Monthly Archives: జనవరి 2012

రామాయణం

త్వాం   నియోక్ష్యామహే   విష్ణో  లోకానాం  హితకామ్యయా
రాజ్ఞో  దశరథస్య  త్వమయోధ్యాతిపతేః  ప్రభోః

ధర్మజ్ఞస్య  వదాన్యస్య  మహర్షిసమతేజసః
తస్య  భార్యాసు  తిసృషు  హ్రీశ్రీ  కీర్త్యుపమాసు  చ
విష్ణో  పుత్రత్వమాగచ్ఛ  కృత్వాత్మానం  చతుర్విధం

పరమాత్ముని తనివితీరా  ప్రార్థించిన పిదప  లోక కల్యాణం  కోసం  ” ధర్మజ్ఞుడైన   దశరథుని తనయుడుగా ” ఆవిర్భవించమని అర్థించారు “.
” దశరథుని  భార్యలు  హ్రీ , శ్రీ , కీర్తులతో ( వీరందరూ దిక్పాలకుడైన దక్ష ప్రజాపతి కుమార్తెలు ) సమానులు .  దశరథుడేమో ,  మహర్షులతో సమానమైన   దివ్యతేజం  కలవాడు . మీ ఆత్మను నాలుగుభాగాలుగా  విభజించి , రఘుకులంలో  జన్మించి ,  రావణున్ని   రణంలో  సంహరించండి ” అని దీనంగా  విష్ణువు నర్థించారు  దేవతలు .

తత్ర త్వం   మానుషో  భూత్వా  ప్రవృధ్ధం  లోకకణ్టకం
అవధ్యం  దైవతైర్విష్ణో  సమరేజహి  రావణం .
స హి  దేవాంశ్చ  గంధర్వాన్  సిధ్ధాంశ్చ  మునిసత్తమాన్
రాక్షసో  రావణో  మూర్ఖో  వీర్యోత్సేకేన  బాధతే
ఋషయశ్చ  తతస్తేన  గంధర్వాసరస్తథా
క్రీదంతో  నందనవనే  క్రూరేణ  కిల హింసితాః

బ్రహ్మ  ప్రసాదించిన దివ్యమైన   వరాలు  రావణుని   అజేయునిగా  చేసాయి . అజేయుడననే గర్వంతో ఆతడు  సాధువులైన దేవ ,  గంధర్వులనూ , అబలలైనా అని చూడకుండా  అప్సరసలనూ  హింసిస్తున్నాడు .  సిధ్ధులూ , ఋషులమాట  వేరుగా చెప్పాలా . దశరథ  తనయునిగా  ధరలో  జన్మించి  , రావణుని  సంహరించి  మమ్ములను  రక్షించవా   .

వధార్థం  వయమాయాతాస్తస్య  వై  మునిభిః సహ
సిధ్ధగంధర్వయక్షాశ్చ  తతస్త్వాం  శరణం గతాః
త్వం  గతిః పరమా దేవ సర్వేషాం  నః  పరంతప
వధాయ  దేవశత్రూణాం  నృణాం లోకే  మనః కురు .

“నీవేతప్ప   ఇతః  పరంబెరుగ , మన్నిపందగున్  దీనులన్ , కావవే  వరద  సంరక్షింపు  భద్రాత్మకా ”   అని  కనుల నిండుగా  కన్నీరు  కారుతుండగా  భగవంతుని  శరణుజొచ్చారు .  “అన్యధా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ ”  అని  ప్రార్థించి  రావణ  సంహారానికి  నరుడుగా   నరలోకంలో  అవతరించమని  అవనత వదనులై  అంజలి  ఘటించి  దేవదేవుని  వేడుకున్నారు .

