Monthly Archives: నవంబర్ 2010

శ్రీమద్రామాయణము

నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః

పూజయా మాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా

అపృష్ట్వైవాభ్య నుజ్ఞాతస్స జగామ విహాయసం .

 

 

ముగ్ధ మనోజ్ఞ దర్శనుడు , శారదామూర్తి , వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి , రమ్యంగా  రామకథను  వినిపించిన  నారదుణ్ణి పూజించాడు.  పూజలందుకొన్న పుణ్యుడు , మహర్షి అనుజ్ఞ్గ తీసుకొని అకాశమార్గాన దేవలోకానికి వెళ్ళిపోయాడు.

 

ఆదికవి మనసులో ఇతిహాస రచన కంకురార్పణ జరిగింది.ఇక ఆ విత్తు మహావృక్షమై , అనేక శాఖలతో అలరారడానికి సమయ మాసన్నమయింది. మానవాళి మనుగడకు అర్థం విశదపరచబడింది.సుందరమూ, సుమధురమూ సుమనోహరమూ , గంభీరమూ, ముక్తిప్రదమూ , కమనీయమూ, మోక్షదాయినీ ,తరతరాలకు మార్గదాయినీ  కాబోయే మహనీయ  గ్రంధాన్ని ఇక  మనకు  ప్రసాదిస్తాడు మహర్షి. శారదాదేవి ఆనందంతో పొంగిపోయింది. ముగ్ధమోహనంగా దరహాసం చేసింది .

 

భద్రం కర్ణేభిః శ్రుణుయామ  దేవాః అంటే “శుభమైన దానినే మా చెవులతో వింటామని” . ప్రార్థనా మంత్రాలలో  వేద ఋషులు అన్నట్లుగా , ఇక మనం వినేదంతా మంచే , శుభప్రదమే . దరహాసం చేసింది .

 

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు “వందే వాల్మీకి కోకిలం ” అనే పద్య ఖండికలో

వాల్మీకి మహర్షికి అంజలి ఈవిధంగా ఘటించారు.

 

తీయని పదాల “రామా , రామా” యటంచు

తీయ తీయగ రాగాలు తీయుచున్న

కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది

ఆదికవి కోకిలస్వామి కంజలింతు


శ్రీమద్రామాయణము

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం

యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే

 

రామాయణం వేదాలతో సమానమైనది.దీన్నిపఠించే మహనీయుని పాపాలన్నీ పటాపంచలవుతాయి. పుణ్యమూ , పరిశుధ్ధతా లభిస్తాయి.

 

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః

సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే

 

రామాయణం ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది. దీన్ని పఠించిన పుణ్యాత్ముడు ఇహలోకంలో స్వర్గసుఖాలనుభవించి మరణించాక దేవతలతో పూజింపబడుతాడు.

 

పఠన్ ద్విజో వాగృషభత్వ మీయాత్ ,

స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్

వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్

జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్

 

రామాయణాన్ని బ్రాహ్మణుడు పఠిస్తే ఆతని వాక్కు అమోఘమౌతుంది. క్షత్రియుడు పఠిస్తే రాజవుతాడు . వైశ్యుడు పఠిస్తే ధనికుడౌతాడు. శూద్రుడు పఠిస్తే మహనీయుడౌతాడు.

దీన్ని బట్టి చూస్తే రామాయణ కాలంలో వర్ణ బేధం లేకుండా అందరూ విద్యనభ్యసించే వారని నా నమ్మకం.. విద్యావంతులు కాకుంటే వారు రామాయణమెలా చదవగలరు ?

 

ఈ శ్లోకంతో నారదుడు చెప్పిన సంక్షేప రామాయణం సమాప్తమవుతుంది .

శ్రీమద్రామాయణము

నగరాణి చ రాష్ట్రాని ధనధాన్యయుతాని చ ,

నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా .

 

అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణకైః

గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ,

 

అసంఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః ,

 

చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి.

 

ఇప్పటి వరకూ చెప్పింది జరిగిన కథ . ఇక జరగబోయే కథ .

 

దేవతలను తృప్తి పరచి రాజ్యాన్ని సుబిక్షంగా ఉంచడానికై   అశ్వమేధ , బహుసువర్ణక మనే యాగాలను వందలకొలదీ చేస్తాడా  రఘుకుల తిలకుడు. బ్రాహ్మణులకు గోవులనూ ధనాన్నీ ఇస్తాడు . ప్రజారంజకంగా పదకొండు వేల సంవత్సరాలు రాజ్యమేలి బ్రహ్మలోకం చేరుతాడు రాముడని  చెబుతాడు నారద మహర్షి.



