Monthly Archives: ఆగస్ట్ 2011

రామాయణం

వర్షేణైవాగతం  విప్రం  విషయం స్వం  నరాధిపః
ప్రత్యుద్గమ్య  మునిం  ప్రహ్వః శిరసా చ  మహీం గతః

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై  న్యాయతః సుసుమాహితః
వవ్రే  ప్రసాదం విప్రేంద్రన్మా  విప్రం మన్యురావిశత్

అంతఃపురం  ప్రవిశ్యాస్మై  కన్యాం  దత్వా  యథావిధి
శాంతాం శాంతేన  మనసా  రాజా హర్షమవాప  సః

ఏవం  స  న్యవసత్తత్ర   సర్వకామైః  సుపూజితః

రాజ్యానికి అరుదెంచిన ఋష్యశృంగునికి ఎదురుగా వెళ్ళి  సాష్ఠాంగ నమస్కారం  చేసాడు రోమపాదుడు . అర్ఘ్య , పాద్యాలిచ్చి  ఆదరించాడు .  మోసంతో తీసుకొని  వచ్చినందుకు విభాండక మహర్షికి  కోపం వస్తుందేమో అన్న
భయం ఉంది  అంగ  రాజుకు . విభాండకుడికి  కోపం  రాకుండా తనను  అనుగ్రహించమని ఋష్యశృంగుని అర్థించాడు . అనుగ్రహించిన ఋష్యశృంగునకు  తన  ముద్దుల కుమార్తె  శాంతనిచ్చి  వివాహం  చేసి  ధన్యుడయ్యాడు రోమపాదుడు .  ఋష్యశృంగుడు  అంగరాజ్యాన్ని  తన  నివాసంగా మార్చుకున్నాడు .

బాలకాండలో పదియవ  అధ్యాయం  ఇక్కడ ముగుస్తుంది .

రామాయణం

తత్ర  చానీయమానే  తు  విప్రేతస్మిన్ మహాత్మని
వవర్ష సహసా  దేవో జగత్ప్రహ్లాదయంస్తదా

మహాత్ముని  పాదస్పర్శ తో అంగరాజ్యం పునీతమై  పోయింది . ఋష్యశృంగుడు అంగ దేశంలో   అడుగుపెట్టగానే  పర్జన్యుడు ( వర్షాధిదేవత ) సంతసించాడు .  వర్షం  కురిసింది . పృకృతి పరవసించింది . పురజనుల చిత్తాలు చింతను వీడాయి . దేశానికి పట్టిన దరిద్రం వదలిపోయింది . మహాత్ముల  ఆగమనం శుభకారకం . ” ఊరక రారు మహాత్ములు ,  వారు వచ్చుటలెల్లం కారణములగు మంగళములకున్ ” అని గానం చేస్తాడు పోతన , తన  భాగవత పురాణంలో . పవిత్రుడూ ,పరమ పావనుడూ , తేజోవంతుడూ ,  తపస్వీ అయిన ఋష్యశృంగుడు  నివసించే చోట కరువు కాటకాలు  దరి చేరవు . రామాయణకాలంలోనే  కాదు , ఈ రోజు కూడా వర్షాభావం  సంభవించినపుడు  ఋష్యశృంగ మహర్షిని  పూజించడం  కొన్ని  ప్రదేశాలలో  ఆనవాయితీ .

కవికులగురువు కాళిదాసు  మాటలలో చెప్పాలంటే వర్షాగమనం  వల్ల :

ప్రభిన్నవైడూర్య నిభైస్తృణాంకురై
స్సమాచితా ప్రోత్థిత కందలీ దళైః
విభాతి శుక్లేతరరత్నభూషితా
వరాంగనేన క్షితిరింద్రగోపకైః

వైడూర్యకాంతులతో  పోటీ పడుతూ  అప్పుడే  మొలచిన   పచ్చ గడ్డి చేతనూ , కందళీ దళాల  ఆకుల చేతనూ , ఎర్రని పట్టులాంటి  ఆరుద్ర పురుగుల చేతనూ  భూమి కప్పబడి — వివిధ వర్ణాలతో  భాసిల్లే  రత్నాలంకృత   స్త్రీ మూర్తి లాగా ఉందట .