Lord Mahavishnu

రామాయణం

ఏతచ్ఛ్రుత్వా  ప్రియం  వాక్యం బ్రహ్మణా  సముదాహృతం
దేవా   మహర్షయః    సర్వే    ప్రహృష్టాస్తే    భవంస్తదా

రావణుని  నిర్జించే  మార్గమే  లేదని అనుకుంటున్న  ఋషులూ , దేవతలూ  ,    విధాత   పలికిన    పలుకులు  విని  సంతోష  పరవశులయ్యారు .  ఇదే  సమయంలో

ఏతస్మిన్నంతరే   విష్ణురుపయాతో   మహాద్యుతిః
శఙ్ఖ   చక్ర  గదా  పాణిః    పీతవాసా    జగత్పతిః
బ్రహ్మణా  చ  సమాగమ్య  తత్ర తస్థౌ  సమాహితః
తమబ్రువన్  సురాస్సర్వే  సంభిష్టూయ  సన్నతాః

దేదీప్యమానమైన  దివ్యతేజస్సుతో  శంఖ   చక్ర   గదాది  ఆయుధాలను  హస్తభూషణాలుగా  ధరించి   పీతాంబరధారియైన   మహావిష్ణువు  అక్కడ  ప్రత్యక్షమయ్యాడు .  వచ్చి  బ్రహ్మదేవుని పక్కన నిలబడ్డాడు .

తమకోరిక   తీర్చమని దేవతలు  కోరిన  వెంటనే   చతుర్ముఖుడు  ఉపాయాన్ని  సూచించాడు .  బ్రహ్మదేవుని  నోటి నుండి  మాట  పూర్తి   కాకమునుపే లోకాలను లాలించి  పాలించే హరి ప్రత్యక్షం కావడం కన్నా  శుభసూచకం  వేరొకటి ఉంటుందా  .

స శంఖ  చక్రం  సగదాసి  శార్ఙం
పీతాంబరం  కౌస్తుభవత్సచిహ్నం
శ్రియా  సమేతోజ్వలశోభితాంగం
విష్ణుం సదాహం  శరణం  ప్రపద్యే

భగవంతుడూ , పరమాత్మా  ,  జగదీశుడూ  ,  జనార్దనుడూ ,   అయిన   హరిని   చూచి   స్తుతించారు సురులు . విష్ణువు   స్తుతిప్రియుడు   కదా .

పరమాత్మ  దర్శనంతో  ధన్యులైనారు దేవతలు .భగవంతుని  అనుగ్రహం పొందాలంటే  నవవిధ భక్తి  మార్గాలలో  ఏదైనా ఎంచుకోవాలి .  ఈ భక్తి మార్గాలేవంటే

తను  హృద్భాషల సఖ్యమున్ , శ్రవణమున్ , దాసత్వమున్ , వందనా
ర్చనముల్ ,  సేవయు , నాత్మలో నెఱుకయున్  ,సంకీర్తనల్ , చింతనం
బను  నీ తొమ్మిది  భక్తి  మార్గముల  సర్వాత్మున్  హరిన్ నమ్మి  స
జ్జనుడై  యుండుట  భద్రమంచున్  దలతున్  సత్యంబు  దైత్యోత్తమా .

విచ్చేసిన   శ్రీనాథునికి  వందనం చేసారు , పిదప  స్తుతించారు . మనసు విప్పి  తమ కష్టాలను విన్నవించారు .

రామాయణం

దేవతల  విన్నపం  విన్న  విధాత  మనసు కరుణతో  కరిగి  పోయింది . వాగ్దేవీ మనోనేత  , దివ్యానంద ప్రదాత ,   జగన్నిర్మాత , ధాత  సమస్యకు  పరిష్కారాన్ని ఆలోచించాడు .  మార్గం దృష్టిగోచరమైంది . దేవతలతో  ఈ విధంగా అన్నాడు :

ఏవముక్తః సురైః సర్వైశ్చింతయిత్వా తతోబ్రవీత్
హంతాయం  విదితస్తస్య  వధోపాయో  దురాత్మనః
తేన గంధర్వయక్షాణాం  దేవదానవరక్షసాం
అవధ్యోస్మీతి  వాగుక్తా  తథేత్యుక్తం  చ తన్మయా
నా కీర్తయదవజ్ఞానాత్తద్రక్షో   మానుషాం స్తదా
తస్మాత్స  మనుషాద్వధ్యో   మృత్యుర్నాన్యోస్య   విద్యతే

