Monthly Archives: జూన్ 2011

రామాయణము

తతః   సుమంత్రస్త్వరితం  గత్వా త్వరిత విక్రమః
సమానయత్స తాన్ సర్వాన్ సమస్తాన్వేదపారగాన్

సుయజ్ఞం  వామదేవం చ జాబాలిమథ కాశ్యపం
పురోహితం  వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమా ః

దశరథుని  ఆజ్ఞ ప్రకారం  —  సుయజ్ఞ , వామదేవ ,  జాబాల , కాశ్యప  మహర్షులనూ — కులగురువూ, పురోహితుడైన వసిష్ఠునీ — వేదపారంగతులైన ఇతర ద్విజోత్తములనూ , సవినయంగా అహ్వానించి  తన వెంట తీసుకొని వచ్చాడు సుమంత్రుడు .

తాన్  పూజయిత్వా  ధర్మాత్మా  రాజా  దశరథస్తదా
ఇదం  ధర్మార్థసహితం  శ్లక్ష్ణం వచన మబ్రవీత్

మహాత్ములైన మహర్షులను సాదరంగా ఆహ్వానించి పూజించాడు మహారాజు . తన మనసులోని భావాన్ని  మధురంగా , తియ్యనైన మాటలలో వారికి  వివరించాడు.

రామాయణము

స  నిశ్చితాం  మతిం  కృత్వా యష్టవ్యమితి బుధ్ధిమాన్
మంత్రిభిః   సహ  ధర్మాత్మా   సర్వైరేవ   కృతాత్మభిః

తతో    బ్రవీదిదం   రాజా    సుమంత్రం    మంత్రిసత్తమం
శీఘ్రమావయ  మే  సర్వాన్   గురూంస్తాన్ స  పురోహితాన్ .

ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం విజ్ఞుల లక్షణం .  పెద్దలైన  గురువులనూ , పురోహితులనూ  తన దగ్గరకు తీసుకొని రమ్మని  అమాత్య సుమంత్రుని అదేశించాడు  దశరథమహారాజు .

రామాయణము

చింతయానస్య తస్యైవం బుధ్ఢి రాసీన్మహాత్మనః

సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం

సంతానమే లేక సౌఖ్యమే లేదని తలచిన దశరథ మహారాజు సంతానం పొందడానికి ఏమి చెయ్యాలా అని అలోచించాడు .  అశ్వమేధ యాగం చేస్తే పుత్రుడు జనిస్తాడని అనుకొన్నాడు . సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారమార్గాలనాలోచించి సమస్యలను తొలగించుకొనేవాడే విజ్ఞుడు కదా . సంతానం పొందడానికి  దశరథునికి తట్టిన మొట్ట మొదటి అలోచన ఇది .”ఫస్ట్  థాట్ ఈస్  ది  బెస్ట్  థాట్”  అని తలచిన దశరథమహారాజు  అశ్వమేధయాగాన్ని   చేయడానికి నిశ్చయించుకున్నాడు . ఈ విధంగా నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ” ఇంట్యూటివ్  డెసిషన్ మేకింగ్ ” అని అనవచ్చు .

రామాయణము

అష్టమ సర్గ

తస్య త్వేవం  ప్రభావస్య ధర్మజ్ఞస్య  మహాత్మనః
సుతార్థం తప్యమానస్య  నాసీద్వంశకరః    సుతః

ప్రపంచంలో అన్ని సుఖాలకంటే  పుత్రగాత్ర  పరిష్వంగం ఉత్తమమైనది అని పెద్దల ఉవాచ . ఆ కౌగిలి చల్లదనాన్ని  ముక్తాహారాలూ , మంచిగంధపు పూతలూ , పరాగ ప్రవరమూ (పరాగమంటే పుప్పొడి ), చంద్రుని వెన్నెలా ఇవ్వలేవని అంటుంది శకుంతల (తెలుగు మహాభారతం ).  “మహోదధేః పూర ఇవేందు దర్శనా” పూర్ణ చంద్రుని చూచినప్పుడు ఉప్పొంగే సముద్రుని వలె  పుత్రుని చూసి జననంతో తండ్రి ఉప్పొంగుతాడు . ఒక దీపాన్నుండి ఇంకో దీపం పుట్టినట్లుగా పుత్రుడు ఉదయిస్తాడు . ఇంకా వివరంగా చెప్పాలంటే జనకుడే తనదైన ప్రకాశంతో  పుత్రుడై వర్ధిల్లుతాడు .  తన రూపాన్ని చూసి తనే మురిసినట్టు , పుత్రుని చూసిన తండ్రి మహదానంద భరితుడౌతాడు . పున్నామ నరకం నుండీ తప్పించుకుంటాడు .

