రామాయణం

భాగవతం : ” ఇల్లలుకగానే పండుగ కాదన్న” సామెత చందంగా సముద్ర మథనం మొదలయింది కానీ పాలసముద్రంలోనుండి  అమృతం పుట్టలేదు . అందరి గుండెలవిసేలా హాలాహలం పుట్టింది .

ఆలోల జలధిలోపల , నాలో నహి విడిచి సురలు నసురులు బఱువం
గీలా కోలాహలమై , హాలాహల విషము బుట్టె నవనీనాథా !

మథనం చేస్తున్న దేవతలూ , రాక్షసులూ భయపడి , వాసుకిని వదలి పెట్టి పారిపోయారు .ఆ హాలాహలం లక్షసూర్యుల కాంతి కలిగి చూడడానికి కూడా అలవికానటువంటిది . ముక్కంటి కంటిమంట కంటే వంద రెట్లు భయంకరమైనది . ప్రళయ కాలపు రాత్రి  మేఘాల మధ్యలో మెరిసే పిడుగులవలె భయంకరమైనది . అతి త్వరగా ఆ మహావిషం ఆకాశంలోకి ఎగబాకింది . మందర పర్వతాన్ని దాటి సముద్రమంతా వ్యాపించింది . కొండ గుహలలోకి పాకి పోయింది . వెళ్ళిన చోటల్లా బూడిద మాత్రమే మిగిల్చింది .

పెనుమంటల ధాటికి తట్టుకోలేక కొందరు దేవతలు దగ్ధమయ్యారు . రాక్షసులు నేలకూలారు ,కిన్నరులు కనిపించకుండా పోయారు. గంధర్వుల విమానాలు నేలకూలాయి . సిధ్ధుల గుంపులు చెల్లా చెదరై పోయాయి . నదులు ఎండిపోయాయి . అడవులు మాడిపోయాయి . నేల బద్దలయింది . అకాలంలో ప్రళయం వచ్చిందా అని భయ పడ్డారు ప్రజలు .

ఆ విషజ్వాలలనుండి కాపాడే మహానుభావుడు కనిపించలేదు .

ఒడ్డారించి విషంబున , కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రాలన , బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా

బ్రహ్మ అలోచించి దేవతాగ్రజుడైన పరమేశ్వరుని వద్దకు వెళదామని దేవతలతో పలికి , ఆక్షణమే వారితో కలిసి కైలాసానికి కదలి వెళ్ళాడు . ఆ సమయంలో  భక్తవశంకరుడైన ఆ శంకరుడు పార్వతీ మాతతో నిండు పేరోలగంలో (సభలో ) ఉన్నాడు .

బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని ముందు చేతులు జోడించి , పరమేశ్వరునితో

మూడు మూర్తులకు మూడులోకములకు , మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు , దుది నభేదమై యొప్పారు , బ్రహ్మ మనగ నీవు ఫాల నయన .

అని ప్రార్థించారు .

ఆ పరమేష్ఠి , మాతృమూర్తి పార్వతితో ” హరిణాక్షీ ! లోకులకు కలిగిన దుఃఖాన్ని చూసావా ! శక్తి కలిగిన ప్రభువు ప్రజల కష్టాలను రూపుమాపాలి కదా ! ” అని అన్నాడు . భాగవతం రాస్తున్న పోతన కండ్లకు ఈ దృశ్యాలన్నీ కనిపించాయి . పరమేశ్వరుడు చిద్విలాసంగా పరమపావని పార్వతీ మాత వంక అర్ధనిమీలిత నేత్రాలతో , చిలిపిగా ” ఏమిచెయ్యాలి ” అని అడుగుతున్నట్టు చూడడమూ కనిపించింది పోతన కనుదోయికి . కరుణ నిండిన మాతృమూర్తి ముఖారవిందం అందం చిందుతూ కనిపించిది . మ్రింగబోయేవాడు భర్త . మ్రింగేది ” హాలాహలాన్ని ” . అయినా అది అమ్మ హృదయం . తన బిడ్డల కొచ్చిన ఆపదను చూసి చలించిపోయింది . అంతే ! ఇంకేమీ ఆలోచిచలేదు . తన మంగళసూత్రం తనను కాపాడుతుందన్న నమ్మకంతో గరళాన్ని గ్రహించమని పరమశివుని కోరింది . భక్తవశంకరుడైన ఆ శంకరుడు గరళాన్ని గ్రక్కుమని మింగాడు . అంతలోనే జ్ఞాపకం వచ్చింది , తన కుక్షిలోనే లోకాలున్నాయని . గరళాన్ని తన కంఠాన్ని దాటనీయలేదు . గొంతులోనే హాలాహలాన్ని నిక్షిప్తం చేసాడు . దీనివల్ల మెడ కమిలిపోయింది . శంకరుడు గరళకంఠుడైనాడు . లోకానికొచ్చిన ప్రమాదం తప్పిపోయింది .

మ్రింగెడువాడు విభుండని , మ్రింగెడునది గరళమనియు , మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ , మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో

మాతృమూర్తి మంగళగౌరికి మనమీద ఎంతటి దయో !

హాలాహల భక్షణ కథ , హేలాగతి విన్న వ్రాయ నెలమి బఠింపన్ 

వ్యాళానల వృశ్చికముల , పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై

” హాలాహల కథను హేలగా విన్నా , వ్రాసినా చదివినా భయమనేది నశిస్తుంది . విష జంతువులైన సర్ప , వృశ్చిక విషాల వల్లా , అగ్నిజ్వాలల వల్లా బాధ కలుగదు ” అని ఫలశ్రుతిగా భాగవతంలో చెప్పబడ్డది .

IMG_1761

నాగేశ్వరుడు

శుభం

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి