Monthly Archives: ఏప్రిల్ 2014

రామాయణం

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక మహేశ్వరః
బాఢమిత్యబ్రవీత్సర్వాన్ పునశ్చేదమువాచ హ
ధారమిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా
త్రిదసాః పృథివీ చైవ నిర్వాణ మధిగఛ్చతు
యదిదం క్షుబితం స్థానాన్మమ తేజోహ్యనుత్తమం
ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః

 

భక్తులు కోరితే కాదంటాడా భక్తవశంకరుడు ? ” నా రేతస్సును నా తేజస్సులోనే ( శరీరంలోనే ) నిక్షిప్తంగా ఉంచుకుంటాను . దేవతలూ , ధరణీ మాతా భయం చెందవలసిన పని లేదని అభయమిచ్చాడు . ” అయితే ఒక చిన్న సమస్య . రేతస్సులో కొంత భాగం నా శరీరాన్నుండి కదిలి పోయింది . దాన్ని ఎక్కడ ఉంచాలో మీరే చెప్పండి ” అని దేవతలనడిగాడు పరమేశ్వరుడు .

 

IMG_1761

రామాయణం

తథా బ్రువతి కాకుత్సే విశ్వామిత్రస్తపోధనః
నిఖిలేన కథాం సర్వా మృషిమధ్యే న్యవేదయత్
పురా రామ కృతోద్వాహో నీలకణ్ఠో మహాతపాః
దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే
శితికణ్ఠస్య దేవస్య దివ్యం వర్ష శతం గతం
న చాపి తనయో రామ తస్యామా సీత్పరంతప .

రాముడడిగితే విశ్వామిత్ర మహర్షి చెప్పకుండా ఉంటారా ! మునులందరి మధ్యలో కూర్చొని కథ చెప్పడానికి ఉపక్రమించాడు . ” రామా ! తపోధనుడు నీలకంఠుడు మాతృమూర్తి కడకంటి చూపులకు లొంగిపోయి ఆవిడను వివాహం చేసుకున్నాడు . గిరి కన్య పాణి తలాన్ని పట్టుకున్న పరమాత్మ వలపు చిగురిస్తూ మాతతో దివ్యమైన క్రీడ మొదలు పెట్టాడు . వంద సంవత్సరాలు గడిచిపోయాయి కానీ పరమశివుని రతి క్రీడ ముగియ లేదు . ఇంత దీర్ఘ కాలం సాగిన రతి క్రీడ కారణంగా మాతృమూర్తి పార్వతి గర్భాన్నుండి పుట్టే ప్రాణిని ( భూతాన్ని ) సహించడానికి ఎవరికి శక్యం ? అని బ్రహ్మాది దేవతలు భయ పడ్డారు . అంతే ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య క్రీడకు అడ్డు పడ్డారు . పాహి పాహి పరమేశ్వరా ! చాలించవయ్యా నీ లీల . కాపాడవయ్యా లోకాలను అని మొర పెట్టుకున్నారు .

అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్
దేవ దేవ మహాదేవ లోకస్యస్య హితే రత
సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తు మర్హసి
న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర
త్రైలోక్య హిత కామార్థం తేజస్తేజసి ధారయ .

దేవ దేవా ! లోకులకు , లోకాలకు హితం చేయడానికి ఇష్టపడే తమకు మా ప్రణతులు . కరుణతో తమ కృపారసాన్ని మా మీద ప్రవహింపజేసి మమ్ములను కాపాడండి . తమ తేజస్సును ( రేతస్సును ) లోకాలు భరించలేవు . తమ తేజస్సును తమ యందే ధరించి తపస్సు చేయండి . ఈ విధంగా మూడు లోకాలకు హితం చేకూర్చండి .
పరమాత్ముని రేతస్సు అత్యంత శక్తివంతమైనది . పరమాత్మ శరీరాన్నుండి బయట పడితే దాని వేడికి లోకాలు మల మల మాడిపోతాయనే భయం దేవతలకు పట్టుకుంది . అందుకే రేతస్సును బయటకు రానీయకుండా చేయమని భగవంతుని ప్రార్థించారు .

 

రామాయణం

ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవ లక్ష్మణౌ
ప్రతినంద్య కథాం వీరావూచతుర్మునిపుంగవం .
ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా
దుహితుః శైలరాజస్య జ్య్యేష్ఠాయా వక్తుమర్హసి
విస్తరం విస్తరజ్ఞ్యోసి దివ్యమానుష సంభవం
త్రీన్ పథో హేతువా కేన ప్లావయేల్లోక పావనీ
కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా
పరమ పావని పార్వతీ దేవి ( తపస్సు చేసి) పరమేశ్వరుని వివాహం చేసుకున్న విషయం , పూజ్యురాలు , త్రిపథగా ప్రవహించే గంగమ్మ కథ , విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని అభినందించారు . “బ్రహ్మర్షీ ! మీరు చెప్పిన కథ మా హృదయాలకు హత్తుకొని పోయింది . మా మది పులకించింది . మీకు అన్ని విషయాలూ వివరంగా తెలుసును కదా . ఉమాదేవి కథను ఇంకా వివరంగా మాకు వినిపించండి . అదే విధంగా లోకపావని త్రిపథగా ఎందుకు ప్రవహిస్తున్నది ? ఏ కారణం చేత గంగ మూడు లోకాలలో ఉత్తమమైన నదీమ తల్లిగా పరిగణింపబడుతున్నది అనే విషయాన్ని తెలుసుకోవాలని మాకు కుతూహలంగా ఉన్నది ? ” అని వినయంగా ప్రశ్నించారు .