Monthly Archives: ఫిబ్రవరి 2015

రామాయణం

ఉచ్చైశ్శ్రవం తరువాత ఐరావత మనే ఏనుగు ఆవిర్భవించింది . నాలుగు దంతాల ఐరావతం వెండికొండవలె వెలుగుతూ కనిపించింది .

తడలేని వడపు గల యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడగై యువతుల మురిపపు ,నడకలకున్ మూలగురువనన్ గజ మొప్పెన్

పెద్ద కుంభ స్థలం , పొడవైన తొండమూ , అందమైన నడకా ఆ గజరాజు స్వంతం . యువతులు ఈ గజపు నడకలు చూసి కులుకుతూ నడవడం నేర్చుకున్నారట . అందుకే ఇది తరుణులకు నడక నేర్పిన మూలగురువు .

ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై , యింద్రు విరులతోట కేపుదెచ్చి
కోరి వచ్చువారి కోర్కుల నీనెదు , వేల్పూమ్రాను బాలవెల్లి పుట్టె 

అటుపిమ్మట పాలకడలి నుండి కదలి వచ్చింది కల్పవృక్షం . ఋతువులతో సంబంధం లేకుండా విరబూచే పూలతో ఒప్పారింది కల్పవృక్షం . ఆశ్రయిస్తే కోరికలు తీర్చే వృక్షం కల్పవృక్షం .ఐరావతాన్ని , కల్పవృక్షాన్ని ఇంద్రుడు గ్రహించాడు .

తరువాత అరుదెంచాడు రాకా సుధాకరుడు . అతడు పాలవెల్లినుండి బయటకు రాగానే ( జంధ్యాల వారి మాటలలో )

పూచె వనలక్ష్మి ; పిండారబోసినట్లు
పండువెన్నెల జగమెల్ల నిండిపోయె

చంద్రుని ఆగమనంతో లోకాలన్నీ పరవశించి పోయాయి . అందరి మనసులలో ఒక రకమయిన హాయి నిండిపోయింది .  బ్రహ్మ అనుమతితో తన స్వస్థానానికి వెళ్ళి అక్కడ ప్రకాశించాడు . లోకాలకు ముదం చేకూర్చాడు .

రామాయణం

ఉచ్చైః శ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం
ఉదతిష్ఠన్నరశ్రేష్ఠ   తధైవామృత  ముత్తమం
అప్సరసలు , ధన్వంతరి , వారుణి సముద్ర మథనంలో లభించాయి . అటు పిమ్మట ఉచ్చైశ్రవస మనే గుఱ్ఱము , కౌస్తుభమనబడే మణి , అన్నిటికంటే ముఖ్యమైన అమృతం క్షీర సముద్రాన్నుండి లభించాయి .

భాగవతం :

రామాయణంలో క్షీరసాగర సముద్ర చరిత్ర క్లుప్తంగా వర్ణించారు . వివరణ కావాలంటే భాగవతం చదవాలి .రామాయణంలో కామధేనువు , ఐరావతం , కల్పవృక్షం , చందమామ ఇంకా చెప్పాలంటే , క్షీరసాగర కన్య లక్ష్మీ దేవి ప్రసక్తే లేదు .

భాగవతంలో పోతన వ్రాసిన పద్యాలు చదివితే మది పులకించిపోతుంది . వాటిలో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావిస్తాను .

తెల్లని మేనును నమృతము , జిల్లున జల్లించు పొదుగు శితశృంగములుం
బెల్లుగ నర్థుల కోర్కులు , వెల్లిగొలుపు మొదవు పాల వెల్లిం బుట్టెన్

పాల సముద్రంలోనుండి అమృతంవంటి పాలు , పొదుగులోనుండి వెల్లువ లాగా ప్రవహింపజేస్తూ శ్వేత వర్ణంతో కామధేనువు పుట్టింది . అర్థులు కోరిన కోరికలు తీర్చే ధేనువది .హోమాలు చేయడానికి కావలసిన హవిస్సు ఇచ్చే కామధేనువును దేవతలు తీసుకున్నారు .

