముఖా  సర్వే  తతో  రామం  విసర్జయ

కన్నతండ్రివైన  నీవు  రాముడు  బాలుడని   తలపడానికి  ఆస్కారముంది .  రాముని  పరాక్రమం  నాకు తెలుసు . వసిష్ఠునికీ  తెలుసు . ఈ మహర్షులకు  కూడా తెలుసు . రాముడు  అజేయుడు .  ఇంత   పెద్దపని రాముడు  చేయగలడా అనే   సందేహం నీకు అవసరం లేదు .  నీ   కీర్తి   చిరకాలం  భువిలో  నిలిచిపోవాలంటే ,   ధర్మంగా    ప్రవర్తించాలనేదే   నీ  కోరికైతే    శ్రీరామచంద్రుని    నాతో   పంపు .     .

రామాయణం

అహం  నియమమాతిష్టే   సిధ్ధ్యర్థం  పురుషర్షభః
తస్య  విఘ్నకరౌ  ద్వౌ  తు  రాక్షసౌ  కామరూపిణౌ
వ్రతే  మే  బహుశశ్చీర్ణే  సమస్త్యాం  రాక్షసావిమౌ
మారీచశ్చ  సుబాహుశ్చ  వీర్యవంతౌ సుశిక్షితౌ
సమాంస రుధిరౌఘేణ  వేదిం  తామభ్యవర్షతాం

తన కోరికను సూటిగా  చెప్పాడు . ” పురుషులలో  ఉత్తమమైనవాడా ! ఒక సిధ్ధి  సంపాదించాలనే  ఉద్దేశ్యంతో నేను   నియమంగా   ఉన్నాను . ( నియమంగా   ఉండడమంటే  యజ్ఞం  చేయడమని  భావం ) . ఇద్దరు  రాక్షసులు   ఆ నియమాన్ని  కొనసాగనీయడంలేదు  .  విఘ్నాలను  కలిగిస్తున్నారు .
మారీచ  , సుబాహులనబడే ,  బలవంతులూ ,  సుశిక్షితులూ  అయిన    వారు   రక్తాన్నీ , మాంసాన్నీ యజ్ఞకుండంలో   వర్షంలాగా  కురిపిస్తున్నారు .

అవధూతే  తథా  భూతే  తస్మిన్నియమ  నిశ్చయే
కృతశ్రమో  నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే

న చ మే  క్రోధముత్సృష్టుం  బుధ్ధిర్భవతి  పార్థివ
తథాభూతా  హి  సా  చర్యా న శాపస్తత్ర  ముచ్యతే

తలపెట్టిన  పని  పాడైపోయినందున , పడిన  శ్రమంతా ( బూడిదలో  పోసిన  పన్నీరులాగా ) వ్యర్థమైనందున   నేను  ఉత్సాహాన్ని   కోల్పోయాను . ఆ దేశం  వదలివచ్చాను . శాపమివ్వడానికి  నా  మనస్సు  అంగీకరించడం  లేదు  .   యజ్ఞ  సమయంలో    శాపమివ్వకూడదు  .

పై  శ్లోకాలలో  తనకు  కలిగిన  కష్టాన్ని  మహారాజుకు  వివరించాడు  మహర్షి  . శపించే శక్తి  ఉన్నా  దానిని  ఉపయోగించడానికి  మనసొప్పటం లేదట .  నిజమే తన  కోపంవల్ల  ఎన్నోమార్లు  తపస్సును  నష్టపోగొట్టుకున్న  అనుభవజ్ఞుడు   విశ్వామిత్రుడు .

శక్తి  ఉన్నా  ఉపయోగించడానికి  వీలు  లేని  సందర్భాలు  మానవజీవితంలో  కోకొల్లలు . అటువంటి సమయాలలో   సన్నిహితుల   సహాయాన్ని   తీసుకుని  కార్యాన్ని  నిర్విఘ్నంగా   నెరవేర్చుకోవాలిని   రామాయణం  సూచిస్తుంది .  సహాయాన్ని  అడిగేటప్పుడు  డొంకతిరుగుడు  లేకుండా సూటిగా  అడిగేయాలి .

