Monthly Archives: అక్టోబర్ 2010

శ్రీమద్రామాయణము

నారదుడు రాముని కథను వాల్మీకి మహర్షికి క్లుప్తంగా సంక్షేప రామాయణరూపంలో  ఇంకా ఇలా  చెబుతాడు.

తస్యాభిషేకసంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ

పూర్వం దత్తవరా దేవీ వరమేన  మయాచత

వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం.

ఆనుకున్నదే తడవుగా దశరథుడు యౌవరాజ్యపట్టాభిషేక ప్రయత్నాలను మొదలుపెట్టాడు.అవసరమైన వస్తువులను సమకూర్చమని తన భృత్యవర్గానికి ఆనతిచ్చాడు. రాముని రాజ్యాభిషేకానికి సంభారాలను సేకరించడాన్ని కైకేయి గమనించింది. ఇంకేమి. కైకేయికి కన్ను కుట్టింది. దశరథమహారాజు పూర్వం రెండువరాలు ప్రసాదిస్తాను అన్న విషయం  జ్ఙాపకం వచ్చింది.   అంతే రాముని అరణ్యాలకు పంపివేయమనీ , భరతునికి పట్టాభిషేకం  చేయమనీ   కోరింది.

స  సత్యవచనాచ్చైవ  ధర్మపాశేన సంయతః
వివాసయామాస సుతం రామం దశరథః  ప్రియం.

మాట ఇచ్చి తప్పని వాడైన దశరథుడు , ధర్మపాశబధ్ధుడై ,   తనకు ఇష్టం లేకున్నా రాముని  అడవులకు పొమ్మన్నాడు

స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్
పితుర్వచననిర్దేశాత్  కైకేయ్యాః  ప్రియకారణాత్

తండ్రి మాట  జవదాటని తనయుడు  అరణ్యానికి బయలుదేరాడు.

పుత్ర ధర్మాన్ని ఆచరించి చూపిన పురుషోత్తముడు రాముడు. దశరథుడు  రాముని అడవులకు వెళ్ళమని చెప్పడానికి పడ్డ బాధ వర్ణనాతీతం. అది గ్రహించి ఎందుకని కూడా ప్రశ్నించకుండా అడవులకువెళ్ళాడా మహానుభావుడు.  తండ్రి ఏ పని  చేసినా పుత్రుని క్షేమం కోరే చేస్తాడు. అలా చేయని తండ్రి తండ్రే కాడు. ధర్మబధ్ధుడైన దశరథునికి, కుమారునికి కష్టం కలిగించే ఆజ్ఞ్య ఇవ్వక తప్పలేదు. అది తెలిసిన రఘురాముదు ఆనందంగా , లోకులకు ఆదర్శంగా  అడవులకు పయనమయ్యాడు.

 

శ్రీమద్రామాయణము

సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః    స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః

సర్వదాభిగతఃసద్భిః  సముద్ర ఇవ సిందుభిః
ఆర్యః సర్వసమశ్చైవ  సదైక ప్రియ దర్శనః

స చ సర్వగుణోపేతః కౌసల్యా నందవర్ధనః
సముద్ర  ఇవ  గాంభీర్యే  ధైర్యేణ హిమవానివ

తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం
జ్యేష్టం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం

పృకృతీనాం హితైర్యుక్తం పృకృతి ప్రియకామ్యయా
యౌవరాజ్యేన సంయోక్తు మైచ్ఛత్  ప్రీత్యా మహీపతిః

విష్ణునా సదృశో  వీర్యే   సోమవత్ప్రియదర్శనః
కాలాగ్ని  సదృశః  క్రోధే  క్షమయా  పృథివీసమః
ధనదేన   సమస్త్యాగే   సత్యే   ధర్మ    ఇవాపరః

రామాయణ కథా ప్రారంభం ఇక్కడనుండి మొదలైనట్లు మనం భావించవచ్చు. అతులిత బలపరాక్రముడూ , అమేయమైన గుణసంపన్నుడూ  ప్రజలకు ప్రీతిపాత్రుడూ అయిన రామచంద్రుని యువరాజుగా పట్టాభిషేకము చేయ సంకల్పించాడు దశరథ మహారాజు.  ఉద్దేశ్యం మంచిదే. కానీ ఎవరైనా అభివృధ్ధి లోకివస్తే చూచి సహించలేనివారు కొంతమంది  వుంటారు.  మానవ చరిత్రను మార్చివేసిన సంఘటనలెన్నిటికో  అసూయ కారణం. ఇది మానవ స్వభావం. రామాయణ కథకూ అదే మూల కారణం.

