Monthly Archives: ఫిబ్రవరి 2012

రామాయణం

తతో యజ్ఞే  సమాప్తేతు    ఋతూనాం  షట్సమత్యయుః
తతశ్చ ద్వాదశే  మాసే  చైత్రే  నావమికే తిథౌ .
నక్షత్రే  దితిదైవత్యే  స్వోచ్ఛసంస్థేషు  పఞ్చసు
గ్రహేషు  కర్కటే  లగ్నే  వాక్పతావిందునా  సహ
ప్రోచ్యమానే  జగన్నాథం  సర్వలోక నమస్కృతం
కౌసల్యాజనయద్రామం  సర్వలక్షణసమ్యుతం
విష్ణోరర్థం  మహాభాగం పుత్రమైక్ష్వాక  వర్ధనం

 

యజ్ఞం  పూర్తి  అయినాక  ఆరు ఋతువులు  వచ్చి  వెళ్ళాయి . అంటే  పన్నెండు  మాసాలు  గడిచాయి . తిరిగి  వసంతం   వెల్లివిరిసింది .

చైత్రమాసాన ,  కౌసల్యా గర్భాన నవమీ  తిథి యందు ,   అదితి   దేవతగా   గల   నక్షత్రంలో   (పునర్వసు  నక్షత్రంలో )  ఐదు గ్రహాలు  ఉచ్చ  స్థానంలో  ఉండగా , కర్కాటక లగ్నంలో  , బృహస్పతి  చంద్రునితో  ఉదయిస్తూండగా  సర్వలోక నమస్కృతుడైన   శ్రీమహావిష్ణువు  , సర్వ లక్షణ సంపన్నుడై  , ఇక్ష్వాకు  వంశ  వర్ధనుడై  జన్మించాడు .

వాల్మీకికి  నక్షత్ర , గ్రహ తారా స్థితులను  గురించి  చక్కని  అవగాహన ఉందని  పై శ్లోకాలు  నిరూపిస్తాయి .  అసలు   ఇటువంటి  గ్రహ  సంఘటన  నిజంగా  సాధ్యమా  అనే  సందేహం  కలిగిన  కొందరు ” ప్లానెటోరియం ” అనే   సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి  పరిశోధనలు  చేసారు .  వారిలో  ప్రథముడు “పుష్కర్ భట్నాగర్ ” అనే రెవెన్యూ  శాఖ  ఉద్యోగి .కంప్యూటర్   లో   ఆతడు  వాల్మీకి  తన శ్లోకాలలో  పొందుపరచిన  వివరాలను   కంపూటర్లోకెక్కించాడు .

కంప్యూటర్   లెక్క  ప్రకారం  ఈ గ్రహ  సంఘటన   జరిగిన తేదీ   జనవరి 10 , క్రీస్తు పూర్వం  5114   సంవత్సరం  , మధ్యాహ్న  సమయం (అభిజిత్  సంజ్ఞాత  లగ్నం) .

ప్రస్తుతం    మనకందుబాటులో  ఉన్న  కంప్యూటర్లూ , టెలిస్కోపులూ , ఇతర సాధన సామగ్రీ లే ని కాలంలో  నక్షత్రాల గతులను గమనించి  మనకందించిన  వాల్మీకి ధన్యుడు  , అందుకొన్న మనం ఇంకా ధన్యులం .

ఆశ్రిత పారిజాతుడైన   శ్రీరామచంద్రుడు  సీతమ్మ తో  సహా  భువిలో   అవతరించాడని  నమ్మకం కలగాలంటే  దిగువనీయబడిన  లింక్ లను  పరిశీలించండి .

 

1 .  http://bhandarusrinivasarao.blogspot.in/2011/12/blog-post.html

2 . http://www.serveveda.org/iServe.html (Scientific dating of events before 2000 BC )

3 . http://lakdiva.org/aryan/rama.html

4 . http://www.hindunet.org/hindu_history/ancient/ramayan/rama_vartak.html

5 . 1 . http://www.sunday-guardian.com/news/rama-born-on-10-jan-claims-stargazer-body

 

 

రామాయణం

శాంతయా  ప్రయయౌ  రాజా  దశరథస్తదా
అన్వీయమానో  రాజ్ఞాథ  సామయాత్రెణ  ధీమతా
ఏవం  విసృజ్య  తాన్సర్వా  న్రాజా  సంపూర్ణమానసః
ఉవాస  సుఖిత  స్తత్ర  పుత్రోత్పత్తిం  విచింతయన్

ఋష్యశృంగ  మహర్షి  కూడా  దశరథునిచేత   పూజలందుకొని    మహారాజైన  రోమపాదుడు ,  సుందరమైన   శాంతా  అనుసరించిరాగా  అంగ  రాజ్యానికి  పయనమైనాడు .

