Monthly Archives: జనవరి 2015

రామాయణం

తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః
గఙ్గా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుధ్ధో యజ్వా తు రాఘవ
అ పిబచ్చ జలం సర్వం గఙ్గాయాం పరమాద్భుతం

అంతా సుఖమయమవుతోంది అని అనుకుంటున్న సమయంలో ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నది మార్గాన జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది . ఆశ్రమంలోని యజ్ఞవాటాన్ని పావన గంగా జలాలు ముంచెత్తాయి . జహ్ను మహర్షి మహాత్ముడు . తన ఆశ్రమం తన ముందే గంగానదిలో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు . గంగ గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు . హుంకరించి నోరు తెరిచాడు . అంతే ! ప్రవహిస్తున్న ఆ గంగా జలం అద్భుతంగా మహాత్ముని ఉదరంలోకి వెళ్ళి పోయింది . భగీరథుని ప్రయత్నం మొదటికి వచ్చింది .

తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సుచిస్మితాః
పూజయంతి మహాత్మానం జహ్నుం పురుష సత్తమం
గఙ్గాం చాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః
తతస్తుష్టో మహాతేజాః శ్రోత్రాభ్యా మసృజత్పునః
తస్మాజ్జహ్నుసుతా గఙ్గా ప్రోచ్యతే జాహ్నవీతి చ

అయితే ఆ అద్భుతాన్ని చూసిన ఋషులు , దేవతలు , గంధర్వులు గంగా నదిని వదలివేయమని జహ్ను మహర్షిని ప్రార్థించారు . గంగను కుమార్తెగా భావించమని మహర్షిని కోరారు . మహాతేజస్సుతో మెరిసిపోతున్న మహాత్ముడు జహ్ను మహర్షి , గంగా నదిని తన చెవుల నుండి బయటకు వదిలాడు . ఆ విధంగా భగీరథునికి మరొక ఆపద తొలగిపోయింది . గంగానది “జాహ్నవి ” అయింది . ” జహ్ను సుత ” అనే సార్థక నామధేయం కూడా గంగా నది స్వంతమయింది .

DSC04542

జహ్ను మహర్షి గంగా పానం చేసిన స్థలం ” బీహార్ రాష్ట్రంలోని సుల్తా న్ గంజ్ ” వద్ద ఉంది . ఈ ప్రదేశంలో గంగా నది మధ్యన ఒక రాతి ప్రదేశం ఉంది . దానిని “జహ్ను గిర ” లేక “జహ్ను కొండ ” అని పిలుస్తారు .

రామాయణం

భగీరథోపి రాజర్షిదివ్యం స్యందనమాస్థితః
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం పృష్టతో న్వగాత్

దేవాః సర్షిగణాః సర్వే దైత్య దానవ రాక్షసాః
గంధర్వ యక్ష ప్రవరాః సకిన్నరమహోరగాః

సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగాం
గఙ్గామన్వగమన్ ంప్రీతాః సర్వే జలచరాశ్చ యే

యతో భగీరథో రాజా తతో గఙ్గా యశస్వినీ
జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాప ప్రణాశినీ

భగీరథుడు దివ్యమైన  రథాన్నెక్కి బయలు దేరాడు . అతనిననుసరించింది శివజటాజుటాన్నుండి జాలువారిన గంగమ్మ . జలాలతోబాటు జలచరాలు అమ్మవడిలో ఈదులాడుతూ కదిలాయి . పావనమైన గంగతో బాటు ఋషులు , దేవతలు , యక్ష ,కిన్నర , కింపురుషులూ , అప్సరసలూ ప్రయాణం చేసారు . సాగరం వైపు భగీరథుడు ప్రయాణిస్తుంటే యశస్వినీ , జలాలలో పుణ్యప్రదమైనదీ , సర్వపాప వినాశినీ అయిన గంగ ఒయ్యారంగా ఆ మహర్షిని అనుసరించి వెళ్ళింది . ఉత్సాహంతో ఉరవడిగా , ఉరుకులు పరుగులతో సాగిపోయింది గంగ .
ఆలోచన :

గజేంద్రమోక్షంలో శ్రీహరిననుసరించి లక్ష్మి , శంఖ ,చక్రాది అయుధాలు , గరుత్మంతుడు వెళ్ళే సందర్భం స్మరణకు రావడం లేదూ .
భాగవతంలోని ఆ పద్యం :
తనవెంటన్ సిరి , లచ్చివెంట నవరోధవ్రాతమున్ , దాని వెన్
కను బక్షీంద్రుడు వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును , నారదుండు , ధ్వజినీ కాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాల గోపాలమున్

పుణ్యుల వెంట ప్రయాణించడం మనకు అనాదిగా వస్తున్న సంస్కృతి . మహాత్ముల బాటలో ప్రయాణం చేసేవారికి పుణ్యాలను లభిస్తాయి . సన్మార్గం అవగతమౌతుంది .

