Monthly Archives: సెప్టెంబర్ 2016

రామాయణం

తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః స శరీరో యథా దివం
గచ్ఛే దిక్ష్వాకు దాయాదో విశ్వామిత్రస్య తేజసా
తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్టత

ఏవ ముక్త్వా మహర్షయశ్చ క్రుస్తాస్తాః క్రియాస్తదా
యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రో భవత్కృతౌ

ఋత్విజశ్చాను పూర్వ్యేణ మంత్ర్వన్ మంత్ర కోవిదాః
చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి

తతః కాలేన మహతా విశ్వామిత్రో మహా తపాః
చకారావాహనం తత్ర భాగార్థం సర్వ దేవతాః

నాభ్యాగమం స్తదాహూతా భాగార్థం సర్వ దేవతాః

తతః క్రోధమావిష్టో విశ్వామిత్రో మహామునిః
స్రువముద్యమ్య సక్రోధ త్రిశంకు మిదమబ్రవీత్

పశ్యమే తపసొ వీర్యం స్వార్జితస్య నరేశ్వర
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా
దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్ఛ నరాధిప

స్వార్జితం కిం చిదప్యస్తి మయ హి తపసః ఫలం
రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ

ఉక్త వాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః
దివం జగామ కాకుత్థ్స మునీనాం పశ్యతాం తదా

 

త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపడానికి యాగాన్ని చేయడానికి నిశ్చయించుకున్న మహర్షులు యాగాన్ని మొదలు పెట్టారు . ఇతర కార్యాలను మహర్షులు నిర్వహిస్తుండగా , తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు తానే స్వయంగా యాజకుడయ్యాడు . మంత్రకోవిదులైన ఋత్విక్కులు శాస్త్రం నిర్దేశించిన ప్రకారం మంత్రాలను పఠిస్తూ , క్రమం తప్పకుండా , కల్పంలో చెప్పబడినట్లు యాగాన్ని నిర్వహించారు . ఈ యజ్ఞం చాలా దినాలు సాగింది . పిదప తపోమూర్తి అయిన విశ్వామిత్రుడు దేవతలను వారి వారి యజ్ఞ భాగాలను గ్రహించడానికి రమ్మని ఆహ్వానించాడు . మహర్షి పిలిచినా దేవతలు తమ యజ్ఞ భాగాలను గ్రహించడానికి రాలేదు . మహర్షి కోపోద్రిక్తుడైనాడు .స్రువాన్ని ( హోమసాధనమైన కొయ్యగరిటె ) పైకెత్తి , త్రిశంకు మహారాజుతో ఈ విధంగా పలికాడు .” రాజా ! నా తపః ప్రభావాన్ని నీకు చూపిస్తాను . నా తేజస్సు చేత నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను . సశరీరుడవై ఇతరులెవ్వరికీ సాధ్యం కాని స్వర్గానికి నీవు వెళ్ళు . నేను స్వయంగా సంపాదించిన తపః ఫలితం కొంత ఉన్నది కదా . ఆ తపస్సుకు కల తేజస్సు వలన నీవు స్వర్గానికి వెళ్ళు ” .

విశ్వామిత్రుడు తన తపస్సును ధార పోసిన మరుక్షణం త్రిశంకు మహారాజు , సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు .

Reflection :

శరణన్న మహారాజుకు క్షత్రియ ధర్మానుసారం శరణు ఇచ్చాడు సరణాగత వత్సలుడు కౌశికుడు . శరణు కోరిన వాడి కోరిక తీర్చడం కోసం వలసిన యాగాన్ని తానే యాజకుడై నిర్వహించాడు . దేవతలు నిరసించి ,ఆహుతులను అందుకొని , త్రిశంకు కోరిక తీర్చడానికి రాక పోతే తను కష్టపడి సంపాదించిన తపస్సును వెచ్చించి స్వర్గానికి పంపించాడు తన ఆశ్రితుణ్ణి . ఇదీ శరణాగతున్ని కాపాడే దీక్ష . ఇది మహర్షి వ్యకిత్వంలో ఒక అంశ .

