Monthly Archives: జూన్ 2012

రామాయణం

తాం దృష్ట్వా  రాఘవః   క్రుధ్ధాం  వికృతం  వికృతాననం
ప్రమాణేనాతివృధ్ధాం  చ  లక్ష్మణం  సోభ్యభాషత
పశ్య  లక్ష్మణ  యక్షిణ్యా  భైరవం  దారుణం  వపుః
భిద్యేరన్  దర్శనాదస్యా  భీరూణాం  హృదయాని   చ
ఏనాం  పశ్య  దురాధర్షాం   మయాబల  సమన్వితాం
వినివృత్తాం  కరోమ్యద్య  హృతకర్ణాగ్ర  నాసికాం .
న హ్యేనాముత్సహే  హంతుం  స్త్రీ  స్వభావేన  రక్షితాం
వీర్యం  చాస్యాం  గతిం  చాపి  హనిష్యామీతి  మే మతిః

 

పెద్ద  దేహం ,  వికృతమైన  ఆకారం , దానికితోడు కోపం . ఇదీ  తాటక  ప్రథమ  దర్శనం . దినకర  కుల కమల  దివాకరుడైన   రామచంద్రుడు  ఆ  యక్షిణి  ఆకారాన్ని  చూచి : ” లక్ష్మణా !  దారుణమైన  దేహంతో , భయాన్ని కలిగించే  రూపుతో  ఉన్న  తాటకను  చూడు .  భీరువుల ( పిరికి వాళ్ళ)   గుండెలు  ఈ  యక్షిణి  దర్శన  మాత్రం చేతనే  పగిలిపోతాయి . మాయాబలం  అపరిమతంగా  ఉన్నందున  ఈ  యక్షిణిని  ఎదిరించడం  సులభసాధ్యం  కాదు . అయినా  ఈ  తాటకను  ముక్కూ  , చెవులూ  కోసి  పంపించేస్తాను .  నా   చేత   చావకుండా , ఆడజన్మ  ఈమెను  రక్షిస్తోంది .  ఈ  రాక్షసి  వేగాన్ని , పరాక్రమాన్ని మాత్రమే   నాశనం  చేయాలని  నా ఉద్దేశ్యం” అని అన్నాడు .

 

తాటక  తనను  చంపడానికి   మీదపడి   వస్తున్నా  మనఃస్థిమితం  కోల్పోలేదు  రఘురాముడు .  మహిళను  మట్టుపెట్టకూడదనే  ఆ మహితాత్ముని  ఆలోచన .  తప్పని పరిస్థితిలో ,  మహర్షి  ఆజ్ఞ  కారణంగా  తాటకను  పరిమార్చాడు , కానీ  ఇష్టంతో  కాదని  ఈ శ్లోకం  తెలియజేస్తోంది .

రామాయణం

తేన    శబ్దేన   విత్రస్తాస్తాటకా     వనవాసినః
తాటకా  చ  సుసంక్రుధ్ధా  తేన  శబ్దేన మోహితా

తం   శబ్డమభినిధ్యాయ  రాక్షసీ  క్రోధమూర్ఛితా
శ్రుత్వా   చాభ్యద్రవద్వేగాద్యతః   శబ్దో   వినిస్సృతః

రామచంద్రుని   మౌర్వీ రవం ( నారి  శబ్దం)  అడవిలో   ప్రతిధ్వనించింది  . తాటకారణ్యంలో  నివశించే  జంతువులూ , ఇతర ప్రాణులూ  ఆ  శబ్దం విని   భయంతో   వణికిపోయాయి . శబ్దం  తాటకకూ  వినిపించింది .  తన  వనంలోకి  ప్రవేశించి ,  నారిమోగించే  సాహసం  చేసిన వారి  మీద విపరీతమైన  కోపం  వచ్చింది . ఒక్క  క్షణమాలోచించింది .  అంతే !  శబ్దం  వచ్చిన  దిశవైపు  వేగంగా  పరుగెట్టింది .

