Monthly Archives: మే 2014

రామాయణం

తమువాచ తతో గఙ్గా సర్వదేవ పురోహితం
అశక్తా ధారణే దేవ తవ తేజస్సముద్ధతం
దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా
అథాబ్రవీదిదం గఙ్గాం సర్వదేవ హుతాశనః
ఇహ హైమవతే పాదే గర్భోయం సంనివేశ్యతాం

పరమేశ్వర తేజంతో గంగామాత అవయవాలు నిండిపోయాయి . మహిమాన్వితమూ , శక్తి  స్వరూపమూ  అయిన పరమేశ్వరుని  తేజస్సును  గంగామాత భరించ లేక పోయింది .. ” హుతాశనా ! ఈ తేజాన్ని ధరించడం నా శక్తికి మించినది . నేను అసమర్థురాలను . ఈ తేజస్సు నన్ను దహించి వేస్తున్నది . మిక్కిలి క్షోభ కలుగుతున్నది ” అని ఆక్రోశించింది గంగ . జాలిపడిన అగ్ని దేవుడు ” భాస్వరం లాగ వెలుగుతున్న  గంగా గర్భాన్ని హిమవత్పర్వతం మీద వదల” మన్నాడు .

రామాయణం

దేవతానాం ప్రతిజ్ఞాయ గఙ్గామభ్యేత్య పావకః
గర్భం ధారయ వై దేవి దేవతానామిదం ప్రియం
తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్
దృష్ట్వా తన్మహిమానం స సమంతాదవకీర్యత
సమంతస్తతో దేవీమభ్యషిఞ్చత పావకః
సర్వస్తోత్రాంసి పూర్ణాని గఞ్గాయా రఘునందన

దేవతలతో “అలాగే ! మీరు చెప్పిన విధంగా చేస్తాను ” అని పలికి గంగ దగ్గరకు వెళ్ళి ” దేవీ ! గర్భాన్ని ధరించవలసింది . ఇది దేవతలకు ప్రియమైన కార్యము ” అని కోరాడు . అగ్ని మాట విన్న గంగ దివ్యమైన రూపాన్ని ధరించింది . రఘునందనా ! గంగామాత  దివ్యమైన రూపాన్ని  చూసి విస్మయుడైన అగ్ని తన దేహాన్ని మాత  దేహంపై   వ్యాపింపజేసి , తనలో నిక్షిప్తమై ఉన్న పరమేశ్వరుని వీర్యాన్ని గంగా మాత  అవయాలలో  ప్రవేశపెట్టాడు .

IMG_0270

రామాయణం

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన
ప్రణిపత్య సురాః సర్వే పితామహమపూజయన్

తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమణ్దితం
అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవతాః

దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన
శైలపుత్ర్యాం మహాతేజో గఙ్గాయాం తేజ ఉత్సృజ

 

ఈశ్వర తేజాన్నుండి గంగా మాత గర్భం ఫలిస్తే శైలరాణ్ణందనకు కూడా అభ్యంతరముండదు ( ఈ విధంగా మీ కోరిక తీరుతుంది , మాతృమూర్తికీ కోపం రాదు ) అని పలికాడు పితామహుడు . బ్రహ్మ వాక్కు విన్న దేవతలు కృతార్థు లయినారు . భక్తితో బ్రహ్మకు ప్రణమిల్లారు , పూజలు చేసారు . పిదప కైలాస పర్వతానికి ప్రయాణమయ్యారు . కైలాస పర్వత ప్రాంగణంలో ” ఇది దేవకార్యం . నీలో నిక్షిప్తమైన నీలకంఠుని తేజాన్ని గంగా మాతలో ప్రవేశపెట్ట” మని అగ్నిని ఆజ్ఞాపించారు .

రామాయణం

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః

సాంత్వ యన్మధురైర్వాక్యై స్త్రిదశానిదమబ్రవీత్

 

శైలపుత్ర్యా యదుక్తం తన్న ప్రజాస్యథ పత్నిషు

తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్నసంశయః

దేవతలు పలికిన పలుకులు ఆలకించిన పితాహమహుడు ” పార్వతీ మాత శాప ప్రకారం మీరు అనపత్యు లవుతారు ( సంతానం కలుగదు ) . మాతృ వచనం సత్యమవుతుంది , సంశయించవలసిన పని లేదు . కానీ

ఇయమాకాశగా గఙ్గా యస్యాం పుత్రం హుతాశనః

జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం

 

జ్యేష్ఠా శైలేంద్రతనయా మానయిష్యతి తత్సుతం

ఉమయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః

ఆకాశంలో ప్రవహించే గంగా దేవి యందు దేవతలకు సేనానాయకుడై శత్రువులను సమూలంగా నాశనం చేయగల కుమారుణ్ణి పుట్టిస్తాడు , అనే ఉపశమన వాక్యాన్ని పలికాడు .

