Monthly Archives: మార్చి 2014

రామాయణం

యా చాన్యా శైలదుహితా కన్యాసీద్రఘునందన
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే త్పోధనా
ఉగ్రణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతాం
రుద్రయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతాం
ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే
గంగా చ సరితాం శ్రేష్టా ఉమాదేవీ చ రాఘవ

పరమ పావని ఉమ , హిమవంతుని రెండవ కుమార్తె   .  ఉమ ఉగ్రమైన తపస్సు చేసింది . లోకాలన్నీ ఆ మాత ముందు తలవంచి నమస్కారం చేసాయి . సర్వలోక నమస్కృత అయిన ఆ మాతను , అప్రతిరూపుడైన ( సాటిలేని రూపంగల ) పరమ శివునికిచ్చి వివాహం చేసాడు హిమవంతుడు . ఈ విధంగా నదీమతల్లులో శ్రేష్థమైన గంగా నదీ , పరమ పవిత్రురాలు పార్వతీ , హిమవంతుని కుమార్తెలు . ప్రాణులందరికీ పరమ పూజ్యులు .

 

ఏదత్తే సర్వమాఖ్యాతాం యథా త్రిపథగా నదీ
ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాం వర .
సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ

 

అందంగా నడిచే రామా ! గంగా నది ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో చెప్పాను . జలరూపంలో ప్రవహించే హిమవంతుని కుమార్తె – స్వర్గాన్ని అధిరోహించిన గంగ – సురగంగ అయింది . పాప రహితమైనది ఈ మాతృమూర్తి   . రమ్యమైనది , రమణీయమైనది .

 

 

DSC04366

రామాయణం

అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా
శైలేంద్రం వరయామాసుర్గఙ్గాం త్రిపథగాం నదీం

దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీం
స్వచ్ఛందపథగాం గఙ్గాం త్రైలోక్యహితకామ్యయా

ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోక హితకారిణః
గఙ్గామాదాయ తే గచ్ఛన్ కృతార్థేనాంతరాత్మనా

పెద్దకుమార్తె అయిన గంగా దేవిని తమ కిమ్మని కోరారు దేవతలు . ముచ్చటగా మూడు మార్గాలలో ప్రవహించే నది గంగానది . ( మూడు నదుల సంగమ స్థానాన్ని ప్రయాగ అని అంటారు . ఉదాహరణకు అలహాబాద్ అసలు పేరు ప్రయాగ . అది గంగా ,యమునా ,సరస్వతీ నదుల సంగమస్థానం . అదే విధంగా -విష్ణు ప్రయాగ , దేవ ప్రయాగ మొదలైనవి ) .
మూడు లోకాలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో గంగా దేవిని దేవతల కిచ్చాడు హిమవంతుడు . గంగా నది తన స్వేచ్ఛానుసారంగా ప్రవహించగల శక్తి కలది . గంగా దేవిని గ్రహించిన దేవతలు సఫలులైనారు . తమ వెంట గంగమ్మను స్వర్గానికి తీసుకొని వెళ్ళారు . గంగ , స్వర్గంగ అయింది . లోకపావనిగా మారింది .

పోతన మాటల్లో   గంగమ్మ  “అమృతాపాంగ , సుతరంగ , ముఖవనరుహ , రత భృంగ  శివ జటాగ్రరంగ ”  . అమృతం  చిందించే  కటాక్షం కలది . అలలతో కూడినది .  ముఖమనే  పద్మం  మీద   ఆసక్తి తో ఉండే   భృంగాలు ( తుమ్మెదలు )  కలిగినది. వేయేల శివ జటాజూటాలనే  రంగస్థలంగా  (play field ) కలిగి ఉన్నది .

 

 

 

 

రామాయణం

చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః
వృధ్ధిం జన్మ చ గంగాయా వక్తుమేవోప చక్రమే

రాముడంటే అమిత ప్రేమ విశ్వామిత్రుడికి . గంగా నది పుట్టుకను , వృధ్ధి అంటే పెరగడం మొదలైన విషయాలను చెప్పడానికి పూనుకున్నాడు .

శైలేంద్రో హిమవాన్నామ ధాతూనామకరో మహాన్
తస్య కన్యాద్వయం రామ రూపేణాప్రతిమం భువి
యా మేరు దుహితా రామ తయోరాత్మా సుమధ్యమా
నామ్నా మనోరమా నామ పత్నీ హిమవతః ప్రియా
తస్యాం గంగేయమభవజ్జ్యేష్టా హిమవతః సుతా
ఉమా నామ ద్వితీయా భూన్నామ్నా తస్యైవ రాఘవ .