రామాయణం

ఏవముక్త్వా ధనుర్మధ్యే బధ్ధ్వా ముష్టి మరిందమ
జ్యా శబ్దమకరోత్తీవ్రం దిశశబ్దేన నాదయన్

అరిందముడైన ( శత్రువులను సంహరించేవాడు ) రాముడు , పిడికిలి  బిగించి  , వింటి నారిని లాగాడు . నారి లాగడం వల్ల పెద్ద శబ్దం జనించింది . ఈ శబ్దాన్ని ధనుష్టంకారమని అంటారు .

ఎందరో రామాయణ కర్తలు ఈ శబ్దాన్ని వర్ణించారు . కొన్ని వర్ణనలు అద్భుతంగా ఉంటాయి . ఉదాహరణకు భాస్కర రామాయణంలోని వర్ణన :

అంతఁగడంక రాముడు సమగ్ర భుజాలుల విక్రమోత్సవం
బెంతయు బర్వ మౌర్వి మొరయించె దిగంతర దంతి కర్ణరం
ధ్రాంతర సాగరాంతర ధరాభ్ర తలాంతర చక్రవాళ శై
లాంతర సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్

రాముని వింటినుండి జనించిన శబ్దం దిగంతరాలల్లో మారు మ్రోగిందట. అష్ట దిగ్గజాల చెవులలో ప్రతిధ్వనించింది , సాగరాంతరాలలో ( సముద్రం లోపల ) , పర్వతగుహలలో , భూమ్యాకాశాల మధ్యన ఉండే స్థలంలో నిండిపోయిందట ఆ శత్రుభీకరమైన శబ్దం . “దిగంతర , రంధ్రాంతర , సాగరాంతర , తలాంతర , శైలాంతర , కుహరాంతర ” అనే రైమింగ్ పదాలతో అతి అందంగా రచించిన పద్యమిది .

రామభద్రుని వింటి శబ్దాన్ని ప్రణవనాదంగా భావించి ఒక కవి ” ప్రభువు విల్లు ధర్మం వైపు వంగుతున్నదనీ , బాణాన్ని ఎక్కుపెడితే ముక్తి వరదలై పారుతునందనీ చెబుతూ , అటువంటి కోదండానికి అంజలి ఘటిస్తాడు .

రామ భద్రుని విల్లొక ప్రణవమేమొ
వంగుచున్నది ధర్మము వైపునకును
శరము గురిపెట్టెనా ముక్తి వఱలు గాదె
అట్టి కోదండమునకునై ప్రాంజలింతు!
రాముని పేరే  కోదండరాముడు . కోదండం  లేని  రాముని  ఊహించుకోవడం  కష్టం . .  తాటక  సంహారానికి  ఉద్యమించిన    రాముడు   ధనుష్టంకారం  చేసి    ” ఖబర్దార్ ! నేను వచ్చానని ”  రాక్షసులకు   తెలియ జేసిన  రీతిగా  ఉంది   ఆ  ధనుష్టంకారం . లోకాలనావరించిన  చీకటిని  పోగొట్టడానికి  ,  సుప్రభాతవేళ   తూర్పున  ఉదయించే  సూర్యుని  ఆగమనాన్ని  సూచించే  సంజె  వెలుగులా ,   సాధుజనుల  భయాందోళనలు   మటుమాయం  కావడం   ఖాయమని  తెలిపే  శంఖారావం    ఆ  ధనుష్టంకారం  .  నిజమైన  సంజె వెలుగది .శాంతమూర్తిగా   ఉదయించి  సమయం  గడిచే   కొద్దీ   ప్రచండుడయ్యే   మార్తాండుని   లాగా  భాసించాడు  నీలమేఘ శ్యాముడు   రామ చంద్రుడు .

రామాయణం

గోబ్రాహ్మణ  హితార్థాయ  దేశాస్యాస్య   సుఖాయ  చ
తవ  చైవాప్రమేయస్య  వచనం  కర్తుముద్యతః

శ్రీరాముని  దృష్టిలో   తాటకను  సంహరించడానికి  కారణాలు  మూడు :
1 .  గో  బ్రాహ్మణుల  హితం  .
2 . దేశవాసుల  సుఖం  .
3 . విశ్వామిత్రుని  ఆజ్ఞ పాలించడం  . ( తండ్రి   ఆజ్ఞ    , కౌశికుడు చెప్పినట్లు  చేయమన్నాడు  కదా )  .

ఈ  మూడు  కారణాలూ  తెలిపి , మహాత్మా  మీరు  చెప్పినట్టు  చేయడానికి  సిధ్ధంగా  ఉన్నానని  కౌశికునికి  తెలిపాడు .

రామాయణం

తాటక  సంహారం :

ఇరవై  ఆరవ   సర్గ  లో   శ్రీరాముడు   తాటకను  సంహరించడం  జరుగుతుంది .

మునేర్వచన  మక్లీబం  శ్రుత్వా  నరవరాత్మజః
రాఘవః  ప్రాఞ్జలిర్భూత్వా   ప్రత్యువాచ  దృఢవ్రతః

పితుర్వచన  నిర్దేశాత్పితుర్వచన  గౌరవాత్
వచనం  కౌశికస్యేతి  కర్తవ్య  మవిశఙ్కయా

అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా
పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి తద్వచః

 

విశ్వామిత్రుని   మాటలు  విన్న  రామచంద్రుడు  ముకుళిత  హస్తాలతో   “తండ్రి    ఆజ్ఞ  ,  తమ  మాట , తండ్రియందు  నాకుండే   గౌరవం   వల్ల  ఈ  కార్యం  తప్పకుండా  చేయాలి  .    అయోధ్యలో  ,  పెద్దల  సమక్షంలో    మా  తండ్రి  దశరథుడు  మీరు  చెప్పినట్లు  చేయమని  ఆజ్ఞాపించారు . తండ్రిమాట  జవదాటకూడదు    కదా ? ” అని పలికాడు .

దశరథుడు  ధన్యుడు .  తండ్రిగారి  మాటను  జవదాటని  తనయుడు  రాముడు .  నిజంగా  ఇటువంటి  కొడుకు  పుట్టడం  ఆ తండ్రి   చేసుకున్న   అదృష్టం  కాదా !

ఈ  సందర్భం లో  కౌటిల్యుని  / చాణుక్యుని  వాక్యాలు  మననీయాలు  .

” తే పుత్రాయే  పితుర్భక్తా  , స  పితాయస్తు  పోషకః —– యశ్య పుత్రో వశీ  భూతో — తస్య స్వర్గం  ఇహైవ  హి “.

తండ్రి యందు  భక్తి కలవాడే  కుమారుడు , పుత్రులను పోషించేవాడే  తండ్రి — విధేయుడైన కుమారుడు  కలిగినవాడికి  ఇహమే  స్వర్గం .
అందుకే  రాముని  పుత్రునిగా  పొందిన దశరథుడు  ధన్యుడు .

రామాయణం

రాజ్యభార     నియుక్తానామేష  ధర్మ  స్సనాతనః
అధర్మ్యాం  జ హి కాకుత్స  ధర్మో  హ్యస్యా  న విద్యతే
శ్రూయతే  హి పురా  శక్రో  విరోచనసుతాం  నృప
పృథివీం  హంతుమిచ్ఛంతీం మంధరామభ్యసూదయత్
విష్ణునాపి  పురా రామ భ్ర్గుపత్నీ  దృఢవృతా
అనింద్రం  లోకమిచ్ఛంతీ కావ్యమాతా  నిషూదితా
ఏతైశ్చాన్యైశ్చ  బహుభీ  రాజ్పుత్ర  మహాత్మభిః
అధర్మసహితా  నార్యో  హతాః  పురుషసత్తమైః