మహర్షి శుశ్రూష చేసిన శ్రీరామ చంద్రుడు గురువు దారిలో ప్రయాణం చేస్తూ “శరణన్న వానికి శరణమీయడం తన వ్రతమని వ్రాక్కుచ్చాడు” . శరణన్న వానికి శరణం ఇవ్వకుండా ఉండనని , ఉండలేనని పలికిన రామచంద్రుని పలుకులు ఆలకించండి . కోరితే అంత తప్పు చేసిన రావణునికే శరణాన్ని ప్రసాదిస్తానన్నాడు, రఘుకుల తిలకుడు రామచంద్రుడు .

సకృదేవ ప్రపన్నాయ తావాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ

” అత ఏవ రామాయణం దీర్ఘశరణాగతి రిత్యభి యుక్తైర్యుక్తం ” అని పెద్దల వాక్యం . రామాయణం శరణాగతి కావ్యం . వివరించాలంటే దీర్ఘమైన వ్యాఖ్యానం అవసరమవుతుంది .

కల్పం : వేదానికి ఆరు అంగాలు . అవి వరుసగా”శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము”. ఇందులో కల్పంలో యజ్ఞాలలో జరిపే కార్యాలను వివరిస్తూ సూత్రాలు ఉంటాయి . కల్ప సూత్రాలను

శ్రౌత సూత్రాలు , స్మార్త సూత్రాలు  అని రెండు భాగాలుగా విభజించ వచ్చు . శ్రౌత సూత్రాలలో హోమగుండ నిర్మాణం , వాటి సంఖ్య ,వాటి కోలతలు .వాటి నిర్మాణ పద్ధతులు , హోమ ప్రక్రియలు , మొదలగు వాతిని గురించి చెప్పబడ్డాయి .శుల్బ సూత్రాలు కల్ప సూత్రాలలో ఒక భాగం

స్మార్త సూత్రాలలో గృహ్య సూత్రాలు అంటే గృహస్తులకు పనికివచ్చే సూత్రాలు. పెళ్ళి, జననం, నామకరణం వంటి సందర్భాలలో పాటించవలసిన విధానాలు. ఇంటిలో ఏర్పరచే హోమగుండాలు లాంటివి వివరించబడ్డాయి . ధర్మ సూత్రాలలో ఆచారాలు, సామాజిక వ్యవహారాలు వివరించ బడ్డాయి .

 

dsc01988

 

 

 

 

 

 

రామాయణం

విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః
ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా బ్ధర్మ సంహితం .

అయం కుశిక దాయాదో మునిః పరమ కోపనః
యదాహ వచనం సమ్యగే తత్కార్యం న సంశయః
అగ్ని కల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః

విశ్వామిత్రుని అభ్యర్థనను విన్న వారు ” కౌశిక వంశంలో జనించిన మహర్షి అభ్యర్థించిన విధంగా చేయడం సరియైనది . అందులో ఏ విధమైన అనుమానానికీ తావులేదు .పూజ్యుడు . అగ్నికల్పుడు . అందునా కోపిష్టి . కోపాన్ని కలిగిస్తే శాపం తప్పదు . విశ్వామిత్ర మహర్షి తపస్సు ఫలితంగా సశరీరుడై స్వర్గానికి వెళ్ళడానికి వలసిన యజ్ఞాన్ని ప్రారంభిద్దాము . అందరూ ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి “నని తమలో తాము ముచ్చటించుకున్నారు .

విశ్వామిత్రునికి సహాయం చేయడానికి కారణాలు విశ్వామిత్ర మహర్షి తపస్సు మీద వారికి ఉన్న నమ్మకం .అంతే కాకుండా కాదంటే కాటేస్తాదేమోనన్న (శపిస్తాడేమో అన్న ) భయం .

“నయమునఁ బాలుం ద్రావరు; భయమున విషమ్మునైన భక్షింతురుగా; నయమెంత దోసకారియొ; భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ ” అన్న సుమతీ శతక పద్యం ఈ సందర్భంలో జ్ఞాపకం రాక మానదు . తన కార్యాన్ని కోపం చూపి సాధించుకోవడంలో విశ్వామిత్రుని మించిన వారు కానరారు .

dsc01987

Reflections:

One of the definitions of management is “Getting things done ” . Sage Viswamitra is a master in management . He was able to convince (scare ) king Dasaratha to send Lord Rama to  help him . He got most of the sages to help him in performing the yaaga to send Trisanu to heaven . In fact he succeeds in sending Trisanku to heaven . He uses Lord Rama to get rid of Tataka and her progenies . He plans for and succeeds in arranging the marriage of Lord Rama . He succeeds in his ultimate aim of  becoming Brahmarshi despite many obstacles . He is a kshatriya in his thinking and we can see the tenacity of a king in his actions . However he realises that satvika guna is necessary  for becoming brahmarshi which was his ultimate aim . He struggles and struggles and finally cultivates satvika guna .

His is a success story . Despite many a human fallible in his character , and failures in the way he always succeeds in the end by doing and getting things done . He is  an excellent leader as well as a good manager .

 

 

రామాయణం

తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ స మహోదయాన్
ఋషి మధ్యే మహాతేజా విశ్వామిత్రోభ్య భాషత

అయమిక్ష్వాకు దాయాద స్త్రి శఙ్కురితి విశ్రుతః
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః
తేనానేన శరీరేణ దేవలోక జిగీషయా

యథాయం స్వ శరీరేణ స్వర్గలోక్మ్ గమిష్యతి
తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ

వసుష్ఠ కుమారులను , మహోదయుని శపించిన మహర్షి , తన ఆశ్రమంలో సమావేశమైన ఋషులతో సౌమ్యంగా ” ఇతడు ఇక్ష్వాకు వంశంలో జనించి త్రిశంకు నామధేయంతో ప్రసిద్ధుడైన మహారాజు . దాత ,ధర్మిష్ఠుడు . స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళవలెననే కోరికతో నా శరణుజొచ్చాడు . శరణువేడిన ఈ మహారాజును స్వర్గానికి పంపవలెనని నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను . యజ్ఞాన్ని నిర్వహించడానికి మీరు నాకు సహాయం చేయవలసింది “అని వారి సహాయాన్ని అర్థించాడు .

 

DSC01921.JPG

 

 

 

 

 

 

రామాయణం

ప్రాణాతి పాత నిరతో నిరనుక్రోశతాం గతః
దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి

ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః

” నన్ను నిందించిన మహోదయుడు నిషాద జాతిలో జన్మించి సకల జనుల చేతా దూషింపబడతాడు . నా కోపానికి ఫలితంగా ఈ మహోదయుడు జాలిలేని వాడై , ఇతరుల ప్రాణాలు తీయడంలో అనురక్తుడై , చాలాకాలం హేయమైన జీవితాన్ని గడపగలడు ” అని ఋషులమధ్యలో పలికాడు .

మహర్షి వ్యక్తిత్వం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది . తనను నిందించిన వారిని వదలడు . కోపానికి వశుడు . ఎంతో శ్రమకోర్చి సాధించిన తపో ఫలాన్ని క్షణంలో వదులుకున్నాడు . ఈ గుణాలన్నీ రాజస గుణాలు . అందుకే బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని రాజర్షిగానే గుర్తించాడు . కాలక్రమాన ఈ లక్షణాలను వదలి పెట్టి బ్రహ్మర్షి అవుతాడు .

img_9228

రామాయణం

తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః
క్రోధ సంరక్తనయనః సరోష మిద మబ్రవీత్
యే దూషయంత్య దుష్టం మాం తప ఉగ్రం సమాస్థితం
భస్మీ భూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః
అదా తే కాలపాశేన నీతా వైవస్వతక్షయం
సప్తజాతి శతాన్యేవ మృతపాః సంతు సర్వశః
శ్వ మాంస నియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః
వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్
మహోదయస్తు దుర్బుద్ధిర్మా మదూష్యం హ్యదూషయత్
దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి

శిష్యుల మాటలు విన్న మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది . నేత్రాలు ఎరుపు రంగులోకి మారాయి . పెదవుల నుండి పరుష వచనాలు వెలువడ్డాయి . ” తపోవృత్తిని ఆశ్రయించి ఉగ్రమైన తపస్సు చేస్తూ , చెడుకు దూరంగా ఉండే నన్ను దూషించిన దురాత్ములు సందేహం లేకుండా భస్మమవుతారు .వారందరూ యమ పాశంచేత బంధిపబడి ఏడువందల సంవత్సరాలు శవభక్షకులుగా ఉంటారు . వసిష్ఠ మహర్షి తనయులు వికృతాకారాన్ని ధరించి ,కుక్క మాంసాన్ని భక్షిస్తూ ఈ లోకంలో చరిస్తారు ( సంచరిస్తారు )