 

పరమేశ్వర తేజం అగ్నిలో నిక్షిప్తమయి ఉందని ముప్పది ఆరవ అధ్యాయంలో చెప్పబడింది . ఆ తేజమే గంగా గర్భంలో అగ్నిదేవుని ద్వారా ప్రవేశ పెట్టబడుతుంది .

 

 

 

 

 

రామాయణం

తప్యమానే తపో దేవే దేవాః సర్షిగణాః పురా
సేనాపతిమభీప్సంతః పితామహముపాగమన్
తతోబ్రువన్ సురాః సర్వే భగవంతం పితామహం
ప్రణిపత్య సురాః సర్వే సేంద్రాః సాగ్నిపురోగమాః
యో నః సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా

యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా 

సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమా గతిః

 

కుమార స్వామి జననాన్ని ఈ అధ్యాయంలో మరికొంత వివరంగా తెలుపుతారు వాల్మీకి మహర్షి .

పుణ్యులు పార్వతీ పరమేశ్వరులు హిమాలయపర్వతం పైన తపస్సు చేయడానికి వెళ్ళారు కదా . ఈ సమయంలో తమకు సేనానాయకుడు కావాలని పరమేష్ఠి ( బ్రహ్మ ) దగ్గరకు ముకుళిత హస్తాలతో వెళ్ళారు దేవతలు , ఋషులు . అందరికన్నా ముందు అగ్ని దేవుని నిలబెట్టారు . పరమేష్ఠికి ప్రణామం చేసారు . ” ప్రభూ ! పరమేశ్వరుడు తపస్సులో మునిగిపోయాడు .( లోకాలకు సేనాపతి భారాన్ని వహించి రక్షించే దెవరు ? ) . కరుణించి మాకు శరణోపాయం చూపించవలసింది . ” త్వమేవ శరణం మమ ” మాకిక దిక్కు నీవే , అని వినయపూర్వకంగా ప్రార్థించారు .

రామాయణం

తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్త్వా సురాన్ సురపతిస్తదా
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం

స గత్వా తప అతిష్టత్పార్శ్వే తస్యోత్తరే గిరేః
హిమవత్ప్రభవే శృఙ్గే దేవ్యా సహ మహేశ్వరః

ఏష తే విస్తరే రామ శైలపుత్ర్యా నివేదితః
గఙ్గాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః

 

శైలరాణ్ణందన  శాపాన్ని పొందిన సురలందరూ సిగ్గుతో తలవంచుకున్నారు . వీరందరినీ చూసి , పరమేశ్వరుడు పశ్చిమ దిక్కుగా ( వరుణుడు పాలించే  దిక్కు) ప్రయాణం చేసాడు . హిమవత్పర్వతం మీద పశ్చిమంగా ఉన్న పర్వతం మీద పార్వతీ సమేతంగా తపస్సు చేయడానికి ఉపక్రమించాడు  పరమేశ్వరుడు . ” ఇది పరమ పవిత్రమైన పార్వతీమాత కథ . ఇక గఙ్గాదేవి ప్రభావాన్ని చెబుతాను , శ్రధ్ధగా విన మన్నాడు ” మహర్షి విశ్వామిత్రుడు .

 

రామాయణం

అద్యపృభృతి యుష్మాకమప్రజాః సంతు పత్నయః
ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి
అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి
న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృతా
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ

 

మీకు సంతానం కలుగదని శాపమిచ్చాక కూడా మాతృమూర్తి కోపం చల్లార లేదు . ఈశ్వర తేజస్సును భూమి ధరించింది కదా , అందుకని భూమాతను కూడా శపించింది . ” అవనీ ! నీవు అనేక రూపాలు ధరించి , అనేకులకు భార్యవవుతావు . నాకు కుమారుడు జనించడం ఇష్టపడని కారనంగా , నీవు పుత్రానందాన్ని పొందలేవు ” .

