Monthly Archives: ఆగస్ట్ 2013

రామాయణం

 

ఏవముక్తాస్త తస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః 

విశ్వామిత్రం పురస్కృత్య రామం వచన మబ్రువన్

మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి
యజ్ఞః పరమధర్మిష్టస్తస్య యాస్యామహే వయం

త్వం చైవ నరశార్దూలస్సహాస్మా భిర్గమిష్యసి
అద్భుతం ధనురత్నం చ తత్ర తద్దృష్టుమర్హసి

 

విశ్వామిత్రుని  సమీపంలో  ఆశీనులైన  మునులు విశ్వామిత్రుని అనుజ్ఞపొంది ” రామా ! మిథిలా నగరంలో జనకమహారాజు ధర్మ సంయుతమైన యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు . మేమందరమూ ఆ యజ్ఞానికి వెడుతున్నాము . నరశార్దూలా ! మీరు ఆ యజ్ఞానికి మాతో కలిసి దయచేయాలి . జనక మహారాజు ఆస్థానంలో ధనస్సులలో రత్నం లాంటి ఒక ధనస్సు ఉంది . వీరుడవైన నీవు ఆ ధనస్సును చూసి తీరాలి . అది చూడడానికి నీవు అర్హుడవు ” అని పలికారు .

 

అథతాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ
ఊఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా

ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ
విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః

అభివాద్య మునిశ్రేష్టం , జ్వలంతమివపాదుకం
ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ

ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ
ఆజ్ఞాపయ యథేష్టం వై శాశనం కరవామ కిం

 

శ్రీయుతమూర్తులు సఫలంగా తండ్రి ఆజ్ఞను నిర్వర్తించారు . కృతార్థులైనారు . వారి మనస్సులలో ఒక రకమైన ఆనంద డోలిక , నిర్వచించలేని ప్రశాంతత అలముకున్నాయి . ముని యజ్ఞం కాచే దాకా నిద్రలేని వారికి , గాఢనిద్ర ముంచుకు వచ్చింది . నిశీధి సమయంలో నిశ్చింతగా నిదుర పోయారు . చూస్తూండగానే చీకట్లను చీల్చుకుంటూ భానుడుదయించాడు . బాలమయూఖమాలికలు కలకలలాడుతూ జగత్తునాక్రమించాయి . అటువంటి సుప్రభాత సమయంలో నిదురలేచారు రామలక్ష్మణులు . స్నానం చేసి భానుడికి అర్ఘ్యమిచ్చారు . పిదప మందగమనంతో విశ్వామిత్ర మహర్షి సముఖానికి చేరారు . సవినయంగా అభివాదనం చేసారు . అసమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు విశ్వామిత్రుడు . అగ్నివలె జ్వలిస్తున్నాడట . మృదుమధురంగా మాటలాడే స్వభావం వారిది . ” మీ ఆజ్ఞు పాలించడానికి మేము సిధ్ధంగా ఉన్నాము . యధేచ్ఛగా అజ్ఞాపించండి ” అని మందస్మితవదనంతో , మధురంగా ఉదారంగా పలికారు .

 

రామాయణం

శేషాన్  వాయవ్యమాదాయ  నిజఘాన  మహాయశాః
రాఘవః  పరమోదారో  మునీనాం  ముదమావహన్

స హత్వా  రాక్షసాన్  సర్వాన్  యజ్ఞ్యఘ్నాన్రఘునందనః
ఋషిభిః  పూజితస్తత్ర  యథేంద్రో  విజయే పురా

“అవా  యవ్యయా   వాయవ్యా   అపోవాయ   యయావాయవ్యోం — ” అనే   వాయవ్యమంత్రాన్ని  అనుసంధించి  వాయవ్యాస్త్రాన్ని  ఇతర  రాక్షసుల  మీద  ప్రయోగించాడు  రఘురాముడు . ఆ  అస్త్ర ప్రయోగంతో  రాక్షస  సంహారం  విజయవంతంగా  ముగిసింది . యాగాన్ని  కాచిన  రామచంద్రుని   దేవేంద్రుని  పూజించినట్లు  పూజించారట  ఋషులు .