DSC04746

సచ్చంద్ర పాండురంబై , యుచ్చైశ్శ్రవ మనగ దురగ మొగి జనియించెన్
బుచ్చి కొనియె బలి దైత్యుం , దిచ్చ గొనం డయ్యె నింద్రు డీశ్వరశిక్షన్

చంద్రునివలె తెల్లగా ఉన్న యుచ్చైశ్శ్రవాన్ని బలి చక్రవర్తి తీసుకున్నాడు .

రామాయణం

న తాః మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః
అప్రతిగ్రహాణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః

వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహం

దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజాం
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితాం

అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః
హృష్టాః ప్రముదితాశ్చాసన్ వారుణీగ్రహణాత్ సురాః

అప్సరసలను దేవతలు , రాక్షసులు వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు .అందుచేత వారు “సాధారణ స్త్రీలు” అని పిలవబడ్డారు .( వారు దేవ వేశ్యలుగా ఉండిపోయారు ) .సముద్ర మథనంలో పిదప బయటకు వచ్చింది వరుణ పుత్రిక అయిన వారుణి .( వారుణి అంటే సారాయి ) . వారుణి మద్య దేవత . తనను స్వీకరించేవారు ఎవరా ? అని అనుకుంటూ బయటకు వచ్చింది . దైత్యులు వారుణిని స్వీకరించడానికి నిరాకరించారు . దోషరహితమైన వారుణిని దేవతలు సంతోషంతో స్వీకరించారు .స్వీకరించి వారు ఆనంద పరవశులైనారు . వారుణిని గ్రహించిన దేవతలు “సురు”లైనారు . రాక్షసులు “అసురులు ” అయినారు .

సందేహం :

వారిధి దరువగ నంతట , వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్    
వారిజ లోచను సమ్మతి  వారై   కైకొనిరి  దాని  వారిజ  నేత్రన్

సముద్ర మథనంలో అప్సరసల తరువాత జనించినది సారాయి , దానికే ముద్దుగా వారుణి అని పేరుపెట్టారు . సుధను కాంక్షిస్తే సుర లభించింది . (దేవేంద్రుడు సోమ రసమనే సురను ప్రీతిగా త్రాగేవాడని చెప్పబడింది ).దేవతలు సారాయిని గ్రహించడం , రాక్షసులు వద్దనడం విచిత్రంగా తోస్తుంది . లోకుల దృష్టిలో సురాపానం సప్త వ్యసనాలలో ఒకటి కదా ?

రామాయణం

అథ వర్ష సహస్రేణ సదణ్డః స కమణ్డ్లుః
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చశః
అప్సు నిర్మథనాదేవ రసాత్తస్మాదరస్త్రియః
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్

షష్టిః కోట్యో భవంస్తా సామప్సరాణాం సువర్చసాం
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః

అటు పిమ్మట వేయి సంవత్సరాలు సముద్రమథనం సాగింది . అప్పుడు పాల సముద్రంలో నుండి దండ కమండలాలు ధరించి ఉద్భవించాడు ధన్వంతరి . అతనితో పాటే అవతరించారు అప్సరస స్త్రీలు . అప్పు అంటే జలం. జలం మథించగా పుట్టారు కనుక వారు అప్సరసలయ్యారు .  లెక్కకు మిక్కిలైన పరిచారికలు  తమను  సేవిస్తూ ఉండగా  అరువది వేల మంది అప్సరసలు   సముద్ర జలాలనుండి జనించారు .

భాగవతం :

క్రొక్కారు మెఱుగు మేనులు , క్రిక్కిరిసిన చన్నుగవలు గ్రిస్సిన నడుముల్
పిక్కటిలి యున్న తుఱుములు , జక్కని చూపులును దివిజ సతులకు నొప్పెన్

అప్సరసలు , క్రొక్కారు  మెఱుగు మేనులతో ( brilliantly lit bodies ) , సన్నని నడుములతో , నిండైన తుఱుములతో ( కొప్పులతో) జనించారు . చక్కని  చిక్కని చూపులతో  చూసేవారికి ఆకర్షణీయంగా ఉన్నారా దివిజ సతులు

రామాయణం

Interestingly there exists a hillock in Bhagalpur district of Bihar which the locals believe as mount Mandara , the mountain used for churning the milky ocean . The height of this hillock is less than eight hundred feet and it appears to be a granite monolith . In his magnum opus Kumara sambhava , Kalidasa refers to the foot marks of Lord Vishnu on the slopes of Mandara hill .

