Monthly Archives: సెప్టెంబర్ 2011

రామాయణం

తథేతి   చ   స   రాజానమువాచ   చ   సుసత్కృతః
సంభారాః  సంభ్రియంతాం  తే  తురగశ్చ  విముచ్యతాం

తతో   రాజాబ్రవీద్వాక్యం  సుమంత్రం మంత్రిసత్తమం
సుమంత్రావాహయ క్షిప్రం  ఋత్విజో  బ్రహ్మవాదినః

సుయజ్ఞం  వామదేవం  చ జాబాలిమథ  కాశ్యపం
పురోహితం  వసిష్ఠం  చ యే  చాన్యే  ద్విజసత్తమాః

రాజు  కోరాడు .  ఋషి  సమ్మతించాడు . (తురగాన్ని )  గుఱ్ఱాన్ని  విడవమన్నాడు . చేయాల్సింది   అశ్వమేధయాగం  కదా మరి .  యజ్ఞానికి  కావలసిన  పదార్థాలను  కూడా సేకరిచడం  మొదలు  పెట్టమని ఆనతిచ్చాడు  తేజోమయుడైన  ఋష్యశృంగుడు . దశరథుడు  సుమంత్రునితో  ”  బ్రహ్మ వాదులైన  ఋత్విక్కులను , సుయజ్ఞ , వామదేవ , జాబాల , కాశ్యపులను  శ్రీఘ్రంగా  ఇచటికి  రమ్మని  ఆహ్వానించండి . అలాగే కుల  పురోహితులైన  వశిష్ఠ  మహర్షినీ , వేద విదులైన  ఇతర  బ్రాహ్మణులనూ  ఇచటికి  రమ్మని  మా మనవిగా  విన్నవించండి ” అని పలికాడు .

ఏదైనా కార్యం  మొదలు   పెట్టినప్పుడు  దానిని  సక్రమంగా   నిర్వహించడానికి  సమర్థుడైన  వ్యక్తిని  నియోగించడం అతి ముఖ్యం .choosing right man for the right job . అటువంటివాడు  దొరికితే  కార్యం  సఫలమైనట్టే . దశరథుని అదృష్టం కొద్దీ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలో తెలిసిన   ఋష్యశృంగుడు    లభించాడు . అతడే  యజ్ఞకార్యాలన్నీ  సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది .  ఋష్యశృంగుడికి సహాయంగా  ఋత్విక్కులను  ఎంచుకోవాలి . అందరూ ఋత్విక్కులు కాలేరు . ఋత్విక్కులు  బ్రహ్మవాదులై  ఉండాలి .  అలాంటివారివలననే  కామ్యార్థాలు  సిధ్ధిస్తాయని  దశరథుని  నమ్మకం .బ్రహ్మవాది  కావడం కష్టాలతో కూడుకున్న పని . దానికి  తోడు  అదృష్టం కూడా తోడు  కావాలి   . విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చాలాకాలం  నియమ  నిష్థలతో  తపస్సు  చేయాలి . భగవతత్త్వాన్ని  గురించి  అలోచించాలి . ఆత్మనూ ,పరమాత్మనూ  తెలుసుకోగలగాలి . ఇవన్నీ  అయ్యాక  భగవంతుని  అనుగ్రహం  ఉంటే   బ్రహ్మమంటే   ఏమిటో   అర్థమవడానికి   అవకాశముంటుంది . పరబ్రహ్మను ఈ విధంగా తెలుసుకున్నవాడు  బ్రహ్మవాది  అవుతాడు .   ఇది  పూర్వకాలమైనా , ప్రస్తుతకాలమైనా  చాలా కష్టంతో కూడుకోవడమే  కాకుండా ,  భగవంతుని అనుగ్రహం వలన మాత్రమే  సాధ్యపడే  పని  కావడం మూలాన  బ్రహ్మవాదులు  చాలా కొద్దిమంది  మాత్రమే ఉంటారు . అటువంటి  వారు ఏ పని  సంకల్పించినా  విజయం తథ్యం . అందుకే దశరథుడు తను  తలపెట్టిన  అశ్వమేధ యాగాన్ని  నిర్వహించడానికి  బ్రహ్మవాదులను  పిలిపించమని   సుమంత్రునితో  చెప్పాడు . సుయజ్ఞుడు , వామదేవుడు , జాబాలి , కాశ్యపుడు ఆ కాలంలోని   బ్రహ్మవాదులు .