దశరథుని  హృదయం  ఆనందంతో  పరవళ్ళు  తొక్కుతూ పుత్రాగమనానికి  ఎదురుచూస్తోంది .

అతివయైన  మొల్ల    దిన దినమూ    మారుతున్న   గర్భవతుల   రూపు రేఖలను అత్యంత రమణీయంగా   వర్ణించింది .  ఈ విధమైన  వర్ణన ఒక  స్త్రీకే  సాధ్యం .

ధవళాక్షులనుమాట  తథ్యంబు గావింప
దెలుపెక్కి కన్నులు  తేటలయ్యె
నీలకుంతలలని  నెగడినయామాట
నిలుపంగ నెఱులపై నలుపుసూపె
గురు  కుచలను  మాట సరవి  భాషింపంగ
దోరమై  కుచముల నీరువట్టె
మంజుభాషణులను మాట  దప్పకయుండ
మెలతల  పలుకులు  మృదువులయ్యె

గామిను  లటంట  నిక్కమై   కాంతలందు
మీఱి   మేలైన  రుచులపై   గోరికయ్యె
సవతిపోరన   దమలోన   సారె  సారె
కోకిలింతలు    బెట్టుచిట్టెములు  బుట్టె

తనుమధ్య  లనుమాట    దప్పింపగా   గాబోలు
బొఱలేక  నడుములు  పొదలజొచ్చె
గుచములు  బంగారుకుండలో  యనుమాట
కల్లగానగ్రముల్  నల్లనయ్యె
జంద్రాస్య  లనుమాట  సరవి మాపగ బోలు
గళలవిలాసమ్ము  పలుచనయ్యె
సుందరులనుమాట  సందియమ్ముగబోలు
గర్భభారమ్ముల  గాంతి దప్పె

ననుచు  గనుగొన్న  వారెల్ల నాడుచుండ
గట్టు చీరెల  వ్రేకంబు  పుట్టుచుండ
నా సతుల జూచి  యందరు నలరుచుండ
గాంతలకు  నప్డు  గర్భముల్  గానుపించె

సంవత్సరకాలం గడిచింది . చైత్రమాసం  తిరిగి  వచ్చింది . నల్లని వాడు ,  పద్మనయనంబుల   వాడు  ,  తన్ను లో నమ్మిన వారి మనస్సులలో  ఉండేవాడు ,  కోరిన   కోర్కెలు   తీర్చే   కోదండ రామయ్య    కౌసల్య   కనకగర్భం   నుండి  రత్నగర్భ   ఐన   భువిపై    అవతరించాడు

తేనెలూరు  మాటలతో అంత్యప్రాస విలాసాలతో  భాగవతాన్ని  రచించిన    పోతన ,   శ్రీరామచరిత్ర  ఆరంభిస్తూ  చెప్పిన పద్యమొక్కటి :

అమరేంద్రాశకు  బూర్ణ చంద్రు డుదితుండైనట్లు   నారాయణాం
శమునం  బుట్టె  మదాంధ  రావణ  శిరస్సంఘాత  సంఛేదన
క్రమణోద్దాముడు  రాముడాగరితకున్ గౌసల్యకున్ సన్నుతా
సమనైర్మల్య  కతుల్య  కంచిత  జనుస్సంసార  సాఫల్యకున్ .

రామాయణం

నిర్వృత్తే  తు  కృతౌ  తస్మిన్ హయమేద్ఘే  మహాత్మనః
ప్రతిగృహ్య  సురా  భాగాన్  ప్రతిజగ్ముర్యథాగతం
సమాప్తదీక్షానియమః  పత్నీగణసమన్వితః
ప్రవివేస  పురీం  రాజా  సభృత్యబలవాహనః
యథార్హం  పూజితాస్తేన  రాజ్ఞా  వై  పృథివీశ్వరాః
ముదితాః  ప్రయయుర్దేశాన్  ప్రణమ్య  మునిపుఙ్గవం
గతేషు  పృథివీశేషు   రాజా  దశరథస్తదా
ప్రవివేశ  పురీం శ్రీమాన్  పురస్కృత్య  ద్విజోత్తమాన్