This place incidentally is also the famed kingdom of Anga ruled by the legendary warrior Karna Who is known for charity , valour ,and friendship .

Mandar Hill (Mandar Parvat, Mount Mandara) In Bhagalpur, Bihar

Image taken from http://www.ebharat.in/bihar/bhagalpur/mandar-hill-mandar-parvat-mount-mandara-bhagalpur-bihar

రామాయణం

దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః
తతో దేవాసురాస్సర్వే మమంథూ రఘునందన
ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతోనఘః
తతో దేవాః సగంధర్వా స్తుష్టువుర్మధుసూదనాం
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్తిథః
పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః
పర్వతాగ్రే తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః
దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమః

హాలాహలాన్ని పానం చేసాడు పరమశివుడు . దేవదానవులు తిరిగి సముద్ర మథనాన్ని మొదలు పెట్టారు . ఇంతలోనే ఇంకొక విఘ్నం తటస్థించింది .సముద్రమథనానికి కవ్వంగా వాడుతున్న మందర పర్వతం సముద్రంలో బుడ బుడా మునిగిపోయింది . దిక్కుతొచని దేవ దానవులు హరిని ఆశ్రయించారు .” స్వామీ ! సర్వ భూతాలకూ నీవే దిక్కు . సముద్రంలో మునిగిన మందరాన్ని పైకెత్తి మేము తలపెట్టిన కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించడానికి సహకరించవా ” అని వేడుకున్నారు . శరణన్న వారిని వదలడా వేదవేద్యుడు . మందరగిరిని సముద్రం పైకి చేర్చడానికి కూర్మావతారమెత్తాడు . ఆ మహాకూర్మం మందర పర్వతాన్ని తన మూపుపై మోస్తూ పాలకడలి అడుగు భాగాన పవళించింది . అంతే కాకుండా సకలలోకాలకూ ఆత్మ , పురుషోత్తముడైన ఆ మహానుభావుడు దేవతలో మధ్యలో నిలిచి పర్వతాగ్రాన్ని పట్టుకొని సముద్రాన్ని మథించాడు (రెండురూపులు ధరించాడని అర్థమేమో?) . ఒక వైపు మందరాన్ని మూపున పెట్టుకున్నాడు ఇంకొక వైపు సముద్రమథనంలో పాలు పంచుకున్నాడు .
ఆలోచన:

ఏదైనా పెద్దపని తలపెట్టితే విఘ్నాలు కలగడం సహజం . అమృతం సాధించాలంటే విఘ్నాలు కలగకుండా ఉంటాయా ? కానీ విఘ్నాలకు భయపడి తల పెట్టిన కార్యాలను ఆపవద్దని సందేశమిస్తున్నది ఈ కథ . అంతే కాకుండా దైవబలాన్ని సమకూర్చుకుంటే ఎటువంటి విఘ్నమైనా తొలగిపోక తప్పదని స్పష్టం చేస్తున్నది .
భాగవతం :

కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో నౌ నౌగదే ! బాపురే!
కమలాక్షా ! శరణంబు భూదిశలు నాకాశంబునన్ మ్రోయగన్ .

విష్ణువు లక్ష యోజనాల వెడల్పైన వీపుతో ఉన్న మహాకూర్మంగా అవతారమెత్తాడు . పెద్ద నోరూ , అంతకంటే పెద్దదైన కడుపూ , విశ్వమంతా మీద పట్ట కదలకుండా ఉండే కాళ్ళూ కలిగి అద్భుతంగా కనిపించాడు . సుందరంగా కనిపిస్తున్న కమలాల వంటి కన్నులు ఆ మహా కూర్మం స్వంతం . స్వామి కమలాక్షుడు కదా.