స్వంతంగా  కార్యాన్ని  సాధించుకొనే   శక్తి కలిగి  ఉండి కూడా  కారణాంతరాలవల్ల  ఇతరులను  సహాయమర్థించేవారు  ఒకరైతే , కార్యాన్ని  స్వశక్తి  ద్వారా  సాధించుకొనే  వారు  ఇంకొందరు . మొదటిరకానికి  చెందినవారు  సహాయం  చేసినవారి    శ్రమనుంచుకోకుండా , అడగకుండానే    ఎన్నో రెట్లు  ఎక్కువగా  ప్రతిసహాయం  చేస్తారు .విశ్వామిత్రుని  విషయంలో  అలాగే  జరిగింది .  ప్రతిసహాయంగా  రామునికి   నేర్పిన  విద్యలెన్నో  , చివరికి  లోకకల్యాణకారకమైన  రాముని  కళ్యాణం  జరగడానికికూడా  కారకుడైనాడు .  విశ్వామిత్రుడు   దశరథుని  వద్దకు  వచ్చే  సమయంలో  , పుత్రుల  వివాహాలను  గురించి  అలోచిస్తున్నాడు  దశరథుడు . తనకు  సహాయం  చేసాడు  కనుక ,  అడగకుండానే  దశరథుని  కోరికను ,  సీతారాముల  వివాహం   చేసి  సఫలం  చేసాడు .   మహాత్ములకు  సహాయం  చేయడం మంగళకరం .

ఏకోనవింశసర్గ  అంటే  ఇరువదిఒకటవ  సర్గ  ఆరంభం :

తత్ఛ్రుత్వా   రాజసింహస్య  వాక్యమద్భుత విస్తరం
హృష్టరోమా  మహాతేజా  విశ్వామిత్రోభ్యభాషతః
సదృశం  రాజశార్దూల  తవైతద్భువి  నాన్యథా
మహావంశప్రసూతస్య  వసిష్టవ్యపదేశినః
యత్తు  మే హృద్గతం  వాక్యం  తస్య  కార్యస్య  నిశ్చయం
కురుష్వ  రాజశార్దూల  భవ  సత్యప్రతిశ్రవాః

నీ  కోరిక  నెరవేరుస్తాను  అన్న  దశరథుని  మాటలు  విన్న  విశ్వామిత్రుని  రోమాలు (వెంట్రుకలు ) ఆనందంతో   గగుర్పొడిచాయి , నిటారుగా  నిలబడ్డాయి .  “మహారాజా !  వసిష్టుని  ఉపదేశవాక్యాలను  వింటూ ఉన్న  నీవు ఈ  విధంగా  మాట్లాడడం  సహజం .  ఇంకో విధంగా   మాట్లాడడం  నీకు  అసాధ్యం . సరే! నా  మనసులో  మాట  ,  నేను వచ్చిన కార్యాన్ని  నీకు  వివరిస్తాను . ఆ  కార్యాన్ని  సఫలం చేసి , సత్యవాక్య పరిపాలకుడవై   నీ ప్రతిజ్ఞ ను  నిలబెట్టుకో ”  , అని దశరథునితో   పలికాడు .

విశ్వామిత్రుడు  తన గృహాన్ని  పావనం  చేసాడన్న  ఆనందంలో  “నీవేదడిగినా   ఇస్తా”నని  మాట ఇచ్చాడు .  ఆలోచిం చకుండా  మాట  ఇవ్వడం  , ప్రతిజ్ఞలు  చేయడం  సరికాదేమో . దశరథుని  లాంటి    వాడే  మాట నిలబెట్టుకోవడానికి  చిక్కులలో పడ్డాడు .  ఏ పని చేసినా  సాధ్యాసాధ్యాలను  , కష్టనిష్టూరాలను  బేరీజు  వేసిన  తరువాతే  చేయాలి .  వచ్చినవాడు  విశ్వామిత్రుడిలాంటి  అఖండుడైతే  అతి  జాగర్తగా  మాట్లాడడం , వ్యవహరించడం  అవసరం.

