Monthly Archives: అక్టోబర్ 2011

రామాయణం

మిథిలాధిపతిం   శూరం   జనకం  సత్యవిక్రమం
నిష్ఠితం  సర్వశాస్త్రేషు  తథా  వేదేషు  నిష్ఠితం

తమానయ  మహాభాగం  స్వయమేవ  సుసత్కృతం
పూర్వసంబనంధినం  జ్ఞాత్వా  తతః  పూర్వం  బ్రవీమితే

జనక మహారాజు  శూరుడు , నిజమైన  పరాక్రమం కలవాడు . భాగ్యవంతుడు , శాస్త్రపారంగతుడు .  నీవు  స్వయంగా  వెళ్ళి  సకల  మర్యాదలతో  అయోధ్యకు  తీసుకొని  రావాలి .

ప్రజలందరినీ  ఆహ్వానించమని  సుమంత్రుని  ఆదేశించాక  , అహ్వానమిచ్చి   స్వయంగా  వెళ్ళి  వెంట  తీసుకు రావలసిన  మహారాజుల  వివరాలను   పేరు పేరునా  చెప్పాడు  వసిష్ఠుడు .  ఇప్పుడు  చెప్పబోయే  వారంతా వీరులూ ,  దశరథునికి  కావలసిన  వారూ , స్నేహితులూ , ధార్మికులు . మొట్టమొదటగా  అత్యంత ఆప్తుడైన  జనకుని  పేరు వస్తుంది . జనకుడు  దశరథునికి  పూర్వ సంబంధి అట .

సాగర  తీరం

 

రామాయణం

తతః   సుమంత్రమానీయ  వసిష్ఠో   వాక్యమబ్రవీత్
నిమంత్రయస్వ  నృపతీన్  పృథివ్యాం  యే  చ  ధార్మికాః
బ్రాహ్మణాన్  క్షత్రియాన్  వైశ్యాన్  శూద్రాంశ్చైవ  సహస్రశః
సమానయస్వ   సత్కృత్య   సర్వదేశేషు   మానవాన్

చెప్పిన  పనులన్నీ  చేయగలమని  తన  అనుచరులు  మాట  యిచ్చాక  వసిష్ఠుడు   మంత్రియైన  సుమంత్రుని  పిలిచాడు .  భూమండలంలోని  రాజులందరికీ  ఆహ్వానం  పంపమని  ,  సుమంత్రుని    ఆదేశించాడు .  రాజులనేకాక ,  వర్ణవిభేదం  లేకుండా  వివిధ  దేశాలలో  నివసించే వేలకొలది   బ్రాహ్మణ , క్షత్రియ ,  వైశ్య  , శూద్రులను  ఆదర  పూర్వకంగా ఆహ్వానించి  గౌరవంగా  తీసుకొని  రమ్మని  కోరాడు .

 

ప్ర కృతి

రామాయణం

తతః  సర్వే  సమాగమ్య  వసిష్ఠ  మిదమబ్రువన్
యథోక్తం   తత్సువిహితం   న   కించి   త్పరిహీయతే
యథోక్తం  తత్కరిష్యామో  న  కించిత్  పరిహాస్యతే

వసిష్థ  మహర్షి  ఆనతిచ్చిన   విధంగా అతిథులకు  సకల సౌకర్యాలను  సమకూర్చారు   కర్మచారులు .  తమ  గృహాన్ని  పావనం చేసిన  బంధువులను  చూసినంత  అప్యాయంగా ,  యాగానికి  విచ్చేసిన  పెద్దలనూ  పిన్నలనూ పలకరించి  , వారికి  ఏ  విధమైన  అసౌకర్యం  కలగకుండా  జాగర్తగా  వ్యవహరించారు .  వసతి  విషయంలో ,  భోజన  విషయంలో  ప్రత్యేకమైన  శ్రధ్ధ తీసుకున్నారు .

ఫీడ్ బాక్  అన్నది   మానేజ్ మెంట్లో    చాలా ముఖ్యం .  చెప్పినపని  చెప్పినట్లు  చేయడమే  కాకుండా ,   చేసామని  లీడెరైన   వాడికి  చెప్పాలి . ఏవైనా  ఆటంకాలుంటే  వాటిని  సరిదిద్ద్దుకోవడానికి , అవసరమౌతే   సమయానుకూలమైన   డెసిషన్స్   తీసుకోవడానికి  , కంట్రోల్ చేయడానికీ   ఫీడ్ బాక్ ఎంతో  అవసరం . ఈ  శ్లోకంలో ” తాము  చెప్పినట్లే  పనులన్నీ  సక్రమంగా  జరుగుతున్నాయని ” వసిష్థునితో  చెబుతున్నారు  పనులు  చేయడానికి   నియోగింపబడ్డ  కర్మిష్ఠులు .

రామాయణం

సర్వే  వర్ణా  యథా పూజాం  ప్రాప్నువంతి   సుసత్కృతాః
న చావజ్ఞా    ప్రయోక్తవ్యా    కామక్రోధవశాదపి

యజ్ఞకర్మసు  యే వ్యగ్రాః  పురుషాః
తేషామపి  విశేషేణ  పూజా  కార్యా యథాక్రమాం
తే చ స్యుః  సంభృతాః  సర్వే  వసుభిర్భోజనేన  చ

యథా సర్వం  సువిహితం  న  కించిత్  పరిహీయతే
తథా  భవంతః  కుర్వంతు  ప్రీతిస్నిగ్ధేన  చేతసా

యజ్ఞకర్మల్లో  నిమగ్నమైన  శిల్పులను  విశేషంగా  సత్కరించాలి . వారికి మంచి  భోజనం   పెట్టి ,  వలసినంత  ధనాన్నిచ్చి  తృప్తిపరచాలి .  పనులు  చేయడానికి చక్కని అనుకూలమైన  వాతావరణాన్ని ఏర్పరచాలి . చేసే  పనులన్నీ ప్రీతితో , ప్రేమతో , చేయాలి .

వసిష్ఠ మహర్షి  మంచి  “మానేజ్ మెంట్  ఎక్స్పర్ట్”  రూపంలో దర్శనమిస్తారు . పనులు  సకాలంలో ,  ఏవిధమైన  తప్పులు  లేకుండా  జరగాలంటే  పనిచేసేవారిని  ప్రత్యేకంగా  వారిమనస్సులు  అహ్లాదంగా  ఉండేటట్లు  చూసుకోవాలి .  వారికి   వలసిన   సౌకర్యాలు  అమర్చేలా చూడాలి .  వారు  తమ పనిమీదే  దృష్టి  కేంద్రీకరించేలా సౌకర్యాలు  ఏర్పరచాలి .  మోటివేషన్ కు  ప్రత్యేక  ప్రాముఖ్యత  ఇవ్వాలి .  మోటివేషన్   ప్రస్తుతం   మానేజ్ మెంట్ ఎడ్యుకేషన్   లో   ప్రముఖమైన  సబ్జెక్ట్ అన్నది  అందరికీ  తెలిసిన  విషయమే . వసిష్టమహర్షి  ” పాసిటివ్   మోటివేషన్ ” కు ప్రాధాన్యత  ఇచ్చేవారని  తన అనుచరులతో  పైన   పలికిన  వాక్యాలవల్ల అనిపిస్తోంది .

రామాయణం

తథా  పౌర జనస్యాపి  కర్తవ్యా  బహువిస్తరాః
ఆవాసా  బహుభక్ష్యా  వై  సర్వకామైరుపస్థితాః

తథా  జానపదస్యాపి  జనస్య బహుశోభనం
దాతవ్యమన్నం  విధివత్సత్కృత్య  న తు లీలయా

సర్వే  వర్ణా యథా  పూజాం  ప్రాప్నువంతి  సుసత్కృతాః
న చావజ్ఞా  ప్రయోక్తవ్యా  కామక్రోధవశాదపి

“బ్రాహ్మణులకే  కాదు  ,  పురజనులందరికీ  విశాలమైన  వసతి కల్పించి  ఆ గృహాలలో భక్ష్య , భోజ్య , లేహ్యాదులనుంచాలి . జనపదాలనుండి (గ్రామాలనుండి)  వచ్చే  వ్యక్తులకు  అత్యంత  ఆదరపూర్వకంగా    అత్యుత్తమమైన  ఆహారాన్ని  ఇవ్వాలి . వారి  విషయంలో  సౌమ్యంగా ,  మర్యాదాపూర్వకంగా ఉండాలి .  వర్ణభేదాలు  లేకుండా , అన్ని  వర్ణాలవారినీ తగిన విధంగా  సత్కరించి  పూజించాలి .  పనులు చేసే సమయంలో  క్రోధం , విసుగు లాంటివి కలుగడం  సహజం . ఇటువంటి సమయాల్లో  జాగ్రత్తగా  మసలుకోవాలి ,  ఎవరినీ అనాదరంగా  చూడకూడదు “.

భారతీయ సంస్కృతి  ప్రతిబింబించే మధురమైన  వాక్కులు  వసిష్ఠ మహర్షి  నోటినుండి వెలువడ్డాయి . ఆహ్వానితులందరినీ  ఏ విధంగా ఆదరించాలో  తన అనుచరులకు వివరిస్తున్నారు  మహర్షి . అతిథులలో   భిన్న భిన్న మనస్తత్వాల  వారుంటారు . వారికి  కావలసిన సౌకర్యాలూ , భోజన పదార్థాలూ , వసతి గృహాలూ వేరు వేరుగా  వుంటాయి . ప్రతి  ఒక్కరినీ  సంతుష్ట   పెట్టాలని  మహర్షి  ఆదేశం . అందుకే బ్రాహ్మణులకు  కావలసిన సౌకర్యాలను ఏర్పరచమని చెప్పారు , అలాగే పురజనులకూ  , జానపదులకూ కావలసిన పదార్థాలను అమర్చమని ఆనతిచ్చారు . కోపం తెచ్చుకోవద్దని చెప్పారు . అందరినీ  సమానంగా  ఆదరించమన్నారు . మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు  వారి  స్వభావానికి  అణుగుణంగా  ప్రవర్తించి , వారిని సంతుష్ట పరచాలనే   భారత  సంస్కృతి  మనకిక్కడ కనిపిస్తుంది .

“అతిథి దేవో భవ” అన్న  సూక్తిని  ఆచరణలో ఎలా  పెట్టాలో  చక్కగా  వివరించారు మహర్షి .

రాబోయే శ్లోకాలలో  ఇతర  వర్గాల ప్రజలను  ఏవిధంగా సంతుష్టపరచాలో  వివరిస్తారు  వసిష్ఠులు .

                          

                                                     


 

రామాయణం

బ్రాహ్మణావసథాశ్చైవ  కర్తావ్యాః  శతశః  శుభాః
భక్ష్యాన్నపానైర్బహుభిః  సముపేతాః  సునిష్టితాః

యజ్ఞానికి  విచ్చేసే బ్రాహ్మణుల సౌకర్యార్థం  వందలకొలది  గృహాలను  నిర్మించండి .  వారికి భక్ష్యాలతో , అన్నాలతో , పానీయాలతో  కూడిన రుచికరమైన  ఆహారాన్ని  సమకూర్చండి  అని యజ్ఞానికి  కావలసిన సౌకర్యాలను సమకూర్చే  వ్యక్తులతో వసిష్ఠ మహర్షి పలికాడు .

రామాయణం

యజ్ఞ కుండము : ఇది  క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ నుండి తీసుకోబడ్డది
http://esurabhi.blogspot.com/2009/08/akshardham-fabulous-creation.html

తతో   బ్రవీద్ద్విజాన్వృధ్ధాన్యజ్ఞకర్మసు  నిష్టితాన్
స్థాపత్యే   నిష్ఠితాంశ్చైవ  వృధ్ధాన్  పరమ ధార్మికాన్

కర్మాంతికాన్  శిల్పకరాన్  వర్ధకీన్  ఖనకానపి
గణకాన్  శిల్పినశ్చైవ  తథైవ  నటనర్తకాన్

తథా  శుచీన్ శాస్త్రవిదః  పురుషాన్   సుబహుశ్రుతాన్
యజ్ఞకర్మ  సమీహంతాం  భవంతో  రాజశాసనాత్

ఇష్టకా  బహుసాహస్రీ  శీఘ్రమానీయతామితి
ఔపకార్యాః  క్రియంతాం  చ  రాజ్ఞాం  బహుగుణాన్వితాః

వసిష్ఠుడు   యజ్ఞాలు  చేయడంలో   నిష్ణాతులైన వృధ్ధ  బ్రాహ్మణులను , వాస్తు తెలిసిన  స్థపతులను (  విశ్వకర్మలను)   శిల్పులను ,  వడ్రంగులను , ఖనకులను ( గోతులను త్రవ్వే వారు) , గణకులను ( లెక్కలు తెలిసినవారు) , నటకులను , శాస్త్రవేత్తలను , బహుశ్రుతులను ( అనేక విషయాలు తెలిసిన వారు ) సమావేశ పరిచాడు . వారందరితో యజ్ఞానికి  సంబంధిచిన పనులు చేయమని  ఆజ్ఞాపించాడు . యజ్ఞ వేదిక నిర్మాణానికి   వేలకొలదీ  ఇటుకలు సమకూర్చమన్నాడు . ఆహ్వానితులైన అతిథుల కోసం తాత్కాలికంగా  నివాసాలను  నిర్మించమన్నాడు .

పూర్వకాలంలో  యజ్ఞం  చేయడం  శ్రమతో  కూడుకున్న  పని . వివిధ వృత్తులలో నిపుణులైన  వారిని సమకూర్చుకోవాలి . అశ్వమేధ  యాగం  చాలా పెద్దది . నూటికీ , కోటికీ ఎవరో  చేస్తారు . అది  చేసినప్పుడు తెలిసినవారికందరకూ  ఆహ్వానం  పంపి , వచ్చినవారిని తగు రీతిగా  సత్కరించడం  ఆనవాయితీ . వేలాది మంది ఒక చోట  గుమిగూడినపుడు  వారికి  కావలసిన వసతులూ , భోజనాలూ , ఇతర సౌకర్యాలూ ,  ఇచ్చే బహుమానాలూ ఒక ఎత్తైతే ,  యాగాన్ని  శాస్త్రీయంగా  చేయడం ఇంకో ఎత్తు . ఒక  చిన్న పెళ్ళి  చేయాలంటే  కలిగే  కష్టం  పిల్లల తండ్రులకందరికీ  అనుభవమే  కదా .మరి అంతకు ఎన్నో  వందల రెట్లు పెద్దదైన  యాగాన్ని  చేయడానికి  కావలసిన నాయకత్వమూ , ఆలోచనా ,  చతురతా ,  , వస్తుసేకరణా  సామర్థ్యమూ  మొదలైనవి  ఆ  కాలంలో ఉండడం శ్లాఘనీయం .

వసిష్ఠ మహర్షి  యజ్ఞ  నిర్వహణలో  చేయవలసిన కార్యాలను  వివరించడం మనం  రాబోయే శ్లోకాలలో చూడగలం . అయితే అవి స్థూలంగా  వివరించబడ్డాయి . సూక్ష్మంగా  వెడితే  చేయవలసిన పనులు  లెక్కకు మిక్కిలిగా ఉంటాయి . A big  event  needs  great  amount  of  preparation ,   planning  and organizing  capability . The person who gives direction  to all the experts needs to be a great administrator  giving general directions in the initial stages and getting  into  details at  later stages , solving problems all the way , taking instant decisions as and when neccessary  . The job of looking  after the entire function is given  to  sage  Vasishta ( a brahmarshi ) who undertook the job wholeheartedly,  and successfully executes it to the satisfaction of one and all

రామాయణం

తథేతి  చ స  రాజానం అబ్రవీద్ద్విజసత్తమః
కరిష్యే  సర్వమేవైతద్భవతా  యత్సమర్థితం

రాజు  కోరిన  ప్రకారం యజ్ఞభారాన్ని  వహించి  నిర్విఘ్నంగా  నిర్వహిస్తానని  మహారాజుకు   మాట  ఇచ్చాడు  మహర్షి .