తాబేలుగా మారిన ఆ మహనీయుడు సముద్రంలోకి ముత్తెపు చిప్ప ప్రవేశించినంత సులువుగా ప్రవేశించాడు . బ్రహ్మాది దేవతలు” ఔను ! ఔనౌను ! బాపురే ! కమలాక్షా శరణం”! అని ముక్త కంఠంతో ప్రస్తుతిస్తూండగా
సముద్ర జలాలనుండి వాసుకినీ , మందర పర్వతాన్నీ పైకి లేపాదు .
తరిగాండ్రలోన నొకడట , తరి కడవకు గుదురు నాక త్రాడట చేరుల్;
దరి గవ్వంబును దా నత , హరి హరి ! హరి చిత్రలీల హరియే యెరుగున్
సముద్రమనే కడవకు కుదురు అయిన హరి , సముద్రాన్ని చిలికే వారిలో ఒకడుగా కూడా ఉన్నాడు . చిలికే కవ్వమూ , కవ్వానికి చుట్టిన త్రాడూ తానే అయినాడు (” సర్పానా మస్మి వాసుకిః” అని భగవద్గీత వాక్యం ) . హరి లీలలు హరికే తెలుస్తాయి .

రామాయణం

భాగవతం : ” ఇల్లలుకగానే పండుగ కాదన్న” సామెత చందంగా సముద్ర మథనం మొదలయింది కానీ పాలసముద్రంలోనుండి  అమృతం పుట్టలేదు . అందరి గుండెలవిసేలా హాలాహలం పుట్టింది .

ఆలోల జలధిలోపల , నాలో నహి విడిచి సురలు నసురులు బఱువం
గీలా కోలాహలమై , హాలాహల విషము బుట్టె నవనీనాథా !

మథనం చేస్తున్న దేవతలూ , రాక్షసులూ భయపడి , వాసుకిని వదలి పెట్టి పారిపోయారు .ఆ హాలాహలం లక్షసూర్యుల కాంతి కలిగి చూడడానికి కూడా అలవికానటువంటిది . ముక్కంటి కంటిమంట కంటే వంద రెట్లు భయంకరమైనది . ప్రళయ కాలపు రాత్రి  మేఘాల మధ్యలో మెరిసే పిడుగులవలె భయంకరమైనది . అతి త్వరగా ఆ మహావిషం ఆకాశంలోకి ఎగబాకింది . మందర పర్వతాన్ని దాటి సముద్రమంతా వ్యాపించింది . కొండ గుహలలోకి పాకి పోయింది . వెళ్ళిన చోటల్లా బూడిద మాత్రమే మిగిల్చింది .

పెనుమంటల ధాటికి తట్టుకోలేక కొందరు దేవతలు దగ్ధమయ్యారు . రాక్షసులు నేలకూలారు ,కిన్నరులు కనిపించకుండా పోయారు. గంధర్వుల విమానాలు నేలకూలాయి . సిధ్ధుల గుంపులు చెల్లా చెదరై పోయాయి . నదులు ఎండిపోయాయి . అడవులు మాడిపోయాయి . నేల బద్దలయింది . అకాలంలో ప్రళయం వచ్చిందా అని భయ పడ్డారు ప్రజలు .

ఆ విషజ్వాలలనుండి కాపాడే మహానుభావుడు కనిపించలేదు .

ఒడ్డారించి విషంబున , కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రాలన , బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా

బ్రహ్మ అలోచించి దేవతాగ్రజుడైన పరమేశ్వరుని వద్దకు వెళదామని దేవతలతో పలికి , ఆక్షణమే వారితో కలిసి కైలాసానికి కదలి వెళ్ళాడు . ఆ సమయంలో  భక్తవశంకరుడైన ఆ శంకరుడు పార్వతీ మాతతో నిండు పేరోలగంలో (సభలో ) ఉన్నాడు .

బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని ముందు చేతులు జోడించి , పరమేశ్వరునితో

మూడు మూర్తులకు మూడులోకములకు , మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు , దుది నభేదమై యొప్పారు , బ్రహ్మ మనగ నీవు ఫాల నయన .

అని ప్రార్థించారు .

