Monthly Archives: డిసెంబర్ 2014

రామాయణం

తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః
సంపతద్భిః సురగణైస్తేషాం చా భరణౌజసా
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదం
శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః
విద్యుద్భిరవ విక్షిప్త మాకాశమ భవత్తదా

దివ్యమైన కాంతులు గగన భాగంలో నింపుతూ తరలి వచ్చారు దేవతలు -గంగావతరణాన్ని చూడడానికి .ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో నిండిపోయింది  .
మనో నేత్రంతో చూసి వర్ణిస్తున్నాడు కౌశికుడు . దాన్ని యథాతథంగా మనకందిస్తున్నాడు ప్రాచేతసుడు ( వాల్మీకి ) . ఈ దృశ్యాన్ని ఎందరో కవులు వర్ణించారు . పుణ్యుడు పోతనామాత్యుడు గంగావతరణాన్ని వర్ణించిన వారిలో అగ్రగణ్యుడు . అద్భుతమైన వచన రూపంలో దీనిని మనకందించాడు . అది చదివిన వాడి జన్మ ధన్యం . రండి మనమూ ఆ మహాత్ముడు రచించిన వచనం చదివి ధన్యులమవుదాం .

రామాయణం

గగనాత్ శంకర శిరస్తతో ధరణిమాశ్రితా
వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం
మత్స్య కచ్ఛప సంఘైశ్చ శింశుమార గణైస్తదా
పతద్భిః పతితైశ్చాన్యైర్వ్యరోచ్యత వసుంధరా
తతో దేవర్షి గంధర్వా యక్ష సిధ్ధ గణాస్తదా
వ్యలోకయంత తే తత్ర గగనాద్గాం గతాం తథా
విమానైర్నగరాకారైర్హయై ర్గవరైస్తదా
పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః

గంగా మాత శివదేవుని శిరస్సును అలంకరించింది . అటు పిదప భూమిపైకి జాలువారి భగీరథుని అనుసరించింది . తీవ్రమైన శబ్దంతో భూదేవిపై పడి గలగలా పారింది గంగామాత . గంగా జలాలలో నివసించే చేపలు , తాబేళ్ళు , మకరాలు గంగతో బాటే ధరణిపై పడి , ఆ జలాలలో ఈదసాగాయి . పావన గంగా ప్రవాహంతో పుడమి తల్లి పులకరించింది . భూదేవి అనూహ్యంగా శోభించింది . గగన గంగ భువిమీద పడడాన్ని గగనాన్నుండి వీక్షించారు దివిజ గంధర్వాదులు , ఋషులు , యక్షులు , సిధ్ధులు . అందరూ ఆశ్చర్య చకితులైనారు . నగరాకారంలో ఉన్న తమ విమానాలపై , పరుగులెత్తే వారువాలపై , గంభీరమైన గజరాజులపై ఎక్కి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి చకితులైనారు .

నది - దాని పక్కనే రమణీయమైన  అరణ్యం

రామాయణం

అనేన తోషితశ్చాసీదత్యర్థం రఘునందన
విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి

తస్యాం విసృజ్యమానాయాం స్రోతాంసి జజ్ఞిరే
హ్లాదినీ పావనీ చైవ నళినీ చ తథాపరా
తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గంగాః శివజలాః సుభాః
భక్త సులభుడైన శంకరుడు సులభంగానే కరుణించాడు . బిందు సరస్సు వద్ద గంగానదిని ఏడు ప్రవాహాలుగా వదిలాడు . అవి హ్లాదిని , పావని , నళిని , సుచక్షువు , సీత , సింధు , గంగ . వీటిలో హ్లాదిని, పావని , నళిని — అనే పేర్లుగల పవిత్ర గంగా జలాలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి .

సుచక్షుస్ఛైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ
తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుబోధకాః

సప్తమీ చాన్వగా త్తాసాం భగీరథ్మథో నృపం
భగీరథోపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్తిథః
ప్రాయాదగ్రే మహాతేజా గంగా తం చాప్యనువ్రజత్

సుచక్షువు , సీత , సింధు గంగా జలలు పశ్చిమ దిశగా ప్రవహించాయి .ముఖ్యమైన గంగా పాయ భగీరథుని అనుసరించింది . ముందు భగీరథుడు ,ఆతని వెనువెంటనే గంగమ్మ . చూడ చక్కని దృశ్యం .