బ్రహ్మవాదులలో  గార్గి , మైత్రేయీ   లాంటి విదుషీమణులూ ,  బ్రహ్మతత్త్వాని ప్రతిపాదించి మునులందరిముందూ  తన  ప్రజ్ఞ నిరూపించుకున్న   యాజ్ఞవల్కుని లాంటి  వేదవేత్తలూ ఉన్నారు . వారందరికీ  ఉండే  విలక్షణం  సత్యాన్ని  తెలుసుకోవలనే  బలమైన  కోరికా , ఇతరులను   ప్రశ్నించైనా  , తమలో తాము  అలోచించైనా  సృష్టి తత్త్వాన్ని  తెలుసుకోవాలనే  తపనా .  ఈ  లక్షణాలను అలవరచుకొన్న  మనిషి   ఈ ప్రపంచంలో  సాధించలేనిది ఏదీ  లేదు .

రామాయణం


వసంత శోభ

తతః    కాలే     బహుతిథే    కస్మింశ్చిత్సుమనోహరే
వసంతే   సమనుప్రాప్తే   రాజ్ఞో  యష్టుం  మనోభవత్

తతః  ప్రసాద్య  శిరసా  తం  విప్రం  దేవ వర్ణినం
యజ్ఞాయ  వరయామాస   సంతానార్థం  కులస్య వై

కాలం  గడచిపోతోంది . వసంత ఋతువు వచ్చింది . మావి చిగురులు మేసి మత్తెక్కిన  కోయిలల  కుహూ కుహూ రవాలు వినిపిస్తున్నాయి .  వసంతయామినికి  వెన్నెలలు శోభ చేకూరుస్తున్నాయి . తనువునూ ,మనసునూ    పులకింప  చేసే  ప్రకృతి  అందాలు  కనులకు విందులు చేస్తున్నాయి . శుభ కార్యాలు చేయడానికి  అనుకూల  సమయమది .చివురులు వేసిన కలలు  సాకార  మయ్యే కాలమది . దశరథునికి మదిలో తలపెట్టిన  కార్యక్రమానికి నాంది పలకాలనిపించింది . ఋష్యశృంగుని  వద్దకు  వెళ్ళాడు . ” నా  వంశం  అవిచ్ఛిన్నంగా  సాగిపోవడానికి  యజ్ఞాన్ని చేయించమని ” వినయంగా  విన్నవించాడు .

రామాయణం


అయోధ్యలో ఋష్యశృంగునికి  ఘన స్వాగతం లభించింది

http://www.mariateresalupo.it/simbolimitialchimiafiabe/damaunicorno.html

అంతః  పురం   ప్రవేశ్యైనం  పూజాం కృత్వా  చ   శాస్త్రతః
కృతకృత్యం   తదాత్మానం    మేనే     తస్యోపవాహనాత్

అంతఃపుర స్త్రియః   సర్వాః    శాంతాం   దృష్ట్వా   తథాగతాం
సహ    భర్త్రా   విశాలాక్షీం       ప్రీత్యానందముపాగమన్

పూజ్యమానా   చ   తాభిః   సా   రాజ్ఞా    చైవ    విశేషతః
ఉవాస   తత్ర    సుఖితా    కంచిత్కాలం     సహర్వ్తిజా

అయోధ్యా  నగరానికి  విచ్చేసిన  ఋష్యశృంగ  మహర్షిని  అంతఃపురానికి  తీసుకొని  వెళ్ళి  శాస్త్రోక్తంగా     అతిథి  పూజ    జరిపి  తన  కర్తవ్యం నెరవేర్చాననీ ,  కృతకృత్యుణ్ణి  అయ్యాననీ    సంతోషపడ్డాడు   దశరథుడు .  రాజాంతఃపురంలోని  మహిళలు  శాంతను  ఎంతో  ప్రేమతో  ఆదరించారు .  ఎంతైనా  దశరథుని పుత్రిక కదా . రాజపుత్రికకు  ఇవ్వాల్సిన  విశేష గౌరవ  మర్యాదలు శాంతకు లభించాయి . ఆదర సత్కారాల  మధ్యలో ఋష్యశృంగుడు తన భార్య  శాంతతో  కొంతకాలం  అయోధ్యలో హాయిగా  గడిపాడు .
ఈ శ్లోకంతో బాలకాండలో   ఏకాదశ  సర్గ సమాప్తమవుతుంది .

