Monthly Archives: మే 2012

రామాయణం

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమం
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరం

అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుఙ్గవ
కథం వాగసహస్రస్య ధారయత్య బలాబలం

అప్రమేయ ప్రభావం కలిగిన విశ్వామిత్రుడు పలికిన మాటలు ఆలకించి   శ్రీరామచంద్రుడు ” మహర్షీ ! యక్షులు అల్పవీర్యులని అంటారు కదా . ఈ అబలకు (తాటకకు ) వేయి ఏనుగుల బలం రావడానికి కారణమేమిటి ? ” అని కౌశికుని ప్రశ్నించాడు .

శ్రీరామచంద్రుని గుణాలలో ముఖ్యమైనది ” క్యూరియాసిటీ .” ప్రశ్నించకుండా వదిలిపెట్టడు . జీవితంలో అభివృధ్ధి పొందాలనే కోరికగలిగిన యువకులందరూ అలవరచుకోవలసిన ముఖ్య లక్షణం ” విజ్ఞులను ప్రశ్నలడిగి తమ జ్ఞానాన్ని పెంపొందిచుకోవడం “.

తాటక  సంహారానికి  నాందీ  వాక్యం  పలికాడు  కౌశికుడు . తాటకను  అవలీలగా కూల్చాడు శిష్యుడు శ్రీరాముడు . ఈ  ఘట్టాన్ని  అతిరమణీయమైన  అంత్యప్రాసలతో మనకందించాడు కైవల్య పదాన్ని కోరుకున్న  పోతన్న . పోతన్న  పద్యం వీనులకు విందు . మరిదుగో   విందుపదార్థాన్ని   మీ   విస్తరిలో  వడ్డిస్తున్నాను , ఆస్వాదించండి .

సవరక్షార్థము తండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడ రా
నవలీలం దునుమాడె రాండదయుండై బాలుడై కుంతల
చ్ఛవిసంపజ్జిత హాటకం గపటభాషవిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకన్ దాటకన్

” బాలుడైన   రాముడు తండ్రిగారి  ఆజ్ఞ ప్రకారం  తపసి  యాగాన్ని  కాపాడడానికి   కౌశికుని  అనుసరించి  వెళ్ళి — బంగారు  రంగుజుట్టూ , కపటపు మాటలూ , గుఱ్ఱం వంటి వడిగల పరుగూ , చేతిలో  డాలూ కల తాటకను సంహరించాడు ” అని ఈ పద్యం భావం .

రామాయణం

దుర్గమారణ్యం .

వృత్తబాహుర్మహావీర్యో    విపులాస్యతనుర్మహాన్
రాక్షసో  భైరవాకారో   నిత్యం  త్రాసయతే  ప్రజాః

ఇమౌ జనపదౌ  నిత్యం వినాశయతి  రాఘవ
మలదాంశ్చ  కరూశాంశ్చ  తాతకా  దుష్టచారిణీ

సేయం  పంథానమావృత్య  వసత్యధ్ధ్య ర్థయోజనే
అత  ఏవ  న గంతవ్యం   తాటకాయా  వనం  యతః

మారీచుడు  మహాబలుడు . బలిసిన  బాహువులు , విశాలమైన  వదనము ,  పెద్ద  శరీరాకృతి  . చూడడానికి  భయంకరంగా  ఉండే  మారీచుని  వృత్తి   ప్రజలను ప్రతినిత్యం   బాధించడం .  తాటక  సంగతి   వేరే  చెప్పాలా ! అదే   పనిగా  మలద ,  కరూర   దేశాలను   నాశనం  చేయడం . ఈ  ప్రదేశానికి   ఒకటిన్నర   ఆమడల  దూరంలో తాటక నివాసం .  ఈ    తాటకా   వనంలోకి    ఎవ్వరూ   ప్రవేశించలేరు .