ఈ  శ్లోకంతో  అష్టాదశ  సర్గ  ప్రారంభమవుతుంది . విష్ణువు  అవతారమెత్తడానికి  నిశ్చయించడం  ,    దశరథుడు  పుత్రకామేష్టి  యజ్ఞం  సఫలంగా నిర్వర్తించడం  ,  చతుర్ముఖుని ఆదేశం  ప్రకారం  కోట్లకొలదీ  వానరులు  జన్మించడం  ఇప్పటివరకూ  జరిగిన కథ .
అశ్వమేధ   యజ్ఞం    సఫలంగా  పూర్తి  కాగానే  దేవతలు  తమ  తమ  హవిర్భాగాలను  తీసుకొని   స్వస్థానాలకు  వెళ్ళారు . దశరథుడు తన పరివారంతో  యజ్ఞ స్థలాన్ని  వదలి  అయోధ్యానగరంలో  తిరిగి  ప్రవేశించాడు .
దేశదేశాలనుండి  యజ్ఞాన్ని   చూడడానికి  వచ్చిన  రాజులు  దశరథునిచేత  సత్కరింప బడ్డారు . వసిష్ఠుని కి   వందనం చేసి  తమతమ రాజ్యాలకు పయనమై  వెళ్ళిపోయారు . ఆ విధంగా  వెడుతూన్న  రాజుల    సైన్యాలు    శుభ్రాలై  ,  ఆనందంతో    ప్రకాశించాయట .  శుభ్రాలై  అంటే  స్వచ్ఛమైన   వస్త్రాలు  ధరించి  సుందరంగా కనిపిస్తూ  అని  భావం .  దశరథుడు  వచ్చినవారందరికీ  వస్త్రప్రదానం చేసాడు  కదా !
దశరథుడు   తన   పరివారంతో  ,  యజ్ఞ స్థలాన్ని  వదలి  భూసురులైన    సద్బ్రాహ్మణులను    ముందిడుకొని    అయోధ్యానగరంలో  తిరిగి   ప్రవేశించాడు .

రామాయణకథ   రేపటినుండీ   చక్కని   మలుపు  తిరుగుతుంది . దివి నుండి   భువికి   దిగి  వస్తున్నాడు  శ్రీమన్నారాయణుడు  , మన పుణ్యఫలంగా .  రామజననానికి   ఇక  సమయం  ఎక్కువగా  లేదు . మానవాళిని  రక్షించే  మహాత్ముని  ఆగమనం  కోసం   కష్టమైనా   రేపటివరకూ  మనం   వేచి ఉండాలి మరి . “రాముని  కోసం  వేచియుండే వానిది భాగ్యవైభవము  , వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్ ” .

రామ రామ యని పలికేరా
నిష్కామ కామ , రిపు నుత, రారా !

రామాయణం

దేవా  మహర్షిగంధర్వాస్తార్క్ష్యా  యక్షా  యశస్వినః
నాగాః  కింపురుషాశ్చైవ  సిధ్ధవిద్యాధరోరగాః
బహవో   జనయామాసుర్హష్టాస్తత్ర   సహస్రశః
వానరాన్న్  సుమహాకాయాన్   సర్వాన్వై   వనచారిణః
అప్సరస్సు    చ   ముఖ్యాసు    తథా   విద్యాధరీషుచ
నాగకన్యాసు   చ  గంధర్వీణాం   తనూష    చ

రావణ సంహారానికి   నాంది  పలకడానికి  విష్ణుమూర్తి   భూమిపై    అవతారమెత్తుతున్నాడని  విన్న  దేవ , యక్ష ,  తార్క్ష్య , కిన్నర  , కింపురుష , సిధ్ధ , విద్యాధరుల   సంతోషాలకవధులు  లేకుండా పోయాయి . ఈ  పవిత్ర  కార్యానికి  తమవంతు  సాయమందించాలని తహతహ లాడారు . అప్సరల  ద్వారా , విద్యాధర ,నాగ , గంధర్వ  స్త్రీల  ద్వారా  వేలకొలది  వానరులను సృజించారు .