శ్రీరాముడు  ధర్మ, న్యాయ, మీమాంసా , సాంఖ్య , వైశేషిక, యోగ శాస్త్రముల రహస్యములను ఆకళింపు చేసుకున్నవాడు , నేర్చుకొన్న విషయాలను మరచిపోయేవాడు కాదు, ప్రతిభావంతుడు , సద్గుణాలకు  పుట్టిల్లు ఆ  కౌసల్యానందవర్ధనుడు.  సముద్రుని  గాంభీర్యము, హిమవంతుని ధైర్యము ఈతని సొత్తు.  సర్వలోకప్రియుడ. నదులు సముద్రుని  చేరే చందంగా సత్పురుషులు రాముని చేరుతారు. వారికి  రాముడు తప్ప వేరే ఉపాయము  లేదు.ఈవిధంగా  శ్రీ రాముని గుణాలు వర్ణిస్తూ తనను తానే మైమరచి పోతాడు వాల్మీకి  మహర్షి. నిజమే ఆ రాముని గుణాలను ఇన్ని సంవత్సరాలు గడచిన తరువాత వినే మనకే తనివి తీరక పోతే సమకాలీకుదైన వాల్మీకికి ఎలా తనివి తీరుతుంది.

శ్రీమద్రామాయణము

రామాయణాన్ని మనము శరణాగతి కావ్యంగా భావిస్తాము . శ్రీ రాముడు యుధ్ధకాండలో విభీషణునికి శరణాన్ని ప్రదానం చేసే  సందర్భంలో  చెప్పిన  శ్లోకం చూడండి.

సకృదేవ  ప్రపన్నాయ  తవాస్మీతి   చ  యాచతే 
అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్ వ్రతం మమ

శరణాగతికీ   వైష్ణవులకూ   చాలా దగ్గరి సంబంధం. వైష్ణవ సిధ్ధాంతం ప్రకారం  శరణాగతికి ఆరు అంగాలు.

1.  భగవంతునికి అనుకూలమైన వాటినే  పరిగ్రహించడం.
2. భగవంతునికి ప్రతికూలమైన వాటిని విడచిపెట్టడం.
3.  భగవంతుడు రక్షిస్తాడు  అనే పరిపూర్ణమైన నమ్మకం.
4. భగవంతుని నిజంగా  శరణు వేడటం  .
5.  భగవంతుని మీద మన భారాన్ని పూర్తిగా వదలివేయడం. 
6.  మన నిస్సహాయతను అభివ్యక్తం చేయడం.

సంస్కృతంలో ఈభావాన్నే వ్యక్తం చేసిన శ్లోకాన్ని చదవండి.

అనుకూల్యస్య సంకల్పః , ప్రతికూల్యస్య వర్జనం 
రక్షిష్యతి ఇతి విశ్వాసః  ,     గోపృత్వవరణం తదా
ఆత్మ నిక్షేప కార్పణ్యే ,  షడ్విధా శరణాగతిః

భగవంతుని శరణంలోకి వెళ్ళడమే ఈ జీవిత పరమార్థం. శరణాగతి గద్యంలో  ఆచార్య  రామానుజులు మనకు శరణాగతి చేయవలసిన విధానాన్ని , తాము చేసి చూపించారు. మనమూ ఆ దారిలో నడవడానికి ప్రయత్నిద్దాం .

భగవద్గీతలో  శ్రీకృష్ణుడు  చెప్పింది కూడా ఇదే.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి  మా శుచః

శ్రీమద్రామాయణము

ధర్మజ్ఞః  సత్యసంధశ్చ  ప్రజానాం చ హితే  రతః
యశస్వీ జ్ఞా న సంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్

ప్రజాపతిసమః  శ్రీమాన్  ధాతా  రిపునిషూదనః
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా
వేద వేదాంగ తత్వజ్ఞో  ధనుర్వేదే చ నిష్ఠితః