రామాయణం

తతః స్వలంకృతం  రాజా  నగరం  ప్రవివేశహ
శఙ్ఖ దుందుభి  నిర్ఘోషైః పురస్కృత్య  ద్విజర్షభం

తతః ప్రముదితాః  సర్వే  దృష్ట్వా తం నాగరాద్విజం
ప్రవేశ్యమానం  సత్కృత్య  నరేంద్రేణేంద్ర కర్మణా

 

ఋష్యశృంగుని  ఆగమనం సర్వ శుభదాయకం . దశరథ మహారాజు  తేజంతో వెలిగిపోతున్న ఋష్యశృంగ  మహర్షితో    సహా   అయోధ్యలో  అడుగు  పెట్టాడు .  శంఖ నాదాలతో ,  దుందుభి ఘోషలతో    నగర  ప్రజలు వారికి  స్వాగతం  పలికారు . మహర్షిని  చూసిన  వారి  హృదయాలు  సంతోషంతో   నిండిపోయాయి .   పులకించి పోయారా పుర  ప్రజలు . మహాత్ముల రాక  మంగళకరమని  వారికి  తెలుసు కదా . వచ్చినవాడు ఋష్యశృంగుడు .  సంతానం  లేక  తల్లడిల్లి  పోతున్న  దశరథుని కోరిక తీర్చడానికి  వచ్చిన  వివేక భూషణుడు — దివ్యభాషణుడు  కూడా .

రామాయణం

క్రియతాం  నగరం  సర్వం క్షిప్రమేవ  స్వలఙ్కృతం
ధూపితం  సిక్తసమృష్టం  పతాకాభిరలంకృతం
తతః  ప్రహృష్టాః పౌరాస్తే  శ్రుత్వా  రాజా సమాగతం
తథా ప్రచక్రుస్తత్సర్వం  రాజ్ఞా  యత్ప్రేషితం  యథా

దశరథ మహారాజు ,    తేజస్వీ   తపస్సంపన్నుడూ  అయిన  ఋష్యశ్రంగ  మహర్షి  తనతో  వస్తున్నాడన్న  సంతోషంతో  అయోధ్యానగర  ప్రజలకు ఈ విధంగా  వర్తమానం  పంపించాడు . ” నగరాన్ని  శీఘ్రంగా   అలంకరించండి . సువాసనలు వెదజల్లే  ధూపాన్ని వేయండి .   ధూళి   పైకెగయకుండా  మార్గాన్ని    జలంతో తడపండి . జండాలను ఎగర వేయండి “.
అయోధ్యా వాసులు  రాజు  వస్తున్నాడన్న  వార్త  విని సంతోషంతో  రాజాజ్ఞ ప్రకారం  నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు .

ఎవరైనా ముఖ్యమైన అతిథులు  నగరానికి  వస్తే ఈ రోజున కూడా  సంతోషాన్ని  వ్యక్తపరిచే పధ్ధతి  ఇదే  కదా .

 

 

రామాయణం

తతః సుహృదమాపృచ్ఛ్య  ప్రస్థితో  రఘునందనః
పౌరేభ్యః  ప్రేషయామాస  దూతాంత్వై  శీఘ్ర గామినః

మిత్రుని వద్ద సెలవు తీసుకున్న దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షితో సహా  తను అయోధ్యకు వస్తున్నానని  దూతల ద్వారా  అయోధ్యపౌరులకు  వర్తమానం పంపించాడు .

రామాయణం

తథేతి  రాజా సంశ్రుత్య గమనం  తస్య ధీమతః
ఉవాచ  వచనం  విప్రం  గచ్ఛ త్వం  సహ  భార్యయా

ఋషిపుత్రః ప్రతిశ్రుత్య  తథేత్యాహ   నృపం తదా
స నృపేణాభ్యనుజ్ఞాతః   ప్రయయౌ   సహ  భార్యయా

తావన్యోన్యాఞ్జలిం  కృత్వా స్నేహాత్సంశ్లిష్య  చోరసా
ననందతుర్దశరథో  రోమపాదశ్చ  వీర్యవాన్

దశరథుని కోరికను మన్నించినవాడై   ఋష్యశృంగుణ్ణి భార్యా సహితంగా   అయోధ్యకు వెళ్ళమని  ఆనతిచ్చాడు రోమపాదుడు . ఋష్యశృంగుడు  అందుకు అంగీకరించి   ప్రయాణానికి  సిధ్ధ మౌతాడు . స్నేహభావంతో  గట్టిగా  కౌగిలించుకొని ,   ముకుళిత హస్తాలతో  అంజలి ఘటిస్తూ   దశరథ మహారాజు , రోమపాదుని  వద్ద  వీడ్కోలు  తీసుకొంటాడు

 