స్వబాహుబల  మాశ్రిత్వ  జహీమాం  దుష్టచారిణీం
మన్నియోగాదిమం   దేశం  కురు  నిష్కంటకం  పునః

న వా   కశ్చిదిమం  దేశం శక్నోత్యాగంతుమీదృశం
యక్షిణ్యా  ఘోరయా   రామ  ఉత్సాదితమసహ్యయా

ఏతత్తే   సర్వమాఖ్యాతం  యథైతద్దారుణం   వనం
యక్ష్యా  చోత్సాదితం  సర్వమద్యాపి  న  నివర్తతే

” రామా !  నీ బాహుబలం చేత  ఈ   యక్షిణిని  వధించు . ఈ  పనికి   నేను  నిన్ను    నియోగిస్తున్నాను . ఈ  దేశాలను  నిష్కంటకంగా  చేయి . తాటక   చేత  వనమంతా  పాడుపడిపోయింది . ఎంతటి    వీరునికైనా   తాటక  నెదిరించి    ఈ   ప్రదేశానికి    రావడానికి    తగిన    సామర్థ్యం    లేదు .  నాకు  తెలిసిన  విషయాన్ని   నీకు    వివరించాను”  అని  కౌశికుడు  , శ్రీరాముణ్ణి  , తాటకను   వధించమని  కోరాడు .

ఇరువది  నాల్గవ  సర్గ  ఇక్కడితో  సమాప్తమవుతుంది .

విశ్వామిత్రుడు  రాముని  అరణ్యానికి  తీసుకొని  వచ్చిన  కారణం  రాక్షస  సంహారం .  సజ్జనులు  స్వేచ్ఛగా  జీవించడానికి  అనువైన  వాతావరణాన్ని  కల్పించడం .  రాజధర్మం  అదే  కదా .
కష్టాలకోర్చి   తాపసి  వెంట  అరణ్యానికి  అరుదెంచిన  రామచంద్రునికి  జేజేలు .  రాబోయే  అధ్యాయంలో తాటక   కథను  ఇంకొంత  వివరంగా  వినిపిస్తాడు  విశ్వామిత్రుడు .

కస్య   చిత్త్వథ   కాలస్య  యక్షీ  కామరూపిణీ
కులం  నాగసహస్రస్య   ధారయంతీ  తదాహ్యభూత్
తాటకా  నామ  భద్రం  తే  భార్యా సుందస్య  ధీమతః
మారీచో  రాక్షసః  పుత్రో  యస్యాః  శక్రపరాక్రమః

ఇంత  సమృధ్ధమైన  దేశం  భయంకరంగా  మారడానికి  కారణం  ఒక  యక్షిణి .  పేరు  తాటక . రాబోయే  శ్లోకాలలో  తాటకి  కథను  శ్రీ  రామచంద్రునికి  సవివరంగా  తెలుపుతాడు  కౌశికుడు .

“రామా ! ఇది  ఇలా  ఉండగా  ఈ  ప్రదేశానికి  దగ్గరగా  మందుడనే  యక్షునికి  భార్యగా  అవతరించింది .  వేయి ఏనుగుల  బలం   ఆ   యక్షిణికి .  ఇంద్రుని తో   సమానమైన   పరాక్రమం  కల  మారీచుడనేవాదు  ,  తాటకకు  కుమారుడు .  రామా !  నీకు  భద్రమగుగాక ” .

తాటక ,  మారీచుల  సమాచారాన్ని  తెలియజేస్తున్న  విశ్వామిత్రుని  నోటి  నుంది ” నీకు  భద్రమగు  గాక ”  అనే  పదాలు  వెడలడం   ,  ఆ   యక్షులు   ఎంత  భయంకరులో  ,  బలం  కలిగినవారో  సూచిస్తుంది  . రామచంద్రుని   అపాయానికి   గురిచేస్తున్నానేమో  అనే  శంక  కూడా    విశ్వామిత్రునిలో   కనిపిస్తుంది  . వీరుడూ  , శస్త్రాస్త్ర  కోవిదుడూ , చూపులతోనే  శత్రునాశనం  చేయకలిగిన శక్తి  కలవాడూ   అయిన  విశ్వామిత్రుడు  కూడా  రాముడు  క్షేమమంగా   ఉండాలనీ ,  రామునికి  అపాయం  కలగకూడదనీ  కోరుకుంటున్నాడు . తల్లిదండ్రులు  తమ  బిడ్డల  క్షేమం  ఎలా  కోరుకుంటారో , అదే విధంగా  రామలక్ష్మణుల  క్షేమాన్ని  కోరుతున్నాడు   .  రామచంద్రుడు   భగవంతుడనీ  , అరివీర  భయంకరుడనీ , ఓటమి  ఆతని  దరిచేరదనీ   తెలిసి  కూడా  ,   “భద్రమస్తు ” అని అన్నాడు . దీనికి కారణం  “అతి ప్రేమ ” .  అతి ప్రేమ  పాప శంకి  కదా . ఒక పిల్లవాడు  సమయానికి  ఇల్లు  చేరకుంటే  ” పిల్లవాడికి  ఏదైనా  అపాయం  కలిగిందేమో  ” అని   తలిదండ్రులు  పడే  అవేదనలాంటిదిది .
వాల్మీకి   రచనలో  అడుగడుగునా  తన   పాత్రల   మనసులో  కదిలే  భావనలను  పాఠకులకు  తెలియజేస్తాడు .   ప్రతి  చిన్న  విషయాన్నీ అతి   నిశితంగా  పరిశీలించడం  మనకు  కనిపిస్తుంది . సూక్ష్మ  దృష్టితో  మనుషుల  స్వభావాలను   గమనించి  , ఆ  స్వభావాలను   అతి   సున్నితంగా  రచనలో   జొప్పించడం  వాల్మీకికి  వెన్నతో  పెట్టిన  విద్య .  అందుకే  ఆది  గ్రంథానికి   సాటిరాగల   గ్రంథాలు  అరుదు . అసలు  లేవేమో  కూడా .