కామరూప  బలోపేతా  యథాకామం  విచారిణః
సింహ శార్దూలసదృసా దర్పేణ  బలేన  చ
శిలాప్రహరణాః  సర్వే  సర్వే  పాదపయోధినః
నఖదంష్ట్రాయుధాః  సర్వే  సర్వే  సర్వాస్త్రకోవిదాః

రావణ సంహారమంటే  మాటలా ?  భక్తితో  బ్రహ్మదేవుని   మెప్పించిన  ఘనుడతడు . ఆతనితో  యుధ్ధం  చేయడానికే   దేవతలతద్వారా  సృజింపబడ్డ   వానరులు  అతి బలవంతులు , ఛలవంతులు .  అస్త్ర కోవిదులు . కామరూపులు  అంటే కోరినరూపాన్ని  ధరించగలిగిన  వారు . రాళ్ళు , గోళ్ళు  వారి  ఆయుధాలు .

దారయేయుః  క్షితిం  పద్భ్యామాప్లవేయుర్మహార్ణవం
నభస్థలం  విశేయుశ్చ  గృహ్ణీయురపి  తోయదాన్
గృహ్ణీయురపి  మాతఙ్గాన్మత్తాన్  ప్రవ్రజతో  వనే
నర్దమానాశ్చ  నాదేన  పాతయేయుర్విహంగమాన్

పాదాలచేత  భూమిని  బ్రద్దలు కొట్టగల శక్తీ  , సముద్రాన్ని  దాటగలశక్తీ ,  ఆకాశంలోని  మేఘాలను  ముట్టుకోగల  శక్తీ  వారి   స్వంతం . వారు బిగ్గరగా  అరిస్తే  ఆకాశంలో ఎగిరే  పక్షులు  రాలికింద పడిపోతాయి . అడవి  ఏనుగులను  అవలీలగా  పట్టుకోగలరు .

ఈదృశానాం  ప్రసూతాని  హరీణాం  కామరూపిణాం
శతం  శతసహస్రాణి  యుథపానాం  మహాత్మనాం .
తే ప్రధానేషు యుథేషు  హరీణాం  హరియూథపాః
బభూవుర్యూథపశ్రేష్ఠా  వీరాంశ్చాజనయన్  హరీన్

ఈ విధమైన  శక్తిగల   నూరు  లక్షల  మంది  వానరులను సృజించారు  దేవతలు .   ఋక్షపర్వతం  మీద నివాసమేర్పర్చుకున్న  వానరులు   కొంతమందైతే , అడవులలో నివసించే వారు   కొంతమంది . కొండలో నెలకొన్నవారు  మరికొంతమంది .

సూర్యపుత్రం  చ సుగ్రీవం  శక్రపుత్రం  చ వాలినం
భ్రాతరావుపతస్థుస్తే   సర్వ ఏవ  హరీశ్వరాః
నలం  నీలం  హనూమంతమన్యాంశ్చ  హరియూథపాన్ .
తే తార్క్ష్యబలసంపన్నాః సర్వే యుధ్ధ విశారదా
విచరంతోర్దయన్  దర్పాత్సింహ వ్యాఘ్రమహోరగాన్
తాంశ్చ  సర్వాన్  మహాబాహుర్వాలీ  విపులవిక్రమః
జుగోప  భుజవీర్యేణ  ఋక్షగోపుచ్ఛవానరాన్

వాలి సుగ్రీవులు , నలుడు నీలుడు ,  పూజ్యుడైన ఆంజనేయుడు  వీరికి  నాయకులు . వైనతేయుని (గరుత్మంతుడు )   పోలిన  బలంతో ,   క్రూర మృగాలైన సింహాలనూ , పులులనూ , పాములనూ  పట్టుకొని  బాధించేవారు  ఈ  వానరులు .

వీరికున్న బలం సరిపోదన్నట్లు   ఈ  వానరులందరికీ  రక్ష    దేవేంద్రుని  పుత్రుడైన   వాలి .

తైరియం  పృథివీ  శూరైః  సపర్వతవనార్ణవా
కీర్ణా  వివిధ సంస్థానైర్నానా  వ్యఞ్జన లక్షణైః

తైర్మేఘబృందాచల కూటకల్పైః
ర్మహాబలైర్వానరయూథపోలైః
బభూవ భూర్భీమశరీరరూపైః
స్సమావృతా  రామసహాయహేతో

కోట్లకొలది  వానరులు  విచిత్రమైన  ఆకారాలతో  పర్వతాలతో , వనాలతో  నిండి  సముద్రంచే  పరివేష్టింపబడ్డ  భూమండలాన్ని  ఆక్రమించారు . వీరందరి  ధ్యేయం  శ్రీరామ చంద్రునికి   సేవ  చెయ్యడం , సహాయంగా పక్కన నిలబడడం .

