Monthly Archives: జూన్ 2014

రామాయణం

తస్య పుత్రో అంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్
సంమతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియంవదః

అసమంజసుడు సజ్జనులను బాధించేవాడు . అందుచేత నగరన్నుండి బహిష్కరిప బడ్డాడు . కానీ  అసమంజసుని పుత్రుడు అంశుమంతుడు , ( ప్రహ్లాదుడిలాగా ) ప్రజలకు ప్రీతిపాత్రుడు . అందరితో ప్రియంగా మాట్లేవాడు .

ప్రజలు ఈతని ఇష్టపడేవారు . ఇష్టపడడానికి కారణం ” ప్రియవాదిత్వం ” .మంచిమాటలు మాట్లాడే నేర్పున్న వాడి  నాలుక కొనభాగాన లక్ష్మీ దేవి నివాసముంటుందట .  మంచిమాటలు మాట్లాడే నేర్పున్న  వాడికి  మంచి స్నేహితులూ , బంధువులూ  లభిస్తారట .

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!
జిహ్వాగ్రే మిత్రబాంధవాః!

మంచిగా మాటలాడేవాడికి లోకమంతా స్నేహితులే .

రామాయణం

స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మ సంభవః
బాలాన్ గృహీత్వా తు జలే సరయ్వా రఘునందన
ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్ సమీక్ష్యవై
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః
పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్

 

సగరుడి పెద్దకుమారుడు అసమంజసుడు . అతడు దుర్మార్గుడు. చిన్న పిల్లలను పట్టుకొని సరయూ నదిలో పదవేసి వారు మునిగిపోతూ ఉంటే తను కేరింతలు కొట్టేవాడు . పాప ప్రవృత్తితో సజ్జనులను బాధించేవాడు . ధర్మాత్ముడైన సగరుడు ఇది సహించలేక అసమంజసుణ్ణి అయోధ్యానగరాన్నుండి వెడలగొట్టాడు .

ఒక అలోచన :
కష్టపడి కల కాలం శ్రమించి కన్న కొడుకైనా సరే , వాడు దుర్మార్గుడై ప్రజలకు బాధ కలిగించేవాడైతే , ధర్మాత్ములైన ఆ రాజులు వారిని పరిహరించేవారు . దేశ బహిష్కారం చేసే వారు . ఇదీ మన సంస్కృతి . ప్రస్తుతం తమ తనుజలను పాలకులుగా చేయాలనే తపనలో ఉన్న మన నాయకులను చూస్తే బాధ కలుగుతుంది . కానీ ఇది మనకు అనూచానంగా వస్తున్న సంస్కృతి కాదు . భృష్టుపట్టి పోయిన సంస్కృతి .

రామాయణం

సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత
షష్టిః పుత్ర సహస్రాణి తుంబభేదాద్వినిఃసృతాః
ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్తాన్సమవర్ధయన్
కాలేవ మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే
అథ దీర్ఘేణ కాలేన రూపయౌవన శాలినః
షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవం స్తదా

కేశినికి అసమంజసుడు పుడితే  రెండవ భార్య సుమతి గర్భాన్నుండి సొరకాయ లాంటి గర్భపిండం బయటకు వచ్చింది . ఆ గర్భం పగిలి అరువదివేల మంది పుత్రులు బయటకు వచ్చారు .సూక్ష్మ రూపంతో ఉన్న వారిని ఘృత పాత్రలలో ( నేతి పాత్రలలో ) ఉంచి పెంచారు తల్లులు .చాలా సమయం గడిచింది . మెల్ల మెల్లగా సగర పుత్రులందరికీ యౌవనం ప్రాప్తించింది . రూప యౌవన లావణ్యాదులతో మెరిసిపోతూ పెరిగారు ఆ రాజ కుమారులు .

 

 

రామాయణం

ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ
జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన
అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత
అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజం

వరమిచ్చిన భృగు మహర్షికి వినయంగా నమస్కారం చేసాడు . భార్యా సహితంగా ప్రదక్షిణం చేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు సగర మహారాజు . కొంత కాలం గడిచింది . పెద్ద భార్య కేశిని గర్భవతి అయింది . అసమంజసుడనే కుమారునికి జన్మ ఇచ్చింది .

రామాయణం

తయో తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః
ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోత్ర విధీయతాం
ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః
కీర్తిమంతో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి .
మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘు నందన
పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ
షష్టిం పుత్ర సహస్రాణి సుపర్ణభగినీ తదా
మహొత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ .

పరమ ధార్మికుడు భృగుడు . కరుణతో  ,  ” మీలో ఎవరికి వంశాభివృధ్ధి  చేసే కుమారుడు కావాలి . ఇంకెవరికి మహాబలులు , కీర్తివంతులు , మహా ఉత్సాహం కలిగిన అరువది వేలమంది పుత్రులు కావాలి . ఈ విషయం మీకే వదలి వేస్తున్నానని ” పలికాడు .

వంశకరుడైన పుత్రుని ప్రసాదించమని కోరింది  కేశిని   . అరువదివేల మంది  పుత్రులు కావాలని అర్థించింది సుమతి . తథాస్తు అన్నాడు భృగుడు .

