Monthly Archives: ఏప్రిల్ 2015

రామాయణం

బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాంబ్రాహ్మణానాం మహాభాగ

వేదాధ్యయన శాలినాం  ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శత సంకులాః

దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యా మహే వయం రామస్య వచనం

శ్రుత్వావిశ్వామిత్రో మహామునిః నివేశమ కరోద్దేశే వివిక్తే సలిలాన్వితే


” జనక మహారాజు చేసే యాగాన్ని చూడడానికీ , యాగంలో పాల్గొనడానికీ వచ్చిన వేద పండితులు వేల సంఖ్యలో ఉన్నారు . వచ్చిన ఋషుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు . వచ్చిన వారితో , వారి వాహనాలతో విడిది స్థలమంతా నిండిపోయి ఇరుకుగా కనిపిస్తోంది . మనం విడిది చేయడానికి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించండి మహాత్మా ” అని శ్రీరాముడు , విశ్వామిత్రునితో పలికాడు .
IMG_5019

రామాయణం

పుష్పవృష్టిర్మహత్యాస్సీదేవ దుందుభి నిస్స్వనైః
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమః

సాధు సాద్వితి దేవాస్తా మహల్యాం సమపూజయన్
తపో బల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగాం

గౌతమోసి మహాతేజా అహల్యా సహితః సుఖీ
రామం సంపూజ్య విధివత్తప స్తేపే మహాతపాః
అహల్య శాపవిమోచ్నాన్ని కనులారా తిలకించిన దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు . పుష్పాలు వృష్టిగా కురిపించారు . పోతన భాషలో ” పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలు ఆనందమునన్ గూడిరి సిధ్ధులు — మొరసె వేల్పుల భేరుల్ “.

గౌతమముని అదేశం ప్రకారం తపోధనురాలై , శుధ్ధమైన శరీరాన్ని సంపాదించుకున్న ఆ అహల్యను చూసి ” సాధు , సాధు ( బాగున్నది , బాగున్నది ) ” అని కీర్తించారు దేవతలు . అంతలోనే అక్కడకు వచ్చాడు గౌతముడు .  శ్రీరాముని పూజించాడు . అహల్యను సగౌరవంగా స్వీకరించాడు . శ్రీరాముడు కూడా తపస్సు , తేజస్సు కలిగిన ఆ మునికి ప్రణామం చేసి పూజించాడు . పిదప విశ్వమిత్రునితో కలిసి మిథిలా నగరం వైపు పయన మయ్యాడు .

గౌతముడు అహల్యతో కలిసి తపస్సమాధిలో మునిగి పోయాడు .

తతః ప్రగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్

రామస్తు మునిశార్దూల మువాచ సహ లక్ష్మణః
సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః

విశ్వామిత్రుని వెనువెంట నడుస్తూ ఈశాన్య దిశగా ప్రయాణం చేసారు రామ లక్ష్మణులు . అల్లంత దూరంలో సుందరంగా గోచరించింది మిథిల . మిథిలా నగర సరిహద్దు వద్ద వారికి కనిపించింది జనకుని యజ్ఞ వేదిక . యజ్ఞవేదిక వద్ద యజ్ఞం చేయడానికి కావలసిన వస్తువులు వారికి కనిపించాయి . ” మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారాదులు విశేషంగా , ఉత్తమంగా ఉన్నాయి ” అని కౌశికునితో పలికాడు కౌసల్య కుమారుడు .

DSC09597

రామాయణం

తప్పు చేసిన నాతిని మనిషిగా మార్చి ఆ పుణ్యమూర్తి పాదాలకు నమస్కరించి , మాతృమూర్తి గౌరవాన్ని అందలమెక్కించిన రామచంద్రుడు లోకాలకు ఆదర్శ పురుషుడు . ప్రాతః స్మరణ వందనీయుడు .

స్మరంతీ గౌతమ వచః ప్రతిజగ్రాహ సా చ తౌ
పాదమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితౌ
ప్రతిజగ్రాహ కాకుత్థ్సో విధి దృష్టేన కర్మణా

నమస్కరించిన రామలక్ష్మణులను చూసిన అహల్యకు తన భర్త గౌతముని ఆదేశం జ్ఞాపకం వచ్చింది . వచ్చిన వారికి ఆదర పూర్వకంగా అర్ఘ్య , పాద్య , ఆచమనాదులు సమర్పించింది . అతిథి దేవోభవ అని సూక్తి . కానీ అహల్య ఆశ్రమానికి దేవదేవుడే విచ్చాడు . తన శక్తికి సాధ్యమైన పూజ చేసి చరితార్థులైంది . రామచంద్రుడు ఆ పూజను స్వయంగా స్వీకరించాడు .