శ్రీరాముని  అనుచరులుగా  పుట్టడానికి  వీరు  చేసుకున్న  పుణ్యమేమిటో ?

 

 

రామాయణం

తే సృష్టా  బహుసాహస్రా  దశగ్రీవవధే  రతాః
అప్రమేయబలా  వీరా  విక్రాంతాః కామరూపిణః
మేరుమందర సంకాశా  వపుష్మంతో మహాబలా
ఋక్షవానరగోపుచ్ఛా  క్షిప్రమేవాభిజజ్ఞిరే
యస్యదేవస్య  యద్రూపం  , వేషో యశ్చపరాక్రమః
అజాయత  సమస్తేన   తస్య   తస్య   సుతః   పృథక్
గోలాఙ్గూ లీషు  చోత్పన్నాః  కేచిత్సంమతవిక్రమాః
ఋక్షీషు  చ తథా  జాతా  వానరాః  కిన్నరీషు  చ

రావణున్ని  వధించడానికి   కామరూపులై  , పెద్ద పెద్ద దేహాలతో  వేలకొలదిగా వానరాలు , ఎలుగుబంట్లు , కొండముచ్చులు (లంగూర్) – ఋక్షజాతికి  చెందిన స్త్రీల యందు , కిన్నర స్త్రీల యందు , ఆడ ఎలుగుబంట్ల  యందు  పుట్టాయి .

ఏ దేవతల ద్వారా  అవి పుట్టాయో  ఆ దేవతల  గుణాలనవి  పుణికి పుచ్చుకున్నాయి .

రామాయణం

మారుతస్యాత్మజః  శ్రీమాన్  హనుమాన్నామ  వీర్యవాన్
వజ్రసంహననోపేతో  వైనతేయసమో  జవే .

అందరికన్నా  మిన్నయైన  ఆంజనేయుడు  , పవన  పుత్రుడు  .  ఆంజనేయుని  పేరు వింటేనే  వళ్ళు  గగుర్పొడుస్తుంది .  ఆంజనేయుడు  అమరుడు . రామాయణాన్ని పఠించే   ప్రతి   ప్రదేశంలో  ఆంజనేయుడుంటాడని  ప్రతీతి .
ఆంజనేయుని  గొప్పతనాన్ని చెప్పడం  మొదలు  పెడితే  అది  రామాయణం కన్నా పెద్ద  గ్రంధమవుతుంది . అయినా  ఆంజనేయునీ   గొప్పతనం  తెలియనిదెవరికి .
పోతన  మాటలలో
” అలవాటు కలిమి  మారుతి ,  లలితామిత లాఘవమున లంఘించెను శైవలినీ గణసంబంధిన్ , జలపూరిత ధరణి గగన సంధిన్  గంధిన్” .
అలవాటు  ప్రకారం  ఆంజనేయస్వామి  సముద్రాన్ని  లంఘించాడట . వానరులకు  అటూ ,ఇటూ  దూకడం  ఒక ఆట  కదా . అందుకే  అది  వారికి అలవాటు .  అలవాటైన  ఆ  క్రీడలో  భాగంగా  సముద్రాన్ని  లలితంగా   లంఘించాడు  పవన తనయుడు .

సుందరకాండ  — మహనీయుడైన మారుతి  ప్రతి పనినీ ఏవిధంగా  విశ్లేషించి  , ఏమి చెయ్యాలో నిర్ణయించి ,  నిర్ణయించిన దానిని  ఏవిధంగా  ఆచరణలో  పెడతాడో   వర్ణిస్తుంది . తలపెట్టిన  కార్యాలనూ , ఇంకా   చెప్పాలంటే   జీవితాన్నీ సఫలం చేసుకోవాలంటే  మనం  చేయాల్సింది మారుతి చూపిన  బాటలో  పయనించడమే . తలపెట్టిన  కార్యాన్ని  సాధించడంలో మారుతికన్నా  మిన్న “న భూతో , న భవిష్యతి ” . రామాయణంలో ఒక కాండనిండా  మారుతి  చేసిన  మహనీయమైన కార్యాలను వాల్మీకి వర్ణించాడు .