ధాతువులకు నిలయం హిమవత్పర్వతం . బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుంటుంది మేరు పర్వతం . మనోరమ ఆ మేరు పర్వతానికి పుత్రిక . హిమవంతునికి భార్య . అతిలోక సౌందర్యవంతులైన గంగ , ఉమలు వారి సంతానం .

పర్వతాలేమిటీ ?  వాటికి సంతానమేమిటీ ? అంతా  అభూత కల్పనలు అని మనకు  అనిపిస్తాయి . నిజానికి నదులు  పర్వతాలనుండి  పుట్టకుండా మనుషులకు  పుడుతాయా ?  కాల  పరిణామంలో  రెండు  పర్వతాలు  దగ్గరగా రావడం జరిగినప్పుడు  ,  ఆ వత్తిడికి  నదులు  అవిర్భవిస్తాయని  మన  పెద్దలు చెప్పిన మాట .  అయితే  అందమైన  కథలుగా వాటిని  చెప్పారు . లిటరల్గా  తీసుకోకూడదు .  అంతర్గత  భావాన్ని గ్రహించగలిగిన  శక్తి   ఉంటే  ఈ కథలలోని  నిజం  మనకవగతమౌతుంది .

మేరు పర్వతం బంగారు  రంగులో  ఉంటుందని అంటే మనకు నమ్మకం కుదరదు . మరి ఈ పర్వతాన్ని చూడండి .

తస్యాస్తీరే  తతశ్చక్రు  స్త ఆవాసపరిగ్రహం 

తతః స్నాత్వా  యథాన్యాయం  సంతర్ప్య పిటృదేవతాః

హుత్వా  చైవాగ్నిహోత్రాణి  ప్రాశ్య  చామృతవద్ధవిః 

వివిశుర్జాహ్నవీతీరే  శుచౌ  ముదిత  మానసాః 

విశ్వామిత్రం మహాత్మానం  పరివార్య  సమంతతః   

 

పుణ్యులైన రామచంద్రులు , విశ్వామిత్ర ఋషి , మహర్షి పరివారం పావన గంగానదీ తీరాన్ని చేరి స్నానం చేసారు . శాస్త్రప్రకారంగా తర్పణాలు సమర్పించి పితృదేవతలను సంతృప్తిపరిచారు . ( పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారు సంతృప్తి చెందుతారు అని మన పూర్వీకుల నమ్మకం ) . అగ్నిని వెలిగించారు . అమృత సమానమైన హవిస్సును భుజించారు .( హవిస్సు అంటే భోజనము . పిండి , నేయి మొదలగునవి ) . భోజనం కాగానే విశ్వామిత్ర మహర్షి చెంత చేరి ఆతని చుట్టూ కూర్చున్నారు .

అథ తత్ర తదా రామో విశ్వామిత్ర మథాబ్రవీత్
భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీం
త్రైలోక్యం కథమాక్రామ్య గతా నదనదీపతిం

శ్రీరామునికి విషయాలను తెలుసుకోవాలనే కోరిక మిక్కుటం . విశ్వామిత్ర మహర్షిని ” భగవన్ ! త్రిపథగ ( మూడు మార్గాలలో ప్రయాణించే ) అయిన గంగమ్మ కథను వినాలని కోరికగా ఉంది . ఈ నదీమ తల్లి మూడులోకాలను ఏవిధంగా ఆక్రమించింది ? నదీ నదాలకు పతి అయిన సముద్రాన్ని ఏ విధంగా చేరింది ” అని అడిగాడు .

గంగమ్మ భూతలానికి అరుదెంచే దృశ్యాన్ని ఎందరో కవులు మనోహరంగా వర్ణించారు . ఉదాహరణకు భాగవతంలోని తొమ్మిదవ స్కంధంలో అత్యద్భుతమైన గంగావతరణ ఘట్టాన్ని మన కళ్ళముందు పెడతాడు పోతన . ఇక కొన్ని రోజుల పాటు గంగా నదిని తలుచుకుంటూ మనం కూడా మైమరచి పోదాం .

IMG_1921

Gangaa flowing majestically at Prayag . This place is hallowed by Lord Rama’s presence .

Alaknanda River – Uttranchal
View1

Alaknanda at Uttaranchal : photo taken from ” http://www.harmyne.com/2012/12/alakananda-river-uttarakhand.html “.