ఆలోచన :
వాల్మికి రామాయణం ప్రకారం పరమ శివుడు గంగను వదిలిన ప్రాంతం బిందు సరస్సు . ప్రస్తుతం ఒక బిందు సరస్సు గుజరాత్లో ఉంది . అంటే భగీరథుడు ఈ ప్రదేశం నుండే గంగను తన పితరులకు తర్పణాలు వదలడానికి తీసుకొని వెళ్ళి వుండాలి . కానీ ప్రస్తుతం గంగా నది హిమవత్పర్వత ప్రాంతమయిన ” గోముఖ్” దగ్గరనుండి తన పయనాన్ని ఆరంభిస్తుంది . అంటే పరమ శివుడు గోముఖ్ దగ్గర గంగను విడిచిపెట్టి వుండాలి కదా ? అందునా గంగా నది శివలింగ్ పర్వతంక్రింద ఉన్న గోముఖ్ వద్ద జనిస్తుంది .హిమాలయాలలోని ” శివలింగ పర్వత ” ప్రాంతంలో ” సీత” అనే పేరుగల ఉపనది గంగానదిలో కలుస్తుంది .

ఇక బిందు సరోవర ప్రాంతం , సిధ్ధపూర్ ( పటాన్ జిల్లా ) , గుజరాత్ లో ఉంది . కపిల మహర్షి తపస్సు చేసిన స్థలమిదే . ఈ ప్రదేశం పురాణ కాలంలో ప్రసిధ్ధమైన  “సరస్వతీ” నదీమతల్లి   తటాన  వెలసిందని  చెబుతారు . ఈ ప్రదేశాన్ని గంగా సరస్వతీ నదుల సంగమ స్థానంగా కూడా చెబుతారు . దధీచి తన వెన్నెముకను ( వజ్రాయుధాన్ని చేయడం కోసం ) ఇంద్రుడికి దానమిచ్చిన స్థలం కూడా ఇదేనని చెబుతారు . ఈ స్థలంలో తల్లులకు తర్పణం  ఇవ్వడం ఆనవాయితీ . పరశురాముడు కూడా తన తల్లి రేణుకా దేవికి ఇక్కడ తర్పణం ఇచ్చాడని చెబుతారు .

నాకు మాత్రం శివలింగ్ పర్వత సాణువులలోనే శివ జటాజూటం నుండి గంగా నది భూతలానికి వచ్చిందని అనిపిస్తుంది .

మాటలో మాట భారత దేశంలో ప్రసిధ్ధమైన సరస్సులు అయిదు . అవి వరుసగా : మానస సరోవరం ( లడఖ్ -చైనా) , బిందు సరోవరం ( గుజరాత్ పటాన్ ) , నారాయణ సరోవరం ( కచ్), పంపా సరోవరం ( హంపి) , పుష్కర్ (రాజస్థాన్) ” అనే పంచ సరస్సులు . ఈ సరస్సులలో స్నానం చేయడం పాపఘ్నం , పరమ పుణ్య ప్రదం అని హిందువుల విశ్వాసం .

రామాయణం

ఆ  విధంగా  శ్రధ్ధతో , దీర్ఘకాలం తపస్సు చేసి హరుని మెప్పించి ఆకాశ గంగను  ధరకు తెచ్చాడు భగీరథుడు . అతని కష్టాలు అంతటితో అంతమయ్యాయా ? చదవండి

తతో హైమవతీ గఞ్గా సర్వలోక నమస్కృతా
తదా సాతి మహద్రూపం కృత్వా వేగం చ దుస్సహం

ఆకాశాద పతద్రామ శివే శివ శిరస్యుత 

అచింతయచ్చ సా దేవీ గఞ్గా పరమ దుర్ధరా
విశామ్యహం హి పాతాలం స్రోతసా గృహ్య శంకరం

తస్యానలేపనం జ్ఞాత్వా క్రుధ్ధస్తు భగవాన్ హరః
తిరోభావయితుం బుధ్ధిం చక్రే త్రిణయన స్తదా

సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని
హిమవత్ప్రతిమే రామ జటామండల గహ్వరే