బ్రూహి   యత్ప్రార్థితం   తుభ్యం  కార్యమాగమనం  ప్రతి
ఇచ్ఛామ్యను  గ్రహీతోహం    త్వదర్థ  పరివృధ్ధయే

కార్యస్య  న విమర్శం  చ  గంతుమర్హసి  కౌసిక
కర్తా   చాహమశేషేణ   దైవతమ్హి  భవాన్మమ

మమ  చాయమనుప్రాప్తో   మహానభ్యుదయో   ద్విజ
తవాగమనజః  కృత్స్నో ధర్మశ్చానుత్తమో  మమ

“కౌశిక  మహర్షీ !  తమరు   నన్ను   అనుగ్రహించి  తమ   కోరిక  నాకు  తెలపండి . మీరు  తలపెట్టిన కార్యం  ఎంత  గొప్పదైనా  సందేహించకుండా  చెప్పండి . మీ  కార్యాన్ని  నేను  సఫలంగా  నిర్వర్తిస్తాను .  మీరు  నాకు   దైవం వంటి వారు  కదా !  ద్విజులైన  మీ  రాకతో  నాకు  అభ్యుదయం  కలిగింది”   అని   విశ్వామిత్రుని  వేడుకున్నాడు  దశరథుడు .

ఇతి  హృదయసుఖం  నిశమ్య  వాక్యం
శ్రుతిసుఖ  మాత్మవతా  వినీతముక్తం
ప్రథిత  గుణ  యశా  గుణైర్విశిష్ఠః
పరమఋషిః  పరమం జగామ   హర్షం
హృదయానికి   ఆహ్లాదం   కలిగించే   దశరథుని   మాటలను  విన్న  విశ్వామిత్రుడు  చాలా  ఆనందం  పొందాడు . .

రామాయణం

పూర్వం  రాజర్షి  శబ్దేన  తపసా  ద్యోతితప్రభః  ,
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః  పూజ్యోసి  బహుధా  మయా
తదద్భుతమిదం  బ్రహ్మన్  పవిత్రం  పరమం  మమ
శుభక్షేత్రగతశ్చాహం  తవ  సందర్శనాత్ప్రభో
విశ్వామిత్రుని  రాకతో   సంతోషంతో  పొంగిపోయిన  డశరథమహారాజు  ఇంకా  ఇలా  అన్నాడు ” పూర్వం   రాజర్షి   శబ్దంతో  భాసిస్తూ  ఉన్న  మీరు  ,  తపస్సు  చేసి  బ్రహ్మర్షి  ఐనారు  . నాకు  అన్నివిధాలా  , అన్నివేళలా   పూజ్యులు .  తమ రాక  అద్భుతం . నేను  ధన్యుడనైనాను .  మీ రాక  పరమ  పవిత్రం . మిమ్ములను  చూచిన  నాకు  ఏదో  పుణ్యక్షేత్రంలో  ఉన్న  అనుభూతి  కలుగుతున్నది “.
కష్టపడి   కార్యాన్ని   సాధించిన   వారికి   ఆ  రోజైనా  ఈ రోజైనా   గౌరవ  మర్యాదలు  లభించడం  సహజం .  మొదలుపెట్టిన  కార్యాన్ని  ఎన్ని  ఆటంకాలెదురైనా  వదలిపెట్టకుండా  సాధించినవారిలో  అగ్రగణ్యుడు  విశ్వామిత్రుడు . పట్టుదలకు  మారుపేరు .  విజయపథంలో  విహరించాలనుకునేవారికి  మార్గదర్శకుడు  మన బ్రహ్మర్షి .  అతనికి  నమస్సుమాంజలి .
ఏదైనా  కార్యం  మొదలుపెట్టేముందు  ,  ఏమి  సాధించాలో  స్పష్టంగా  చెప్పి   చేతికి  కంకణం  కట్టుకునే  వారు  మన  పూర్వీకులు .  ఆ  కంకణం  చేయవలసిన  కార్యాన్ని  వారికి  సదా  గుర్తు చేస్తూ ,  తలపెట్టిన  కార్యాన్ని  సాధించేవరకూ  హస్తానికి  ఆభరణంగా  ఉండేది .
ఏదైనా  పని   ప్రారంభించే  ముందు   ఆలోచించాలి . ఆలోచించి    మొదలుపెట్టినాక  ఇక  ఇది  మంచిదా  కాదా లాంటి అలోచనలు దరిచేరనీయకుండా  దానిని  సాధించాలి —  ఎంత కష్టమైనా  సరే  , ఎన్ని ఆటంకాలెదురైనా  సరే  . ” ఇది  కష్టం  కదా , నేను చేయలేనేమో”   లాంటి  అలోచనలకు  తావివ్వకూడదు .   ఇదీ  విశ్వామిత్రుని  నుండి  మనం  నేర్చుకోవలసింది .

