Monthly Archives: నవంబర్ 2011

రామాయణం

అభిపూజ్య   తతో   హృష్ఠాః   సర్వే  చక్రుర్యథావిధి
ప్రాతః   సవన  పూర్వాణి   కర్మాణి   మునిపుంగవాః

యాగం  ప్రారంభమయింది .  యజ్ఞంలో  భాగాలైన   ప్రాతః సవనము  మొదలగు   కార్యాలను  విధిపూర్వకంగా  నిర్వర్తించారు సంతుష్టాంతరంగులైన  మునిపుంగవులు . పిదప ఆహూతులైన  దేవతలను  ఆరాధించారు  .

రామాయణం

ఋశ్యశృంగం  పురస్కృత్య  కర్మ చక్రుర్ద్విజర్షభాః
అశ్వమేధే  మహాయజ్ఞే   రాజ్ఞోస్య   సుమహాత్మనః

కర్మ  కుర్వంతి  విధివద్యాజకా  వేదపారగాః
యథావిధి  యథాన్యాయం  పరిక్రామంతి  శాస్త్రతః

 

బ్రాహ్మణులు  యాగాన్ని  ఆరంభించారు . ఋశ్యశృంగుడు   మార్గదర్శకత్వం  వహించగా  చేయవలసిన  కార్యాలన్నీ యథావిధిగా , తప్పులు లేకుండా చేసారు  ద్విజపుంగవులు .  వేదమార్గం , శాస్త్రమార్గం ,న్యాయమార్గాలను  పాటిస్తూ   యాగాన్ని  చేసారు .

ప్రవర్గ్యం  శాస్త్రతః  కుర్వా  తథై  వోపసదం  ద్విజాః
చక్రుశ్చ  విధివత్సర్వమధికం   కర్మ  శాస్త్రతః

అశ్వమేధానికి  అంగాలయిన  ప్రవర్గ్యము , ఉపసదము  అనే కర్మలను  ద్విజులు  శాస్త్రపరకారం  నిర్వర్తించారు .

అశ్వమేధ  యాగాన్ని  ప్రారంభించడానికి  ముందు చేసే  కర్మ  ప్రవర్గ్యం .  అశ్వనీ  దేవతలకు  ఆవు  పాలను  ఆరగింపుగా  ఇవ్వడమే  ఈ కర్మలోని  ప్రధానాంశం . ఇది రెండువిధాలుగా  ఉంటుంది . పాలను ఆరగింపు  చేయడానికి  ఉపయోగించే  మృణ్మయ   పాత్రలనూ  ఇతరపరికరాలనూ  నిర్మించే విధానం  మొదటిది . ఈ పాత్రలను  ఘర్మ లేక  మహావీర  అని  అంటారు .  మృణ్మయ  పాత్రలను  అగ్నిలో కాల్చి  నిర్మించిన వెంటనే  వేడిపాత్రలలో   ఆవుపాలను  అశ్వనీ  దేవతలకు  ఆరగింపు  చేస్తారు . ఈ తంతు ప్రతి  ఉదయమూ , సాయంత్రమూ , మూడురోజుల పర్యంతం  ఉపసదమనే  కర్మ చేయడానికి ముందు  చేస్తారు .   యజ్ఞం  సమాప్తి  కాగానే  మహావీర  పాత్రను  ఒక  ఉరేగింపుగా  ఉత్తరవేదిక  వద్దకు  తీసుకొని వెళ్ళి  భూస్తాపితం  చేస్తారు . ప్రవర్గ్య  కర్మను  శాస్త్రీయంగా  చేస్తే  యజమాని  మార్తాండునిలాగా  వెలిగిపోతాడనీ , అత్యంత శక్తివంతుడౌతాడనీ  నమ్మకం .
ప్రవర్గ్యం  పిదప చేసే కర్మ ఉపసదం .  ఉపసదంలో  అగ్నికీ , సోముడికీ చివరగా   మహావిష్ణువుకూ నేతితో  ఆహుతులిస్తారు .  శతపథ  బ్రాహ్మణంలో  ఉపసదానికి  సంబంధించిన కర్మకాండను  వివరంగా  తెలిపారు .