తత్రైవా బంభ్రమత్ దేవీ సంవత్సర గణాన్ బహూన్
తామపశ్యన్ పునస్తత్ర తపః పరమాస్థితః
గంగ అతి వేగంతో శివుని శిరస్సు మీద పడింది . ” నా ప్రవాహ వేగంతో పరమేశ్వరుని కూడా నాతో బాటు పాతాళానికి కొనిపోతాను ” అని తలపోసింది . గంగమ్మ గర్వాన్ని గ్రహించాడు త్రినేత్రుడు . ఆ మాతృమూర్తి ఇక ఎవ్వరికీ కనబడకుండా నిగ్రహించాలని తల పోసాడు . అంతే దుస్సహమైన వేగంతో మీద పడినా , గంగ పరమేశ్వరుని కదలించలేక పోయింది . లోకులందరిచేతా పూజింపబడే మాతృమూర్తి ఆకాశంనుండి పతనమై , పవిత్రమైన శివుని శిరస్సులో నిక్షిప్తమై పోయింది . ఆ మహాత్ముని జడలలో చిక్కుకొని బయటకు రాలేక పోయింది .సంవత్సరాలు గడిచిపోయాయి . గంగామతల్లి  శివ జటాజూటంలోనుండి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పోయింది . భగీరథుడు ఎంతో సహనంతో గంగమ్మ కోసం నిరీక్షిస్తున్నాడు . ఇక లాభం లేదని నిశ్చయించుకొని మరల పరమేశ్వరానుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు మొదలు పెట్టాడు .

రామాయణం

దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్ర నిపీడితాం
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత

అథ సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతః
ఉమాపతిః పశుపతీ రాజానమిదబ్రవీత్

ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం
శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం

బ్రహ్మ వాక్యం విన్న భగీరథుడు , బ్రహ్మ దేవుడు వెళ్ళాక ఒక సంవత్సరం అంగుష్టం అంటే కాలి బొటనవేలి మీద నిలబడి తపస్సు చేసాడు . భక్త సులభుడైన ఉమాపతి కరుణించాడు . భగీరథుని ముందట ప్రత్యక్షమయ్యాడు . “నరులలో ఉత్తముడా ! నేను సంతసించినాను . నీకు ప్రియమైన కార్యాన్ని నిర్వహిస్తాను . నా శిరస్సునందు గంగను ధరిస్తాను ” అని మాట ఇచ్చాడు .

ఆ విధంగా పరమేశ్వరుని కటాక్షంతో కృతార్థుడైనాడు ఆ రాజర్షి .

ఇక మొదలవుతుంది ” శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహం ” . ఆలకించిన వారికి ఆనందం . మునిగిన వారికి పాపఘ్నం , పవిత్రం .

రామాయణం

మనోరథో మహానేష భగీరథ మహారథ
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకు  కులవర్ధన

ఇయం హైమవతీ గఙ్గా జ్యేష్ఠా హిమవతః సుతా
తాం వై ధారయితుం శక్తో  హరస్తత్ర   నియుజ్యతాం

గఙ్గాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి
తాం వై  ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః

తమేవముక్త్వా  రాజానం గఙ్గాం చా భాష్య లోకకృత్
జగామ త్రిదివం దేవః  దేవై  ర్మరుద్గణైః

” తథాస్తు . భగీరథా ! నీ కోరిక చాలా కష్ట సాధ్యమయినది . నీవు కోరినట్లే అగుగాక . నీకు మంగళమగుగాక . కానీ ! హైమవతి ,(హిమవంతుని పుత్రి ) గంగ స్వర్గ లోకం నుండి భూలోకానికి రావాలంటే , ఆ శక్తినీ , వేగాన్నీ సహింపగల సమర్థుడు శివుడొక్కడే . ఈశ్వరుడు తప్ప ఈ కార్యం సాధించడానికి ఇతరులెవ్వరూ నాకు కనిపించడం లేదు  ” అని అంటూ వర ప్రదానం చేసాడు విధాత .ఈ విషయంలో గంగా మాతతో కూడ భాషించాడు (మాట్లాడాడు ) . పిదప తనను అనుసరించి వచ్చిన దేవతలతో , మరుద్గణాలతో ప్రయాణమై స్వర్గానికి వెళ్ళాడు .