విశ్వామిత్ర  మహర్షి శ్రీరామ  చంద్రునితో  ఇంకా ఇలా  చెబుతున్నాడు :  ప్రజారక్షణ  రాజుల  ప్రథమ  కర్తవ్యం . ఇది ప్రాచీన  ధర్మం . అయినా ధర్మాన్నే  పాటించని  తాటకను  సంహరించడంలో  దోషమనేది  ఉండదు ” .  అటు పిదప   దుష్టులైన  స్త్రీలను  చంపడం  తప్పు  కాదనడానికి  ఉదాహరణలు    ఇస్తాడు  మహితాత్ముడు కౌశికుడు . ” పూర్వం  విరోచనుని   కుమార్తె   మంధర   పృథివిని  నిర్జించడానికి  ప్రయత్నించినప్పుడు   ఇంద్రుడు  మంధరను  సంహరించాడని  వినికిడి .  అదే  విధంగా  ఇంద్రుడనే వాడు  ఉందకూడదని  తపస్సు చేస్తున్న  భృగు  మహర్షి  భార్యను  స్వయంగా  శ్రీ  మహవిష్ణువే  సంహరించాడు . పూర్వం ఎందరో  మహానుభావులు  అధర్మ  మార్గంలో  పయనించే  స్త్రీలను  చంపారు .”
శ్రీరామా !  స్త్రీ అని వెనుకాడకుండా , అధర్మమని  అలోచించకుండా  తాటకను  తెగటార్చు . దీనిలో  దోషం  లేదు  అని  రామచంద్రునికి  ఉద్బోధ  చేశాడు .

ఒక  సత్కార్యాన్ని  చేయమని  చెప్పడానికి  విశ్వామిత్రుని  ఉద్బోధలో ”  రాజ  ధర్మాన్ని  మొదట  ఉటంకించడం  జరిగింది .  అధర్మాన్ని  పాటించే  స్త్రీలను  చంపడంలో  పాపం  లేదని  చెప్పడమూ  జరిగింది . ఇంకా  సందేహమేమైనా  మిగిలి  ఉంటే  , నీవు  చేయ బోయే  పని   కొత్తదేమీ  కాదని  ఉదాహరణలు  ఇవ్వడం  జరిగింది . ” యద్యదాచరతి  శ్రేష్టః”  అన్నట్లు  శ్రేష్టులను   అనుకరించమని  , అదే ధర్మమని  యుక్తి యుక్తంగా   రామునికి  చెప్పి  తాటక  సంహారానికి  మానసికంగా   రాముని  ఒప్పించాడు . ఈ  కాలం  గురువులు  తమ  శిష్యులకు  ఈ విధంగా  బోధించ  కలిగితే  ఎంత  బాగుంటుంది ? అని  ఒక భావన  కలుగక  మానదు .

రామాయణం

నహ్యేనాం    శాపసంసృష్టాం   కశ్చిదుత్సహతే  పుమాన్
నిహంతుం  త్రిషు  లోకేషు  త్వమృతే  రఘునందన
న  హి   తే  స్త్రీవధకృతే  ఘ్రుణా  కార్యా  నరోత్తమ
చతుర్వర్ణ్య  హితార్థాయ  కర్తవ్యం   రాజసూనునా
నృశంసమనృశంసం  వా  ప్రజారక్షణకారణాత్
పాతకం  వా  సదోషం  వా  కర్తవ్యం  రక్షతా  సతా