అందుచేతనే ఏమో ? అహల్యకు పంచకన్యలలో స్థానం లభించింది .

శ్లోకం : అహల్యా, ద్రౌపది, సీతా,తారా, మండోదరీ తధా పంచకన్యా అని పంచకన్యలను ప్రాతః కాలంలో స్మరిస్తే స్త్రీలు దీర్ఘ సుమంగళులవుతారనీ , పాపాలన్నీ పటాపంచలవుతాయనీ శాస్త్రం .

రామాయణం

విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః
విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమ మథావిశత్

దదర్శ చ మహాభాగాం తపసా ద్యొతిత ప్రభాం
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః

ప్రయత్నాత్ నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ
స తుషారావ్ర్తాం సాభ్రాం పూర్నచంద్ర ప్రభామివ
మధ్యేంభసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ .

విశ్వామిత్రుని మాటలు విన్న శ్రీ రాముడు లక్ష్మణునితో సహా గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు . రాముని దర్శన మాత్రం చేత అహల్యకు శాప విమోచన మయింది .

తపస్సు చేత లభించిన  దివ్యకాంతితో ప్రకాశిస్తూ  వారికి కనిపించింది అహల్య . కాంతితో మెరిసిపోతూ దుర్నిరీక్ష్యంగా ( చూడడానికి శక్యం కాకుండా ) ఉంది . మెరిసిపోతున్న సూర్యుని మనం చూడగలమా ? తపస్సు చేస్తే అటువంటి కాంతి లభిస్తుందని రామాయణం సూచిస్తున్నది . . బ్రహ్మ ప్రయత్నం చేసి మరీ సృజించాడా అని అనిపించే విధంగా మూడు లోకాలలో ఇతరులెవ్వరికీ లేని అందంతో , సముజ్జ్వల సౌందర్య తిలకంగా భాసించింది అహల్య . మనిషేనా లేక మాయా స్వరూపమా అని భ్రాంతి గొలిపేలా ఉంది . మంచు మేఘాలు కప్పిన పున్నమి చంద్రుని కాంతితో , జలమధ్యంలో ప్రతిబింబించే సూర్య కాంతిని పోలిన కాంతితో కనుల పండువగా ఉంది అహల్య .

IMG_5311

సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ హ

త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనం

శాపస్యాంత ముపాగమ్య తేషాం దర్శన మాగతా

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతు స్తదా

గౌతమ మహర్షి శాపం చేత మూడు లోకలఓ ఎవ్వరికీ కనిపించకుండా కాలం గడిపింది అహల్య . భగవంతుని దర్శనం చేత పవిత్రత పొందింది . పుణ్యురాలైంది . శాపం తొలగి పోయింది . అతిలోక సౌందర్యంతో అచట ఉన్న వారందరికీ కనిపించింది ఆ పుణ్యమూర్తి .

రామ లక్ష్మణులు ఆ పవిత్ర మూర్తి పాదాలు స్పృశించి నమస్కారం చేసారు .

నోట్ : ఇది మన సంస్కృతి . తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాక వారికి పూర్వ గౌరవం ఇవ్వడం . వారు చేసిన తప్పులు మరిచిపోవడం . శాపాన్నుండి విముక్తి చేసిన రాముడు అహల్య పాదాలకు నమస్కరించడం రాముని ఔన్నత్యాన్నీ , అహల్య గొప్పతనాన్నీ చాటి చెబుతుంది .స్త్రీలను గౌరవించాలనీ , పెద్దవారైతే పాదాభివందనం చేయాలనీ చెబుతున్నాయి మన గ్రంధాలు .

రామాయణం

అహల్యా శాప విమోచనాన్ని తులసీ దాసు ఏ విధంగా వర్ణించాడు ?