 

రామాయణం

నిర్మలో  నిష్కరూషశ్చ   శుచిరింద్రో  యదా  భవత్
దదౌ  దేశస్య  సుప్రీతౌ  వరం  ప్రభురనుత్తమం

ఇమౌ   జనపదౌ   స్ఫీతౌ  ఖ్యాతిం  లోకే  గమిష్యతః
మలదాశ్చ  కరూరాశాశ్చ  మమాఙ్గమలధారిణౌ
సాధు  సాధ్వితి  తం  దేవాః  పాకశాసనమబ్రువన్
దేశస్య  పూజాం  తాం  దృష్ట్వా  కృతాం  శక్రేణ  ధీమతాః

ఏతౌ  జనపదౌ  స్ఫీతౌ  దీర్ఘకాలమరిందమ
మలదాశ్చ  కరూశాశ్చ   ముదితౌ  ధనధాన్యతః

 

అశుచిత్వం పోయి , ఆకలి  తీరిన  ఇంద్రునికి  సంతోషం కలిగింది . ఆ  దేశాలు  మలదము  ,కరూరము  అనే పేర్లతో  సర్వ  సమృధ్ధంగా  వర్ధిల్లుతాయని  ప్రసిధ్ధి  చెందుతాయని  పలికాడు  ( వరమిచ్చాడు )  .

ఇంద్రుడు  ఆ  దేశాలకు  చేసిన  గౌరవాన్ని   గమనించిన  దేవతలు “సాధు , సాధు ” ( బాగు  ,బాగు )  అని  దేవేంద్రుని  మెచ్చుకున్నారు . రామా !  విశాలమైన   మంద , కరూర  దేశాలు , ఇంద్రుని  వరం  చేత  ఎల్లప్పుడూ   ధనధాన్యాలతో   తులతూగుతూ  ఉండేవి .

రామాయణం

ఏతౌ  జనపదౌ  స్ఫీతౌ  పూర్వమాస్తాం  నరోత్తమ
మలదాశ్చ    కరూశాశ్చ  దేవనిర్నాణ   నిర్మితౌ
పురా వృతవధే  రామ  మలేన  సమభిప్లుతం
క్షుధా   చైవ  సహస్రాక్షం  బ్రహ్మహత్యా  సమావిశత్

నరులలో  ఉత్తముడవైన  శ్రీరామా  !   ఒకానొక కాలంలో  ,  ఈ   ప్రదేశంలో మందము , కరూశము అనబడే   రెండు   జనపదాలు  ఉండేవి .  దేవతలచే  నిర్మిపబడ్డ  ఈ  దేశాలు  విశాలంగా ,  సర్వ  సమృధ్ధంగా  విలసిల్లుతూ  వర్ధిల్లాయి .
ఇది ఇలా ఉండగా   దేవతలకు  రాజైన   ఇంద్రుడు  వృత్రాసురుడనే     బ్రహ్మరాక్షసుని    వధించాడు . ఆ  కారణంగా  బ్రహ్మహత్యాపాతకం  అతనికి  అంటుకుంది .  దాని  ఫలితంగా   అశుచిత్వం , ఆకలి   ఇంద్రుణ్ణి  పీడించసాగాయి .