” స్త్రీ  కదా !  చంపకూడదు  కదా !  చేయతగిన పని కాదు  కదా ! ”  లాంటి  అలోచనలు  దరిజేరనీయకు . రాజకుమారుడు ,  నాలుగు  వర్ణాలవారికి   మంచి కలిగించే  పని  ఏదైనా  సరే ,  చేయాలి . ప్రజలకోసం ,  పాపమైనపనైనా ,  దోషమైనపనైనా  , క్రూ రమైనదైనా  – ఎలాంటిపనైనా  చేయాలి . ఇది  రాజ  ధర్మం .  సనాతనమైనది .  రాజ్యపాలనను  స్వీకరించిన  వారు  పాటించవల్సిన  ధర్మమిది .  తాటకలో  ధర్మమనేది  లేదు . చేసే  పనులన్నీ  అధర్మంతో  కూడుకున్నవి . తాటకను  సంహరించడమే  ధర్మం .
విశ్వామిత్రుడు  రామునికి  రాజధర్మాన్ని  వివరిస్తున్నాడు .   రాజనేవాడికి   ప్రజలే  పరమాత్మ  స్వరూపాలు . ఆ  ప్రజలకు  మేలు కలిగించే పని , ధర్మాధర్మాలను  అలోచించకుండా  నిర్వహించాలి . ప్రజా  క్షేమమే  రాజుల  కర్తవ్యం . భాగవతంలో  రంతిదేవుని  చరిత్రలో   చెప్పిన రీతిగా   ” శరీరధారులకు  ఆపద  వచ్చిన  వారి  ఆపదల్  గ్రన్ననన్    దాల్చి వారికి  సుఖంబులు  సేయుటకన్న ”    వేరే   మేలు   ఉండదు .

స్వార్థం  కోసం  ప్రజలను  దోచుకునే  వారి  మధ్యన  జీవనం  గడిపే  మనకు  ఈ  రాజధర్మం  అర్థమవుతుందా ? అర్థమైనా , పాలకులను  ఈ విధంగా  పాటించమని  చెప్పే  ధైర్యం  ఉందా ? చెబుతే  వారు  వింటారా ? అదీ  డెమోక్రసీలో  – ప్రజలే  పాలకులైన  ప్రస్తుత  కాలంలో .    అందుకే అన్నారు ” గతియించిన  కాలము   మేలు ,  వచ్చు  కాలము కంటెన్ ” అని .

రామాయణం

తాం   తు  జాతాం  వివర్ధంతీం  రూపయౌవనశాలినీం
ఝర్ఝ  పుత్రాయ  సుందాయ  దదౌ  భార్యాం  యశస్వినీం

కస్యత్త్వచిథ   కాలస్య యక్షీ  పుత్రమజాయత
మారీచం  నామ  దుర్ధర్షం   యశ్శాపాద్రాక్షపో  భవత్
సుందే తు నిహతే  రామ  ఆగస్త్త్య  ఋషిసత్తమం
తాటకా  సహ  పుత్రేణ    ప్రధర్షయితుమిచ్ఛత

భక్షార్థం జాతసమ్ర ంభా గర్జంతీ సాభ్యధావత

ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషిః

రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః

ఆగస్త్యః పరమక్రుధ్ధ స్తాటకామపి శప్తవాన్
పురుషాది మహాయక్షీ విరూపా వికృతాననా
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్యుతే