గౌతమ నారి శ్రాప బస , స్పల దేహ ధరి ధీర 

చరన కమల రజ చాహతి , కృపా కరహు రఘుబీర 

పర సత పద పావన సోకన పావన ప్రగట భయీ తపపుంజ సహీ

దేఖత రఘునాయక జన సుఖ దాయక —

అహల్య శాపవశాన శిలగా మారింది . నీ పాద స్పర్శతో పవిత్రురాలౌతుంది .అనుగ్రహించమన్నాడు కౌశికుడు . గురువు మాట జవదాటని రఘురాముడు పాదం ముందుకు మోపాడు. రాముని పదరజం బండరాయిగా ఉన్న అహల్యను తాకింది . శిలా రూపంలో ఉన్న అహల్య సుందరమైన స్త్రీగా మారింది . “పాదరజంతో ఒక రాతిని పడతిగా మార్చాడు ” ఇంకా రాఘవుడు మానవుడనే అనుకుంటున్నారా ? కాదు , కాదు అతడు మాధవుడే , మధుసూదనుడే ” .

అహల్య శాప విమోచనం కాగానే ఎదురుగా కనిపించాడు కరుణ చిందే చూపు చూస్తూ రఘురాముడు .భువనైక మోహనుడు . ఆ సుందర మూర్తిని చూసి సుమనోంజలి ఘటించి అలా చూస్తూ ఉండిపోయింది అహల్య . నోట మాట రాలేదు . కొద్దిగా తేరుకున్నపిదప ప్రభు పాదాలకు ప్రణమిల్లిందట. ” రామా! మీ శ్రీ పాదాలను భక్తితో కడిగి బ్రహ్మ ధన్యుడయ్యాడు .ఆ శ్రీ పాదం నా భాగ్యంకొద్దీ నా తలపై పడింది . నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద కమలాల రసాస్వాదనం చేసేలా నాకు వరమివ్వండి” అని వినయంగా కోరింది “.

ప్రభువు తప్పక కరుణించి ఉంటాడు .

అయితే రామాయణంలో ఈ కథ వేరుగా ఉంది .

IMG_5141

రామాయణం

రాతిని నాతిగా మార్చిన రఘురాముడు :

తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః
తారయైనాం మహాభాగా మహల్యాం దేవరూపిణీం

అహల్య శాప వృత్తాంతాన్ని వివరించి చెప్పిన విశ్వామిత్రుడు ” రఘురామా ! పుణ్యాత్ముడైన గౌతముని ఆశ్రమలోకి ప్రవేశించి అహల్యను శాపాన్నుండి కాపాడు ” అని పలికాడు .

ఈ సందర్భాన్ని మొల్ల అతి రమణీయంగా వర్ణించింది :

ముది తాపసి వెనువెంటను
వదలక చనుదెంచునట్టి రాముని శ్రీ
పదపంకజము సోకి చిత్రం
బొదవగ గనుపట్టె నెదుట నొక ఉపల మటన్

( ఉపల మంటే రాయి . ఉపల మంటే రత్నమని కూడా అర్థం ఉంది . అహల్య రాతి రూపంలో ఉన్న రత్నమని ఒకే పదాన్నుపయోగించి చెప్పిన మొల్ల నిజంగా విదుషీమణి ) .

రాముడు తాపసి వెంట నడుస్తుంటే కాలికి రాయి తగిలింది .

పదనై యొప్పిద మై కడు
గదలుచు బంగారుపూదె కర్గిన రీతిన్
మెదలుచు లావణ్య స్థితి
సుదతిగ జూపట్టి నిలిచె సురుచిర లీలన్

శ్రీ రాముని పాదం సోకగానే ఆ బండ రాయికి బంగారం కరిగి ప్రవహించే రీతిగా కదలిక వచ్చింది ( అంటే ఆ రాయి ప్రకాశంతో మెరిసిపోయింది ) . చూస్తూ ఉండగానే ఆ రాయి ఒక రమ్యమైన రమణీ లలామగా మారింది . కౌశికుడు ” రామా ! చిత్రంగా , నీ పాద ధూళితో రాతిని నాతిగా మార్చావు . నీ నామాన్ని మదిలో తలిచే వారికి భుక్తి , ముక్తి ప్రసాదంగా లభ్యమవుతాయని నమ్మవచ్చు ” అని పలికాడు మొల్ల రామాయణంలో .

అహల్యా శాప విమోచనాన్ని రస రమ్య గీతంగా మార్చిన కవులు కోకొల్లలు . రఘు రాముడు మానవుడు కాదనీ , మహిమాన్వితుడనీ చూపించే సందర్భాలు రామాయణంలో అతి తక్కువ . అహల్యా శాపవిమోచనం రాముని భగవంతునిగా చూపించే కథలలో మొదటిది .