రావణునికి   ,  దేవ ,  దానవ , గంధర్వ  ,  యక్ష  ,  కిన్నర ,  కింపురుషులతో   మరణం  లేకుండా   నేను  వరమిచ్చిన  మాట  నిజమే . కానీ   మూడులోకాలలో  ఎదురులేని  నన్ను అల్పులైన    మానవులేమిచేయగలరనే   అహంభావంతో  నరులతో చావులేకుండా  కాపాడమని  రావణుడు  నన్నర్థించలేదు . అటువంటి  వరం నేనీయలేదు . మానవుడు  రావణుని  చంపే  అవకాశముంది .  ఇది తప్ప ఇంకో మార్గం కూడా   లేదు .

రామాయణం

తః  సమేత్య  యథాన్యాయం  తస్మిన్  సదసి  దేవతాః
అబ్రువన్  లోకకర్తారం  బ్రహ్మాణం  వచనం  మహత్

భగవన్  తత్ప్రసాదేన  రావణో  నామ  రాక్షసః
సర్వాన్నో  బాధతే  వీర్యా  చ్ఛాసితుం    తం  న  శక్నుమః  

హవిర్భాగాలను  స్వీకరించడానికి   సదస్సులో  సమావేశమైన  దేవతలందరూ సృష్టికర్త  సముఖానికి  చేరారు .  స్వామీ !  రావణుడు  లోకకంటకుడైనాడు .  అతనికి మీరిచ్చిన వరాలు  మా పాలిట శాపాలైనాయి .  అతనిని శిక్షించడానికి  మా సమర్థత  సరిపోవడం  లేదు .  

త్వయా  తస్మై  వరో దత్తః  ప్రీతేన  భగవంపురా
మానయంతశ్చ  తం  నిత్యం సర్వం  తస్య  క్షమామహే

ఉద్వేజయతి లోకాంస్త్రీనుచ్ఛ్రితాన్  ద్వేష్టి దుర్మతిః
శక్రం  త్రిదశరాజానం  ప్రధర్షయితుమిచ్ఛతి .

ఋషీన్యక్షాన్సగంధర్వా  నసురాంబ్రాహ్మణాం స్తథా
అతిక్రామతి  దుర్ధర్షో వరదానేన  మోహితః

రావణుని   తపస్సుకు  మెచ్చి  మీరిచ్చిన  వరాలను  గౌరవిస్తూ  అతను  చేసిన అపకారాలన్నీ సహిస్తూ  అతనిని క్షమిస్తున్నాము . దుర్బుధ్ధియైన  ఆ రావణుడు దేవేంద్రునికూడా  అవమానిస్తున్నాడు . ఇక ఋషులనూ, సురులనూ , భూసురులనూ ,  గంధర్వులనూ , ఎవరినీ వదలడం  లేదు .  వరాల ప్రభావం  వల్ల  వానిని  జయించడం మాకు అసంభవం .  

నైనం  సూర్యః  ప్రతపతి పార్శ్వే  వాతి  న మారుతః
చలోర్మిమాలీ  తం  దృష్ట్వా  సముద్రోపి  నకంపతే

తన్మహన్నోభయం  తస్మాద్రాక్షసాద్ఘోరదర్శనాత్  
వధార్థం  తస్య భగన్నుపాయం  కర్తుమర్హసి

ఏవముక్తః  సురైః   సర్వైశ్చింతయిత్వా   తతోబ్రవీత్
హంతాయం  విదితస్తస్య  వధోపాయో  దురాత్మనః 

ప్రచండుడైన  సూర్యుడు  రావణున్ని  తపింపజేయడు , వాయువైతే  ఇతని  చుట్టుపక్కలకు వెళ్ళడంలేదు , సముద్రుడు   ఇతణ్ణి  చూసి   స్తంభించి  పోతాడు .  రావణున్ని  చూడాలంటేనే  భయంగా  ఉంది . ఇక  వాడితో యుధ్ధం  కూడానా ?  మమ్ములను  కరుణించి  వాడిని వధించే  ఉపాయం చెప్పండి .
 