ఆ పరమేష్ఠి , మాతృమూర్తి పార్వతితో ” హరిణాక్షీ ! లోకులకు కలిగిన దుఃఖాన్ని చూసావా ! శక్తి కలిగిన ప్రభువు ప్రజల కష్టాలను రూపుమాపాలి కదా ! ” అని అన్నాడు . భాగవతం రాస్తున్న పోతన కండ్లకు ఈ దృశ్యాలన్నీ కనిపించాయి . పరమేశ్వరుడు చిద్విలాసంగా పరమపావని పార్వతీ మాత వంక అర్ధనిమీలిత నేత్రాలతో , చిలిపిగా ” ఏమిచెయ్యాలి ” అని అడుగుతున్నట్టు చూడడమూ కనిపించింది పోతన కనుదోయికి . కరుణ నిండిన మాతృమూర్తి ముఖారవిందం అందం చిందుతూ కనిపించిది . మ్రింగబోయేవాడు భర్త . మ్రింగేది ” హాలాహలాన్ని ” . అయినా అది అమ్మ హృదయం . తన బిడ్డల కొచ్చిన ఆపదను చూసి చలించిపోయింది . అంతే ! ఇంకేమీ ఆలోచిచలేదు . తన మంగళసూత్రం తనను కాపాడుతుందన్న నమ్మకంతో గరళాన్ని గ్రహించమని పరమశివుని కోరింది . భక్తవశంకరుడైన ఆ శంకరుడు గరళాన్ని గ్రక్కుమని మింగాడు . అంతలోనే జ్ఞాపకం వచ్చింది , తన కుక్షిలోనే లోకాలున్నాయని . గరళాన్ని తన కంఠాన్ని దాటనీయలేదు . గొంతులోనే హాలాహలాన్ని నిక్షిప్తం చేసాడు . దీనివల్ల మెడ కమిలిపోయింది . శంకరుడు గరళకంఠుడైనాడు . లోకానికొచ్చిన ప్రమాదం తప్పిపోయింది .

మ్రింగెడువాడు విభుండని , మ్రింగెడునది గరళమనియు , మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ , మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో

మాతృమూర్తి మంగళగౌరికి మనమీద ఎంతటి దయో !

హాలాహల భక్షణ కథ , హేలాగతి విన్న వ్రాయ నెలమి బఠింపన్ 

వ్యాళానల వృశ్చికముల , పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై

” హాలాహల కథను హేలగా విన్నా , వ్రాసినా చదివినా భయమనేది నశిస్తుంది . విష జంతువులైన సర్ప , వృశ్చిక విషాల వల్లా , అగ్నిజ్వాలల వల్లా బాధ కలుగదు ” అని ఫలశ్రుతిగా భాగవతంలో చెప్పబడ్డది .

IMG_1761

నాగేశ్వరుడు

శుభం

రామాయణం

ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేస్వరః ప్రభుః
ప్రాదురాసీత్తతోత్రైవ శంఖచక్రధరో హరిః

ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః
దైవతైర్మథ్యమానే తు యత్పూర్వం సముపస్థితం

త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణామగ్రజోసి యత్
అగ్రపూజా మిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో

ఇత్యుక్త్వా చ సురశ్రేష్థస్తత్రైవాంత రధీయత
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ ఙ్గిణః
హాలాహల విషం ఘోరం స జగ్రాహామృతతోపమం

పాహిమాం !పాహిమాం ! అని పరమేశ్వరుని శరణుజొచ్చారు దేవతలు . ఇంతలోనే అచట ప్రత్యక్షమయ్యాడు పతిత పావనుడైన విష్ణుమూర్తి . శంఖ చక్రాలు ధరించిన విష్ణువు మందస్మిత వదనారవిందుడై ” పరమేశ్వరా ! దేవతలలో అగ్రజుడువు .అందరికన్నా ముందు పుట్టావు . అందుచేత దేవతలు సముద్రాన్ని మథించినప్పుడు లభించిన వస్తువులలో ప్రథమంగా లభించింది నీకే స్వంతం . ఈ విషాన్ని అగ్రపూజగా అందుకో ” అని పలికి అంతర్ధానమయ్యాడు . పరమేష్ఠి చిరునవ్వుతో ఆ హాలాహలాన్ని అందుకొని అమృతతుల్యంగా దానిని గ్రహించాడు / నిగ్రహించాడు .