IMG_5481

రామాయణం

అఫలస్తు తతః శక్రో దేవానగ్ని పురోగమాన్
అబ్రవీత్తృస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః
క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతం

అఫలోస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా
శాపమోక్షేణ మహతా తపోస్యాప హృతం మయా

తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః స చారణాః
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ
అయం మేషః సవృణః శక్రోహ్య వృషణః కృతః
మేషస్య వృషణే గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత

IMG_5029

 

 

 

 

 

 

 

గౌతముడిచ్చిన  శాపంతో   మ్లాన   వదనుడైన  ఇంద్రుడు   అగ్నితో  సహా  ఇతర దేవతలతో , ఋషుల తో , చారణులతో  ” గౌతమ మహర్షికి కోపం కలిగించి ఆతని తపస్సు భంగ పరిచాను . దీనివలన దైవకార్యాన్ని సాధించాను ( ఇక్కడ స్పష్టత లేదు . మహర్షి తపస్సు భంగపరిచి ఏ దైవ కార్యాన్ని సాధించాదో తెలియదు ) అతడు నాకు శాపాన్నిచ్చాడు . అహల్యను కూడా శపించాడు . దేవ కార్యాన్ని సాధించిన నాకు నాకు శాప విముక్తి మార్గాన్ని తెలుపండి . ఈ శాపం వలన నేను బాధ పడకుండా చేయండి ” అని పలికాడు .

ఇంద్రుని మాటలు విన్న దేవతలు మరుద్గణాలను వెంటపెట్టుకొని (? ) పితృదేవతల వద్దకు వెళ్ళి ” యజ్ఞంలో మీకు లభించే  భాగాన్ని ఇంద్రుడికి ధారపోసి అతనిని శాప విముక్తుణ్ణి చేయండి ” అని కోరారు .

అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి
భవతాం హర్షణ్ర్థాయ యే చ దాస్యంతి మానవాః

అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవతాః సమాగతాః
ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్

యజ్ఞంలో మీఎకు హవ్య భాగంగా లభించే మేక వృషణాలను ఇంద్రునికి ఇవ్వండి . వృషణాలు లేకున్నా లభించే మేక భాగం మీకు సంతోషాన్ని ఇస్తుంది . మేషాన్ని మీకు సమర్పించే మానవులు తమ ఇష్ట ఫలాలను పొందగలరు . ఆ విధంగా వృషణాలు లేని మేకను సమర్పించిన వారికి కూడా కోరికలు తీరి సంతోషం కలుగుతుంది .

అగ్నేస్తు వచనం శ్రుత్వా పిత్ర్దేవతాః సమాగతాః
ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్

తదా పృభృతి కాకుత్స పితృదేవతాః సమాగతాః
అఫలాన్ భుఙ్జతే మేషాన్ ఫలైస్తేషా మయోజయన్

ఇంద్రస్తు మేషవృషణ స్తదాపృభృతి రాఘవ
గౌతమస్య ప్రభావేణ తపసశ్చ మహాత్మనః

ఆ విధంగా పితృదేవతలు మేష వృషణాలను ఇంద్రునికి ఇచ్చి , వృషణాలు లేని మేష భాగాలను మాత్రమే తాము భుజిస్తున్నారు .ఈ విధంగా గౌతమ మహర్షి తపశ్శక్తి వలన ఇంద్రుడు మేష వృషణుడైనాడు .

నోట్ : మహాత్ములకు అపకారం కలిగిస్తే ఆ పాప ఫలం భీకరంగా ఉంటుంది . ప్రస్తుతం మహిళల పట్ల తప్పులు చేసే వారి సంఖ్య మితి మీరింది .ఉత్తములైన వారికి అపకారం చేస్తే ఏ విధమైన శిక్ష ఇవ్వాలో తెలియజెప్పడం ఈ కథలోని సందేశమేమో ?