రూపాన్ని వర్ణించిన మహర్షి గుణాలను వర్ణించకుండా వదులుతాడా. సత్య సంధుడైన  రాముడు ప్రజలకు మేలు చేయడంలో ఆసక్తి కలవాడు, జ్ఞానసంపన్నుడు అంటే అన్ని విషయాలనూ యెరిగినవాడు,  నిరంతరమూ భక్తులకు లొంగి ఉండి , వారిని ఏ విధంగా రక్షించాలి అనే ఆలోచనలో మునిగి ఉండే వాడు.బ్రహ్మతో సమానుడు, లోకాల ను పోషించే వాడు. వేద వేదాంగాలను చక్కగా అకళింపు చేసుకున్నవాడు. ధనుర్వేదంలో రాముని కున్న జ్ఞానం అపారం. అన్నిటి కన్న ముఖ్యం -శ్రీరామ చంద్రుడు  శరణాగత రక్షకుడు. తనను ఆశ్రయించినవారిని వదలడు గాక వదలడు.రాముని  శరణాగత దీక్షను వర్ణించే గ్రంధాలు అపారంగా ఉన్నాయి. భక్తుడయిన వాడు, రామున్ని శరణు వేడకుండా ఉన్నవాడు మనకు కనిపించడంటే అతిశయోక్తి కానేరదు. మనము కూడా ఆలశ్యం చేయకుండా ఈ క్షణమే  “రామ చరణం ,నాకు శరణం” అని ఆనందంగా రాముని వేడుకుందాం. రాముని స్వజనుల మై పోదాం.

శ్రీమద్రామాయణము

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్యహం బుధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః

ఇక్ష్వాకు వంశప్రభవో  రామోనామ  జనైశ్రుతః
నియతాత్మా  మహావీర్యో  ద్యుతిమాన్   ధృతిమాన్  వశీ

బుధ్ధిమా న్నీతిమాన్వాగ్మీ   శ్రీమాన్ శత్రునిబర్హణః,
విపులాంసో  మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః  .

మహోరస్కో  మహేష్వాసో , గూఢజత్రు రరిందమః
ఆజానుబాహుః   సుశిరాః    సులలాటః   సువిక్రమః

సమః సమవిభక్తాఙ్గః  స్నిగ్ధవర్ణః  ప్రతాపవాన్
పీనవక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః .

ఒక్కసారి అలోచించండి. ఎవరైనా మనను ఈ లోకంలో వాల్మీకి మహర్షి అడిగిన గుణాలు ఉన్నటువంటి  మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతే , ఏం జవాబు చెప్తాం.  నారద మహర్షి కూడా , వాల్మీకితో,  అటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తులలో కనిపించడు, కానీ నీవడిగిన గుణాలే కాక, ఇంకా ఎక్కువ  సుగుణాలున్న నరుడు మన అదృష్టం వలన ఉన్నాడు, శ్రధ్ధగా వినమని  చెప్పాడు.

అడిగిన ప్రశ్నకు సూటిగా, అలోచించాల్సిన అవసరం  లేకుండా, ఏ విధమైన జంకు,గొంకు లేకుండా  సమాధానం చెప్పాలంటే, చెప్పేవాడికి విషయాన్ని గురించి పూర్తి అవగాహన ఉండాలి. మహర్షి అయిన నారదుడికి  ప్రాపంచిక పరిజ్ఙానం పరిపూర్తిగా ఉంది. వాల్మీకి  మహర్షి అడిగిన  ఫ్రశ్నకు  టక్కుమని సమాధానం ఇచ్చాడు .  ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో   ఇక్కడ మనం గమనించ వలసిన విషయం. విషయాన్ని చక్కగా ఆకళింపు చేసుకొని సూటిగా సమాధానాన్ని ఇవ్వగలుగుతే మన దైనందిన జీవితంలో విజయం తథ్యం.

ఆ మహా మనీషి ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడు. రామునిగా జనులలో ప్రసిధ్ధుడు. మహావీరుడు, ప్రకాశవంతుడు.అతడు  నియతాత్మ , వశీ  అన్న పదాలతో వర్ణింపబడ్డాడు.

నియతాత్మా,వశీ అన్న రెండు పదాలు భగవంతుని లక్షణాలు.  నియతాత్ముడంటే  నిశ్చయమైన స్వభావము కలవాడు లేక నిర్వికార స్వరూపుడని  ఉపనిషత్తుల్లో చెప్పబడింది. వశీ  అంటే  ప్రపంచాన్ని, తన వశంలో ఉంచుకొనే పరమాత్మ .