రామాయణం

అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాం సి చ
వమంత్యతివిషం తత్ర దదంశుర్దశనైః శిలాః

ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహలమహావిషం
తేన దగ్ధం జగత్సర్వం స దేవాసురమానుషం

అథ దేవా మహాదేవం శంకరం శరనార్థినః
జగ్ముః పసుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుః

క్షీరసాగర మథనం మొదలు పెట్టి వేయి సంవత్సరాలు గడిచాయి . కవ్వపు త్రాడైన వాసుకి తలలనుండి విషం వెలువడింది . వాసుకి తన దంతాలతో మంథర పర్వత శిలలను కాటువేశాడు . అప్పుడు జనించింది భయంకరమైన హాలాహలమనబడే కాలకూట విషం . అది దేవతలనూ , రాక్షసులనూ , మనుష్యులనూ ఒకటనేమిటి జగాలన్నిటినీ దహించసాగింది .
వారందరూ భయపడ్డారు . పరుగు పరుగున పరమ శివుని వద్దకు వెళ్ళారు . పాహిమాం ! పాహిమాం ! అని ప్రార్థించారు . పరమేశ్వరున్ని రక్షించమని పరి పరి విధాల ప్రార్థించారు .

భాగవత కథ :
విష్ణువు దేవతలకు ప్రత్యక్షమయ్యాడు . సకలాభరణాలతో అందంగా కనిపించిన ఆ పరమాత్ముని చూసిన బ్రహ్మ భగవంతునికి నమస్కారం చేసాదు . ప్రస్తుతి చేసాడు . ఆద్యంతాలు లేని ఆ స్వామికి సాగిలి పడి మొక్కాడు . పరమాత్మ సంతోషించాడు .దేవతలతో   “ప్రస్తుతానికి రాక్షసులతో సహవాసం చేయండి . ఇరువురూ కలిసి తృణలతలూ , ఔషధీ వృక్షాలూ వేసి పాల కడలిని మథించండి . మథించడానికి సర్ప రాజైన వాసుకిని కవ్వపు త్రాడుగా , మంథర పర్వతాన్ని కవ్వంగా వాడండి . నా సహాయం కూడా మీకు లభిస్తుంది . పాల సముద్రాన్ని మథించినప్పుడు మొట్టమొదట హాలాహమనే విషం పుడుతుంది . దానిని చూసి మీరు భయపడవలదు . పిదప అనేకమైన సంపదలు మీకు లభిస్తాయి . అవి గ్రహించండి . ఇతరాలైన వస్తువులు కూడా పాల కడలిలోనుండి బయటకు వస్తాయి . వాటిమీద దృష్టి సారించకండి . ఆశపడవద్దు . పిదప అమృతం ఉద్భవిస్తుంది . అమృతం తాగిన వాడికి మరణముండదు ” అని పలికి అదృశ్యమయ్యాడు అఖిల లోకాలకూ ఆరాధ్య దైవం .

పరమాత్మ విశ్వరూప దర్శనంతో పునీతులైన దేవతలు బలి చక్రవర్తితో స్నేహం చేసారు . భక్తి భావాన్ని ప్రదర్శించారు . అతని ఆజ్ఞలను అమలుపరిచారు . రాక్షసులు దేవతలను నమ్మలేదు . వారిని సంహరించాలని అనుకున్నారు . కానీ ! బలి చక్రవర్తి వారిని వారించాడు . ప్రేమతో కలిసి జీవించాలని ఉద్బోధ చేసాడు . ” అక్కా చెల్లెండ్ర బిడ్డలమైన మనం కలిసి అమృతాన్ని సాధించి మరణమనే పదం లేకుండా జీవిద్దాం ” అని వారికి హితవు పలికాడు .
బలి చక్రవర్తి ఆజ్ఞమేరకు దేవదానవులంతా సముద్ర మథనానికి ఆయత్తమయ్యారు . అందరూ కలిసి మందర పర్వతాన్ని పాల సముద్రం వద్దకు చేర్చాలనుకున్నారు . అయితే వారి బలం దానికి సరిపోలేదు . ఎంత బలం పెట్టినా పర్వతం కదల లేదు . దేవతలు మరల విష్ణుమూర్తిని ప్రార్థించారు . పరమాత్మ కరుణించి గరుడునికి ఆ పని అప్పగించాడు . మహాబలవంతుడైన ఖగేంద్రుడు అవలీలగా మందర పర్వతాన్ని విష్ణుమూర్తితో సహా పాల సముద్రం దగ్గర వదిలాడు .