రామాయణం

మేధావీ  తు తతో  ధ్యాత్వా  స  కించిదిదముత్తరం
లబ్ధసంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్

ఇష్టిం   తేహం  కరిష్యామి   పుత్రీయాం  పుత్రకారణాత్
అథర్వశిరసి  ప్రోక్తైర్మంత్రైః   సిధ్ధాం  విధానతః

వినయంతో  వినమ్రుడై  తన ముందు  అంజలిఘటించి   నిలుచున్న  దశరథుని చూచి  కరుణాతరంగుడయ్యాడు  ఋష్యశృంగుడు .  వేదాలను పుక్కిటబట్టిన  ఆ  మేధావంతుడు  ఒక్కనిమిషం  అలోచించాడు . ” నీతో   అథర్వశిరస్సు అనబడే  వేదభాగంలోని  మంత్రాలతో  చేసే  ” పుత్రీయేష్ఠి ” (పుత్రకామేష్ఠి )  యాగాన్ని  చేయిస్తాను”   అని పలికాడు .  అంటూనే  యజ్ఞాన్ని  మొదలు  పెట్టాడు .

తతః  ప్రాకమ్య  తామిష్ఠిం  పుత్రీయాం  పుత్రకారణాత్
జుహావ చాగ్నౌ  తేజస్వీ  మంత్రదృష్టేన  కర్మణా

తతో  దేవాః  సగంధర్వాః  సిధ్ధాశ్చ  పరమర్షయః
భాగప్రతిగ్రహార్థం   వై   సమవేతా  యథావిధి .

బ్రహ్మతేజస్సు  అలరారుతుండగా , యజ్ఞకుండం ముందు  కూచుని  దివ్యమైన   వేదమంత్రాలనుచ్చరిస్తూ   అగ్నిలో   హోమంచేసాడు ఋష్యశృంగుడు . దేవతలూ , గంధర్వులూ , సిధ్ధులూ  , మహర్షులూ  , తమ తమ   హవిస్సులను  స్వీకరించడానికి  యాగస్థలానికి   విచ్చేసారు .

 

 

అయ్యలరాజు  రామభద్రుడు తన ” రామాభ్యుదయంలో ” ఈ సందర్భంగా  రచించిన  పద్యాలు .

అలఘుశ్రీనిధి   విశ్వభూతలవరుం డా  ఋష్యశృంగర్షి  ము
ఖ్యుల ఋత్విక్కుల నప్పుడేర్పరచి  యాగోద్యోగరాగాంకురం
బులు  సందీక  మదిన్  బెనంగ  నుచితంబుల్  ద్రవ్యముల్ తోరహ
త్తులుగా  గూర్చి  నిజాంగనాజన  సమేతుండై  ప్రమోదంబునన్

హారి సరయూసరిజ్జల   ఎన్
పూరంబుల  గ్రుంకి  యాగభూస్థలి  చేరెన్
బ్రారంభించిరి  నిగమా
కారులు  యాజకులు  పుత్రకామాధ్వరమున్

అమృతముకంటెను  మధురము
నమలము  నతిరుచియు శుచియునని యమ్మఖ  హ
వ్యము  చవుల  దవిలి కాక
య్యమరవరులు  దివినుండి  నేలకరుదే నేలా ?

రామాయణం

తతః   ప్రీతమనా  రాజా   ప్రాప్య యజ్ఞమనుత్తమం
పాపాపహం  స్వర్నయనం  పార్థివర్షభైః

తతో    బ్రవీదృశ్యశృంగం    రాజా  దశరస్తథా
కులస్య  వర్ధనం త్వం  తు కర్తుమర్హసి  సువ్రత

తథేతి  చ స  రాజానమువాచ  ద్విజసత్తమః
భవిష్యంతి  సుతా     రాజం  శృత్వారస్తే   కులోద్వహాః