ఇండొనీషియా రామాయణ బాలెలో  దశరథ  పాత్రధారి  కోసం  ఈ లింక్  నొక్కండి . లింక్ పనిచెయక పోతే  కట్ అండ్  పేస్ట్ చేయండి .
http://www.flickr.com/photos/oggie/5396827995/in/set-72157625924382682

రామాయణం

ఏవం   సుసత్కృతేన  సహోషిత్వా  నరర్షభః
సప్తాష్ట  దివసాన్  రాజా రాజానమిదమబ్రవీత్

శాంతా తవ సుతా  రాజన్ సహ భర్త్రా నిశాంపతే
మదీయనగరం  యాతు కార్యం  హి  మహదుద్యతం

అతిథిసత్కారాలందుకొన్న  దశరథ మహారాజు ఏడు  , ఎనిమిది రోజులు అంగ  రాజ్యంలో  ఆనందంగా  గడిపాడు . ఇక అయొధ్యకు తిరిగి బయలు దేరడానికి  సమయ మాసన్నమైంది . రోమపాదుని  వద్ద శెలవు తీసుకొంటూ తను వచ్చిన  కార్యాన్ని అతనికి ఈ విధంగా నివేదించాడు . ” అంగ  రాజా  నేను ఒక మహత్కార్యాన్ని  తలపెట్టాను . ఆ కార్యం సఫలం  కావడానికి  తమరు తమ కుమార్తె  శాంతను భర్తతో  సహా మా రాజ్యానికి పంపించండి .”

 

రామాయణం

తతో రాజా యథా న్యాయం  పూజాం చక్రే  విశేషతః
సఖిత్వాత్తస్య  వై రాజ్ఞః  ప్రహృష్టేనాంతరాత్మనా
రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ  ధీమతే
సఖ్యం  సంబంధకం  చైవ  తదా  తం  ప్రత్యపూజయత్ .

దశరథమహారాజు  రోమపాదునికి మిత్రుడు . స్నేహితుని రాక సంతోషదాయకం కదా . వచ్చిన మిత్రునికి శాస్త్రప్రకారమే కాకుండా , విశేషంగా కూడా   సత్కారం చేసాడు . దశరథునితో తనకు గల సంబంధబాంధవ్యాలను అల్లుడైన  ఋష్యశృంగునికి  వివరించాడు .  ఋష్యశృంగమహర్షి   , బాంధవ్యాన్ని  తెలుసుకొని  సంతోషించిన వాడై  తను కూడా  దశరథునికి సత్కారం చేసాడు .

శాంత రోమపాదుని కన్న కుమార్తె కాదు . దశరథుని కూతురనీ , ఆవిడను రోమపాదుడు దత్తత తీసుకొన్నాడనీ ఒక కథనం . ఈ కథ ప్రకారం శాంత శ్రీరామచంద్రుని సోదరి . పైన చెప్పిన శ్లోకం ప్రకారం రోమపాదునికీ దశరథునికీ స్నేహం తో బాటు  సంబంధ బాంధవ్యాలున్నాయని అర్థమవుతుంది  కానీ ఏ విధమైన బాంధవ్యమో తెలుపలేదు .

 

 

 

 

రామాయణం

అనుమాన్య  వసిష్ఠం   చ   సూతవాక్యం  నిశమ్య   చ
సాంతఃపురః  సహామాత్యః  ప్రయయౌ  యత్ర  స ద్విజః

సూతమహర్షి  మాటలు  సుమంత్రుడు చెప్పగా విన్న దశరథ మహారాజు , ఋష్యశృంగమహర్షిని అయోధ్యా నగరానికి  అహ్వానించడానికి  నిశ్చయించుకొని , కుల గురువైన  వశిష్థుని అనుమతి తీసుకొని ,  అంగ  రాజ్యానికి బయలుదేరాడు .

వనాని సరితశ్చైవ  వ్యతిక్రమ్య శనైః శనైః
అభిచక్రామ  తం దేశం  యత్ర వై  మునిపుంగవః
అసాద్య  తం ద్విజశ్రేష్ఠం  రోమపాదసమీపగం
ఋషిపుత్రం దదర్శాదౌ  దీప్యమానమివానలం .

అంగ  రాజ్యానికి   అరణ్యమార్గాన  పయనమై ,  ఎన్నో   నదులనూ , వనాలనూ  దాటి  మెల్లగా మునిపుంగవుడున్న స్థలానికి చేరాడు . రోమపాదుని సమీపంలో  అగ్ని జ్వాలవలె మెరిసిపోతూ దర్శనమిచ్చాడు ఋష్యశృంగ మహర్షి .

Rushi (Sage)