 

ఈ  సందర్భంలో  భర్తృహరి  శతకంలోని  పద్యం  మీకోసం :

ఆరంభిపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతురు  విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్, ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్ధము లుజ్జగించరు సుమీ ప్రజ్ఞా నిధుల్ గావునన్ .

రామాయణం

వసిష్టం  చ సమాగమ్య  కుశలం  మునిపుంగవః
ఋషీంశ్చ  తాన్  యథాన్యాయం  మహాభాగానువాచ  హ
తే  సర్వే  రాజా  హృష్టమనసస్తస్య   రాజ్ఞో  నివేశనం
వివిశుః   పూజితాస్తత్ర    నిషేదుశ్చ    యథార్హతః
అథహ్  హృష్టమనా  రాజా  విశ్వామిత్రం  మహామునిం
ఉవాచ    పరమోదారో    హృష్టస్త   మభిపూజయన్

దశరథ  మహారాజును  కుశల  ప్రశ్నలడిగాక   వసిష్టునీ    ఇతర   మునిపుంగవులనూ    క్షేమసమాచారాలడిగాడు  కౌశికుడు . పిదప   దశరథుడూ , విశ్వామిత్రుడూ , ఇతర సదస్యులూ   రాజగృహంలో    ప్రవేశించి   తమ  తమ   ఆసనాలను   స్వీకరించారు .
మహాత్ములు  రావడం  మంగళాలకు  కారణమని  తెలిసిన  మహారాజు  సంతోషంతో  పొంగిపోతూ , ఈవిధంగా  పలికాడు .

యథా అమృతస్య   సంప్రాప్తిర్యథా   వర్షమనూదకే
యథా  సదృశదారేషు  పుత్రజన్మా   ప్రజస్యచ
ప్రణష్టస్య  యథా  లాభో  యథా  హర్షో  మహోదయే
తథైవాగమనం  మన్యే  స్వాగతంతే  మహామునే

“మహామునీ !  మీరు  మా గృహాన్ని   పావనం  చేయడం ( రావడం )  అమృతము  లభించడం  వంటిది .  జలంలేని  చోట   వర్షం కురియడం  వంటిది .  సంతానం  లేనివాడికి  పుత్రుడు  లభించడం  వంటిది .   పోయిన  వస్తువు  దొరకడం  వంటిది .  చాల  గొప్పదైన  అభివృధ్ధి  కలిగినప్పుడు   కలిగే  ఆనందం  వంటిది .
మీకు  స్వాగతం !  సుస్వాగతం “.

కం  చ  తే పరమం  కామం  కరోమి  కిము  హర్షితః
పాత్రభూతోసి  మే  బ్రహ్మన్  దిష్ట్యా  ప్రాప్తోసి  కౌశిక
అద్య  మే  సఫలం  జన్మ  జీవితం  చ సుజీవితం

మహర్షీ !  మీరు   దైవవసంకల్పం  చేత  నావద్దకు   వచ్చారు  .  నా జన్మ  ధన్యమైంది . నా  జీవితం  సుజీవిత మైంది .  సంతోషంతో  పొంగిపోతున్న  నేను  మీకు  ఏ విధంగా  సహాయ పడగలను . మీ  కేవైనా  కోరికలుంటే  చెప్పండి .  మీ   కేదైనా   ఇవ్వడం “సత్పాత్ర    దానమౌతుంది “.

లోకకళ్యాణం   కోసం  దాన  మడగడం  తప్పు కాదు .

“ఆదిన్   శ్రీసతి   కొప్పుపై  ,  తనువుపై    అంసోత్తరీయంబుపై   ,
బాదాబ్జంబులపై ,  కపోలతటిపై —– ‘   మర్యాద  చెందిన  వామనుని   చేతులే  బలిచక్రవర్తి  ఇచ్చిన   దానం  పుచ్చుకున్నాయి .  విశ్వామిత్రుడు లోకకళ్యాణం కోసం  దశరథుణ్ణి  తన  కోరిక  తీర్చమని  అదుగుతున్నాడు .  దీనివల్ల  నేర్చుకోవలసిందేమిటంటే  ” మంచి  చేయాలనే  తలపుతో  పుచ్చుకున్న  దానం , దానమిచ్చిన వారికీ  ,  దానం  గ్రహించిన  వారికీ  కూడా  కీర్తి తెస్తుంది” .  దానిని   సత్పాత్ర   దానమని   అంటారు .  ధనం  సంపాదించడం  సత్పాత్రులకు  దానం  చేయడానికే .  రాజులైనా ,  రాజ్యాలనూ , ధనాన్నీ  తమ  వెంట తీసుకుని  వెళ్ళలేరు   కదా !  కానీ  వారు  వెళ్ళాక  కూడా  వారి  కీర్తి  వారి  వెంబడే  ఉంటుంది ,  నలుదిశలా  ప్రకాశిస్తుంది  కూడా .  మన   సంస్కృతిలో   దానధర్మాల   పాత్ర  చాలపెద్దది .  కర్ణుడూ , దధీచీ  , శిబి చక్రవర్తీ  లాంటి  వారెందరో  దానమిచ్చిన  కారణంగా  అమరులైనారు .

