Monthly Archives: మార్చి 2013

రామాయణం

తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూత కల్మషం
వరం వరయ భద్రం తే వరార్హోసి మతో మమ

తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కాశ్యపో బ్రవీత్
ఆదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః
వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత

పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ
భ్రాతా భవ యనీయాంస్త్వం శక్రస్యాసురసూదన
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి .

కశ్యప మహర్షిని కరుణించిన కమలనాభుడు ” “వరమిస్తాను , నీకేం కావాలో కోరుకో ” అని అన్నాడు . ప్రభూ ! నాకూ, అదితికీ , దేవతలకందరికీ ఉన్నది ఒకటే కోరిక . నీవు నా పుత్రుడుగా జనించి శోకంతో ఉన్న దేవతల కష్టాలు తీర్చు ” అని తన మనసులోని కోరికను పరమ పావనుడైన పరమాత్మునికి నివేదించాడు కశ్యపుడు .

వామనమూర్తి కథ భాగవతంలో కొంత వేరుగా ఉంది . కశ్యపమహర్షి అదితికి పయోభక్షణమనే వ్రతాన్ని ఉపదేశిస్తాడనిన్నీ , ఫాల్గుణమాస శుక్లపక్షంలో ప్రథమ దినాన వ్రతాన్ని మొదలు పెట్టిన అదితికి ద్వాదశి నాడు నారాయణుడు ప్రత్యక్షమయి , తను కుమారునిగా పుడతానని వరమిస్తాడని ఉంది . వరాన్ని పొందిన అదితి

కన్నుల సంతోష్రాశులు , చన్నులపై బఱవ బులక జాలము లెసగన్
సన్నతులును సన్నుతులును , నున్నత రుచి జేసి నిటల యుక్తాంజలియై

చూపుల శ్రీపతి రూపము , నాపోవక త్రావి త్రావి హర్షోధ్ధతయై
వాపుచ్చి మంద మధురాలాపంబుల బొగడె నదితి లక్ష్మీ నాథున్

అని ఆనందపారవశ్యంతో పరమాత్మను ప్రశంసిస్తుంది .

రామాయణం

తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం
తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం

శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో
త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః

” భక్త వరదా ! నీవు తపోమయుడవు , తపోరాశివి , తపోమూర్తివి . తపస్సే ఆత్మగా కలిగిన పరమాత్ముడివి . తపస్సు చేసిన కారణంగా ఈ సుదినాన నిన్ను కాంచే అదృష్టం కలిగింది . ప్రభూ , ఆద్యంతాలు లేని నీలో విశ్వమంతా నాకు కనిపిస్తున్నది . నిన్ను వర్ణించడానికి శక్తి చాలడం లేదు .నాకు శరణం నీ దివ్య చరణాలే, అనుగ్రహించవా” , అని ఆర్తితో భగవంతుని ప్రార్థించాడు , మహాత్ముడైన కశ్యపుడు .

కశ్యప ప్రజాపతి జ్ఞాని . తపశ్శబ్దానికి జ్ఞాని అని కూడా అర్థమున్నది .

జనకుండెవ్వడు ? జాతుడెవ్వడు ? జనస్థానంబు లెచ్చోటు ? సం
జననంబెయ్యది ? మేనులేకొలది ? సంసారంబు లేరూపముల్ ?

అని తన మనస్సులో తలచాడు . ఇదంతా విష్ణుమాయ తప్ప వేరొకటి కాదని గ్రహించాడు . అందుకే జగన్నాటకంలో తన పాత్ర నిర్వహించడానికి పరమాత్మ శరణుజొచ్చాడు .