వర్షాగమనంతో  పులకించిన పృకృతి
వానరాగానే  దర్శనమిచ్చే  ఆరుద్ర  పురుగు

రామాయణం

దృష్ట్వైవ   తాస్తదా  విప్రమాయాంతం  హృష్టమానసాః
ఉప్సృత్య   తతః   సర్వాస్తాస్తమూచురిదం వచః

ఏహ్యాశ్రమపదం  సౌమ్య  హ్యస్మాకమితి  చాబ్రువన్
తత్రాప్యేష  విధిః శ్రీమాన్  విశేషేణ భవిష్యతి

శ్రుత్వా  తు వచనం  తాసాం సర్వాసాం  హృదయంగమం
గమనాయ  మతిం  చక్రే   తం  చ  నిన్యుస్తదా స్త్రియః

అతని రాకకోసమే వేచియున్న ఆ రమణీలలామలు సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బయ్యారు . వచ్చిన కార్యం  సఫలమయిందని  మురిసి పోయారు . ఋష్య శృంగుని సమీపించి , ”  మీరు  మా  ఆశ్రమాన్ని  పావనం చేయండి . మీకు  విశేషంగా  అతిథి   సత్కారం చేయాలని మా కోరిక ”  అని  మంద్ర స్వరంతో మధురంగా పలికారు . మనస్సు నిండా  ఆ అంగనామణుల  రూప , యౌవన  , లావణ్యాలే  నింపుకున్న   ఋష్యశృంగుడికి  వారి  ఆహ్వానం  కర్ణపేయంగా  తోచింది . వెంటనే  వారి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు . అడవి  వీడి   అంగరాజ్యం   వైపు    అడుగులేసాడు   ఆ   మహానుభావుడు .

రామాయణం

అపృచ్ఛ్య  చ  తదా విప్రం వ్రతచర్యాం  నివేద్య  చ
గచ్ఛంతి స్మాపదేశాత్తా భీతాస్తస్య పితుస్త్రియః

గతాసు  తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో  ద్విజః
అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్  స్మ పరివర్తతే

తతోపరేద్యుస్తం దేశమాజగామ స  వీర్యవాన్
మనోజ్ఞ్యా  యత్ర  తా  దృష్టా  రూపవత్యస్స్వలఙ్కృతాః

వేశ్యలు వెళ్ళిపోయారు .  ఋష్యశృంగుని  మనసు వికలమై పోయింది . మనసంతా ఒక రకమైన దిగులుతో నిండిపోయింది . దుఃఖంతో ఆశ్రమమంతా  పచార్లు  చేశాడు .  మనసు కుదుటపడలేదు . మరుసటి రోజు పొద్దున ఆశ్రమాన్ని వదలి , ఆ అంగనామణులను తాను పూర్వం చూసిన ప్రదేశానికి  వచ్చాడు .

రామాయణం

ప్రతిగృహ్య  చ  తాం  పూజాం సర్వా  ఏవ సముత్సుకాః
ఋషేర్భీతాశ్చ  శ్రీఘ్రం తా గమనాయ మతిం  దధుః

కుతూహలంతో ఋష్యశృంగుని ఆహ్వానాన్ని మన్నించి  ఆశ్రమానికైతే అరుదెంచారు  కానీ  విభండక  మహర్షి  వస్తాడేమోనని భయం  వారిలో ఉంది . అందువలన  ఆ ఆశ్రమాన్నుండి  తొందరగా  వెళ్ళిపోవాలని  ఆ వేశ్యలు నిర్ణయించుకొని  ఋషికుమారుని వద్ద సెలవు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు .

అస్మాకమపి  ముఖ్యాని  ఫలామాని  వై  ద్విజ
గృహాణ  ప్రతి భద్రం తే భక్షయస్వ  చ మా చిరం
తతస్తాస్తం  సమాలిఙ్గ్య సర్వా    సర్వా హర్ష  సమన్వితాః
మోదకాన్  ప్రదదుస్తస్మై  భక్ష్యాంశ్చ వివిధాన్  బహూన్

” ద్విజకులోత్తమా , మేము భుజించే  ఫలాలలో ఈ ఫలాలు శ్రేష్ఠ మైనవి . వీటిని  గ్రహించి మమ్ములను  కృతార్థులను చేయవలసింది . నీకు భద్రమగుగాక ” , అని  పలికి , ఋష్యశృంగుణ్ణి  ప్రీతితో  కౌగిలించుకొని అనేకమైన భక్ష్య పదార్థాలను ఋషికుమారుని  ముందుంచారు , పురుషులను ఆకట్టుకోవడంలో   నేర్పరులైన   ఆ  గణికలు. తేజస్సుతో  వెలిగి పోతున్న  ఆ  విభాండక పుత్రుడు  అటువంటి   పదార్థాలను ఎన్నడూ  రుచి చూడలేదు . వాటిని భక్షించి , అవి ఫలాలే అని అనుకొన్నాడట .
అమాయకులను  తమ దారికి తెచ్చుకోవడం , నేర్పరులైన వారికి  అతి  సులభం .  మధుర పదార్థాలూ , మగువ మాటలూ , బిగి  కౌగిళ్ళూ  ఎంతవాడినైనా లొంగదీసుకుంటాయి . ఏమీ తెలియని మునికుమారుడెంత . ఆ వేశ్యల వశమై పోయాడు . “ఎంతవారలైనా కాంతా దాసులే కదా” .

రామాయణం

ఋషిపుత్రవచః  శ్ర్య్త్వా  సర్వాసాం మతిరాస  వై
తదాశ్రమపదం  ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన  తాః
ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార  హ
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదంమూలం ఫలంచ వః

ఆహ్వానాన్ని  అందుకొన్న ఆ స్త్రీలకు   ఋష్యాశ్రమాన్ని  చూడాలనే కోరిక కలిగింది .  ఋష్యశృంగుని వెంట అతని ఆశ్రమానికి  వెళ్ళారు . “ఇదమర్ఘ్య ,మిదం పాద్య ,మిదం ఫలం ” , అంటూ అర్ఘ్య పాద్యాలు  ఆ పడతులకు సమర్పించిన పిదప , వారికి  కందమూల ఫలాలను  ఆహారంగా  ఇచ్చాడు .

అతిథిని దైవ తుల్యంగా భావించే భారత  సంస్కృతి మనకిక్కడ ప్రత్యక్షమౌతుంది . ఇంట్లో భగవదారాధన  చేసే  సమయంలో అర్ఘ్య పాద్యా  లిచ్చి భగవంతుని ఆహ్వానించడం మన పధ్ధతి . అతిథి అంటే తిథి వార నక్షత్రాలతో  సంబంధం లేకుండా మన ఇంటికి అరుదెంచే  అభ్యాగతుడు .  అతనిని భగవంతునిలా  భావించి , అర్ఘ్య పాద్యాలతో పూజించి , ఆతిథ్యమివ్వడం మన సంస్కృతి . అతిథి దేవో భవ  అనడం ఒక్క భారతీయులకే  చెల్లింది . ” అభ్యాగతః స్వయం విష్ణుః ” అన్న వాక్యం  కూడా  ఈ సందర్భంలో తలపుకు  రాక  మానదు .

రామాయణం

పితా  విభాణ్దకోస్మాకం   తస్యాహం  సుత  ఔరసః
ఋష్యశృంగ  ఇతి  ఖ్యాతం నామ  కర్మ చ మే భువి

ఇహాశ్రమపదోస్మాకం  సమీపేఆ శుభదర్శనాః
కరిష్యే  వోత్ర పూజాం  వై  సర్వేషాం  విధిపూర్వకం

“శుభదర్శనులారా  నా  పేరు ఋష్యశృంగుడు . విభండక మునికి  ఔరస పుత్రుణ్ణి . మా ఆశ్రమం ఇచటికి సమీపంలోనే ఉంది . మా ఆశ్రమాన్ని మీ పాద స్పర్శతో  పావనం చేయండి . మిమ్ములను విధిపూర్వకంగా  సత్కరిస్తాను”  అని  మనఃపూర్వకంగా   గణికలను  ఆహ్వానించాడు ఆ  అమాయక చక్రవర్తి .
ఇక్కడ ఒక విశేషం . ఆ గణికలను సంబోధిస్తూ ” సర్వేషాం ” (మీ అందరియొక్క ) అన్న  పుంలింగ  పదాన్ని ప్రయోగించాడు  . ఈ పుంలింగ  పద ప్రయోగం ఋష్యశృంగుడికి స్త్రీ పురుష భేదం తెలియదని సూచిస్తున్నది . నిజంగా ఏమీ తెలియని  పసిబిడ్డ లాంటి మనస్సుతో భాసిస్తున్న పవిత్ర  మునికుమారుడి  రూపాన్ని మనముందుంచాడు ఆదికవి  వాల్మీకి .