అంజనాననదనం  వీరం  జానకీ  శోకనాశనం
కపీశమక్షహంతారం వందేలంకా  భయంకరం .

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి  పరిపూర్ణలోచనం
మారుతిం నమత  రాక్షసాంతకం

అతిచ్ఛలవంతుడూ , మతిమంతుడూ , బలవంతుడూ ,  శౌర్యవంతుడూ ,  సుగుణాల పుట్టా అయిన  మారుతికిదే  వందనం .

రామాయణం

బృహస్పతిస్త్వ జనయత్తారం   నామ  మహాహరిం
సర్వవానరముఖ్యానామ్మ్ బుధ్ధిమంతమనుత్తమం

దేవ గురువైన  బృహస్పతికి  పుట్టినవాడు  తారుడు . బృహస్పతి దేవతలందరిలో తెలివైనవాడు . ఆతని  పుత్రుడైన  తారుడు , ” పండిత పుత్రునిలా ” కాకుండా  మంచి బుధ్ధిమంతుడు . ” పండిత పుత్రుడు  పరమ శుంఠ ”  అని ఒక  వదంతి .

ధనదస్య  సుతః  శ్రీమాన్  వానరో  గంధమాదనః
విశ్వకర్మా  త్వజనయన్ నలం నామ  మహా హరిం

కుబేరుని  కుమారుడు  గంధమాదనుడు . విశ్వకర్మ  కుమారుడు  నీలుడు .  నీలుడు  లంకానగరానికి    వారధి కట్టే సమయంలో  రామునికి  ఎనలేని  సహాయం  చేసి  ధన్యుడయ్యాడు .  ఈ రొజు ఉపయోగిచే  పదాలలో  చెప్పాలంటే నీలుడు ”  సివిల్  ఇంజినీర్ ” . ఇతని తండ్రి   విశ్వకర్మ   వాస్తు   శాస్త్రంలో దిట్ట . ఎన్నో  వింత వింత  భవనాలూ , కట్టడాలూ  నిర్మించిన  నిపుణుదు .

పావకస్య సుతః    శ్రీమాన్   నీలోగ్నిసదృశప్రభః
తేజసా  యశసా  వీర్యాదత్యరిచ్యత  వానరాన్
పావనుడైన    పావకుని   (అగ్ని దేవుని)   పుత్రుడు నీలుడు . అగ్ని కుమారుడు అమిత  తేజోవంతుడు , అతి  బలవంతుడు .

రూపద్రవిణ  సంపన్నావశ్వినౌ   రూపసమ్మతౌ
మైందం  చ ద్వివిదం  చైవ  జనయామాపతుః  స్వయం .

అశ్వినీ  దేవతలు  అతి  సుందరులు .  సౌందర్యంతో అలరారే  మైందుడు ,  ద్వివిదుడు అనే  ఇద్దరు  పుత్రులు  వీరిద్వారా  పుట్టారు . ఆరోగ్యం  కావాలంటే   అశ్వినీ దేవతలను పూజిస్తారు .  అందంగా  ఉండడానికి  అన్నిటి  కంటే  ముఖ్యం  ఆరోగ్యం  , అన్న  విషయాన్ని   భావగర్భితంగా  మహర్షి  మనకిక్కడ  సూచిస్తున్నారేమో ?

వరుణో  జనయామాస  సుషేణం  వానరర్షభం
శరభం  జనయామాస  పర్జన్యస్తు  మహాబలం

వరుణ దేవుని   పుత్రుడు  సుషేణుడు . వానరులకు  వైద్యుడితడు . ఇంద్రజిత్తుతో  చేసిన యుధ్ధంలో   లక్స్మణుడు    మూర్ఛ చెందినప్పుడు  హనుమంతున్ని  హిమాలయాలనుండి మూలికలు తెమ్మని చెప్పి , ఆ  మూలికలతో  లక్ష్మణుని మూర్ఛనుండి   బయటకు రప్పించిన  ఘనుడు   సుషేణుడు  . మహాబలుడైన శరభుని   తండ్రి  పర్జన్యుడు .