రామాయణం

యజ్ఞో  మే  క్రియతాం  బ్రహ్మన్  యథోక్తం  మునిపుంగవ
యథా  న  విఘ్నః క్రియతే  యజ్ఞాంగేషు విధీయతాం

భవాన్  స్నిగ్ధః సుహృన్మహ్యం  గురుశ్చ  పరమో  మతః
వోఢవ్యో  భవతా  చైవ  భారో  యజ్ఞస్య   చోద్యతః

మునిపుంగవా !  మీరు  పరమపూజ్యులైన  పురోహితులు  . అంతకు మించి , మంచి  స్నేహితులు . ఈ యజ్ఞ భారాన్ని వహించి , విఘ్నాలు  లేకుండా , సశాస్త్రీయంగా  దీనిని  నిర్వహించాలి .

వసిష్ఠమహామునిని  బ్రహ్మన్  అని సంబోధించాడు  మహారాజు .  పూర్వకాలంలో పురోహితుడు  కావాలంటే   బ్రహ్మవిద్య  తెలిసినవాడై  ఉండాలి . విజ్ఞానఖనులు  కావడం  మూలానే   వారికా  గౌరవం  లభించేది . ఆరోజైనా ,ఈరోజైనా  చదువుకున్నవారికే గౌరవం . విద్య వలన  వినయమూ , వినయము వలన  పాత్రతా , పాత్రత వలన ధనమూ వస్తాయని  భర్తృహరి ఉవాచ . సంపాదించిన  ఆ   ధనాన్ని  ధర్మమార్గంలో  వెచ్చిస్తే   సుఖం   లభిస్తుందని  మహర్షి వాక్యం .

రామాయణం

పునః  ప్రాప్తే   వసంతే  తు  పూర్ణస్సంవత్సరో  భవత్
ప్రసవార్థం  గతో  యష్టుం  హయమేధేన  వీర్యవాన్

అభివాద్య  వసిష్ఠం  చ న్యాయతః  ప్రతిపూజ్య  చ
అబ్రవీత్  ప్రశ్రితం  వాక్యం  ప్రసవార్థం  ద్విజోత్తమం


అశ్వమేధ  యాగం  కోసం    యాగాశ్వాన్ని  వదలి  ఒక సంవత్సరం  గడచింది . దిగ్విజయంగా  అశ్వం అయోధ్యకు  తిరిగి  వచ్చింది . వసంత మాసం  కూడా  తిరిగి  అరుదెంచింది .  లతలు పచ్చదనాన్ని నింపుకున్నాయి . నిండుగా విచ్చుకున్న  పువ్వుల  బరువుతో వంగిపోయాయవి . చెరువులన్నీ  జలంతో నిండి , పద్మాలు వికసించడం  వల్ల  శోభాయమానంగా  ఉన్నాయి . సుగంధంతో  నిండిన పిల్లగాలులు  మనస్సునలరిస్తున్న  వసంతకాలం మరి . శుభ శకునాలూ  , శుభసూచనలూ  లెక్కకు  మిక్కిలిగా  కనిపించాయి  దశరథ  మహారాజుకు . యజ్ఞాన్ని  ఆరంభించే  సద్బుధ్ధితో   యజ్ఞ  శాలలోకి  అడుగుపెట్టాడు .  అక్కడ  కనిపించాడు  తేజోమూర్తియైన వసిష్ఠుడు .  వినమ్రుడై  ,  వినయమూర్తియై ,    విప్రునికి   వందనం    సమర్పించాడు .  పుత్రార్థియైన   దశరథుడు మహర్షితో  ఈ  విధంగా  విన్నవించాడు :