DSC04469

రామాయణం

తత్ర దేవర్షి గంధర్వా వసుధాతల వాసినః
భవాఙ్గ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః
శాపాత్ప్రపతితా యే గగనద్వసుధాతలం
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గత కల్మషాః
ధూతపాపాః పునస్తేవ తోయేనథ సుఖాస్వతా
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే

సహజంగానే  పావనమైనది గంగమ్మ . పరమేశ్వరుని జటల స్పర్శ చేత ఇంకా పునీతమైంది . పవిత్రమైన ఆ జలాల స్పర్శ వలన తమ పాపాలు పోతాయని తెలిసిన దేవతలు , ఋషులు , గంధర్వులు , వసుధా (భూదేవి ) తలంపై నివసించే వారు ఆ గంగోదకాన్ని స్పృశించారు . శాపవశం చేత స్వర్గం నుండి వసుధపై పడ్డ వారు పవిత్ర ఉదకాలలో స్నానం చేసి తమ పాపాలనుండి విముక్తులైనారు . గంగా నదిలో మునిగిన శాపగ్రస్తులు పాప ప్రక్షాళనం కాగానే  ఆకాశంలో తిరిగి ప్రవేశించి తమ తమ లోకాలకు చేరుకున్నారట .

ముముచే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా
కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః

లోకంలోని ప్రజలు స్వచ్ఛమైన గంగోదకాలను దర్శించి ఆనందంతో పొంగిపోయారు . ఆ జలాలలో మునిగి తమ శ్రమ తీర్చుకున్నారు .

ఆలోచన : గంగా నదీ జలాలలో ” మైక్రోఫాంజెస్ ” అనే ఒక రక మైన వైరస్ ఉంటుందట . ఈ వైరస్ హానికరాలైన సూక్ష్మజీవులను మట్టుబెట్టి మనకు అరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతోంది . కలరా , మలేరియా  లాంటి వంటి వ్యాధులు గంగా నదీ స్నానంతో కుదురుతాయని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం . అందుకే గంగ నీళ్ళు ఎంతకాలమైనా నిలువ వుంటాయి . ఈ లక్షణం ప్రపంచంలో ఏ నదీ జలాలకూ లేదు . చాలాకాలం నీళ్ళు నిలవ వుంటాయని ఆంగ్లేయులు ఇంగ్లండ్ దేశానికి వెళ్ళే పడవలలో నింపుకొని వెళ్ళేవారట . ఈ మైక్రోఫాంజెస్ సంఖ్య ఈ మధ్యన తక్కువవుతోందని వినికిడి . గంగా నదీ జలాలను స్వచ్ఛంగా ఉంచుకోవలసిన బాధ్యత మనమీద ఉంది .

Ref : 1.http://www.outlookindia.com/article/The-Water-Purifier-Comes-BuiltIn/277357

For those scientifically inclined a number of papers published on this subject are available .

IMG_0241

రామాయణం

పాణ్డరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా
శారదాభ్రైరివాకీర్ణం గగనం హంస సంప్లవైః
క్వచిద్ద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతం
వినతం క్వచిదుధ్ధూతం క్వచిద్యాతి శనైః శనైః

గంగా ప్రవాహంతో బాటు ఆకాశం నుండి మొసళ్ళు , మీనాలు (చేపలు ) , ఉరగాలు ( పాములు ) భూమిపై పడ్డాయి . తెల్లని నీటి నురగ , ఆకాశంలో శరత్కాల మేఘం లా కనిపించింది . ఇంకా చెప్పాలంటే ధవళ వర్ణంతో ప్రయాణించే రాజ హంసలతో ఆకాశమంతా నిండిపోయిందా అన్న భ్రాంతికల్గించేలా గంగా తరంగాలు శివుని జటల నుండి నేలపై  జాలువారాయి . చక్కటి తెలుపుతో అంత స్వచ్ఛంగా ఉన్నాయా జలాలు .
ఒకచోట తొందరగా , మరొక చోట మెల్లిగా , ఒక చోట తిన్నగా , మరొక చోట వంకరగా గంగా నదీ ప్రవాహం సాగి పోయింది . పల్లంగా ఉన్న చోట క్రిందకు జారుతూ , ఎత్తుగా ఉన్న చోట పైకి ప్రవహిస్తూ చూపరులకు అద్భుతంగా కనిపించింది ఆ మాతృమూర్తి .

సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః
ముహురూర్ధ్వ ముఖం గత్వా పపాత వసుధా తలం
తచ్ఛఙ్కర శిరోభ్రష్టం భూమితలే పునః
వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషం

శంకరుని శిరస్సు నుండి భూమిపై పడే ఆ  జలం  కింద పడుతూ ధారలుగా భూమిపై పడింది . ధారలు  ఇతర  ధారలతో ఢీకొని  తుంపరలు నింగికెగసాయి . నింగిపైకెగసిన ఆ తుంపరలు అంతలోనే భూమ్యాకర్షణ శక్తికి లొంగి పోయి భూమిపై పడ్డాయి . అలా కిందకు జారిపడిన గంగా ఝరులు స్వచ్ఛంగా , కల్మషం లేకుండా , నిర్మలంగా కనిపించాయి .

ఆలోచన : స్వచ్ఛమైన గంగమ్మను కూడా తమ పాపాలతో పాడు చేసారు , పుణ్య స్నానం ఆచరించే నెపంతో మునిగే భక్తులు . తమ పాపాలనే కాకుండా అశుధ్ధమైన అన్ని పదార్థాలనూ అమ్మ వడిలోకి చేరుస్తున్నారు . నిజంగా ఇది గర్హనీయం . గంగా నదిని శుధ్ధం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వేరుగా చెప్పవలసిన పని లేదనుకుంటా .

IMG_1922

త్రివేణీ సంగమం (అలహాబాద్ ) వద్ద మలిన పదార్థాలను తనలో కలుపుకొని సాగిపోతున్న గంగమ్మ .

రామాయణం

గంగావతరణాన్ని అత్యద్భుతంగా వర్ణించిన వారిలో ఉత్పల సత్యనారాయణాచార్యులవారొకరు . వారేవిధంగా వర్ణించారో గమనించండి :

శివుడప్పుడు ఎదురుగ జగ

జెట్టి వోలె నిలుచుండెను

మెడను జాచి జడల బార్చి

మింటివంక కనుచుండెను

ఆకాశము నుండి భువికి

ఉరుములతో మెరపులతో

ఉరవడించి తరలివచ్చె’ 

సురగంగ గరువమ్ము విరువంగ నెంచి 

సంకీర్ణ పటు జటాచ్ఛటలనుప్పొంగించి

దుర్గమ్ముగా మలచినాడు

గంగ నద్భుతముగా బంధించినాడు

(ఉత్పల, చందమామ- ‘గంగావతరణము’- 1960)

మహా వేగంతో శివుడి జటాజూటంలో ఇరుక్కుపోయి సుళ్ళు తిరగడం మొదలుపెట్టింది గంగ.

జడయను అడవిని వడివడి అడుగిడి 

జాడ ఎరుంగనిదై

తడబడి నడచుచు

గడగడ వడకుచు

సుడివడి పోయినదై

ఒక పరి అటు చని

ఒక పరి ఇటు చని 

మొగమే చెల్లనిదై

ఎన్ని సంవత్సరాలైనా కిందపడలేకపోయింది

భగీరథుడు గంగ కనిపించక  మళ్ళీ తపస్సు చేశాడు. శివుడు సంతోషించి గంగను విడిచిపెట్టాడు.

సి . నారాయణ రెడ్డి గారి సీతాకళ్యాణం సినిమాలోని పాటను కూడా ఒకపరి పరికించండి  :

ఉరికింది ఉరికింది గంగ

ఉన్ముక్త మానస  విహం

జలజలా పారుతూ

గలగలా సాగుతూ

చెంగుమని దూకుతూ

చెలరేగి ఆడుతూ

తుళ్ళుతూ తూలుతూ

నిక్కుతూ నీల్గుతూ

ముంచివేసెను

జహ్నుముని ఆశ్రమమును

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు . విన్నప్పుడెల్లా నిత్య నూతనంగా , వయ్యారంగా సాగుతూ భక్తజనుల పాలిటి కల్పతరువైన ఆ లోకపావని గంగ మనకు ముక్తి ప్రసాదిస్తుందని గాఢంగా నమ్మి , ఇక వాల్మీకి రామాయణ కథను అస్వాదించడానికి ముందుకు సాగిపోదాం .

రామాయణం : గంగావతరణం

భగీరథుని కోరిక తీర్చడం కోసం విష్ణుపాదం వదలిన సురగంగ పరమేశ్వరుని జటాజూటంలో చిక్కుకుంది . అటు పిమ్మట పరమేశ్వరుని జటల నుండి క్రిందకు దూకి భూమి మీదకు ఉరికింది . పావనమైన గంగా ప్రవాహాన్ని వర్ణిస్తున్నాడు అపర శివ భక్తుడు పోతన . విష్ణు పదాల నుండి పుట్టిన ఆ పవిత్ర జలాలలో మునిగి పవిత్రులై  శ్రీహరిలో ఐక్యమైనవారు కొందరైతే , ఆ గంగా ప్రవాహాన్ని మనసులో ఊహిస్తూ పుణ్యులైనవారు మరికొందరు . పోతన వ్రాసిన ఈ గంగా వర్ణనం మిమ్ములను ఆనంద పరవశులను చేయడమే కాకుండా అడగకుండానే పవిత్రులను చేస్తుంది . పుణ్యం సంపాదించి పెడుతుంది . మీరు చేయాల్సిందంతా ఒక సారి ఆ వర్ణను చదవడం మాత్రమే . ఇది అనంత పుణ్యప్రదం . ఆలస్య మెందుకు ఇక చదవడం మొదలు పెట్టండి .