ఆలోచన :
స్వయంగా చెప్పక పోయినా , గంగను భరించడానికి ఈశ్వరుని అర్థించమని బ్రహ్మదేవుడు భగీరథునికి సూచన ప్రాయంగా తెలియ జేసాడు . అది అర్థం చేసుకున్నాడు మహాభాగుడు భగీరథుడు .
దీనితో బాలకాండలో నలుబది రెండు అధ్యాయాలు సమాప్తం .

రామాయణం

భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనేశ్వర
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత
తమువాచ మహాతేజాః సర్వలోకపితామహం
భగీరథో మహాభాగః కృతాఞ్జలిరుపస్థితః

బ్రహ్మదేవుడు భగీరథుని తపస్సుకు మెచ్చాడు . ” భాగ్యవంతుడా నీ తపస్సుకు మెచ్చాను . కావలసిన వరాన్ని కోరుకో ” అని ఆనతిచ్చాడు .భగీరథుడు బ్రహ్మదేవుని ముందు చేతులు జోడించి ” భగవన్ ! నా తపస్సుతో తమరు సంతృప్తులైతే , నా తపస్సు ఫలాన్ని ఇచ్చేదైతే , సగర కుమారులకు జలతర్పణాలు చేయగలిగే భాగ్యం నాకు ప్రసాదించండి . మా పితరుల భస్మం గంగా జలం చేత పునీతమగుగాక . వారు శాశ్వతంగా స్వర్గాన్ని పొందుదురు గాక ” అని ప్రార్థించాడు .

దేయా చ సంతతిర్దేవ నావసీదేత్కులం చ నః
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేస్తు వరః పరః

అంతలోనే జ్ఞాపకం వచ్చింది తనకు సంతానం లేదని . అందుకే రెండవ కోరికగా ” దేవా ! ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ సంతాన భాగ్యం కలిగి ఉండాలి . వారి వంశ మెన్నటికీ నశించకూడదు ” అని పలికాడు .

రామాయణం

భగీరస్తు రాజర్షిర్ధార్మికో రఘునందన
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజః
మంత్రిష్వాధాయ తద్రాజ్యం గఙ్గావతరణే రతః
స తపో దీర్ఘమాతిష్టద్గోకర్ణే రఘునందన
ఊర్ధ్వ బాహుః పఞ్చతపా మాసాహారో జితేంద్రియః
తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టతతః
అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః
సుప్రీతో భగవాన్ బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః
తతః సురగణైః సార్థముపాగమ్య పితామహః
భగీరథం మహాత్మానం తప్యమాన మథాబ్రవీత్ .

రాజర్షి . తేజశ్శాలి . ధార్మికుడు . అయినా అనపత్యుడు ( సంతానం లేనివాడు ) భగీరథుడు . భగీరథుడు గంగమ్మను భూలోకానికి తీసుకొని రావాలని నిశ్చయించుకున్నాడు . దానికి మార్గం తపస్సే అని అనిపించింది . రాజ్యాన్ని మంత్రుల అధీనం చేసి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు . భీకరమైన తపస్సు మొదలు పెట్టాడు .

ఎండాకాలం (గ్రీష్మం ) . తనకు నాలుగు వైపులా అగ్నిని వెలిగించాడు . దృష్టి సూర్యుని మీద పెట్టాడు ( దీనిని పఙ్చతపమని అంటారు ) . చేతులను పైకెత్తి , జితేంద్రియుడై వేల సంవత్సరాలు తపస్సు చేసాడు . శ్రధ్ధతో చేస్తున్న తపస్సుకు భగవంతుడైన బ్రహ్మదేవుడు సంతోషించాడు . దేవతలతో కలిసి వచ్చి భగీరథునికి ప్రత్యక్షమయ్యాడు .

గోకర్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి దగ్గరగా ఉన్న సముద్ర తీరాన ఉంది . ఇది ప్రసిధ్ధ శివ క్షేత్రం . రావణుడు తెచ్చిన ఆత్మలింగం ప్రతిష్టమైన స్థలమిది . భగీరథుడు భీకరమైన తపస్సు చేసి కార్య సిధ్ధి పొందిన స్థలమని రామాయణం చెబుతోంది .