తమింద్రం  స్నాపయన్  దేవా   ఋషయశ్చ  తపోధనాః
కలశైః    స్నాపయామాసుర్మలం   చాస్య    ప్రమోచయన్
ఇహ  భూమ్యాం  మలం  దత్వా  దత్వా  కారూశమేవ  చ
శరీరజం    మహేంద్రస్య     తతో    హర్షం    ప్రపేదిరే

ఇంద్రుని  కంటిన  మలాన్ని (అశుచిత్వాన్ని)   తొలగించడానికి     దేవతలు .   తపోధనులైన    ఋషులు ,  మంత్రాలతో  శుధ్ధిచేయబడ్డ  జలాన్ని ,  కలశాలలో  నింపి  స్నానం  చేయించారు . ఇంద్రుడు  శుచియైనాడు . మలమేమో  కరూశదేశానికి   అంటింది . పవిత్ర ఉదకాలతో  స్నానం  చేసినందున  శుచి  అవడంతో  బాటు  ఆకలి  కూడా  తీరింది .

కథ  అలా  ఉంచితే  ,  దోషం  చేసినప్పుడు   అశుచిత్వం  కలుగుతుందనీ  ,  పవిత్రమైన    జలంతో  , పావనమైన    మంత్రాలతో   స్వచ్ఛత  పొందవచ్చనీ   ఈ   శ్లోకాల    ద్వారా    చెప్పబడింది . జలాలతో    శరీరం   స్వచ్ఛమవుతుంది  కానీ  మనస్సు  స్వచ్చమవుతుందా  అని  నాకో  సందేహం . మనస్సు స్వచ్ఛంగా  ఉండాలంటే  మనకు  తప్పు  అనిపించిన  పనులు  చేయకూడదు .  ఒక వేళ  మనసు  అపవిత్రమైతే  , దానిని  తిరిగి  స్వచ్ఛంగా  చేయడం  అంత  సులభం  కాదని  నా  భావన .  Prevention  is definitely better than cure .

Photo from :  http://www.harekrsna.com/philosophy/associates/demons/indra/visvarupa.htm


రామాయణం

దుర్గమమైన అరణ్యంలో అందమైన కలువల కొలను

తమువాచ  మహాతేజా  విశ్వామిత్రో  మహామునిః
శ్రూయతాం   వత్స  కాకుత్స   యస్యైతద్దారుణం  వనం

శిష్యుదు  అడిగాడు –  సర్వజ్ఞుడైన  విశ్వామిత్రుణ్ణి-    అడవి   ఎందుకింత    భయంకరంగా  ఉన్నదని   .  ఈ  వనమెవ్వరిదో ,  ఈ  విధంగా   భయంకరంగా  తయారవ్వడానికి కారణమేమో   చెబుతాను  వినమన్నాడు  మహాతేజశ్శాలి  విశ్వామిత్రుడు .

అడిగినదే   తడవుగా   సందేహాలను   తీర్చే    గురువు   దొరకడం    అదృష్టం .

రామాయణం

ఘోరారణ్యంలో   గజరాజ  వరదుడు

స  వనం   ఘోరసంకాశం  దృష్ట్వా  నృపవరాత్మజః
అవిప్రహతమైక్ష్వాకః   పప్రచ్ఛ  మునిపుంగవం

నదీమతల్లులను   దాటి   ఒడ్డుకు  చేరిన  రామలక్ష్మణుల  ముందు  ఒక   మహారణ్యం  కనిపించింది .   సహజంగానే  కుతూహలం  కదా  రామచంద్రునికి .  అలవాటుకొద్దీ  అడిగాడు .

అహో  వనమిదం  దుర్గం  ఝల్లికాగణనాదితం
భైరవైః  శ్వాపదైః  పూర్ణం  శకునైర్దారుణారుతైః

మహాత్మా ! శబ్దంచేసే  ఝల్లీ  పురుగుల  శబ్దంతో , భయంకరంగా  అరిచే   శకుంత  పక్షులకూతలతో   ,  భయంకరాలైన  మృగాలతో    ఉన్నది   ఈ  అరణ్యం .