సై షా శాపకృతామర్షా తాటకా క్రో ధ మూర్ఛితా
దేశముత్పాదయత్యే నమగస్త్య చరితం శుభం

ఏనాం   రాఘవ   దుర్వృత్తాం   యక్షీం  పరమదారుణాం
గో  బ్రా హ్మణ  హితార్థాయ జహి దుష్ట పరాక్ర మాం
కొద్దికాలం  గడిచింది .  తాటకకు  మారీచుడనే  కుమారుడు  పుట్టా డు .  అయితే  వీరందరూ ( సుందుడు ,తాటక , మారీచుడు )  అగస్త్యుని  శాపానికి  గురి అయ్యారు . సుందుడు  అగస్త్యునితో  వైరం   పెట్టుకుని  ఆ  మహర్షి   శాపాగ్నికి   మరణించాడు . అది చూచిన  తాటక , మారీచుడు , అగస్త్య  మహర్షిని  ఎదిరించారు .  విపరీతమైన  కోపంతో  పెద్దగా  అరుస్తూ     తనను భక్షించడానికి  వస్తున్న  తాటకను మహర్షి   శపించాడు . ” వికృతమైన  రూపంతో , వికారమైన  ముఖం  కలిగి  మనుష్యులను భక్షించే  యక్షిణిగా  మారిపో ” మన్నాడు . నీకు  భయంకరమైన  ఆకారం  కలుగుతుందని  కూడా   అన్నాడు .   మారీచుణ్ణి    “రాక్షసుడిగా  మారిపొమ్మని” పలికాడు .  భగవంతుని  స్వరూపమైన  అగస్త్య  మహర్షి  పలుకులు   ములుకులై  తాకగా   , తాటక తన కుమారుడైన  మారీచునితో  సహా   దుష్ట   స్వభావాన్ని  పొంది  లోకకంటకురాలైంది . అగస్త్యుని  శాపంతో  తాటకకు  కోపం కలిగింది . మహర్షి  నివసించిన ఈ  దేశాన్ని నాశనం  చేస్తోంది .

లోకాల  బాధలు  తీర్చడానికి తాటకను  వధించు .  నీవు  తప్ప  ఈ  లోకంలో  ఈ  పని  చేయడానికి  సమర్థులు  కారు .  అని కౌశికుడు  పలికాడు .

ప్రతి  విషయాన్నీ  చక్కగా  వివరించే  వాల్మీకి  మహర్షి   తాటక  వృత్తాంతాన్ని  సరిగా  వివరించలేదని  నాకనిపిస్తోంది .  ఉదాహరణకు  అగస్త్య  మహర్షికి  సుందుడితో  వైరమెందుకు  కలిగిందో  చెప్పలేదు . తాటకకు  అంత శక్తి   ఎందుకు ఇచ్చాడో వివరించలేదు . ప్రతి చిన్నవిషయాన్నీ  సూక్ష్మంగా  పరిశీలించే స్వభావం  వాల్మీకి  మహర్షిది . లేక కొన్ని  శ్లోకాలు లుప్తమయిపోయాయేమో ?  శ్లోకాల  భావం  కూడా  కొంత  అస్తవ్యస్తంగా  ఉంది .  ఈ  భాగం  వాల్మీకి  మహర్షి  రాసింది  కాదేమో  అని  నా అభిప్రాయం .  నా  భావన  తప్పయితే  క్షంతవ్యుణ్ణి .

విశ్వామిత్రో బ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా
వరదానకృతం వీర్యం ధారయత్యబలాబలం
పూర్వమాసీన్మహాయక్షః సుకెతుర్నామ వీర్యవాన్
అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః
పితామహస్తు సుప్రీతస్య యక్ష్పతేస్తదా
కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః
దదౌనాగసహస్రస్య బలం చాస్యాః పితామహః
న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః

 

రాముని ప్రశ్నకు  జవాబుగా  విశ్వామిత్రుడు   తాటక  కథను  వివరంగా  తెలిపాడు : ” రామా !  అబల రూపంలో ఉన్న  ఈ  సబల  బ్రహ్మదేవుని  వరాల  చేత  అంతులేని   వీర్యాన్ని  , అమేయమైన బలాన్ని  పొందింది .  పూర్వం సుకేతువనే  యక్షుడు  ఉండేవాడు . సంతానం  పొందడానికి   తపస్సు  చేసాడు . బ్రహ్మదేవుడు  ఆతని  తపస్సుచే  సంతోషం  చెంది  తాటక  అనబడే  కన్యారత్నాన్ని  ప్రసాదించాడు . సుకేతుడు  కోరిన విధంగా  పుత్రుణి  ప్రసాదించలేదు కాని  , పుత్రిక అయిన    తాటకకు  వేయి ఏనుగుల  బలం  ఉండేటట్టు  వరమిచ్చాడు . అందుకే  అల్ప బలం  కలిగిన యక్షుల  వంశంలో  పుట్టినా  అపరిమితమైన  బలం  తాటకకు .