రామాయణం

స  రాజ్ఞ    ప్రతిగృహ్యార్థం   శాస్త్రదృష్టేన  కర్మణా
కుశలం  చావ్యయం  చైవ  పర్యపృచ్ఛన్నరాధిపం
పురే   కోశే   జనపదేషు  బాంధవేషు  సుహృత్సుచ
కుశలం  కౌశికో  రాజ్ఞఃః   పర్య   పృచ్ఛత్సుధార్మికః
అపితే  సన్నతాః  సర్వే  సామంతా  రిపవో జితాః
దైవం  చ  మానుషం చాపి  కర్మతే  సాధ్వనుష్టితం

బంధువుల ఇళ్ళకు  వెళ్ళినప్పుడు  వారికి   సంతోషం  కలిగించే  మాటలు  మాట్లాడాలి . మృదువైన  పదాలూ ,  ముచ్చటైన  ముచ్చట్లూ  మనసుకు  ఆనందం  కలిగిస్తాయి . వెళ్ళినప్పటి  నుండీ  మన     గొప్పతనాన్నీ , మన కష్టాలనూ  చెప్పకుండా  అవతలవారి  క్షేమసమాచారాలు  కనుగొని  ,  వారికిష్ట మైన విషయాలు  మాట్లాడాలి . ఇలా   చేస్తే    సుహృద్భావమైన  వాతావరణం  నెలకొంటుంది . అటుపిదప వచ్చిన  కారణం  వివరిస్తే  అది సఫలమవుతుంది .

సాదరంగా  స్వాగతం పలికిన  మహారాజును   మహర్షి   కుశల   ప్రశ్నలడిగాడు . ” మీ పాలనలో   ప్రజలందరూ  సుఖంగా ఉన్నారు  కదా ?  మీ బంధువులందరూ  క్షేమమేనా  ?  సిరిసంపదలు  పుష్కలంగా  ఉన్నాయి  కదా ?  మీ రాజ్యం  ఏ లోటూ  లేకుండా   ఉన్నదికదా ?   మీకు  ఎటువంటి  కష్టాలూ  లేవుకదా ?   మిత్రులు కుశలమేనా ?  శత్రువులందరూ  నిగ్రహింపబడ్డారు  కదా ? యజ్ఞ్య  యాగాదులు  చక్కగా నిర్వహింపబడుతున్నాయి  కదా ?

సకల శాస్త్ర  నిష్ణాతుడు  విశ్వామిత్రుడు . మధురంగా  భాషిస్తాడు . బాలకాండలో  విశ్వామిత్రుని  సంభాషణా  చాతుర్యం  మనకు స్పష్టంగా  కనిపిస్తుంది .

“ది   ఆర్ట్  ఆఫ్  కాన్వర్సేషన్ ”  కు  మన  వాళ్ళు   చాలా  ప్రాధాన్యత  ఇచ్చేవారు . ఉదాహరణకుపాండవోద్యోగ విజయంలో ,    సాయంకోరడానికి వచ్చిన    అర్జునుణ్ణీ , దుర్యోధనున్నీ శ్రీ కృష్ణుడు   క్షేమసమాచారాలడిగిన విధానం  .

ఎక్కడనుండి రాక యిట కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!

బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్,సుతుల్ ,చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

ఇటువంటి   పరామర్శలూ  ,  చతుర   సంభాషణలూ  మన  సంస్కృతిలో  ఒక  భాగం .  మెల్లి   మెల్లిగా  ఈ  సంస్కృతిని  మనం  కోల్పోతున్నామేమోనని  నాకు  సందేహం .