నానా ప్రకారై  శకునైర్వాశ్యద్భిఃర్భైరవస్వనైః
సిమ్హవ్యాఘ్రవరాహశ్చైవ వారణైశ్చోప శోభితం
ధవాశ్వకర్ణకకుభైర్బిల్వ  తిందుక  పాటలైః
సంకీర్ణం  బదరీభిశ్చ   కిం  న్వేతద్దారుణం  వనం

అతి   భయంకరాలైన  స్వరాలతో   పక్షులు  ,  వ్యాఘ్రాలు (పెద్దపులులు )  ,   వారణాలు (ఏనుగులు )  ,   సింహాలు , అడవి  పందులు ,  సంచరిస్తున్నాయీ  ప్రదేశంలో .  మద్ది చెట్లు  ,   మారేడు  చెట్లు   ,   చండ్ర  చెట్లు ,   తుమ్మ  చెట్లు ,   రేగు చెట్లతో   ,   దారి  కనిపించకుండా  దట్టంగా  ఉన్నది  ఈ అరణ్యం .  ఈ   మహారణ్యం   పుట్టుపూర్వోత్తరాలేమిటి  , దీనికి ఏదైనా చరిత్ర  ఉన్నదా ? అని  మహర్షి  విశ్వామిత్రుని  ప్రశ్నించాడు .

అరణ్యాన్ని  వర్ణిస్తూ  పోతన  ఒక  అందమైన  పద్యాన్ని ” గజేంద్రమోక్షం ” లో  రాసాడు  .  అది   మీకోసం ఇక్కడ   పొందుపరుస్తున్నాను .

భిల్లీ  భిల్ల  లులాయక , భల్లుక  ఫణి ఖడ్గ  గవయ , వలిముఖ ,చమరీ
ఝిల్లీ  హరి  శరభక  కిటి  , మల్లాద్భుత , కాక  ఘాక  మయమగునడవిన్

 

నది – దాని పక్కనే రమణీయమైన అరణ్యం

రామాయణం

కైలాస  పర్వతే రామ  మనసా  నిర్మితం  సరః
బ్రహ్మణా   నరశార్దూల   తేనేదం  మానసం   సరః

తస్మాత్సత్రావ     సరసః     సాయోధ్యాముపగూహతే
సరః పృవృత్తా     సరయూః    పుణ్యా    బ్రహ్మసరశ్చ్యుతా

తస్యామతులః  శబ్దో జాహ్నవీ  మభివర్తతే
వారిసంక్షోభజో   రామ   ప్రణామం  నియతః  కురు .

కైలాస  పర్వత  భాగాన  ,   ఒక  సరస్సు  నిర్మించాలని  సంకల్పించాడు  బ్రహ్మ . ఆ  సంకల్ప   ఫలితంగా   అక్కడ   ఒక సరస్సు  రూపు దిద్దుకొంది .   మనస్సంకల్పం   చేత  నిర్మించబడింది   కనుక  దానిని   ”  మానస  సరోవర ”  మని  అన్నారు  . ఆ  సరస్సునుండి  జనించిన  నది   “సరయూ  నది .”  అయోధ్యా  నగరాన్ని  చుట్టుముట్టి    ప్రవహిస్తున్నది  ఈ  సరయూ  నదే .   బ్రహ్మ  మానస   సంకల్పంగా  అవతరించిన    మానస  సరోవరాన్నుండి   పుట్టింది  , కనుక  ఈ  నది  పవిత్రమైనది . పుణ్యప్రదమైనది .

సరయూ నది   , గంగా  నదిలో  ప్రవేశించే   సంగమస్థానమిది .  రెండు  నదీ  జలాల  కలయిక వల్ల  ఏర్పడిన   జలసంక్షోభం  వల్ల  జనించిన  శబ్దమిది . పరమ   పవిత్రాలైన   ఈ జాహ్నవీ , సరయూ  నదులకు  ప్రణామం  చేయమన్నాడు   కౌశికుడు .