రామాయణం

అదృష్టరూపాస్తాస్తేన  కామ్యరూపా  వనే  స్త్రియః
హార్దాత్తస్య  మతిర్జాతా  వ్యాఖ్యాతుం   పితరం  స్వకం .

స్త్రీ  అంటేనే  తెలియని ఋష్యశృంగుణ్ణి  అతిమనోహరంగా ఉన్న   ఆ  స్త్రీల   సౌందర్యం  ఆకర్షించింది . వారిపై అతనికి స్నేహ  భావం  కలిగింది . తన తండ్రి విభాండకుని   గురించి  చెప్పాలనిపించింది .
కొత్త  మనుష్యులను   చూచినప్పుడు  మన హృదయం మనకు తెలియ కుండా వారి వైపు  ఆకర్షింప బడుతుంది . వారితో సంభాషించాలనిపిస్తుంది . కొత్తవారు  లలనలైతే  ఆకర్షణ  శక్తి   ద్విగుణీకృతమవుతుంది . ” ఆడదాని  ఓరచూపుకూ జగాన ఓడిపోని ధీరుడెవ్వడూ ” ? ఇది మానవ  సహజం .  ఋష్యశృంగుడు  కూడా సహజంగానే  ఆ  అతివల వైపు  ఆకర్షింప బడ్డాడు . తన  గురించి  చెప్పడానికేమీ తోచలేదు  కనుక తన  తండ్రిని  గురించి  ఆ   రమణీ లలామలకు    చెప్పాలనుకున్నాడు .

రామాయణం

తతః కదాచిత్తం  దేశమాజగామ  యదృచ్ఛయా
విభండకసుతస్తత్ర  తాశ్చాపశ్యద్వరాంగనా
తన ఆశ్రమానికి  దగ్గరగా నివాసమేర్పరుచుకొని  తన కోసం   ఎదురుచూస్తున్న ఈ అంగనలను ఒక రోజు ఋష్యశృంగుడు చూడడం తటస్థించింది . అందంగా  అలంకరించుకొని మధుర స్వరాలతో పాటలు పాడుతూ ఉన్న ఆ  అతివలు అతని దృష్టిని ఆకర్షించారు .  ఋషిబాలకుని చూసిన ఆ అంగణామణులు అతని దగ్గరగా వెళ్ళి ఇలా పలికారు :

కస్త్వం కిం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయం
ఏకస్త్వం  విజనే   ఘోరే   వనే    చరసి  శంస నః

మహాత్మా  భయంకరమైన  అరణ్యంలో ఒంటరిగా తిరిగే నీవెవ్వరు . నీ పరిచయమేమిటి . మాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది .

ఋష్యశృంగమహర్షిని  తీసుకొని రావడానికి వెళ్ళిన గణికలు .

 

 

 

రామాయణం

పితుః స  నిత్యసంతుష్టో నాతిచక్రామ  చాశ్రమాత్
న తేన జన్మప్రభృతి దృష్తపూర్వం తపస్వినా
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సర్వం  నగర రాష్ట్రజం

నిత్యసంతుష్టుడైన  ఋష్యశృంగుడు  పుట్టినప్పటినుండి  తన తండ్రి  ఆశ్రమాన్ని వదలి  బయటకు  వెళ్ళలేదు . తండ్రి   తప్ప   ఇతర మానవ   సంపర్కం  లేకుండా   పెరిగిన వాడు . స్త్రీలనే  కాదు  ఇతర  పురుషులను కూడా  చూడకుండా  ఏకాకిగా  పెరిగిన  ఋషి ఋష్యశృంగుడు.

Rushi (Sage)