రామాయణం

తేషాం  తద్వచనం  శ్రుత్వా  సపురోధాః  సమాహితః
ప్రత్యుజ్జగామ  తం హృష్టో  బ్రహ్మాణమివ  వాసవః
తం   దృష్ట్వ   జ్వలితం  దీప్తతపసం  సంశ్రితవ్రతం
ప్రహృష్ట  వదనో  రాజా  తతోర్ఘ్యముపహారయత్
విశ్వామిత్ర   మహర్షి  ధీర గంభీర  వదనంతో తన  వాకిట నిలిచి  ఉన్నాడన్న   వార్త విన్న  దశరథునికి   సంతోషం  కలిగింది . దిగ్గున   లేచి బ్రహ్మదేవుడు  వచ్చినప్పుడు ,  ఎదురు  వెళ్ళి  ఆహ్వానించే  దేవేంద్రుని  లాగా   ,   తన  మంత్రి , పురోహితులందరితో  ద్వారం  వద్దకు  వచ్చి  ,  దీర్ఘమైన  తపస్సు చేసిన  కారణంగా జ్వలిస్తున్న (అగ్నిలాగా  మండిపోతున్నాడట , మహానుభావుడు  విశ్వామిత్రుడు )   మహర్షిని  రాజసౌధం  లోపలికి  విచ్చేయమని  కోరాడు .  అర్ఘ్య ,పాద్యాలను  సవినయంగా  సమర్పించాడు .

నియమంతో  చాలాకాలం  తపస్సు  చేస్తే  దేహానికి  ఒకరకమైన  వింతకాంతి  కలుగుతుంది .   అటువంటి  వ్యక్తిని  చూడగానే  ఇతరులకు  గౌరవ  భావం కలుగుతుంది .  శక్తులు  ఎలాగూ  సిధ్ధిస్తాయి .  విశ్వామిత్రుని  జీవితమంతా  తపస్సులో  గడిచిపోయింది . అపారమైన శక్తులు  అతనికి  వశపడ్డాయి .  ధనుర్విద్యలో  అతనిని  మించిన వాడు  కానరాడు .  యాగాలు  చేయడంలో  మేటి . అందుకే    అతని   శరీరానికి     ప్రజ్వలితమైన   అగ్ని జ్వాల  వంటి  కాంతి .
ఈ  రోజున  కూడా    దేవాలయానికి   గౌరవనీయులైన    వ్యక్తులు  వస్తే    పూర్ణకుంభంతో    ఎదురేగి   స్వాగతిమిస్తారు . భారతీయ  ధర్మంలో  అతిథిని , విష్ణువు లాగ  పూజించాలని  చెప్పబడింది .  “ఆభ్యాగతః  స్వయం విష్ణుః  ” .   అతిథి   అంటే  తిథి , వార ,నక్షత్రాలు  చూడకుండా  మన ఇంటికి  వచ్చే   వ్యక్తి   . దశరథుడు   సకల  మర్యాదలతో  స్వాగతం  పలికాడు తన  రాజ్యానికి  విచ్చేసిన    మహర్షికి .

రామాయణం

మహానుభావుల  రాక  మంగళకరం .  వచ్చినవాడు  విశ్వామిత్రుడు . వచ్చి  ద్వారపాలకులతో

స రాజ్ఞో    దర్శనాకాన్షీ    ద్వారాధ్యక్షానువాచ   హ
శ్రీఘ్రమాఖ్యాత   మాం  ప్రాప్తం  కౌశికం  గాధినః  సుతం .

” కౌశికుడు , గాధికుమారుడు అయిన  విశ్వామిత్రుడు  తమ   దర్శనార్థం   వచ్చినాడని  మీ    మహారాజుకు  శ్రీఘ్రంగా  విన్నవించండి ” అని పలికాడు . (విశ్వామిత్రుడు  అయోధ్యా నగరానికి  రావడానికి  కారణం  రాముని  దర్శించాలనే . వీలైనంత  కాలం  రాముని  సాన్నిధ్యంలో  గడపాలనే . లేకపోతే మారీచ , సుబాహుల వంటి చిన్న చిన్న  రాక్షసులు  విశ్వామిత్రుడికి  ఆటంకమా?    ప్రపంచంతో సంబంధాలు వదలివేసిన  మునులు  భగవంతుని  వెదుకుతూ ,  ఆతడెక్కడ  ఉంటాడో  అక్కడికి  వెడతారట ) .