రాముడు భగవంతుని అవతారమని ఈ గుణాలను ఆపాదించడం ద్వారా  నారదులవారు వాల్మీకికి  చెప్పకుండానే    చెప్పారు.

అసలు రామశబ్దానికి అర్థం: ఆనందింప  చేసేవాడని. “రమయతీతి రామః”. రమింపచేసేవాడు రాముడు. అందుకే ఎంతో చక్కని దేవుడు.

అందాల రాముడి గుణాలు ఎన్నని చెప్పగలం. ప్రశస్తమైన బుధ్ధి , నీతి, ఇశ్వర్యము, స్ఫుటమైన వాక్కు, శత్రువులను నశింపచేసే అసామాన్యమైన వీరత్వము వాటిలో కొన్ని మాత్రమే.

ఇక  రూపాన్ని చూద్దామంటే  సాముద్రిక శాస్త్రంలో  వర్ణించిన  ఉత్తముడైన మనిషి వర్ణనకు చక్కగా సరిపోతాయి. ఎత్తైన మూపు, శంఖము వంటి మెడ,   బలిసిన బాహువులు, ఎత్తైన చెక్కిళ్ళు, విశాలమైన వక్షః స్థలము , పొడుగైన చేతులు, గుండ్రంగా ఉండే శిరస్సు,  అర్ధ చంద్రాకారంలో ఉందే  లలాటమూ ,స్నిగ్ధ వర్ణము, విశాలమైన నేత్రాలూ, మెరసిపోయే అవయవ కాంతీ, ఒకటనేమిటి  శుభలక్షణాలన్నీ  రాముని సొత్తు.

గోపీనాథుడు తన రామాయణంలో   రాముని  సుందర  రూపాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేయిస్తాడు . ఈ పద్యం  ఎంతమధురంగా ఉందో చూడండి.

వెడద  కన్నులవాడు  విపులాంసములవాడు  రాకేందు బింబ వక్త్రంబువాడు
కంబు కంఠము వాడు ఘన లలాటము వాడు    రమణీయ మృదు కపోలముల వాడు
పీన వక్షము వాడు  పృథునితంబము వాడు   సముదగ్రచారు మస్తకమువాడు
దివ్య దేహమువాడు దీర్ఘబాహులవాడు  కమనీయ శుభలక్షణములవాడు

ప్రబల చాపంబు మూపున బరగు వాడు, శ్యామవర్ణంబువాడు  ప్రశస్త గూఢ
జత్రు  దేశంబు గలవాడు సమవిభక్త  సముచిత మనోజ్ఞ   సుందరాంగములవాడు.

శ్రీమద్రామాయణము

శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో  వాల్మీకేర్నారదో వచః
శ్రూయతామితి చామంత్ర్య ప్రహ్రుష్టో వాక్యమబ్రవీత్

మూడు లోకాలలోని  విశేషాలను ఎరిగిన నారద మహర్షి  వాల్మీకి తో ఈ విధం గా పలికాడు.

శ్రీ మద్రామాయణము

img_0258

చారిత్రేణ చకోయుక్తః ,సర్వభూతేషు కో హితః

విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియ దర్శనః

మంచి చరిత్ర లేక మంచి నడత కలిగినవాడూ, సర్వప్రాణులకు మేలు చేసేవాడూ,జ్ఙానీ, సమర్థుడూ,  చూచిన   వారందరికీ (ఎన్నిసార్లు చూసినా)  ఆనందం కలిగించే మహానుభావుడు ఎవరు.

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే

ధైర్యవంతుడూ, కోపాన్ని జయించినవాడూ, కాంతితో విరాజిల్లే వాడూ, అసూయ లేనివాడూ, ఎవనిని చూసి  యుధ్ధంలో దేవతలు కూడా భయపడతారో , అటువంటి మహా వీరుని గురించి నేను తెలుసుకో గోరుతున్నాను.

ఏతదిచ్చామ్యహం శ్రోతుంపరమ కౌతూహలం  హి మే

మహర్షే త్వం సమర్థోపి జ్ఞాతుమేవ విధం నరం

అటువంటి మహామనీషిని గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అని నారద మహర్షిని ప్రశ్నించాడు వాల్మీకి.