వాసుకి కవ్వం కదా ! విష్ణుమూర్తి దేవతలు వాసుకి తల భాగాన్ని పట్టుకున్నారు . అయితే రాక్షసులు దానికి ఒప్పుకోలేదు . ” స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మథింపగా , పుచ్ఛమేటికి మాకు పట్టగ? తపస్సూ , బలమూ , వీర్యమూ చదువూ ఉన్న మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము . మీరే తోక భాగాన్ని పట్టుకోవలసింది ” అని అన్నారు . విచిత్రంగా , విష్ణుమూర్తి తల భాగాన్ని రాక్షసులకు వదిలివేసి , తోకను పట్టుకున్నాడు . ఇతర దేవతలు పరమాత్మ చూపిన మార్గంలో నడిచారు .

సముద్ర మథనం మొదలయ్యింది . ఇంతలోనే వచ్చిపడింది ఇంకొక అవరోధం . కొండ అడుగున కుదురు లేని కారణాన మందర పర్వతం సముద్రంలో బుడ బుడ మని మునిగింది .చూస్తూ ఉన్న విష్ణుమూర్తి అందరి యెదురుగానే సముద్రంలోకి దిగాడు . గొప్ప తాబేలుగా మారాడు . సముద్రంలో ప్రవేశించాడు . మందర పర్వతాన్ని పైకి లేపాడు .
జలధి గడవ సేయ శైలంబు గవ్వంబు ,సేయభోగి ద్రాడుసేయ దరువ
సిరియు సుధయు బడయ శ్రీవల్లభుండు దక్క , నొరుడు శక్తిమంతుడొకడు గలడె ?
ఆలోచిస్తే ” సముద్రాన్ని కుండగా , కొండను కవ్వంగా , వాసుకిని త్రాడుగా చేసి మాతృమూర్తి లక్ష్మీదేవినీ , అమృతాన్నీ సాధించడం విష్ణువుకు తప్ప వేరొకరికి సాధ్యమా ? ” అని అబ్బుర పడ్డాడు పోతనామాత్యుడు . నిజమే కదా ?

రామాయణం

ఆ లలితాంగి గనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ? చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది . ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది . నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు . క్షణకాలం కింద తను ఏమి చూసిందో మరిచిపోయింది .
మన నిజ జీవితంలో కూడా కనిపించే వింతలు తక్కువేమీ కాదు . ఇది నిజమా ? కలా అనే సందేహం కలగడం సహజం . ఇక తెలియని విషయాలను గురించి అలోచిస్తే వాటికి అంతేలేదు . ఉదాహరణకు తలెత్తి పైకి చూడండి . అకాశం ఎక్కడ అంతమవుతుందో ఊహించగలరా ? అది అంతమయిన పిదప ఉండేదేమిటి . అంతులేని చీకటేనా ? ఏమీ లేని స్థితేనా ? అసలు ఏమీ లేకపోవడమంటే ఏమిటి ? నిజంగా ఇవి సమాధానం లేని ప్రశ్నలు . ఇటువంటి ప్రశ్నలు వందలు ?కావు వేలు , వేవేలు , లక్షలు ,అంతులేనన్ని . మన ఊహ కందవు . ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి . సమాధానాలు దొరకవు . ఎక్కువ ప్రయత్నం చేయక మునుపే భగవన్మాయా ప్రభావంలో పడి సత్యం తెలుసుకొకుండానే రోజువారీ జీవితంలో మునిగి పోతాము . విశ్వరూపం కనిపిస్తునే ఉంటుంది కానీ ఎందుకలా వుందో మనకు తెలియదు . ఇదే భగన్మాయ అని నా ఊహ .

DSC00255