తాభ్యాం    తావుభౌ    కృత్వా    ప్రణామ   మతిధార్మికౌ
తీరం  దక్షిణమాసాద్య  జగ్మతుర్లఘు   విక్రమౌ

విశ్వామిత్రుని   ఆజ్ఞ    ప్రకారం  నదీమ   తల్లులకు  నమస్కారం   చేసారు   అన్నదమ్ములు  . పిదప   శ్రీఘ్రంగా   ప్రయాణించి  గంగామ   తల్లి    దక్షిణ  తీరాన్ని   చేరారు  పరమ  ధార్మికులైన    రఘువంశ   ప్రదీపకులు .

” మానస   సంచలరే ,  బ్రహ్మణి  మానస   సంచలరే  ”  బ్రహ్మను  తెలిపే  మధురమైన  ఆలోచనలలో  చరించమన్నాడు  త్యాగయ్య  .  సుందరమైన    సరోవరాన్ని  మనసులో   ఊహించుకొని  ,  ఆ   రూపానికి  ఆకృతి   ఇచ్చి   మానస సరోవరంగా  మలిచాడు  బ్రహ్మయ్య .

మానస  సరోవరం

రామాయణం

తతః  శుశ్రావ  వై  శబ్దమతి  సంరంభ   వర్ధితం
మధ్యమాగమ్య  తోయస్య  సహ  రామః  కనీయసా
అథ  రామః   సరిన్మధ్యే  ప్రపఛ్చ  మునిపుంగవం
వారిణో  భిద్యమానస్య  కిమయం  తుములో  ధ్వనిః

నావలో  పయనించి  నది  మధ్యకు  చేరుకున్నారు  నరశ్రేష్ఠులు ( రామ , లక్ష్మణ , విశ్వామిత్రులు ) . అంతలోనే  వారికి  వినిపించింది , జలజలా  జాలువారుతూ ,  గలగలమని  పెద్ద  శబ్దం  చేస్తూ  ,  వేగంతో  ప్రయాణిస్తున్న  నీటి  శబ్దం . సహజంగానే  కుతూహలం  రామచంద్రునికి ?  సందేహాలు  తీర్చడానికి   పక్కనే  సర్వజ్ఞుడైన  కౌశికుడు . ” మహాత్మా !    గంగమ్మనే    చీలుస్తున్నట్లున్న    ఈ    శబ్దానికి   కారణమేమిటి .  నీటిలోనే  ఇంకో  నీటి  ప్రవాహమా? ”  అని విస్మయంతో  ,  వినయంతో , వినమ్రుడై  విశ్వామిత్రుని  ప్రశ్నించాడు .

రాఘవస్య  వచః  శ్రుత్వా  కౌతూహలసమన్వితః
కథయామాస  ధర్మాత్మా  తస్య  శబ్దస్య  నిశ్చయం

కౌతూహలంతో  కూడిన  రాఘవుని  ప్రశ్న  విశ్వామిత్రునికి  ముచ్చట  కలిగించింది  .  ఉద్యుక్తుడయ్యాడు  ఆ  శబ్ద కారణాన్ని  వివరించడానికి .

“చిన్న పిల్లలు  సహజంగానే  కుతూహలపరులు .   ఇది  ఏమిటి ?  ఇది  ఎందుకు ? అని  తల్లిదండ్రులను  ప్రశ్నించి  సమాధానాన్ని  తెలుసుకోవడానికి   ప్రయత్నించని   కుర్రవాడుంటాడా ?  ఆ  ప్రశ్నలకు  సమాధానాలు  తెలియక , తెలిసినా  చెప్పే  ఓపిక లేక  ఆ పిల్లలను  విదిలించే  తల్లిదండ్రులూ  కోకొల్లలు .  ఆ  విధంగానే  పిల్లలను  విదలించుకునే  గురువుల  సంఖ్య  కూడా   తక్కువేమీ  కాదు .  రామాయణం  ఈ  విధానాన్ని  నిరశిస్తుంది .  పిల్లలడిగితే   ప్రేమగా  సమాధానమివ్వడం   పెద్దల  కర్తవ్యం .  తమకు  తెలియక  పోతే  , తెలిసుకోవడానికి  ప్రయత్నించి  , సరియైన  సమాధానం  చెప్పాలి . అప్పుడే  విద్య  వర్ధిల్లుతుంది  . చిన్నపిల్లలకు  విద్యా బుధ్ధులు  నేర్పించడానికి   అత్యంత   ప్రాధాన్యత  ఇచ్చేవారు  మన పూర్వీకులు . ఉదాత్తమైన ఆలోచనలూ ,  ఉత్తమమైన  ప్రవర్తనా   విద్య  ద్వారా  మాత్రమే  సాధ్యమని ,  అసలు  విద్యకు  అర్థమూ , గమ్యమూ  అదేనని  ఎరిగినవారు  మన  పెద్దలు . వారి  అడుగుజాడలలో  నడవడం  మనకు  మేలు  చేకూరుస్తుంది . మనసులో జనించే  ప్రశ్నలకు  సమాధానాన్ని  పొందడం  విద్యలో  ఒక  భాగం . దీనివల్ల  అమూల్యమైన    జ్ఞానం  మన  సొంతమవుతుంది ” .