అపురూపమూ అనన్యసాధ్యమూ అయిన  అశ్వమేధం సంపూర్ణంగా  ముగిసింది .  దశరథుడు పాపవిముక్తుడై   స్వర్గానికి   వెళ్ళే  అర్హత  సంపాదించుకున్నాడు .  ఇక  మిగిలింది  వంశవృధ్ధి . అది పుత్రజననం  వల్లనే  సాధ్యం కదా .  ఋష్యశృంగ  మహర్షి  సముఖానికి  చేరి  ” కులవర్ధనుడైన  కుమారుణ్ణి  కనడానికి  చేయవలసిన  కార్యక్రమాన్ని  మొదలుపెట్టమని  ప్రార్థించాడు . దోసిలియొగ్గి  తనముందు  నిలబడిన దశరథుని చూసి  కరుణాంతరంగుడైన  ఋష్యశృంగుడు  కావలసిన  కార్యక్రామనికి  ఉపక్రమిస్తూ ” వంశోధ్ధారకులైన    పుత్రులు  నలుగురు   నీకు  పుడతారు ”  అని ఆశీర్వదించాడు .”

” వేదవేద్యుడు  దశరథాత్మజుడుగా  ధరలో  జన్మించడానికి ”   రంగం     సిధ్ధమయింది .

 

రఘువంశంలో కాళిదాసు వ్యక్తపరచిన  భావం ఇంచుమించు  ఇలాగే  ఉంటుంది . దిలీప  మహారాజు  వసిష్ఠమహాముని  ముందు  చేతులు జోడించి :

తస్మాన్ముచ్యే   యథాతాత  సంవిధాతుం  త్వ మర్హసి
ఇక్ష్వకూణాం  దురాపేర్థే  తద్వధీనాహి  సిధ్ధయః

తండ్రీ !  మావంశస్థులతో అసాధ్యాలయిన  కార్యాలను  సుసాధ్యాలుగా  చేయించడంలో  మీరు  సమర్థులు . నేను  పితరుల ఋణం  నుండి  విముక్తి చెందడానికి (సంతానం పొందడానికి )  కావలసిందేదో   అది మీరు  చేయండి / నాచేత  చేయించండి.

తతః ప్రీతేషు నృపతిః  ద్విజేషు  ద్విజవత్సలః
ప్రణామమకరోత్తేషాం  హర్షపర్యాకుళేక్షనః

తస్యాశిషోథ  విధివద్బ్రాహ్మణైః  సముదీరితాః
ఉదారస్య  నృవీరస్య  ధరణ్యాం  ప్రణతస్య చ

ద్విజవత్సలుడైన  దశరథుడు ,  భూసురులందరూ  సంతృప్తి చెందినట్లు  గ్రహించి  , ఆనందంతో  వారికి  వందనం చేసాడు .  సాష్ఠంగ ప్రణామం  చేస్తున్న  రఘుకుల  దీపకుణ్ణి  సశాస్త్రీయంగా  ఆశీర్వదించారు  ఆనందపరవశులైన  ఆ  సద్బ్రాహ్మణులు .

 

दानं प्रियवाक्सहितं ज्ञानमगर्वं क्षमान्वितं शौर्यम् ।
त्यागसहितं च वित्तं दुर्लभमेतच्चतुष्टयं लोके ॥

మిత్రలాభం  హితోపదేశం

 

మంచిమాటలతో  దానమిచ్చే  దాతలూ ,  దానగుణం  కలిగిన ధనవంతులూ ,  గర్వం లేని    జ్ఞానులూ  ,   క్షమాగుణం కలిగిన  శూరులూ     చాలా అరుదుగా కనిపిస్తారు .

ఈ  సద్గుణాలన్నీ సంఘాలుగా  వచ్చి  దశరథునియందు  నిలిచాయేమోనని   అనిపించేలా  వర్ణించాడు వాల్మీకి .

రామాయణము

తతః  ప్రసర్పకేభ్యస్తు  హిరణ్యం  సుసమాహితః
జాంబూనదం  కోటిసంఖ్యం  బ్రాహ్మణేభ్యో  దదౌ తదం .

