Monthly Archives: సెప్టెంబర్ 2010

శ్రీ మద్రామాయణము

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్

ధర్మజ్ఙశ్చ కృతజ్ఙశ్చ సత్యవాక్యో దృఢవృతః

వాల్మీకి మహర్షి తన అశ్రమానికి విచ్చేసిన నారద మహర్ష్ని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మహాత్మా ఈ లోకంలో అందరికన్నా గుణవంతుదు,వీర్యవంతుడు,ధర్మాలను చక్కగా ఆకళింపు చేసుకున్నవాడు , ఉత్తమమైన శీలం గలవాడు ,సమర్థుడు,  ఇంకో మాటలో  చెప్పాలంటే   పురుషో త్తముడైన మనిషి  ప్రస్తుతం ఎవరైనా ఉన్నాడా.అసూయ లేనివాడూ,   క్రోధాన్ని జయించిన వాడూ, సూర్యకిరణాలవంటి   కాంతి కలిగినవాడూ,  , యుధ్ధం చేసేసమయంలో   దేవతలను  కూడా భయపెట్టేంత భీకరుడూ  అయినవడెవడైనా  ఉన్నాడా.

శ్రీ మద్రామాయణము

by sriwinz 15. Sep, 2010 Uncategorized { Edit }

తపః  స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని  పుంగవం

ఒక ఉత్తమమైన వ్యక్తి కథ రాయాలనే ఉద్దేశ్యంతో వాల్మీకి , నారదమహర్షిని కొన్ని ప్రశ్న లడగడంతో ఆరంభమవుతుంది రామాయణ మహాకావ్యం.నారద మహర్షి తపస్వాధ్యాయ నిరతుడు.”నార” అంటే జ్ఞానమనీ, “ద” అంటే ఇచ్చేవాడనీ అర్థం.నారదుడు జ్ఙానప్రదాత.అది తెలిసిన వాల్మీకి మహర్షి తన కావ్యానికి కథానాయకున్ని ఎన్నుకోవడానికి నారద మహర్షి సహాయాన్ని అర్థిస్తాడు.

ప్రపంచంలో మనం ఏ పనైనా మొదలు పెట్టడానికి ముందు ఇది ఎందుకు చేయాలి లేక ఇది ఏమిటి ,ఏ విధం గా చేయాలి  అని మనల్ని మనమే ప్రశ్నించుకొని, కొద్దిగా వితర్కించుకొని మొదలు పెట్టినట్లైతే  మనకు ఒక రకమైన స్పష్టత  వస్తుంది. తెలియని విషయాలు తెలిసినవారిని, జ్ఞానులైనవారిని వారిని అడిగి  తెలుసుకోవాలి.ఈ పని చేయాలి అని సంకల్పించు కొన్నాక ,ఆ విషయాన్ని కూలంకషంకం గా అధ్యయనం చేసి, విషయం తెలిసిన వారితో చర్చించి , పనిచేయటానికి ఉపక్రమించాలి. మహాత్ముడూ తపస్సులో పండిపోయినవాడైన వాల్మీకి మహర్షి  కూడా రామాయణాన్ని  రాయడానికి ముందు  నారద మహర్షిని ప్రశ్నించాడు. నారదమహర్షి ని అడిగిన   ప్రశ్నలూ,  వాటి  జవాబులూ, కథాక్రమమూ అంతా నూరు శ్లోకాలలో పొందుపరచాడు. అది సంక్షిప్త రామాయణమయింది.

భారతీయ విద్యలో  శిష్యులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించేవారు. ఆప్రశ్నలకు తెలిసినంత వరకూ సమాధానం చెప్పేవారు.తెలియక పోతే ఒప్పుకొని సమాధానం తెలుసుకోవడానికి గురు శిష్యులిద్దరూ కలిసి ప్రయత్నించే వారు. ఙానసముపార్జనలో గురు శిష్యులిద్దరూ కలసి పని చేసే వారు. మన చదువు ఉత్సాహభరితంగా , ప్రతిఫలం లభించేదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొనేవారు. ఇద్దరూ విబేధించకుండా సత్యాన్వేషణ  చేసేట్టు అనుగ్రహించమని భగవంతుని ప్రార్థించే వారు. ఏదీ గుడ్డి గా నమ్మమని వారు శిష్యులను అడగలేదు. కానీ ప్రశ్నలను ఙాన సముపార్జన కోసమే అడగమని వారు కోరేవారు. ఒక రకమైన   గంభీరత ,విషయాన్ని నేర్చుకొనేవరకు వదలకూడదనే పట్టుదల వారిలో నెలకొని ఉండేవి. ప్రశాంత వాతావరణంలో విద్యా సముపార్జన సాఫీగా సాగిపోయేది.గురు శిష్యులే కాకుండా పెద్దలు ,జ్ఙానవంతులు అయిన వారివద్దనుండి తెలియనివాటిని అడిగి తెలుసుకొనేవారు.ఈ విధంగా నేర్చుకున్న చదువుకు సార్థకత ఉంటుంది.