శ్రీమద్రామాయణము

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః

నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః

 

న పుత్రమరణం కించిద్దృక్ష్యంతి పురుషాః క్వచిత్ ,

నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః

 

నచాగ్ని భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః

న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా

 

నచాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా.

నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ

 

రామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా ముగిసింది. ప్రజల కోరిక తీరింది. రామరాజ్యమారంభమయింది.ఆకలి బాధ ,చోర భయమూ ,అకాల మృత్యు భయమూ,జ్వరభయమూ లాంటివి ప్రజల దరికి రాలేదు. స్త్రీ లందరూ సుమంగళులే.పృకృతి పులకించింది. జగమంతా రామమయంగా శోభించింది. ప్రజల ఆనందానికి అంతే లేదు. మనుషులే కాదు చెట్లు చేమలు కూడా పులకరించాయి. రామ రాజ్యం ప్రజల మనసుల్లో స్థిరంగా నిలచి పోయింది. తరతరాలకూ ఆదర్శప్రాయమయింది.  కన్న తండ్రులను మరపించాడా మహానుభావుడు.

ప్రజలను రాముడు వశం చేసుకొంటే , కన్నతండ్రి రామున్ని తన వశం చేసుకొంది సీతమ్మ

 

సిగ్గు వడుట కల్గి సింగారమును కల్గి , భక్తి గల్గి చాల భయము గల్గి

నయము ప్రియము గల్గి , నరనాథు చిత్తంబు , సీత తనకు వశము చేసికొనియె .

 

సిగ్గూ ,సింగారమూ ,భక్తీ ,భయమూ, నయమూ , ప్రియాలతో రాముని పూర్తిగా వశం చేసుకుంది సీతమ్మ. భర్తతో భార్య ఏ విధంగా మెలగాలో చెప్పకనే చెప్పాడు పోతనామాత్యుడు తన తెలుగు భాగవతంలో.



శ్రీమద్రామాయణము

భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః

భరత్ స్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్

పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః

పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః  సహితో నఘః

రామః సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్

 

పుష్పకంలో భరద్వాజాశ్రమాన్ని చేరిన రాఘవుడు , తన ఆగమన వార్త భరతునికి వినిపించడానికి ఆంజనేయుణ్ణి పంపించాడు. వాయుసుతుణ్ణి గౌరవించి , నిండుగా కౌగిలించుకొని , అన్నయ్య సమాచారమడిగాడు భరతుడు.

మంగళకరమైన మాటవిన్న భరతుడు అంటాడు.

 

కల్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమే

ఏతి జీవంత మానందో నరం వర్ష శతాదపి.

 

మనిషి బ్రతికి వుంటే వంద సంవత్సరాలకైనా ఆనందం పొందుతాడనే వాక్యం నాకు ఈరోజు సత్యమనిపిస్తోంది.ఇంత మంచి వార్త తెచ్చిన నీ ఋణం  నేను తీర్చుకోలేను.

 

రామ భరతుల సమాగమాన్ని పోతన్న గారు భాగవతంలో అతి మధురంగా వర్ణిస్తారు. మచ్చుకు ఒక పద్యం.

 

రామచంద్ర విభుని రాక వీనుల విని , భరతుడుత్సహించి పాదుకలను

మోచికొనుచు వచ్చి ముదముతో బురజను , లెల్ల గొలువ నన్న కెదురు వచ్చె

 

రాముడు సుగ్రీవ , విభీషణాదులతో నందిగ్రామానికి వెళ్ళాడు .రాముని రాకకోసం వేయికన్నులతో ఎదురు చూస్తున్న భరతుడు  బాష్పనయనాలతో భగవంతుడైన తన అన్నయ్యను కలిసాడు.అన్నదమ్ములందరూ మునివేషాలను విడిచి రాజులకనువైన వస్త్రాలను ధరించారు.


శ్రీమద్రామాయణము

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం ,

సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం

కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రముమోద  చ

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్

అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః

 

రావణుడు చనిపోవడం మూడులోకాలకూ ముదాన్ని చేకూర్చింది.చేసిన ప్రతిన ప్రకారం రాముడు , విభీషణున్ని రాజును చేసాడు. దేవతల వరంతో చనిపోయిన వానరులనందరినీ బ్రతికించి పుష్పక విమానంలో అయో ధ్యానగరానికి బయలుదేరాడు.