తచ్ఛ్రుత్వా    వచనం  త్రాసాద్రాజ్ఞో   వేశ్మ  ప్రదుద్రువుః
సంభ్రాంతమనసః  సర్వే  తేన  వాక్యేన  చోదితాః
తే గత్వా  రాజభవనం  విశ్వామిత్రమృషిం  తదా
ప్రాప్తమా వేదయా  మాసుర్న  పాయైక్ష్వాకవే   తదా

అది విన్న  ద్వారాధ్యక్షుల  మనసులు  కలత పడినాయట . గాధినందనుని  పేరు విని ,  వారు  భయభక్తులతో  రాజగృహానికి  పరుగెత్తి  వెళ్ళారు .   విశ్వామిత్రుని  ఆగమనాన్ని   మహారాజుకు  నివేదించారు . కోపానికీ ,  శా పాలివ్వడానికీ    ప్రసిధ్ధి   కదా   కుశికరాజనందనుడు .

రామాయణం

తస్య  చింతయామానస్య  మంత్రిమధ్యే  మహాత్మనః
అభ్యగచ్ఛన్మహాతేజా  విశ్వామిత్రో  మహామునిః

 

అంతా సవ్యంగా జరిగితే కథేముంటుంది . రాజకుమారులకు  పెళ్ళిచేయాలని  దశరథుడు  హితులతో  ముచ్చటిస్తోన్న  సమయంలో  “అభ్యగచ్ఛన్మహాతేజా ” ,  రాజప్రాసాదంలోకి   వచ్చాడు   మహాతేజోమయుడు , విశ్వామిత్రుడు

 

వచ్చినప్పటినుండీ  బాలకాండ  అంతంవరకూ  జరిగిన  కథకు   కారణభూతుడు  కౌశికుడు (విశ్వామిత్రుడు )  . విశ్వానికే   మిత్రుడు   విశ్వామిత్రుడు .  ఆశ్రయించిన వారిని   ఆదుకోకుండా  వదలడు . మహాశివుని  జటాజూటాలనుండి  నిరర్గళంగా  ప్రవహించే  గంగామతల్లిలాగా  వచ్చాడు  మహర్షి .  విశ్వానికి  మిత్రుడే , కానీ  అతనంటే  అందరికీ  భయం . కారణం ? అతనికుండే  అపారమైన శక్తి  ,పట్టుదల , మొదలుపెట్టిన  పని  ఎంత కష్టమైనా  వదలని  మనస్తత్వం .  ఆటంకాలెన్ని  వచ్చినా వాటిని   లెక్కచేయని  మనోదారుఢ్యం .  తలుచుకున్నది  కాకపోతే  చివ్వుమని వచ్చే కోపం .
అందరు  ఋషులూ ఆకాశంలో  తారలు  కావాలని తపస్సు  చేస్తారు .  విశ్వామిత్రుడు  తారలతో  నిండిన  ఆకాశాన్నే  సృష్టించాడు . అది అతని తపశ్శక్తి .  ఆతని  ఇంకో  అద్భుత సృష్టి “గాయత్రీ  మంత్రం ” .  గాయత్రీ   మంత్రకర్త  .  బ్రహ్మాస్త్రమూ ,  బ్రహ్మశిరోనామకాస్త్రమూ , గాయత్రీ మంత్రంతో  వశమవుతాయి .  అస్త్ర విద్యలో  విశ్వామిత్రుని  అధిగమించేవాడు  లేడు . కృషితో , వేల సంవత్సరాలు   తపస్సు  చేసి  బ్రహ్మర్షి అయినాడు  .అనుకున్నది  సాధించడంలో  ఈ మహర్షి  కన్నా  మిన్న కాగడా  పెట్టి  వెదికినా కానరాడు .  భగవంతుడైన    శ్రీరామచంద్రునికే    విద్యలుపదేశించిన   మేటి . జానకితో   రామ చంద్రుని  కళ్యాణాన్ని  కమనీయంగా , కనులపండుగగా    జరిపించిన   మహనీయుడు .
విశ్వామిత్రుడు  సదా  అనుసరణీయుడు . ఆటంకాలెన్ని ఎదురైనా  నిష్టతో , శ్రధ్ధతో  ప్రయత్నిస్తే  ఫలం  మన స్వంతమవుతుందని  నిరూపించిన  మహానుభావుడు .  కష్టపడేవారికి స్ఫూర్తి ( మోటివేటర్) .