తతస్తే  న్యాయతః కృత్వా  ప్రవిభాగం  ద్విజోత్తమాః
సుప్రీతమనసః సర్వే  ప్రత్యూచుర్ముదితా  భృశం

ఋత్విజులను  ప్రీతిపరచిన  దశరథమహారాజు , తన దృష్టి , యాగాన్ని  చూడడానికి  వచ్చిన బ్రాహ్మణులవైపు  మరల్చి , వారికి   కోట్ల    సంఖ్యలో   బంగారు  నాణాలను దానంచేసాడు .  ప్రీతితో  రాజు  ఇచ్చిన  ధనాన్ని  స్వీకరించి  ” చాలా  సంతోషించాము  ”  అని  మహారాజుతో  పలికారు  ద్విజోత్తములు .

దరిద్రాయ  ద్విజాయాధ  హస్తాభరణముత్తమం
కస్మైచిద్యాచమానాయ  దదౌ  రాఘవ  నందనః

ఇంతలోనే  కనిపించాడు  దరిద్రంతో  బాధపడుతూ   చేయిజాచిన  ఒక  ద్విజుడు .” శరీర ధారులకు నాపద  వచ్చిన వారి యాపదల్ గ్రన్నన దాల్చి వారికి  సుఖంబు సేయుటకంటె నొండు  మేలున్నదె ” అని అనుకొన్నాడేమో ? వెంటనే   తాను ధరించిన  హస్తాభరణాన్ని  ఆ  బ్రాహ్మణుని  హస్తంలో పెట్టి  నమస్కరించాడు .

ఈ సందర్భంలో   రామాయణ కాలంలోని  బ్రాహ్మణులను  రమణీయంగా  వర్ణించిన  మొల్ల   పద్యం    మీకోసం :

ప్రకటానురాగసంపన్ను  లౌదురుగాని
రమణీయ కార్ముకులు  గారు
శుభపవిత్రోజ్జ్వలసూత్రధారులు  గాని
టక్కరిహాస్యనాటకులు గారు

ఉభయసంధ్యాది విద్యుక్త  ధర్ములు గాని
చర్చింపగా  నిశాచరులు గాదు
తిలకించి చూడ సద్ద్విజులౌదురే  కాని
తలప  భక్షిజాతములు  కారు

బాడబులు కాని యగ్నిరూపములు గారు
పండితులు గాని విజ్ఞులపగిది  గారు
ధీవరులు  గాని  జాతి  నిందితులు గారు
పరమ పావనులాధరణి సురులు .

రామాయణము

ఏవముక్తో   నరపతిర్బ్రాహ్మణై ర్వేదపారగైః
గవాం  శతసహస్రాణి  దశ   తేభ్యో  దదౌ  నృపః
శతకోటీః  సువర్ణస్య  రజతస్య్ చతుర్గుణం

కరులూ , సిరులూ ,  కామాక్షులూ , భూభాగాలూ    మాకవసరం  లేదన్న  మహాత్ముల   వచనాలు విన్న దశరథుడు  వారికి  పదిలక్షల  గోవులనూ , నూరుకోట్ల  బంగారు  నాణాలనూ  , నాలుగువందల  కోట్ల  వెండినాణాలనూ  దక్షిణగా  ఇచ్చాడు .

దశరథునికి  బలి చక్రవర్తి పలికిన పలుకులు స్ఫురించాయేమో ? ”

ఉన్నమాటలెల్ల  నొప్పును  విప్రుండ !  సత్యగతులు  వృధ్ధసమ్మతంబు
అడుగ దలచి కొంచె  మడిగితివో  చెల్ల ! దాతపెంపు సొంపు  దలపవలదె ?

మీరన్నమాటలన్నీ  సత్యాలే . పెద్దలు  మెచ్చేవే . కానీ  అడిగేటప్పుడు  దాత గొప్పతనాన్నీ , సంతోషాన్నీ  కూడా చూడాలిగదా . మీరొద్దన్నా  నేనిస్తున్నాను , పుచ్చుకోండి  అని  ఇచ్చాడు , లక్షల సంఖ్యలో  సిరులు .