శ్రీమద్రామాయణము

దర్శయామాసచాత్మానం సముద్రః సరితాంపతిః
సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్

భీకరుడైన రాముణ్ణి చూసి భయపడుతూ, మానవాకారంలో ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు . నలుని సాయంతో వారధి నిర్మించమని రామునికి సలహా  ఇచ్చాడు. . సేతు నిర్మాణం పూర్తయింది.


http://www.lalive.info/flash/Ramasetu.htm

రామసేతువు

 

తేనగత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే  ,

రామః సీతా మనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్

తామువాచ తతో రామః పరుషం జనసంసది

రామః సీతా మనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్

తతోగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం ,

బభౌ రామ సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః

 

లంకను చేరిన దాశరథి రావణున్ని సంహరిస్తాడు.లోక నిందకు వెరచి , పరుని ఇంటిలో నున్న సీతమ్మను పరిగ్రహించడమెలా అని మథన పడుతుంటే సీతమ్మ అగ్ని పరీక్షకు సిధ్ధమవుతుంది. అగ్ని సీతమ్మను పరమ పవిత్రురాలిగా నిర్ధారిస్తాడు. సంతసిస్తాడు రామచంద్రుడు

సీతమ్మను శీలపరీక్షకు గురిచేసినందుకు రామయ్యను తప్పుపట్టేవారెందరో.రామునికి సీతమ్మ మీద అణువంతైనా అనుమానం లేదు.కానీ ప్రజలందరికీ సీతమ్మ గొప్పతనాన్నీ , సౌశీల్యతనూ విస్పష్టంగా   తెలియజేయ తలచుకున్నాడు.  అగ్ని సీతను కాల్చలేదని తెలిసే రాముడీపని చేసాడు.నాకో విషయం ఇక్కడ గుర్తుకొస్తోంది.జమదగ్ని మహర్షి ,తల్లిని చంపమని తనయుడైన పరశురాముడికాజ్ఞ ఇస్తాడు. తండ్రి కోరిక ప్రకారం తల్లిని  సంహరిస్తాడు పరశురాముడు. తల్లిని  సంహరించడం తండ్రి ఆజ్ఞ ఇచ్చినా దోషం కాదా అని ప్రశ్నించినపుడు  చెబుతాడు:నా తండ్రికి చనిపోయిన వారిని బతికించే శక్తి ఉంది .నా తల్లిని పునర్జీవితురాలిని చేయించగలనిని తెలిసినందుననే తల్లిని చంపాను అని.అదే విధంగా హుతాశనుడు సీతమ్మకు ఏ విధమైన హానీ చేయడని తెలిసిన రామయ్య సీతమ్మను అగ్ని పరీక్షకు గురిచేస్తాడు. బుధ్ధిలేని వాళ్ళ మనసులలో కూడా అనుమానం లేకుండా చేయాలని, అపవాదు రాకుండా ఉండాలని మాత్రమే రామయ్య ఉద్దేశ్యం. సీతమ్మకు  ఏవిధమైన ఆపద రాదని రామయ్యకు తెలుసు.అగ్ని పరీక్షకు గురి అవడంవల్ల సీతమ్మ పవిత్రతా , సౌశీల్యమూ ఇమ్మడి ముమ్మడి అవుతాయనే ,రాముడు సీతనగ్ని  పరీక్షకు  గురిచేసాడని నా అభిప్రాయం. ఇదే రామాయణంలో చెప్పబడింది.

ఇంకో విషయం . రావణుడు  తనను స్పృశించినా తనను తాను రక్షించుకోలేని పరిస్థితులలో అలా చేయగలిగాడనీ , మానసికంగా తను రాముని తప్ప పరపురుషున్ని తలవలేదనీ , అందువలన తను నిర్దోషిననీ కుండ బద్దలు కొట్టినట్టు  చెబుతుంది సీతమ్మ. . తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షకు సిద్ధమవుతుంది.  అగ్ని దేవుడు కూడా సీత నిర్దోషి అని వక్కాణిస్తాడు. దీనివల్ల మనకు తెలిసే దేమంటే తప్పొప్పులకు మనసే ప్రధానమనీ , ఒకవేళ దుర్మార్గులు మనకిష్టం లేకున్నా మనను అవమానంచేస్తే , ఆ దోషం మనకంటదని .

శ్రీమద్రామాయణము

తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః

సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః

రాముడు సముద్ర తీరాన్ని చేరాడు . సముద్రాన్ని దాటడమెలా ? సముద్రుడిని దారి ఇమ్మని ప్రార్థించాడు. దారి చూపించలేదు ఉత్తంగ తరంగుడైన సముద్రుడు. గత్యతరం లేక సముద్రంలో ఉండే నీటినంతా ఆవిరి చేస్తానని బాణాన్ని ఎక్కుపెట్టాడు దశరథ రాముడు.