రామాయణం

తే తథోక్తా  భగవతా  తత్ప్రతిశ్రుత్య  శాసనం
జనయామాసురేవం  తే  పుత్రాన్వానర  రూపిణః
ఋషయశ్చ  మహాత్మానః  సిధ్ధవిధ్యాధరోరగాః
చారణాశ్చ  సుతాన్వీరాన్  ససృజుర్వనచారిణః
వానరేంద్ర మహేంద్రాభమింద్రో  వాలిన్మూర్జితం
సుగ్రీవం  జనయామాస  తపనస్తపసాం    వరః

రాముని  సేవలో  జన్మ చరితార్థం  చేసుకోవడానికి  తనయులను  కనమని  ఆనతిచ్చాడు చతుర్ముఖుడు .  దివ్య శక్తివంతులైన   వారు  బ్రహ్మ  ఆజ్ఞను  శిరసా  వహించారు . మహావీరులను సృజించారు .
మొట్టమొదటగా  మహేంద్రుడు  వాలిని  సృజించాడు .  సూర్యుడు  సుగ్రీవుని జననానికి  కారకుడయ్యాడు .
వాలి  సుగ్రీవులందుకే  అమిత బలశాలులు , అతి తేజోవంతులు  . తండ్రిగుణాలు  తనయులకు  రావడం  సహజమే కదా .

ముఖ్యులైన  వానరులు ఎవరికి  జన్మించారో  రాబోయే శ్లోకాలలో  వివరిస్తారు   సురసన్నుత  జ్ఞానులైన  సువివేకి  వాల్మీకి .

రామాయణం

పుత్రత్వం  తు   గతే  విష్ణౌ  రాజ్ఞస్తస్య  మహాత్మనః
ఉవాచ  దేవతాః  సర్వాః  స్వయంభూర్భగవానిదం
సత్యసంధస్య  వీరస్య  సర్వేషాం  నో హితైషినః
విష్ణోః సహాయాన్  బలినః  సృజధ్వం  కామరూపిణః
మయావదశ్చ  శూరాంశ్చ  వాయువేగసమాన్  జవే
నయజ్ఞాన్   బుధ్ధిసంపన్నాన్  దివ్యసంహననాంతాన్
సర్వాస్త్ర  గుణ్సంపన్నాన్  అమృతప్రాశనానివ
అప్సరస్సు  చ  ముఖ్యాసు  గంధర్వాణాం  తనూషు  చ
సృజధ్వం  హరిరూపేణ  పుత్రాంస్తుల్య  పరాక్రమాన్ .

పూర్వమేవ  మయా సృష్టో  జాంబవా  వృక్షపుంగవః
జృంభమాణస్య  సహసా  మమ   వక్త్రాదజాయత

గర్భాలు  ధరించిన  దశరథ  పత్నులు  పుత్ర  జననం  కోసం  వేచియున్న  సమయంలో  బ్రహ్మదేవుడు  దేవతలతో :  మహావీరుడై  మనలను  రక్షించడానికి  మహావిష్ణువు  అవతరిస్తున్నాడు . రావణసంహారానికి  అతనికి   తోడు (సహాయం)   అవసరం . మీరందరూ  కామరూపులై ,  అప్సర స్త్రీలతో  , గంధర్వ స్త్రీలతో  కూడి    అసమానులైన   పుత్రులను (హరి రూపంలో)  వానర రూపంలో   పొందండి . ఇంతకు  పూర్వమే  జాంబవంతుడు  నేను  ఆవులిస్తున్నప్పుడు  హటాత్తుగా  పుట్టాడు అని కూడా దేవతలకు  తెలిపాడు .

ఇక్కడ  ఒక  విషయం  గమనించాలి .  భార్యలయందు  పుత్రులను  పొందకుండా  అప్సరలతో  క్రీడించి  వారి  ద్వారా  పుత్రులను  పొందమని  బ్రహ్మదేవుడు  ఎందుకు  ఆజ్ఞాపించాడు ? ఇది  ఉచితమా ?
దేవతలకు తమ  భార్యల  ద్వారా సంతానం కలగదని  పార్వతీ  దేవి  శాపం  ఉంది  .  అంతేగాక  వానరులతో  నీకు  భయం  కలుగుతుందని  నందీశ్వరుడు  రావణున్ని  శపించాడు . అందువలననే రావణుని  ప్రాణాలను  హరించడంలో   హరికి  సహాయం  చేయడానికి  హరిరూపాల్లో (వానర రూపాల్లో)  పుత్రులను  అప్సరల  ద్వారా కనమని  బ్రహ్మదేవుని ఆజ్ఞ .తన వంతుగా ,  తన  మానస పుత్రుడైన  జాంబవంతుడు  రాముని  సహాయం  చేయడానికి  పూర్వమే  పుట్టాడని కూడా  తెలిపాడు.