చిన్న  పిల్లల  మనస్తత్వాన్ని , శిష్యులకు  విషయాన్ని  ప్రేమతో  బోధించాలనుకునే  గురువుల స్వభావాన్ని ,  ప్రతిబింబింపజేసే  చాతుర్యం  వాల్మీకి  మహర్షికి  వెన్నతో పెట్టిన  విద్య .  వెతకాలేగాని     రామాయణంలో   ఇటువంటి    రమణీయమైన  రత్నాలు  కోకొల్లలుగా  కనిపిస్తాయి .
మనకూ  కలుగుతాయి  ఎన్నో  సందేహాలు .  కానీ  కనిపించరు  , సందేహాలకు  సరియైన   సమాధానమిచ్చే  సమర్థులు .తమకు  తెలియక  పోయినా  ,  అవాస్తవాలనూ , అసత్యాలను  బోధించడానికి  పూనుకునే  పెద్ద  మనుష్యులనూ ,  కపట  స్వాములనూ  ఎంతోమందిని  చూసి , ప్రపంచంలో  నిజమైన  విజ్ఞానధనులు   అసలు  ఉన్నారా   అని  మనకు  సందేహం  కలగడం  కద్దు .   

రామాయణం

తతః  ప్రభాతే  విమలే  కృతాహ్నికమరిందమౌ
విశ్వామిత్రం  పురస్కృత్య  నద్యాస్తీరముపాగతౌ

తే చ సర్వే  మహాత్మానో  మునయః  సంశితవృతాః
ఉపస్థాప్య శుభాం  నావం  విశ్వామిత్రమథాబ్రువన్

ఆరోహతు   భవాన్నావం  రాజపుత్రపురస్కృతః
అరిష్ఠం  గచ్ఛ  సంథానం  మా  భూత్కాల   విపర్యయః

విశ్వామిత్రస్తథేత్యుక్తా   తానృషీనభిపూజ్య  చ
తతార  సహితస్తాభ్యాం   సరితం  సాగరం  గమాం

ఆశ్రమంలో   సుఖంగా  రాత్రి  గడిచింది . ప్రభాత  సమయాన  నిదురలేచి  కాలకృత్యాలు  తీర్చుకొని ,  గంగా   నదీ  తీరాన్ని  చేరారు  గురు  శిష్యులు .  ఆశ్రమవాసులైన  ఋషులు  ఒక చక్కటి   పడవను  తెచ్చి , ” మహర్షీ ,  రామలక్ష్మణ  సహితంగా  , మీరు  ఈ  నావనధిరోహించండి .   కాలాతీతం  కాకుండా      గంగా  నదిని  దాటడంలో   ఈ  నావ మీకు  సహాయపడుతుంది ” ,  అని  వినమ్రంగా   విన్నవించారు .  అలాగే  అని చెప్పి ,  ఆ  ఋషులను  తగినవిధంగా  పూజించి  ,  సాగరం  వైపు   ప్రవహించే   గంగా  నది  మీద ,  పడవ  ప్రయాణం  మొదలుపెట్టారు  మహానుభావులు   .

భవసాగరాన్ని  దాటించే  రామచంద్రుడు ,  సాగరాన్ని  చేరడానికి  ఉత్సాహంతో  పరుగులు  తీస్తున్న  గంగమ్మను  దాటడానికి  ఒక  చిన్న  నావనెక్కాడు . తాము  ఇచ్చిన  పడవను  రామలక్ష్మణులుపయోగించినందున  సంతోషంతో  తలమునకలయ్యారు  తాపసులు .