అథ  యజ్ఞే  సమాప్తే  తు విశ్వామిత్రో  మహామునిః
నిరీతికా  దిశో  దృష్ట్వా  కాకుత్సమిదమబ్రవీత్
కృతార్థోస్మి  సత్యం  కృతం  గురువచస్త్వయా
సిధ్ధాశ్రమమిదం  సత్యం  కృతం  రామ  మహాయశః

రాక్షసులు  మరణించారు . యజ్ఞం  నిర్విఘ్నంగా  సమాప్త  మయింది . నలుదిక్కులలోని  ఈతి బాధలన్నీ  తొలగి పోయాయి . విశ్వామిత్ర  మహర్షి  సంతోషంతో ” రామా ! కృతార్థుడనయినాను . తలపెట్టిన  కార్యక్రమం  జయప్రదంగా  ముగిసింది . సిధ్ధాశ్రమమంటే  తలచుకున్న  పని  సిధ్ధింపజేసే  ఆశ్రమమని . నీవు  సిధ్ధాశ్రమం  పేరు  సార్థకం  గావించావు . తండ్రి  ఆజ్ఞను  నిర్వర్తించి     గురువచనాన్ని ( తండ్రి మాటను ) సఫలం చేసావు ” అని సంతోషంతో పలికాడు .

శిష్యుడంటే  శ్రీరాముడే . భయంకరులైన  రాక్షసులను  వధించాడు .సిధ్ధాశ్రమంలో  నివసించే  ఋషుల  భయాన్ని  తొలగించాడు . గర్వం  మాత్రం అతని దరిచేరలేదు . అటువంటి  సమర్థుడూ , ఆజ్ఞపాలించే   శిష్యుడు  లభించిన  విశ్వామిత్రుడు  ధన్యుడు .  గాయత్రీ మంత్ర దృష్ట , సకలాస్త్ర  మంత్రవేత్త , విశ్వామిత్రుని  వంటి  గురువు  లభించడం  రాముని  అదృష్టం . అటువంటి  గురు శిష్యుల  కథ  రాసిన  వాల్మీకి  పూజ్యుడు . ఆ  కథ విని  ఆనందించే  మనం  ధన్యులం .

రామాయణం

పశ్య లక్ష్మణ  శీతేషుం మానవం  ధర్మసంహితం
మోహయిత్వా  నయత్యేనం  న చ ప్రాణైర్వ్యయుజ్యత .
ఇమానపి  వధిష్యామి  నిర్ఘృణాన్ దుష్టచారిణః
రాక్షసాన్  పాపకర్మస్థాన్  యజ్ఞఘ్నాన్  రుధిరాశనాన్

” మానవాస్త్రం  మోహం కలిగించే  చల్లని  బాణం . శత్రువును   యుధ్ధభూమినుంచి  దూరంగా  తీసుకుపోయే స్వభావం  కలది . ప్రాణాలు   తీయదు . మారీచుని ఏ విధంగా తీసుకొని పోతున్నదో  గమనించమని  చెబుతూ , ఇక  దుర్మార్గులూ , జాలి లేని వారూ , యజ్ఞాలకు  విఘ్నాన్ని  కలిగించే  వారూ  అయిన  ఇతర  రాక్షసులను  వధిస్తాను  చూడు  లక్ష్మణా ” అని  అన్నాడు .

సంగృహ్యాస్త్రం  తతో  రామో  దివ్యమాగ్నేయ  మద్భుతం
సుబాహూరసి  చిక్షేప  స విధ్ధః  ప్రాపతద్భువి .

అంటూనే  అద్భుతమైన   ఆగ్నేయాస్త్రాన్ని   అమ్ములపొదిలోనుండి   అందుకున్నాడు .  సుబాహుని  గుండెకు  గురిచూసి  దాన్ని  వదిలాడు ( పావకసర   సుబాహు  పుని మారా , అనుజ  నిశాచర  కటకు సంఘారా  – తులసిదాసు  మాటలలో) . సుబాహుని  రొమ్మునుండి   రుధిరం  బయటకు  చిమ్మింది . శవమైపోయాడు  సుబాహుడు .

రామాయణం

తావాపతంతౌ  సహసా  దృష్ట్వా  రాజీవలోచనః
లక్ష్మణం  త్వభిసంప్రేక్ష్య  రామో  వచనమబ్రవీత్

పశ్య  లక్ష్మణ  దుర్వృత్తాన్  రాక్షసాన్  పిశితాశనాన్
మానవాస్త్ర    సమాధూతాననిలేన  యథా  ఘనాన్

మానవం  పరమోదారమస్త్రం  పరమభాస్వరం
చిక్షేప  పరమ క్రుధ్ధో మారీచోరసి  రాఘవః .