విశ్వామిత్ర మహర్షి విశ్లేషణ :

విశ్వామిత్రుడు విశ్వానికి నిజంగానే మిత్రుడు . లోకాలకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు . నాలుగు వేదాలలో ప్రస్తావించబడిన గాయత్రీ మంత్ర సృష్టికర్త విశ్వామిత్ర మహర్షి . గాయత్రీ మంత్రమే కాకుండా ఎన్నో ఇతర మంత్రాలను తన తపశ్శక్తితో సాధించి లోకాలకు అందజేసిన అసామాన్య వ్యక్తి .ఆకలి దప్పులు దరిజేరకుండా చేసి , అమితమైన శక్తిని ప్రసాదించే బల అతిబల మంత్రాలను ( ఈ మంత్రాలు ఈ రోజున కూడా మనకు లభ్యం , కానీ వాటిని ప్రయోగించడమెలాగో చెప్పే వారు కానరారు ) శ్రీ రామునికి ఉపదేశించిన తపోబల సంపన్నుడు కౌశికుడు . అస్త్ర మంత్రాలన్నీ ఈయన స్వంతం . నేర్చుకున్న విద్యలన్నీ దాచుకోకుండా రామ లక్ష్మణులకు ఉపదేశించిన ఉత్తముడీ మహర్షి . మహాభారతంలో అర్జునుడు అతి కష్టం మీద సంపాదించుకున్న పాశుపతాస్త్రం ఈ మహర్షి అమ్ముల పొదలో ఉంది .మనం మహా విష్ణువు దగ్గర మాత్రమే ఉందనుకునే విష్ణుచక్రం కూడా ఈ మహర్షి అస్త్రాల్లో ఉంది .  అన్ని విద్యలనూ ఏ అరమరికలు లేకుండా రామ లక్ష్మణులకు ఉపదేశించాడు . అదీ అతని శిష్య వాత్సల్యం .

విశ్వామిత్రుడు గురువులందరికీ మార్గదర్శకుడు . విద్యాదానం చేయడానికి మహర్షి ఎంచుకున్న సమయం ప్రభాత సమయం . బాలమరీచిమాలికలు లోకాలను తమ అరుణవర్ణంతో ముంచెత్తిన సమయమది . ప్రశాంత వాతావరణం . ఆ సమయాన మధురమైన శ్లోకంతో రామ లక్ష్మణులను నిదుర లేపాడు . మాతృమూర్తి కౌసల్య నామస్మరణతో శిష్యుల మదిలో ఆహ్లాదం నింపాడు . స్నాన సంధ్యావందనాలు చేసాక తన చెంతకు చేర్చి అసామాన్యమైన అస్త్ర విద్యలను ఉపదేశించాడు . ఇదీ విద్యను శిష్యులకు నేర్పించవలసిన పద్ధతి . ఆహ్లాదకరమైన వాతావరణంలో , మనస్సు ప్రశాంతంగా ఉన్న వేళ మధురమైన మాటలు పలుకుతూ నేర్పించిన విద్య వంటబడుతుంది . బల అతిబల విద్యలు , అస్త్ర మంత్రాలు రామ లక్ష్మణులను అనుగ్రహించడానికి నిర్ణయించి తెల్లవారు జామున “కౌసల్యా సుప్రజా రామ ” అని మధురంగా పలుకుతూ నిద్ర లేపుతాడు . పిల్లవాడికి తల్లిని తలుచుకుంటూ లేవడం కన్న సుఖప్రదమైన , శుభకరమైనది ఇంకేముంటుంది . ప్రస్తుతం వెంకటేశ్వర సుప్రభాతంలోని ప్రప్రథమంగా వినబడే ” కౌసల్యా సుప్రజారామ అనే శ్లోకానికి ఆద్యుడు ఈ మహర్షే .