ఋత్విజశ్చ  తతః సర్వే  ప్రదదుః  సహితా  వసుః
ఋశ్యశృంగాయ   మునయే  వసిష్ఠాయ  ధీమతి

మహారాజు  మంచి మనసుతో  ఇచ్చిన  సొమ్మును సంతోషంగా  స్వీకరించి ,  ఆ  సొమ్ముతో  తమకవసరం  లేదు  కనుక దానిని  ఋశ్యశృంగున కూ ,  విష్ణు స్వరూపుడైన  వసిష్ఠునకూ  సమర్పించారు ఋత్విజులు .

 

క్రతుం సమాప్య  తు  తదా  న్యాయతః  పురుష్ర్షభః
ఋత్విగ్భ్యో  హి  దదౌ  రాజా తాం  ధరాం  క్రతువర్ధనః

క్రతువు  సమాప్తి  కాగానే   తన  ఏలికలో  ఉన్న భూమినంతా  ఋత్విక్కులకు  ధారాదత్తం  చేసాడు    దశరథుడు .

ఋత్విజస్త్వబ్రువన్  సర్వే  రాజానం  గతకల్మషం
భవానేన  మహీం  కృత్స్నామేకో  రక్షితుమర్హసి .
న భూమ్యా కార్య్మస్మాకం  న హి  శక్తాః స్మ  పాలనే
రతాః  స్వధ్యాయకరణే  వయం  నిత్యం  హి  భూమిప .
నిష్కృఅయం  కించిదేవేహ  ప్రయచ్చతు  భవానితి .

మణిరత్నం సువర్ణం వా  గావో  యద్వా సముద్యతం
తత్ప్రయఛ్ఛ  నరశ్రేష్ట  ధరణ్యా  న  ప్రయోజనం

రాజ్యాన్ని దానం  పట్టిన   ఋత్విజులు  ”  రాజా !  రాజ్యాన్ని  రక్షింపగల శక్తీ  , సమర్థతా  , దక్షతా  కలవాడవు  నీవొక్కడవే . స్వాధ్యాయం   చేస్తూ దేహమాత్రావశిష్టులమై    నారాయణోన్ముఖులమైన    మాకు ఈ రాజ్యమెందుకు , భూభారమెందుకు ?   ఇవ్వాలికనుక ,  ధరకు (భూమి )  బదులుగా కొద్దిపాటి  ధనమిచ్చి  ధారిణిని నీవు  తిరిగిపుచ్చుకో .    కొద్దిపాటి   సువర్ణం ,  ఒక మణి , మాణిక్యం  , లేక   కొన్ని   గోవులు  ,  నీదగ్గర  ఏది  ఉంటే  అది  ఇవ్వు ” అని  విన్నవించుకున్నారు .

ఈ   సందర్భలో ,  కోరిన దానమిస్తాను  కోరుకోవయ్యా అని బలి చక్రవర్తి   వామనునిని  కోరితే :

” ఒంటివాడ  నాకు  నొకటి  రెండడుగులు మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల ,
గోర్కి దీర  బ్రహ్మ కూకటి  ముట్టెద , దానకుతుక  సాంద్ర  దానవేంద్ర ”

గొడుగో  , జన్నిదమో , కమండులువో , నాకున్  ముంజియో ,  దండమో
వడుగేనెక్కడ ? భూములెక్కడ ? కరుల్ ,వామాక్షు ,లశ్వంబు  లె
క్కడ ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితంబైన  మూ
డదుగుల్  మేరయ  త్రోవ కిచ్చుటది  బ్రహ్మాండంబు నా పాలికిన్

” కరులు , కామాక్షులు , నాకెందుకు . ముద్దుగా  మూడడుగుల  చోటిస్తే   అది   నాకు    బ్రహ్మాండమిచ్చినంత  . దానితో  నేను  బ్రహ్మకూకటి  ముడతాను ” అని పలికే  వామనమూర్తి   తలపుకు రాక మానరు .