బ్రహ్మదేవుని  ఆజ్ఞను  శిరసా వహించారు  దేవతలు

రామాయణం

తాస్త్వే  తత్పాయసం  ప్రాప్య  నరేంద్రస్యోత్తమాః  స్త్రియః
సంమానం  మేనిరే  సర్వాః  ప్రహర్షోదితచేతసః
తతస్తు  తాః  ప్రాశ్య  తదుత్తమస్త్రియో
మహీపతే రుత్తమ  పాయసం పృథక్
హుతాశనాదిత్యసమానతేజస
శ్చిరేణ  గర్భాన్  ప్రతిపేదిరే తదా
తతస్తు రాజా  ప్రసమీక్ష్య  తాః స్త్రియః
ప్రరూఢగర్భాః  ప్రతిలబ్ధమానసః
బభూవ హృష్టస్త్రిదివే  యథా  హరిః
సురేంద్ర  సిధ్ధర్షి  గణాభి  పూజితః

పుత్రకామేష్టి  యాగం  చేస్తే  లభించిన   పాయసాన్ని   కౌసల్య ,సుమిత్ర , కైకేయిలకు  ఇచ్చాదు  దశరథుడు .  పాయసాన్ని  పొందిన  పడతులు  పొంగిపోయారు .  దానిని  అత్యుత్తమమైన  బహుమానంగా  భావించారు .  భుజించారు . పవిత్రమైన  పాయసం  రాజపత్నులకు  అగ్నిలాంటి  మెరుపునిచ్చింది . గర్భాన్ని  కూడా  ఇచ్చింది .  గర్భంతో దేదీప్యమానులై  వెలిగిపోతున్న  పత్నులను చూచి   దశరథుడు  ప్రతిలబ్ధ మానసు  డైనాడట . దివ్యులు   పూజిస్తే  విష్ణువు  సంతోషించిన  విధంగా   సంతోషించాడు .

గర్భంధరించిన   స్త్రీలలో  కలిగే  మార్పులు  మొల్ల వర్ణించిన  తీరు అద్భుతం.  ఒక స్త్రీ మాత్రమే  అలా  వర్ణించకలదేమో :

ధవళాక్షులను  మాట  తథ్యంబు  గావింప
దెలుపెక్కి  కన్నులు  తేటలయ్యె
నీలకుంతల లని నెగడిన  యా మాట
నిలువంగ  నెఱులపై  నలుపు సూపె
గురుకుచ లను మాత  సరవి  భాషింపంగ
దోరమై  కుచముల  నీరువట్టె
మంజుభాషిణు లనుమాట  దప్పక యుండ
మెలతల   పలుకులు   మృదువులయ్యె

గామినులటంట నిక్కమై  కాంతలందు
మీఱి మేలైన  రుచులపై  గోరికయ్యె
సవతిపోరన  దమలోన  సారె సారె
కోకిలింతలు బెట్టుచిట్టుములు  బుట్టె

 

తను మధ్య లను మాట  దప్పింప  కాబోలు
బొర  లేక  నడుములు  పొదలజొచ్చె
గుచములు  బంగారు కుండలో  యనుమాట
కల్లగా  నగ్రముల్  నల్లనయ్యె
జంద్రాస్య లనుమాట  సరవి మాంపగ బోలు
గళల విలాసమ్ము  పలుచనయ్యె
సుందరులనుమాట  సందియమ్ముగ బోలు
గర్భభారమ్ముల  గాంతి  దప్పె

ననుచు  గనుగొన్న  వారెల్ల  నాడుచుండ
గట్టుచీరెల  వ్రేకంబు పుట్టుచుండ
నాసతుల  జూచి  యందరునలరుచుండ
గాంతలకు  నపుడు  గర్భముల్  గానుపించె .

గర్భం ధరించిన  అతివల

తేటగా  మారిన కళ్ళనూ ,  మృదువుగా  పలుకుతున్న పలుకులనూ ,  మేలైన రుచులపై  కలుగుతున్న  కోర్కెలనూ , పెరుగుతున్న నడుములనూ ,  నల్లగా మారుతున్న  కుచాగ్రాలనూ ,  తరుగుతున్న  శరీర  కాంతినీ  గమనించి

మధురమైన  భాషలో మనకందించిన మొల్ల  సదా  స్మరణీయురాలు .