రుధిరంతో  వేదిక ప్రజ్వరిల్లింది . అది రాఘవుడి  కంటపడింది . పరుగుపరుగున  అరుదెంచాడు  వేదికవద్దకు .  కనిపించారు  అకాశంలో  రాక్షసులు . లక్ష్మణుని  వంక  చూచాడు  రాజీవలోచనుడు  . లక్ష్మణా ! ” దుర్మార్గులూ , నరమాంస భక్షకులూ అయిన  ఈ   అసురులను  మానవాస్త్రం  ప్రయోగించి ,  వాయువు  ఏ విధంగా  మేఘాలను  చిందరవందర  చేస్తుందో ,  ఆ    విధంగా   ఎగరగొడతాను ”    చూడమన్నాడు .  అనడమేకాదు , భాస్కరుని  లాగా  వెలుగులు చిమ్ముతూ  ,  శత్రువులను  దూదిపింజలా  ఎగరగొట్టే    మానవాస్త్రాన్ని  సంధించి  మారీచుని   ఉరానికి ( వక్షస్థలం )  గురిచూచి  వదిలాడు .

స  తేన   పరమాస్త్రేణ  మానవేన  సమాహతః
సంపూర్ణం  యోజనశతం  క్షిప్తః  సాగర  సంప్లవే

విచేతనం  విఘూర్ణంతం  శీతేషుబలతాడితం
నిరస్తం  దృశ్య  మారీచం  రామో లక్ష్మణ   మబ్రవీత్

మానవాస్త్రం మహనీయమైన శక్తి కలది . రాముడు  వదలగానే  మారీచుని తాకింది . తాకిన మరుక్షణం  దూదిపింజలా  ఎగిరిపోయాడు . మారీచుణ్ణి  వాయువు   మేఘాలను  ఎగరగొట్టినట్టుగా  ఎగర గొట్టింది . వందయోజనాల  దూరంలో  పొంగిపొరలే  సముద్ర జలాల  మధ్య  పడ్డాడు

రామాయణ  మననంలో  వేయి  శ్లోకాలు  పూర్తి  అయినాయి . విశేషమేమిటంటే  గాయత్రీ  మంత్రంలో  రెండవ  అక్షరమైన ” స ”  రెండవ  అక్షరంగా  , రామాయణంలో ,  రెండవ  వేయి   శ్లోకారంభంలో  ఉంచబడడం .

Details of manavastra :

manavastra is a weapon which does not kill . It is called paramoadaara . udaaram means does not hurt or kill .

మానవాస్త్రం  పరమోదారమైన   అస్త్రమట . ” మానవం  పరమోదారమస్త్రం ”  అని  వాల్మీకి  మహర్షి  వాక్యం . అస్త్రాలన్నీ  చంపడానికి ఉపయోగించేవే . కానీ  మానవాస్త్రం  యొక్క  ఉద్దెశ్యం  అది  కాదు . భూత  , భవిష్యద్ ,వర్తమాన కాలాల  జ్ఞానం కలిగిన  రామచంద్రుడు  మారీచుణ్ని  చంపకుండా  భయభ్రాంతుణ్ణి  చేశాదు . ముందు జరుగ బోయే  రామాయణకథకు మారీచుని  అవసరం  ఎంతైనా ఉంది మరి . ” శీతేషు ”  అంటే  చలువ  కలిగించేదని  అర్థం . ఈ  బాణం శత్రువును   బాధించదు  . వానిలో  భయాన్ని  నింపుతుంది . రాముడు లక్ష్మణునితో  ” ఈ అస్త్రం శత్రువులకు  మోహం  మాత్రమే  కలిగిస్తుంది . ప్రాణాలు  తీయలేదు ” అని చెప్పాడు . ప్రతి  చిన్న  విషయాన్నీ  అతి  నిశితంగా  పరిశీలించి  రాయడం  వాల్మీకి  మహర్షికి అలవాటు . ఇక రాముడంటారా ! ముందు చూపుతో ఏ పని  ఏవిధంగా  చేయాలో  తెలిసిన  విజ్ఞుడు .