 

photo

 

 

రామాయణం

పదమూడు  సర్గలు  సమాప్తమయ్యాయి . పదునాలుగవ  సర్గలో  అశ్వమేధ  యాగం  చేసిన  విధానాన్ని  వివరిస్తారు  వాల్మీకి  మహర్షి .

అథ  సంవత్సరే  పూర్ణే  తస్మిన్ ప్రాప్తే  తురంగమే
సరయ్వాశ్చోత్తరే   తీరే   రాజ్ఞో   యజ్ఞోభ్యవర్తత

సంవత్సరకాలం  పూర్తి  అయింది .  జైత్ర యాత్ర  ముగించుకొని   తురగం  తిరిగి  వచ్చింది .  పవిత్రమైన  సరయూ  నదీ  తీరంలో  పావనులైన  మహర్షులు  అశ్వమేధ యజ్ఞాన్ని  ప్రారంభించారు .

రామాయణం

సర్వకామైరుపహృతైరుపేపేతం   వై    సమంతతః
ద్రష్టుమర్హసి   రాజేంద్ర    మనసేవ   వినిర్మితం

తథా   వసిష్ఠ  వచనాదృశ్యశృంగస్య  చోభయోః
శుభే  దివసనక్షత్రే  నిర్యాతో  జగతీపతిః

తతో  వసిష్ఠప్రముఖాస్సర్వ  ఏవ  ద్విజోత్తమాః
ఋశ్యశృంగం   పురస్కృత్య   యజ్ఞ కర్మారభంస్తదా
యజ్ఞవాటగతాః  సర్వే  యథాశాస్త్రం  యథావిధి .

దశరథ  మహారాజు  శుభ  నక్షత్రం   కూడిన  శుభ దినాన యాగశాలకు బయలుదేరాడు .
వసిష్ఠ  మహర్షి  దశరథునితో ” రాజా  కామ్యాలైన అన్ని  వస్తువులతో  నిండిఉన్న  ఈ యజ్ఞశాలను  దర్శించండి  . మనసు  ఊహించిన  విధంగా , ఏ కొరతా లేకుండా , అత్యద్భుతంగా  నిర్మించబడిన యాగశాల ఇది ” అని పలికాడు . ఋష్యశృంగ  మహర్షి   కూడా  యజ్ఞానికి  చేసిన ఏర్పాత్లతో  సంతుష్టుడై  వసిష్ఠ మహర్షి  భావాలనే  మహారాజుతో  తిరిగి  వ్యక్తం  చేసాడు .
ఋషులు , బ్రాహ్మణులు  వసిష్ఠుడు  ,  ఋష్యశృంగ మహర్షిని  ప్రధాన  కర్తగా  చేసి  శాస్త్ర ప్రకారం యజ్ఞాన్ని    ప్రారంభించారు .
రామాయణ  కాలం నుండీ  ,  ఏదైనా పని  ప్రారంభించే  ముందు  మంచి  ముహూర్తం చూసి పనిని  మొదలు  పెట్టడం  శుభమని  తలచే వారు . మంచిముహూర్తంలో  మొదలు పెట్టిన పని   సఫలీకృతం  కావడం   , ఈ రోజున  కూడా  చాలామందికి  అనుభవైకవేద్యం .

రామాయణం

తతః   కైశ్చిదహోరాత్రైరుపయాతా  మహీక్షితః
బహూని  రత్నన్యాదాయ  రాజ్ఞో  దశరథస్య వై

తతో  వసిష్ఠః  సుప్రీతో  రాజానమిదమబ్రవీత్
ఉపయాతా  నరవ్యాఘ్ర రాజానస్తవ  శాసనాత్
మయాపి  సత్కృతాః  సర్వే  యథార్హం  రాజసత్తమాః

యజ్ఞీయం  చ కృతం  రాజన్  పురుషైః  సుసమాహితైః
నిర్యాతు  చ భవాన్యష్టుం   యజ్ఞాయతనమంతికాత్

 

అహ్వానితులైన  రాజులందరూ  యజ్ఞాన్ని  వీక్షించే   కోరికతో  అయోధ్యానగరానికి  విచ్చేసారు . దశరథునికి  బహుమానంగా  ఇవ్వడానికి  అత్యుత్తమమైన రత్నాలను  తమతో తీసుకొని   వచ్చారు .
భగవంతుని వద్దకూ , పెద్దలైన వారి వద్దకూ , చిన్నపిల్లల  వద్దకూ , రాజు  వద్దకూ వట్టి  చేతులతో  వెళ్ళకూడదని  పెద్దలు చెబుతారు .

వసిష్ఠ  మహర్షి , దశరథునితో ”  రాజసత్తమా  నీ  ఆజ్ఞ  ప్రకారం  రాజులందరూ  వచ్చారు . వారినందరినీ  యథారీతిగా  నేను  సత్కరించాను” .

“ఇక యజ్ఞానికి  కావలసిన అన్ని  పదార్థాలను సమకూర్చడమైనది . నీవు  యజ్ఞశాలకు  బయలుదేరాలి   ” అని  పలికాడు .

రామాయణం

తతః   ప్రీతో  ద్విజశ్రేష్ఠస్తాన్    సర్వానిదమబ్రవీత్
అవజ్ఞ యా   న దాతవ్యం  కస్య  చిల్లీలయాపివా
అవజ్ఞయా  కృతం  హన్యాద్దాతారం  నాత్ర  సంశయః

యజ్ఞం  నిర్వహించడానికి   చేయవలసిన  పనులు సక్రమంగా  జరుగుతున్నాయని  తెలుసుకొన్న  వసిష్ఠ మహర్షి  ప్రీతి చెందినవాడై పనులు చేసే వారితో  ఈ విధంగా  పలికాడు : “సేవ చేసే  సమయంలో మీరు  జాగర్తగా  ఉండాలి .  ఏదైనా  వస్తువు  అహ్వానితులకు  ఇచ్చే సమయంలో  ఆదరంగా ఇవ్వాలి . అనాదరంగా  కాని అశ్రధ్ధగా  కాని  ఇవ్వకూడదు . అనాదరంతో ఉచ్చిన  దానం  , దాత  వినాశనానికి  కారణమవుతుంది” .
భారతీయ  సంస్కృతిలో ఇతరులను  ఆదరించడం  , అతిథులను  గౌరవించడం  అతి ముఖ్యమైనది .  అతిథిని  విష్ణుదేవునితో  సమానంగా చూడటం  మన పధ్ధతి .

దానమిచ్చేవాడికి  పుచ్చుకునేవాడు లోకువ . ఇది  లోక సహజం . కానీ  భారతీయ  ధర్మానికిది  విరుధ్ధం .  దానగ్రహీతను  సంతోషంగా  ఉండేటట్టు  చూడడం  భారతీయులు  పరమధర్మంగా  భావిస్తారు . అందుకే  ఏదైనా ఇచ్చేటప్పుడు ఎదుటివారి  మనసును  నొప్పించకుండా ఉండతానికి తగు జాగర్త  తీసుకుంటారు .  దానగ్రహీతకు  అసంతృప్తి  కలిగితే  అది  పాపమై తమనుచుట్టుకుంటుందనీ , తమ వినాశనానికి  దారి  తీస్తుందనీ  నమ్ముతారు . అదే  భావాన్ని  వసిష్ఠ  మహర్షి  ఈ శ్లోకంలో  వ్యక్తపరిచారు .

రామాయణం

స్వయమేవ  హి  ధర్మాత్మా  ప్రయయౌ  మునిశాసనాత్
సుమంత్రస్త్వరితో  భూత్వా  సమానేతుం  మహీక్షితః

సుమంత్రుడు  జనకుడు , కేకయ  మహారాజు  వంటి  అతిముఖ్యమైనవారిని  అహ్వానించడానికి  స్వయంగా  బయలు దేరాడు .