పుత్ర సంతానం మీద మాతలకుగల మక్కువ , ఏ కారణం చేతనైనా పొందలేక పోతే మాతలు పొందే దుః ఖమూ , ఆ దుఃఖం కోపంగా మారి  దానికి కారణభూతులైన వారిని కష్టాల పాలు చేయాలనే కోరికా ఈ కథలో మనకు వివరించాడు వాల్మీకి . మాతృదేవో భవ .

రామాయణం

అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా
పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః
అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్
సమన్యురశపత్సర్వాన్ క్రోధసంరక్త లోచనా
యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా
అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ

 

కోరిక తీరిన దేవతలకు , మునులకు ఆనందం కలిగింది . కుమారస్వామి జననం మరీ సంతోషం కలిగించింది . దేవతలూ , మహర్షులూ ప్రీతి చెందిన మనస్సుతో శంకరుని , శాంభవిని పూజించారు .

కానీ లోకుల కోరికలు తీర్చే కామేశ్వరికి కోపం కలిగింది .” పుత్ర సంతానం కోసం మేము చేస్తున్న సంభోగానికి అడ్డు తగిలారు కనుక మీకు మీ భార్యలయందు సంతానం కలుగదు” అని దేవతలను శపించింది .

 

కవికుల గురువు కాళిదాసు కుమార జనాన్ని అత్యద్భుతంగా “కుమారసంభవ ” కావ్యంలో వర్ణించాడు . ఆ గ్రంధంలోని ప్రప్రథమ శ్లోకం ఇదిగో మీ కోసం .

 

అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధి రాజః
పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మాన దణ్డః

 

రామాయణం

ఏవముక్తాః సురాస్సర్వే ప్రత్యూచుర్య వృషభధ్వజం
యత్తేజః క్షుభితం హ్యేతత్తధ్ధరా ధారయిష్యతి
ఏవముక్తః సురపతిః ప్రముమోచమహీతలే
తేజసా పృథివీ యేన వ్యప్తా స గిరికాననాః

తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశననం
ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః

తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః
దివ్యం శరవణం చైవ పావకాదిత్య సంనిభం

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోగ్ని సంభవః  

కదలిపోయిన శంకరుని తేజస్సును భూదేవి ధరిస్తుందని ఈశ్వరునికి తెలిపారు దేవతలు . మహేశ్వరుడు తన తేజస్సును భూమి మీద వదిలాడు . దేవతలు అగ్నిని వాయుదేవునితో కూడి ఆ తేజస్సులో ప్రవేశించమన్నారు . ( ఒకే చోట ఉంటే ఆ తేజస్సును భూమి భరించలేదనేమో ? ) అగ్ని వాయువుల సహాయంతో శక్తివంతమైన ఆ రేతస్సు కొండలమీదా , కోనలలో , కానలలో వ్యాపించింది . ఒక శ్వేత పర్వతంగా మారింది . ఆ శ్వేత పర్వతం మీద శరవణం మొలిచింది . ( శరవణమంటే రెల్లు గడ్డి . శరమంటే బాణం . బాణం లాగా వాడియైన కొన కలిగిన గడ్డి కనుక రెల్లు గడ్డిని శరవణమని అంటారు ). ఈ శరవణంలో జన్మించాడు కుమార స్వామి . అగ్ని కారణంగా పుట్టిన అమిత తేజశ్శాలి కుమార స్వామి . పుట్టగానే కుమార స్వామికి పాలిచ్చి పెంచాయి కృత్తికలు . అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం(గంగ), నక్షత్రశక్తి (షట్‌ కృత్తికలు) ధరించి చివ రకు బ్రహ్మ తపస్సు చేత నిర్మితమైన శరవణం (రెల్లుతుప్ప) లోంచి ఉద్భవిం చినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు . కృత్తిక ఒక నక్షత్ర రాశి అనీ , అది అగ్ని నక్షత్రమనీ మనకు తెలిసిన విషయమే . కృత్తికలు పెంచాయి కనుక కుమారస్వామికి కార్తికేయుడనే పేరు సార్థక మయింది . 

 

కృత్తికా నక్షత్రాలు :

అశ్విన్యాది నక్షత్రములలో మూడవది కృత్తిక . ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అందురు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు . The krittika cluster is known as Pleiades .