Monthly Archives: జనవరి 2014

రామాయణం

పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా
నామ్నా సత్యవతీ నామ ఋచకే ప్రతిపాదితా

స శరీరా గతా స్వర్గం భర్తార మనువర్తినీ
కౌశికీ పరమోదారా ప్రవ్ర్త్తా చ మహానదీ

దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతముపాశ్రితా
లోకస్య హితకామార్థం పృవృత్తా భగినీ మమ

తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం
భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునందన .

సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా
పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వరా

రామా ! ఉత్తమ నియమాలు పాటించే సత్యవతి నా పూర్వజ (అంటే అక్కగారు ) . సత్యవతి వివాహం ఋచక మహర్షితో జరిగింది . నా సోదరి పవిత్రతను వర్ణించడానికి మాటలు చాలవు . తన భర్తతో సహా  సశరీరంగా  స్వర్గానికి చేరింది .స్వర్గంలో  పరమోదారమైన కౌశికీ నదిగా పరిణామం చెందింది .

పుణ్యోదకంతో నిండి , సుందరంగా ప్రవహించే కౌశికి దివ్యమైనది . లోకులకు హితం చేయడానికీ , కోరికలు తీర్చడానికీ   హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తున్నది . అక్క మీది అనురాగంతో నేను హిమాలయ పర్వత సానువులలో సుఖంగా నివసిస్తూ ఉంటాను . కౌశికి నదిగా మారిన నా సోదరి పుణ్యురాలు . సత్య ధర్మాలు ఆవిడకు ఆభరణాలు . వాటియందు ఆవిడ బుధ్ధి స్థిరంగా ఉంటుంది . మహా భాగ్యవంతురాలావిడ .

అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః
సిధ్ధాశ్రమమనుప్రాప్య సిధ్ధోస్మి తవ తేజసా

ఏష రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా
దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి

నియమపాలన పూర్తి చేయాలి కనుక నా సహోదరి సామీప్యాన్ని వదలి సిధ్ధాశ్రమానికి వచ్చాను . నా యాగం నీ తేజస్సు వలన సఫలమయ్యింది . నాకు కార్య సిధ్ధి కలిగింది . నీవడిగిన ప్రకారం నా జననం , నా వంశం , నా దేశాలను గురించిన కథ నీకు తెలియ జేసాను .

గతోర్ధరాత్రః కాకుత్స కథాః కథయతో మమ
నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నో ధ్వనీహ నః

కథలు చెబుతూ ఉన్నందున అర్ధరాత్రి గడిచిపోయింది . ఇక నిదురపో . నీకు మంగళమగుగాక . మనకు మార్గంలో విఘ్నాలు కలుగకుండుగాక .