ఇట్లమ్మహానది , పురారాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబడి , నిరర్గళ ప్రవాహంబై , నేలకు జల్లించి నెఱసి , నిండి , పెల్లువెల్లిగొని , పెచ్చు పెరిగి , విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపు గామధేనువు చందంబున ముందఱికి నిగుడుచు , ముద్దు జందురుతోడి నెయ్యంబున గ్రయ్యనదరి చొప్పుదప్పక సాగి చనుదెంచు సుధార్ణవంబు కైవడి బెంపుకలిగి , మహేశ్వరు వదన గహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్ద బ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబున నమ్మహీపాల తిలకంబు తెరువువెంట నంటివచ్చుచు వెలియేనుగు తొండంబుల ననుకరించి ప`రచు వఱద మొగంబులును , వఱద మొగంబుల పిఱుంద నందండ క్రందుకొని , పొడచూపి , తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గల సంగదంబునం బారిజాత కుసుమస్తబకంబుల చెలువంబునుం దెఘదు వెలినురువులును , వెలినురువుల చెంగట నర్ధోన్మీలిత కర్పూర తరు కిసలయంబుల గేలిగొను సుళ్ళును ,సుళ్ళ కెలంకుల దహవళ జలధర రేఖాకారంబులు బాగు మెచ్చని నిడుదయేఱులును , నేఱులం గలసి వాయువశంబుల నొండొంతిం దాకి బిట్టు మిట్టించి , మీద కెగయు దురిత భంగంబులును , భంగంబుల కొనల భిన్న భిన్నంబులై కుప్పించి , యుప్పరం బెగసి ;

అర్థం :
విష్ణు పాదాల స్పర్శ చేత పవిత్రమైన గంగా జలాలను తన శిరస్సున ధరించాడు పరమ శివుడు . శివుని జటాజూటంలో చిక్కుకొని బయటకు రాలేక ఉండిపోయింది గంగమ్మ . భగీరథుని మీది దయతో తన జటలను విదలించాడు , కారుణ్య మూర్తి . అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి . ఆ రంధ్రాలలోనుండి బయటపడింది పావన గంగ . శివ జటాజూటం నుండి బయల్వెడలిన గంగ నిరర్గళ ప్రవాహంగా రూపందుకొంది . అతిశయంతో — వయసులో ఉన్న కామధేనువు తన కోడెదూడ వెనుక పరిగెత్తినట్టు ముందరికి ప్రవహించింది . ముద్దులొలికే నిండుచందమామ మీద ప్రేమతో ఉప్పొంగే సముద్రుని లాగా పొంగిపోతూ ,మహేశ్వరుని వదన కమలాన్నుండి వెలువడే ఓంకార శబ్దంలా విలాసంగా , విభ్రమంగా , ఐరావత గజ తొండంతో సమానమైన ప్రవాహపు ముందరి భాగంతో ( గంగా ప్రవాహం ఏనుగు తొండంలా ఊగుతూ , మొదటి భాగం సన్నగా , వెనుక భాగం వెడల్పుగా ఉన్నదట ) భగీరథుని అనుసరించింది . గంగా నదిలోని నీటి బుడగలు బాలశారద కుచకుంభాలకన్నా పెద్దవిగా ఉన్నాయి . నీటిబుడగల వలన నురుగు ఏర్పడింది . ఆ నురుగు పారిజాత సుమదళాల కాంతిని మించిపోయింది . ఆ నురగ పక్కనే అర్ధ ఉన్మీలిత (సగం విరిసిన ) కర్పూర చెట్టు చిగుళ్ళ అందాన్ని పరిహాసం చేయగల సుడులనూ , ఆ సుడి పక్కనే తెల్లని మేఘాలను మించిన నీటి ప్రవాహాన్నీ ,గాలి తాకిడికి ఆ ప్రవాహంలో ( ఉత్తుంగ తరంగాలనూ ) వెలసిన పాపాలను పరిమార్చే అలలనూ , ఆ అలలనుండి ముత్యాలసరాలనూ , మల్లెపూల మాలలనూ , కర్పూర ఖండాలనూ , చంద్ర శకలాలనూ , నక్షత్రాల గుంపులనూ పోలి , ముక్తికన్యను వశం చేసుకోగలిగిన నీటితుంపరలను కలిగి , మధ్యమ లోకానికి ( భూలోకం ) శ్రీకరమైంది ఆ గంగా ప్రవాహం .