ఈ ప్రదేశంలో బీచ్ ‘ ॐ ‘ ఆకారంలో ఉంటుంది . భారత దేశంలోని అందమైన సముద్ర ప్రాంతాలలో ఇది ఒకటి .

రామాయణం

తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః
పుత్రో భగీరథో నామ జజ్ఞే  పరమ ధార్మికః

దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్బహుభిరిష్టవాన్
త్రింశద్వర్ష  సహస్రాణి  రాజా రాజ్యమశాసయత్

అగత్వా నిశ్చయం రాజా తేషాముధ్ధరణం ప్రతి
వ్యాధినా నరశార్దూల కాలధర్మము పేయివాన్

ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః

గంగను గగనాన్నుండి తీసుకొని రావడానికి మార్గం ఆలోచిస్తూ ఉండగానే కాలం గడిచిపోయింది . ఇంతలో దిలీప మహారాజుకు ఒక కుమారుడు ఉదయించాడు . అతడే భగీరథుడు . పరమ ధార్మికుడు .

యజ్ఞ యాగాదులు చేస్తూ దిలీపుడు ముప్పదివేల సంవత్సరాలు రాజ్యమేలాడు . ఈ దీర్ఘకాలంలో సగర పుత్రుల ఆర్తి తీర్చడానికి మార్గం కనిపించలేదు . మనోవ్యాధి ముదిరింది . భగీరథునికి రాజ్యాభిషేకం చేసి కాలధర్మం చేసాడు . చేసిన పుణ్య కర్మల వలన స్వర్గం లభించింది దిలీప మహారాజుకు .

రామాయణం

తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన

హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణం

ద్వాత్రింశ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః
తపోవనం గతో రామ స్వర్గం లేభే తపోధనః

దిలీపస్తు  మహాతేజాః శ్రుత్వా పైతామహం వధం
దుఃఖోపహతయా బుధ్ధ్యా నిశ్చయం నాధ్య గచ్ఛత

కథం గఙ్గావతరణం కథం తేషాం జలక్రియా
తారయేయం కథం చైనానితి చింతాపరో భవత్

అంశుమంతుడు ప్రజారంజకంగా పరిపాలన చేసి , వృధ్ధాప్యంలో  రాజ్యభారాన్ని అంశుమంతునికి అప్పగించాడు . వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పవిత్రమైన హిమవత్పర్వతం మీద ముప్పది రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసాడు . అటుపిమ్మట ఆ పుణ్య మూర్తి స్వర్గాన్ని అలంకరించాడు . మహాత్ముడు దిలీపుడు తన తాతలకు కలిగిన దుర్మరణపు కథను విని చాలా బాధ పడ్డాడు . ఎంత ఆలోచించినా అతని బుధ్ధికి కూడా స్వర్గంగను భూమిపైకి తీసుకొని రావడానికి ఉపాయం తోచలేదు . గంగను తెచ్చి జల తర్పణాలను ఇచ్చి తన తాతలను స్వర్గ వాసులను చేయలేక పోయానే అన్న బాధతో కృంగిపోయాడు .
ఆలోచన :
దిలీప మహారాజు కథను కాళిదాస మహాకవి అతి రమణీయంగా తన ” రఘువంశ కావ్యం ” లో వర్ణించాడు . ప్రత్యేకంగా పుత్రుడికోసం తపనతో వశిష్ఠ మహాముని ఆశ్రమంలో తన సహధర్మచారిణి సుదక్షిణా దేవితో కలిసి నందినీ ధేనువును ప్రసన్నం చేసుకున్న భాగం కళ్ళను చెమ్మగిల్ల చేస్తుంది . అతని వీరత్వం , నందినీ ధేనువు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం , అనుకున్న పనిని ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించడం , ఇంకా మరెన్నో విషయాలు  ఆ మహారాజు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి . పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా పెడితే చిన్న పిల్లలకు మన సంస్కృతి / సంప్రదాయాలు వివరంగా తెలుస్తాయి . లుప్తమై పోతున్న మన వారసత్వ సంపదను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది .

DSC04926

పై చిత్రంలో సుదక్షిణా దిలీపులు నందినీ ధేనువు సేవలో నిమగ్నమైన దృశ్యాన్ని చూడవచ్చు .