రామాయణం

ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ
షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి
భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం
ఊచతుః పరమప్రీతే కృతాఞ్జలిపుటే తదా
ఏకః కస్యాః సుతోబ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి
శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్ సత్యమస్తు వచ స్త వ 

 

” నీ ఇరువురు భార్యలలో ఒకరికి వంశాంకురమైన బాలుడు పుడతాడు . రెండవ భార్య అరువదివేల మంది పుత్రులకు మాతృమూర్తి అవుతుంది ” అని ఆశీర్వదించాడు భృగు మహర్షి . సగర మహారాజు భార్యలైన కేశిని , సుమతుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది . వారు రెండు చేతులు జోడించి ఆ మహర్షికి అభివాదం చేసారు . ” మహర్షీ ! మాలో ఎవరికి ఒక కుమారుడు కలుగుతాడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది . దయ చేసి మాకు చెప్పండి ” అని భృగుమహర్షిని కోరారు .

 

 

రామాయణం

తాభ్యాం స హి తదా రాజా పత్నీభ్యాం తస్తవాం స్తపః
హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ
అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః
సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః
అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవానఘ
కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ

సంతానం కోసం సగరుడు కేశిని , సుమతులతో సహా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు . భృగుశ్రవణమనే పర్వత సానువుల మీద తపస్సు చేయడానికి పూనుకున్నాడు . వంద సంవత్సరాలు గడిచిపోయాయి . భృగు మహర్షి సగరుని దీక్షకు మెచ్చి అతని ముందు ప్రత్యక్షమయినాడు . ” పుణ్యుడా ! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది . దానితో బాటే సాటిలేని కీర్తి కూడా నీ స్వంతమవుతుంది ” అని వరమిచ్చాడు .

రామాయణం

తాం కథాం కౌశికో  రామే నివేద్య కుశికాత్మజః
పునరేవాపరం వాక్యం కాకుత్సమిదమబ్రవీత్
అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః
సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్స చాప్రజః
వైదర్భ దుహితా రామ కేశినీ నామ నామతః
జ్యేష్టా సగరపత్నీ సా ధర్మిష్టా సత్యవాదినీ
అరిష్టనేమేర్దుహితా రూపేణప్రతిమా భువి
ద్వితీయా సగర్స్యాసీత్పత్నీ సుమతి సంజ్ఞికా

కార్తికేయుని కథ చెప్పిన కౌశికుడు రామునితో ఇంకో కథ చెప్పడానికి పూనుకున్నాడు :

పూర్వకాలంలో సగరుడనే మహారాజు అయోధ్యా నగరాన్ని పాలించేవాడు . అతడు మంచి శూరుడు , ధర్మాత్ముడు .సగర మహారాజుకు ఇద్దరు భార్యలు . విదర్భ నగర మహారాజు కూతురు ” కేశిని ” , సగరుని పెద్ద భార్య . ఆవిడ  ధర్మిష్ట   , సత్యవాదిని . సగరుని రెండవ భార్య సుమతి . అరిష్టనేమి మహారాజు కుమార్తె . ఆమె సాటి లేని సౌందర్యవతి . అయితే ఆ మహారాజుకు ఎంతకాలానికీ సంతానం కలుగ లేదు .

రామాయణం

సురసేనాగణపతిం తత స్తమతులద్యుతిం
అబ్యషిఞ్చన్ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః
ఏషతే రామ గఞ్గాయా విస్తరోభిహితో మయా
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవచ
భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స భువి మానవః
ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్

సాటిలేని కాంతితో మెరిసిపోతున్న కార్తికేయణ్ణి , అగ్ని మొదలు గాగల దేవతలు దేవసేనా నాయకునిగా అభిషేకించారు . కుమారసంభవ కథ దీనితో సమాప్తం .

నాయనా రామా ! పావనమైన గంగా మాత కథను , పవిత్రమైన కుమారసంభవ వృత్తాంతాన్ని నీకు తెలిపాను . కుమారస్వామిని భక్తితో కొలిచే భూలోక జనులు , దీర్ఘాయువు కలిగి , పుత్రపౌత్రులతో సుఖాలనుభవించి , మరణానంతరం స్కందుని లోకాన్ని చేరుతారు .

ముప్పది ఏడవ సర్గ సమాప్తం

I have a nagging personal feeling that  sage Valmiki was trying to convey certain celestial event through this story in the form of  kartikeya’s story .  . We are perhaps unable to analyse the  actual facts .

రామాయణం

తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే 

స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలం

స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్
కార్తికేయం మహాభాగం కాకుత్స జ్వలనోపమం

ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమం
షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః
గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా
అజయత్స్వేన వీర్యేణ దైత్యసేనా గణాన్విభుః

 

జారిపడినవాడిని స్కందుడని అంటారు . గర్భాన్నించి జారి పడ్డా డు కనుక కార్తికేయునికి స్కందుడనే పేరు వచ్చింది . కింద పడ్డ బిడ్డను తమ బిడ్డే అని దేవతలు చెప్పడంతో సంతోషించిన కృత్తికలు అప్పుడే పుట్టిన ఆ బాలునికి స్నానం చేయించారు . విచిత్రగా ఆ తల్లుల చనుల నుండి ఉత్తమమైన పాలు వచ్చాయి . ఆరుగురు మాతల స్తనాలలో నుండి జనించిన క్షీరాన్ని ఒకే సమయంలో తాగాడు కార్తికేయుడు . కుమార స్వామి సుకుమారుడు . అయినా ఒక్క రోజు మాతలిచ్చిన పాలు తాగి పరాక్రమవంతుడైనాడు . దైత్య సేనలను జయించాడు .