ఇంకో విశేషం.రామాయణము “త”అనే అక్షరం తో మొదలౌతుంది.ఈ అక్షరం శుభప్రదమైనది.శాస్త్రం ఏమంటుందంటే

“త కారో విఘ్న నాశకః,  త కారో సౌఖ్య దాయకః “.

త అనే అక్షరం తో కావ్యాన్ని మొదలుపెడితే  విఘ్నాలను నాశనం చేసి సుఖాలను ఇస్తుందట.

శ్రీ మద్రామాయణము

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం
యః పఠేద్రామ చరితం సర్వపాపైః ప్రముచ్యతే

 
వాల్మీకి మహర్షి మనము  రామాయణము ఎందుకు చదవాలో ఇలా విశదీకరిస్తాడు. ఇది పవిత్రమైనది.పాపాలను నశింప చేస్తుంది. పుణ్యప్రద మైనది. వేదాలకు సమ్మతమైనది. రామచరిత్రను పఠించినవాడు  పాప విముక్తుడౌతాడు.

 

మరి  ఆలశ్యం ఎందుకు. రేపటి నుంచి   రామయణంలో నాకు నచ్చిన శ్లోకాలను వీనుల విందుగా,బహు పసందుగా ఒకటొకటిగా ప్రస్తావిస్తాను.
మొల్ల చెప్పినట్టు “వేదమ్మై తోచకున్న వెర్రినె చెప్పన్”.

శ్రీ మద్రామాయణము


తెలుగు కూడా సరిగా రాదు.రామాయణాన్ని రాస్తావా, అని నన్ను నేనే అక్షేపించుకొన్నాను. ఇంతలొ మొల్ల పద్యం జ్ఞాపకం వచ్చింది.

అది రఘురాము చరితము
నాదరముగ విన్న గ్రొత్తయై లక్షణ సం
పాదమ్మై పుణ్యస్థితి
వేదమ్మై తోచకున్న వెఱ్రినె చెప్పన్.

వింటేనే కొత్తగా ,లక్షణ సంపాద్యంగా ఉంటుంది  అని మొల్ల చెప్పిన మాట అక్షర సత్యం.  మరి రాస్తేనో ? రామాయణాన్ని కొన్ని సంవత్సరాల  నుండి రోజూ అధ్యయనం చేస్తున్నాను . సుందరకాండ నాలుగు మార్లు చదవడం పూర్తయింది. చదివిన  ప్రతిసారీ అది కొత్తగానే అనిపిస్తోంది . కొత్త కొత్త అర్థాలు అనుభవైకవేద్యమవుతున్నయి.

రామాయణం మా నాన్నగారు  కీర్తి శేషులు  శ్రీ  వింజమూరు రామాచార్యులవారికి  ప్రీతిపాత్రమైంది. సంస్కృతంలో నిష్న్ణాతులైన వారు, సంక్షిప్త రామాయణాన్ని కంఠతా పట్టమని మమ్మల్ని ప్రోత్సహించేవారు.  రామాయణం చదివినప్పుడల్లా   వారి జ్ఞాపకాలు  నన్ను వెంటాడతాయి. వారిని స్మరించుకొని, వారి ఆశీర్వాదంతో  రచనకుపక్రమిస్తాను.

ఏమీ రాని నాకు ఈ ఉద్దేశ్యం కలగడం  రామచంద్రుని అనుజ్ఞ  యేమోనని నా సందేహం.రామాయణం లో కొన్ని శ్లోకాలను మాత్రమే  ఇక్కడ ప్రస్తావిస్తాను. సమయం ఉండి,సమర్థత తోడవుతే  అన్ని శ్లోకాలనూ ప్రస్తావించాలని నా కోరిక. ఇక అంతా భగవదనుగ్రహమే.