IMG_5539

రామాయణం

తత శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్

ఇహ వర్షసహస్రాణి బహూని త్వం వసిష్యసి

వాయుబక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ

అదృశ్యా సర్వభూతానా మాశ్రమేస్మిన్నివత్స్యసి

DSC04271
ఇంద్రుని శపించిన గౌతముడు తన దృష్తిని అహల్యపైకి మరల్చి ” నీవు వేలకొలది సంవత్సరాలు ఇచటనే ఎవరికీ కనిపించకుండా నివసిస్తావు . నిరాహారంగా అంటే ఆహారం స్వీకరించకుండా వాయు భక్షణం మాత్రమే చేస్తూ ఈ ఆశ్రమంలో పడి ఉంటావు ” అని శపించాడు . భవిష్యద్దర్శనం చేయగల ఆ మహా తపస్వి అహల్యకు శాపవిముక్తి ఎపుడు కలుగుతుందో కూడా చెప్పాడు .

సీతారాముల నివాసమైన గుహ
యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః

ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి
తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జితా

మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యశి

ఏవ ముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీం

ఇమమాశ్రమ ముత్సృజ్య సిధ్ధ చారిణ సేవితే 

హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః

dsc04174
“దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుడు ఘోరమైన ఈ వనంలో ప్రవేశించగానే నీవు పవిత్రురాలవు కాగలవు . రామ చంద్రునికి ఆతిథ్యం ఇవ్వగానే నీకు లోభము , మోహము తొలగిపోతాయి . సంతోషం కలుగుతుంది . నీ పూర్వ రూపం నీకు లభిస్తుంది . నా సమీపంలో అంటే నాతో కలిసి జీవితం గడపగలవు ” అని పలికాడు .

ఉజ్జ్వలమైన తేజంతో వెలిగే గౌతమమహర్షి ఇంద్రుణ్ణీ , అహల్యనూ శపించి ఆ అరణ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు . సిధ్ధుల చేత , చారణుల చేత సేవింపబడే హిమ శిఖరానికి వెళ్ళి ఆ తపశ్శాలి తన తపస్సు కొనసాగించాడు .

IMG_5533

రామాయణం

దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనో భవత్
అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః
దుర్వ్రత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్

ఆశ్రమంలో ప్రవేసిస్తున్న గౌతమ మహర్షిని చూడగానే దేవేంద్రుడి ముఖం వివర్ణమయింది . చూడగానే తనకు అపచారం జరిగిందని గ్రహించాడు మహర్షి . తన వేషం ధరించిన ఇంద్రుని , చెడుమార్గంలో వంచించడానికి వచ్చిన ఇంద్రుని చూడగానే కలిగిన ఆవేశంతో కొపోద్రిక్తుడైన గౌతముడు ” దుర్మతీ ! చేయరాని పని చేసినావు . భవిష్యత్తులో ఇటువంటి పని చేయడానికి విఫలుడవు / అర్హతలేనివాడవు అవుతావు ” అని శపించాడు .

గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మనా
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్

మహర్షి నోటి వాక్కులు వృధా కావు గదా ! శాపవాక్యం మహర్షి నోటినుండి రావడమే ఆలశ్యం , ఇంద్రుని వృషణాలు నేలపైకి రాలిపోయాయి .

note : Even today there is a demand for castration for the wrong doers . The sage punished Indra with such a punishment aeons ago .

IMG_5484

రామాయణం

గౌతమం సందదర్శాథ ప్రవిశంతం మహామునిం
దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం

తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం
గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం

IMG_4910

ఇంద్రుడు ఆశ్రమం వదలి బయటకు బయలుదేరుతున్న సమయంలో అప్పుడే స్నానం చేసాడేమో తీర్థోదకంతో తడిసి , అనిలునివలె జ్వలిస్తూ ( దేదీప్యమానంగా ) సమిధలను చేతిలో గ్రహించిన గౌతమమహర్షి ఎదురుగా వచ్చాడు . తపోబలంతో దుర్నిరీక్ష్యుడైన ఆ మహర్షి తన ఆశ్రమంలో ప్రవేశిస్తూ దేవేంద్రునికి కనిపించాడు . అప్రతిహతమైన ఆ మహర్షి శక్తి దేవదానవులెవరికీ ఎదిరించడానికి శక్యం కానటువంటిది .
నోట్ : ప్రభావశాలులైన మహర్షుల విషయంలో తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు . వారికి దివ్య దృష్టి ఎలాగూ ఉంటుంది . అంతకన్నా మిన్నగా దైవం సదా రక్షిస్తూ ఉంటుంది . ధర్మాన్ని రక్షించే ఆ మహాత్ములకు ధర్మమే రక్షగా నిలుస్తుంది . ఎన్నో పురాణ గాధలలొ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది .