Monthly Archives: జనవరి 2016

రామాయణం

స దృష్ట్వా పరమ ప్రీతో విశ్వామిత్రో మహాబలః
ప్రణతో వినయాద్వీరో వసిష్ఠం జపతాం వరం

అధ్యాత్మిక వాతావరణం ఆవరించి ప్రశాంతతను వెదజల్లుతున్న వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరాడు మహాబలుడూ , మహావీరుడూ అయిన విశ్వామిత్రుడు . జపతపాల్లో అద్వితీయుడైన వసిష్ఠమహర్షికి వినయవిధేయతలతో రెండుచేతులూ జోడించి నమస్కరించాడు .

IMG_5701

 

రామాయణం

దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితం
ప్రశాంత హరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం

బ్రహ్మర్షి గణసంకీర్ణం దేవర్షిగణ సేవితం
తపశ్చరణ సంసిద్ధై రగ్నికల్పైర్మహాత్మభిః

అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా
ఫలమూలాశనైర్దానై జితరోషై జితేంద్రియైః

ఋషిభిర్ వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః
అన్వైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం


అందమైన జింకలూ , దుప్పులూ , పక్షులూ వసిష్ఠాశ్రమం అందాన్నీ , ప్రశాంతతనూ ఇనుమడింపజేస్తున్నాయి .ఆశ్రమాల్లో కమలాలు , కలువలు ,మందమందంగా వీచే పిల్లగాలులు , పూలు , పూలగుత్తులు , చిగురుటాకులు , సరస్సులు , నదీ ప్రవాహాలు , తుమ్మెదల ఝంకారాలు , పశుపక్షులు , లతలు కనిపిస్తూ మనసుకు విందుచేస్తాయి . కనులకు పసందుగా ఉంటాయి . అందుకేనేమో ఆశ్రమాలను దర్శించాలని ఆ కాలంలో ప్రజలు కుతూహల పడేవారు . ఋషులు కూడా రాజకీయాలకు దూరంగా , పరమాత్మకు సమీపంగా ఉండి తరించేవారు .

బ్రహ్మఋషులూ , దేవర్షులూ ఉన్నారచ్చట . తపస్సు చేసి సిద్ధులు పొందిన మహాత్ములూ , అగ్నిలా వెలిగిపోతున్న మహాత్ములూ ఉన్నప్రదేశమది . మనసును నిగ్రహించిన మహర్షులు , పంచేంద్రియాలను జయించన పరమ నిష్టాగరిష్టులు , రోషానికి తలవగ్గని ఋషులు — అందరికీ ఆలవాలం ఆ ఆశ్రమం .

మంచినీటిని మాత్రమే తాగి మనుగడ సాగించే వారు కొందరుంటే , మీకంటే మేమే గొప్ప అన్నట్టుగా గాలి మాత్రమే పీల్చి బతికే వారు ఇంకొందరు . అడవిలో లభించే కందమూల ఫలాలతో కడుపు నింపుకొనేవారు కొందరుంటే , ఆకులలములతో సంతుష్టి చెందేవారు మరికొందరు .

జపహోమ పరాయణులైన వాలఖిల్య మహర్షులూ ( బ్రహ్మ వాలం నుండి పుట్టారట వాలఖిల్యులు ) , బ్రహ్మ గోటి నుండి పుట్టిన వైఖానస మహర్షులూ ఆ ఆశ్రమానికి శోభ చేకూర్చారు .

ఒక్క మాటలో చెప్పాలంటే మహనీయులుండే పావన ప్రదేశమది . ప్రశాంత వాతావరణం , కర్ణపేయంగా వినిపించే వేదధ్వనులూ , కమనీయంగా పక్షుల కిలకిలారావాలూ , అందరి మధ్యా ఏ భయం లేకుండా తిరుగాడే సాధుజంతువులూ — మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఆ ఆశ్రమం వసిష్ఠమహర్షికి నివాసం .

వసిష్ఠస్యాశ్రమ పదం బ్రహ్మలోక మివాపరం
దదర్శ జయతాం శ్రేష్టో విశ్వామిత్రో మహాబలః

రెండవ బ్రహ్మ లోకమా అన్నట్లు ఉండే ఆ వసిష్టాశ్రమాన్ని విశ్వామిత్ర మహర్షి తిలకించాడు . తిలకించి పులకించాడు .

 

 

 

 

 

 

 

 

 

రామాయణం

నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్

ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ

వసిష్ఠాశ్రమ పదం నానావృక్షసమాకులం 

నానామృగగణాక్కీర్ణం సిద్ధచారణ సేవితం
ఈ శ్లోకాలలో ఏడువేల సంవత్సరాలకు పూర్వం మన దేశంలోని ఋషులు ఏ విధంగా జీవించారో చెప్పబడింది . ఆ జీవన విధానం మనకు మార్గ దర్శకం .

ప్రశాంతమైన వాతావరణంలో పలువిధాలైన వృక్షాల మధ్యన నెలకొల్పబడిన ఆశ్రమంలో సాధు జంతువులూ , పక్షులూ నిర్భయంగా తిరుగేవి . అంటే ఆధ్యాత్మిక సోపానాలు అందుకోవడానికి రమణీయ వాతావరణం అవసరమని చెప్పకనే చెబుతున్నారు ఋషులు . ఆచార్యుడంటే ఆచరించి చూపేవాడని కదా .

ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడని వారెవరుంటారు . సిద్ధులూ ,చారణులూ , దేవ ,దానవ , గంధర్వులు ఆ ఆశ్రమంలో ఉండేవారట .

IMG_5014.JPG