బుధజన విధేయుడు , మహాభాగధేయుడు , సుగుణమణిగణ వరిష్ఠుడు , వినయవివేక భూషణుడు ,    పరమభాగవత శ్రేష్ఠుడు  గా సుమంత్రుని  తీర్చిదిద్దాడు  వాల్మీకి  మహర్షి . ఇటువంటి  మంత్రి  దొరకడం  దశరథుని  అదృష్టం .

తే  చ  కర్మాంతికాస్సర్వే  వసిష్ఠాయ  చ ధీమతే
సర్వం  నివేదయంతి  స్మ  యజ్ఞే  యదుపకల్పితం

వసిష్ఠ  మహర్షి వద్ద  యజ్ఞవిధులలో  నియుక్తులైన  వ్యక్తులు  ,  తాము  చేసిన పనుల  వివరాలను  మహర్షికి  నివేదించారు .

రామాయణం

సంతి  స్నిగ్ధాశ్చ  యే  చాన్యే  రాజానః  పృథివీతలే
తానానయ  యథాక్షిప్రం  సామగాన్  సహబాంధవాన్

ముఖ్యమైన  అహ్వానితుల  పేర్లు  చెప్పాక  వసిష్థ మహర్షి   ”  అయోధ్యా  నగరానికి   స్నేహితులైన  రాజులు , చక్రవర్తులందరినీ   అనుచర సహితంగా  అహ్వానించమని  ”  సుమంత్రుణ్ణి  కోరాడు .

వసిష్ఠ  వాక్యం   తచ్ఛృత్వా   సుమంతృస్త్వరితస్తదా
వ్యాదిశత్పురుషాంస్తత్ర  రాజ్ఞామానయనే  శుభాన్

వసిష్ఠ  మహర్షి  మాటలు  శ్రధ్ధతో  ఆలకించిన  సుమంత్రుడు ,  రాజులను  ఆహ్వానించి వెంట  తీసుకొని  రావడానికి  ఉత్తములైన , సద్గుణవంతులైన  పురుషులను   పంపాడు .

King Dasaratha and His Retinue Proceed to Rama's Wedding: Folio 
from the Shangri II Ramayana Series

రామాయణం

అఙ్గేశ్వరం   మహాభాగం  రోమపాదం  సుసత్కృతతం
వయస్యం  రాజసిం హస్య  సమానయ  యశస్వినం .

ప్రాచీనాన్  సింధువీరాన్  సౌరష్ట్రేయాంశ్చ  పార్థివాన్
దాక్షిణాత్యాన్నరేంద్రాం శ్చ సమస్తానానయస్వ  హ

అంగదేశాధిపతి   రోమపాదుడు  దశరథ  మహారాజుకు  మంచి మిత్రుడు . ఆ   భాగ్యశాలిని   చక్కగా  సత్కరించి  తీసుకొని  రావాలి .  అదేవిధంగా  సింధు , సౌవీర  ,సౌరాష్ట్ర  , దాక్షిణ్య  దేశాల  రాజులందరినీ  అహ్వానించి  అశ్వమేధ  యాగాన్ని  తిలకించడానికి  తీసుకొని  రావాలి .

రామాయణం

తథా  కాశీపతిం  స్నిగ్ధం  సతతం  ప్రియవాదినం
వయస్యం  రాజసిం హస్య   స్వయమేవానయస్వ  హ

తథా  కేకయరాజానం  వృధ్ధం  పరమధార్మికం
శ్వశురం  రాజసిం హస్య సపుత్రం  త్వమిహానయ .

మహారాజు కు  మిత్రుడైన  కాశీపతి  స్నేహశీలుడు , ఎల్లప్పుడూ  ప్రియంగా  పలికేవాడు .
మహారాజు  మామ గారైన  కేకయ రాజు  వృధ్ధుడు ,   పరమధార్మికుడు .
నీవు  స్వయంగా  వెళ్ళి   ప్రేమపూర్వకంగా  వీరిని  పిలచి , వెంట తీసుకొని రావాలి .