Monthly Archives: మే 2016

రామాయణం

ఏవముక్త్వా  మహాతేజా వసిష్ఠో  జపతాం వరః
విశ్వామిత్రం తత వాక్యం సరోషమిదమబ్రవీత్

ఆశ్రమం చిర సంవృద్ధం యద్వినాశితవానసి
దురాచారోసి తన్మూఢ తస్మాత్త్వం న భవిష్యసి

ఇత్యుక్త్వా పరమ క్రుద్ధో దణ్డముద్యమ్య సత్వరః
విధూమమివ కలమింక్ యమదణ్డ మివాపరం

 

మహాతేజోవంతుడూ , తేజశ్శాలీ , మునిశ్రేష్ఠుడూ అయిన వసిష్ఠుడు , విశ్వామిత్రునితో ” మూఢాత్మా ! చిరకాలం నుండి ఎంతో శ్రద్ధతో వృద్ధి చేసిన ఈ ఆశ్రమాన్ని ధ్వసం చేసావు . ఇక నీకు భవిష్యత్తు ఉండదు (అంటే నశిస్తావు )” అని పలుకుతూ కాలాగ్ని సదృశంగా , రెండవ యమదండం లాగా ఉన్న తన దణ్దాన్ని చేత ధరించి విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు .

IMG_7849

రామాయణం

ప్రాప్యచాస్త్రాణి రాజర్షి విశ్వామిత్రో మహాబలః
దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణో భవత్తదా

వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి
హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమం

తత గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః
యైస్స్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా

 
క్షత్రియుడైన విశ్వామిత్రుడు స్వతహాగానే బలవంతుడు . బలాన్ననుసరించి దర్పం కూడా ఉంది . ప్రస్తుతం పరమేశ్వరుడు ప్రసాదించిన అస్త్రాలు అంబుల పొదిలో చేరాయి . ఇక ఆతని దర్పానికి అంతే లేకుండా పోయింది . పర్వదినాన (పూర్ణిమ నాడు సముద్రానికి పోటు వస్తుందని తెలిసిన విషయమే ) పయోధి (సముద్రం) ఉప్పొంగిన చందాన విశ్వామిత్రుని వీర్యం వృద్ధి చెందింది . “వసిష్ఠుడు ఇక హతమైనాడు ” అని అనుకున్నాడు . వసిష్ఠాశ్రమాన్ని చేరి నూతనంగా సంపాదించుకున్న అస్త్రాలను ప్రయోగించాడు . ఆశ్రమం దగ్ధ మయిపోయింది . విశ్వామిత్రుని ధాటికి , వసిష్ఠ మహర్షి శిష్యులు చెట్టుకొకరు , దిక్కుకొకరుగా పారిపోయారు .

 

వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః

విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః

వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః
ముహూర్తమివ నిశ్శబ్దమాసీదిరిణసన్నిభం

వదతో వై వసిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః
నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః

 

శిష్యులే కాకుండా ఆశ్రమంలోని జంతువులు నలుదిక్కులకు పారిపోయాయి , పక్షులూ భయంతో ఎగిరిపోయాయి . నిమేష మాత్రంలో మహాత్ముని ఆశ్రమం మరుభూమిని తలపించింది . నిశ్శబ్దంగా మారింది .

“భయపడవలసిన అవసరం లేదు . భాస్కరుని ప్రవేశంతో నీహారం (మంచు ) ఏవిధంగా నశిస్తుందో ఆ విధంగా విశ్వామిత్రుణ్ణి నశింప చేస్తాను ” అనే వసిష్ఠ మహర్షి  పలుకులను వినకుండానే ఆశ్రమవాసులు చెల్లాచెదరై పోయారు “.

DSC02463

 

 

 

 

 

 

 

 

రామాయణం

ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః

ప్రణిపత్య మహాదేవమిదం వచన మబ్రవీత్

యదితుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ
సాఙ్గో పాఙ్గోపనిషదః స రహస్యః ప్రదీయతాం

యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు
గంధర్వ యక్షరక్షస్సు ప్రతిభాంతు మమానఘ

తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం
ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా

 
భక్తసులభుడు మహాదేవుడు ప్రత్యక్షమై వరాలు ప్రసాదిస్తానని చెప్పగానే మహతపశ్శాలి విశ్వామిత్రుడు రెండు చేతులూ జోడించి నమస్కరించి ” మహాదేవా ! నాకు ధనుర్వేదాన్ని సాంగోపంగంగా ప్రసాదించు . దేవతలకూ , రాక్షసులకూ , గంధర్వులకూ ,యక్షులకూ , మహర్షులకూ తెలిసిన అన్ని అస్త్రాలనూ నాకు స్ఫురించేలా వరమివ్వు ” అని అభ్యర్థించాడు . ” తథాస్తు ” అని పలికి నిష్క్రమించాడు త్రిపురాంతకుడు .

 

IMG_0162.JPG

రామాయణం

స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగ సేవితం
మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః

కేన చిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం

కిమర్థం తస్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితం
వరదోస్మి వరో యస్తే కాంక్షితః సోభిదీయతాం

విశ్వామిత్రుడు , కిన్నరులు ,ఉరగులు నివసించే హిమవత్పర్వతం వద్దకు వెళ్ళాడు . తపశ్శాలి , తేజోవంతుడు అయిన విశ్వామిత్రుడు మహాదేవుని (శివుడు ) అనుగ్రహం కోసం తపస్సు చేసాడు . భక్త సులభుడైన పరమేష్థి విశ్వామిత్రుని ముందట ప్రత్యక్షమయ్యాడు . వరాలను ఇవ్వడానికి పూనుకొని ” రాజా ! ఏ అర్థాన్ని కోరి తపస్సు చేస్తున్నావు . నీ కోరికలను తీరుస్తాను . నీ కోరిక నాకు తెలియజేయ ” మని అనుగ్రహించి పలికాడు .

DSC02465.JPG