విశ్వామిత్రుడు సార్థక నామధేయుడు . లోకకళ్యాణమే ఈ మహర్షి లక్ష్యం .స్వధర్మాచరణమే కర్తవ్యంగా భావించి ఆ విధంగానే తన జీవితాన్ని మలుచుకున్న మహనీయుడు . దశరథునికి
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ
స్వధర్మం ప్రతిపద్యస్య నాధర్మం వోఢు మర్హసి .
స్వధర్మాన్ని ఆచరించు , అధర్మాన్ని చేయకు అని ఉపదేశించాడు . మహర్షులందరూ ఆచార్యులు , అంటే ఎవరికైనా నీతులు చెప్పే ముందు దాన్ని తాము ఆచరించిన తరువాతే ఉపదేశిస్తారు . స్వధర్మాన్ని తను ఆచరిస్తాడు కనుకనే ,ఆవిధంగా నడుచుకోవాలని దశరథునికి చెప్పగలిగాడు . మహర్షి స్వధర్మం ఏమిటి ? తపస్సు ద్వారా జ్ఞాన సముపార్జన చేయడం . శిష్యులకు వాత్సల్యంతో చదువు చెప్పడం , వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దడం . భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకోవడం . తమకు అవసరం లేకున్నా , లోకులకు ఆచరించి చూపాలి కనుక కర్మలను ఆచరించడం ( యజ్ఞ యాగాదులు మహర్షుల కర్మలలో ముఖ్య భాగం) . ప్రజలను బాధ పెట్టే దుష్ట శక్తులను మట్టుపెట్టడం . ఏ జీవికైనా బాధ కలుగుతే దానిని నివారించడం .భక్తి మార్గంలో ప్రజలను నడిపించడం . శరణు కోరిన వారికి అభయ ప్రదానం చేయడం .
విశ్వామిత్రుడు స్వధర్మాలన్నీ ఆచరించాడు . పుణ్యాత్ముడైనాడు . ఆ పుణ్యఫలంగా భగవంతుని అవతారమైన రామచంద్రునికే ఆచార్యుడైనాడు . విశ్వామిత్రుని గొప్పతనమంతా అలుపులేని , నిరంతరమైన ప్రయత్నంలో ఉంది . మానవ సహజమైన కోరికలకు దాసుడైనాడు . ఇంద్రియాలకు లొంగిపోయాడు . వేల సంవత్సరాలు శ్రమకోర్చి సంపాదించుకున్న తపః ఫలితాన్ని విషయాసక్తితో జారవిడుచుకున్నాడు . కోపం ఈ మహర్షి పాలిట శత్రువైంది . కోప ఫలితంగా సాధించిన శక్తులను కోల్పోయాడు . అయితే నిరాశ చెందలేదు . ప్రయత్నాన్ని తీవ్రతరం చేసి పోగొట్టుకున్నదంతా తిరిగి సాధించాడు . అసాధ్యమైన బ్రహ్మర్షిత్వాన్ని చేజిక్కించుకున్నాడు . సృష్టికి ప్రతి సృష్ఠి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగిన ఒకే ఒక వ్యక్తి విశ్వామిత్రుడు . అనుకున్నది సాధించడంలో ఆ మహర్షికి సాటిరాగలవారు ఎవరూ కనిపించరు , అసలు లేరేమో ? తలపెట్టినవన్నీ అసాధ్యమైనవే . అసాధ్యాలన్నిటినీ ప్రయత్నపూర్వకంగా సుసాధ్యం చేసుకున్నాడు . లోకాలకు , లోకులకు మార్గ దర్శకు డయ్యాడు .మనం కూడా దైనందిన జీవితంలో తప్పులు చేస్తాం . తప్పులు పెద్దవైతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి కానీ నిరాశా నిస్పృహలకు లొంగిపోకూడదు . విశ్వామిత్రుని కథను మార్గ దర్శకంగా తీసుకోవాలి . ఇంద్రియాలకు ఎన్నో సార్లు లొంగిపోయాడు . కానీ తప్పు తెలియగానే మరల మంచి మార్గం వైపు మరలి అనుకున్నది సాధించాడు . ఇదీ బ్రహ్మర్షి వ్యక్తిత్వం .