ఈ రోజున కూడా రాముడు సముద్రుని ప్రార్థించిన స్థలాన్నిరామేశ్వరానికి దగ్గరలో మనం చూడవచ్చు.దర్భ మీద పడుకొని మూడు రోజులు రాముడు సముద్రుణ్ణి ప్రార్థించిన స్థలం పేరు “దర్భ శయనం “. ఈ ప్రదేశంలో సముద్రతరంగాలు ఉప్పొంగుతూ మనకుకనిపిస్తాయి . మనసును ఓహరి సాహరి అనందడోలికలలో ఉయ్యాలలూగిస్తుందా సుధాతరంగిణి దర్శనం . నీటిమీద తేలే బండరాళ్ళను కూడా మనమిక్కడ చూడవచ్చు.

శ్రీమద్రామాయణము

సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం

న్యవేదయమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః

 

హనుమ సూక్ష్మ దృష్టిని , వాక్చాతుర్యాన్నీ ఈ శ్లోకంలో మనం చూడవచ్చు .

రాముని చేరిన హనుమ, మొట్ట మొదట చేసిన పని రామునికి ప్రదక్షిణం చేయడం.పెద్దవారి దగ్గరకు వెళ్ళినప్పుడు మాటలకంటే ముందు నమస్కార ,ప్రదక్షిణాలు చేసి గౌరవించడం భారతీయ పద్ధతి .భక్తికి మారుపేరూ వినయానికి పరాకాష్టా అయిన హనుమ ఆ పధ్ధతినే పాటించాడు.

సీతమ్మ క్షేమ సమాచారం కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నాడు రఘురాముడు.సీతక్షేమంగా ఉందని ఎలా చెప్పాలి. సీత అన్న పదం వినగానే అది మంగళమో లేక అమంగళమో అన్న శంక, రాముడికి కలిగే అవకాశముంది. అందుకని సీతమ్మను చూసానని అనకుండా “దృష్టా సీతా “ అని పలుకుతాడు హనుమ. “సీతను చూసాను” అని అనకుండా “చూసాను సీతను” అని అంటాడు . సమయ స్ఫూర్తి కి ఇదొక ఉదాహరణం .దేశ కాల సమయాలనెరిగి మాట్లాడడమంటే ఇదే .

“కంటిన్ జానకి బూర్ణచంద్రవదనన్ గల్యాణి నాలంకలో ” అని హనుమ చేత పలికిస్తుంది మొల్ల తన రామాయణంలో

” కంటిగదయ్య సీత ” అని రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడంటాడు .

వాల్మీకి పెట్టిన వరవడిది .ఈ శ్లోకంలో హనుమ పదాల వరుసను వాల్మీకి రామాయణంలో వాడిన వరుసక్రమంలోనే , రామాయణాన్ని మళ్ళీ రాసిన కవులందరూ అనుసరించారు.

హనుమను వాక్యకోవిదు డంటారు. ప్రతి విషయాన్నీ ఇంత నిశితంగా , విశదంగా ఆలోచించిడం సుందరకాండలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది.

 

శ్రీరాముడే హనుమను ఇలా ప్రశంసిస్తాడు

 

నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః ,

నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం.

 

నూనం వ్యాకరణం కృత్స్నం  అనేన బహుధాశ్రుతం

బహువ్యాహర తానేన న కించిదపశబ్ది తం.

 

వేదాలన్నీ  అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు.ఇతడు వ్యాకరణాన్ని అపోశనచేసినవాడన్నమాట నిర్వివాదం.ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా లేదు.

శ్రీమద్రామాయణము

పంచ సేనాగ్రగాన్  హత్వా  సప్తమంత్రిసుతానపి

శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం  సముపాగమత్

 

అస్త్రేణోన్ముక్త మాత్మానం జ్ఞాత్వా  పైతామహాద్వరాత్

మర్షయన్రాక్షసాన్వీరో  యంత్రిణస్థాన్యదృచ్చయా

 

తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీం

రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః

 

 

అయిదుగురు  సేనాపతులను , ఏడుగురు మంత్రి కుమారులను , అక్షకుమారున్ని వధించి చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన  బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోతాడు అంజనేయుడు.

 

రాక్షసులు తనను ఇతర బంధాలతో బంధించినపుడు ఈ బ్రహ్మాస్త్రబంధం తొలగిపోయిందని తెలిసినా రావణుని చూడాలనే కోరికతో బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టే ఉండిపోతాడు.

రావణునితో మాటలాడి , లంకాదహనం గావించి , సీతమ్మ అనుజ్ఞ తీసుకొని , తిరిగి సముద్రాన్ని లంఘించి రాముని లంకా విశేషాలను వివరించడానికై రాముని వద్దకు వస్తాడు హనుమ.

 

ఇదీ ఈమూడు శ్లోకాల సారాంశం .
సంక్షేప రామాయణమైనందున క్లుప్తంగా విషయాన్ని చెప్పడం జరిగింది. కట్టె ,కొట్టె ,తెచ్చె అన్నట్టు .