దశరథునికి ఆ సుఖం కరువైంది . ప్రభావం కలవాడూ , ప్రతిభావంతుడూ అయిన దశరథునకు ముగ్గురు భార్యలున్నా  సంతానం కలుగలేదు .

రామాయణం

రాజ్యాన్ని సురాజ్యం చేయాలంటే , రాజ్యంలోని ప్రజలందరికీ  శాంతి సౌఖ్యాలందించాలంటే  ధర్మపరిపాలన అవసరం . ధర్మపరిపాలననందించడం  రాజ్యం చేసేవాడి   ప్రథమ కర్తవ్యం .  ఈ కర్తవ్య  నిర్వహణలో  దశరథుడికి తోడ్పడడానికి ఎనిమిది మంది అమాత్యులు ఉండేవారు . వారి పేర్లు వరుసగా

ధృష్టి , జయంతుడు , విజయుడు , సిధ్ధార్థుడు , అర్థసాధకుడు , అశోకుడు , మంత్రపాలుడు , సుమంత్రుడు .

ధృష్టిర్జయంతో విజయః సిధ్ధార్థోహ్యర్థసాధకః
అశోకో  మంత్రపాలశ్చ  సుమంత్ర శ్చాష్టమో భవత్   

ఏడవ సర్గలో ఈ ఎనిమిది మంత్రుల సామర్థ్యాన్నీ , గుణగణాలనూ , రాజభక్తినీ , దేశభక్తినీ బహు చక్కగా వర్ణించాడు వాల్మీకి మహర్షి .

ఈ మంత్రులందరూ సార్థక నామధేయులు .
ధృష్టి  అంటే దూర దృష్టి కలవాడనీ , కార్యసాధకుడనీ  అర్థాలు గోచరిస్తాయి . జయ విజయులు పరాక్రమవంతులు , యుధ్ధంలో ఓటమినెరుగని వారు . సిధ్ధార్థుడు , అర్థసాధకుడు   తలపెట్టిన పనిని పరిపూర్తి గావించేవారు , అశోకునికి దుఃఖమంటే తెలియదు , మంత్రపాలుడు రహస్యాలను దాచి ఉంచగలిగే శక్తి గలవాడు , సుమంత్రుడు ఉత్తమమైన , రాజ్యాపాలనకు అవశ్యకమైన  అలోచనలకు నిధి .

రామాయణం

నాధ్యగచ్ఛద్విశిష్టం  వా  తుల్యం  వా   శత్రుమాత్మనః
మిత్రవాన్నతసామంతః   ప్రతాపహతకణ్టకః
స  శశా స  జగద్రాజా  దివం   దేవపతిర్యథా

తైర్మంత్రిభిః  మంత్రహితే నివిష్టైః
వృతో నురక్తైః   కుశలైః సమర్థైః
స పార్థివో దీప్తిమవాప యుక్త
స్తేజోమయై ర్గోభిరివోదితోర్కః

భూమండలాన్ని పరిపాలించే రాజులందరూ దశరథుని మిత్రులే . నతమస్తకులైన సామంతులు తనను సేవిస్తూ ఉండగా , శత్రునిష్కంటకంగా , దేవేంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లు అయోధ్యను పరిపాలిస్తూ  , తేజోవంతుడైన  ఉదయభానుని లాగా ప్రకాశించాడు  దశరథ మహారాజు .

రామాయణం

ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథోనఘః
ఉపపన్నో గుణోపేతై రన్వశాసద్వసుంధరాం

అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రఞ్జయన్
ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మాన్ పరివర్జయన్

విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః
స  తత్ర  పురుష వ్యాఘ్రః  శశాస పృథివీమిమాం

మహనీయులైన  మంత్రులు అండగా ఉండగా , దశరథునకు  ధర్మపరిపాలనం నల్లేరుమీద నడకైంది .గూఢచారుల ద్వారా ప్రతి చిన్న విషయాన్నీ చక్కగా తెలుసుకొంటూ  ప్రజల సంతోషమే ధ్యేయంగా  పరిపాలన చేశాడు .