అమిత తేజస్సుతో తిమిరాన్ని తరిమికొట్టే భాస్కరుని రీతిలో , లోకాల చీకట్లు పోకార్చిన ఆ మహనీయుని చరిత్రను రామాయణంలో మధురాతి మధురంగా వర్ణించాడు ఆదికవి వాల్మీకి . ఆ కథల వలన మనం ఏ విధంగా లాభ పడగలమో నాకు తెలిసినంత వరకూ వివరిస్తాను . ఒక్క విషయం మాత్రం నిజం . నాకు తెలిసినది అణుమాత్రం . మహర్షి గొప్పతనం ఆకాశాన్నటుంది . కాళిదాసు శ్లోకం ” ప్రాంశు లబ్ధే ఫలే లోభాదుద్భాహురివ వామనః ” నాకు చక్కగా అన్వయమౌతుంది .అపహాస్యం పాలు కాక తప్పదు . భయంకరమైన అలలతో అలరారే సముద్రాన్ని తెప్పతో దాటడానికి ప్రయత్నించడమంటే ఇదే . అసాధ్యమే . బ్రహ్మర్షి వ్యక్తిత్వాన్ని వివరించడం సామాన్యులకు సాధ్యమా . కానీ అణుమాత్రం తెలిసినా అది అందరితో పంచుకొని ఆనందించాలిగా . అయినా వాల్మీకి మహర్షి చెప్పినది పునరావృతం చేయడమే కదా నేను చేయవలసింది . అందుకే ఈ సాహసం . సాధ్యా సాధ్యాలను పరమాత్మునికి వదలి ప్రయత్నలోపం లేకుండా చూడమని మహర్షి అదేశం .  ప్రయత్నాన్ని ఆపవద్దని విశ్వామిత్ర మహర్షి ఉద్బోధ .

IMG_0108.JPG

రామాయణం

తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్త దాజ్ఞ్యయా
అజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః

తే శిష్యాః సమాగమ్య ముని జ్వలిత తేజసం
ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినం

శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః
సర్వదేశేషు చాగచ్ఛన్ వర్జయిత్వా మహోదయం 

విశ్వామిత్ర మహర్షి శిష్యులు బయలుదేరి నలుదిశలా నివసిస్తున్న బ్రహ్మవాదినులైన బ్రాహ్మణులను సగౌరవంగా అహ్వానించారు . ఆహ్వానాన్ని అందుకొని యజ్ఞాన్ని చేయించడానికి వచ్చారు ఆ వేదాధ్యయన సంపన్నులు . ఆహ్వానించిన బ్రాహ్మణులు పలికిన మాటలను విశ్వామిత్రునికి వివరంగా చెప్పసాగారు శిష్యులు . ” మీ వచనం విన్న ద్విజులు యాగానికి వస్తున్నారు . మహోదయుడనే బ్రాహ్మణుడు మాత్రం రావడం లేదు .

వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరం
యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుంగవ

క్షత్రియో యాజకో యస్య చణ్డాలస్య విశేషతః
కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః

బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చణ్డాలభోజనం
కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః

ఏతద్వచన నైష్ఠుర్యమూచు సంరక్తలోచనా
వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే స మహోదయాః

మీ వచనాలు విన్న నూర్వురు వసిష్ఠ మహర్షి కుమారులు, మహోదయుడు మాత్రం క్రోధంతో వ్యాకుల చిత్తంతో పలికిన పలుకులు ఈ విధంగా ఉన్నాయి ” క్షత్రియుని యాజకునిగా స్వీకరించిన వాడు , అందునా చణ్డాలుడు సమర్పించే హవిస్సులను సురులు , మహర్షులు ఏ విధంగా స్వీకరిస్తారు . విశ్వామిత్రుని మాటలు విని చణ్డాలుడొసగిన భోజనాన్ని గ్రహించిన బ్రాహ్మణులు మహాత్ములైనా సరే స్వర్గానికి వెళ్ళగలరా ?” అని కనులు ఎరుపుగా చేసి పరుషంగా పలికారు .

ఆలోచన : విశ్వామిత్రుడు తన ఆహ్వానాన్ని వసిష్థ మహర్షికి పంపాడా , లేదా ? అని నాకొక సందేహం .

img_0162

రామాయణం

గురుశాప కృతం రూపం యదిదం త్వయి వర్తతే
అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి

హస్త ప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప
యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః

ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞసంభారకారణాత్

“శరణాగత రక్షకుడైన కౌశికుని శరణు కోరావు . స్వర్గం నీకిక కరతలామలకం .గురుశాపం వలన ఏర్పడిన ఏఏ రూపం తోనే నీవు స్వర్గానికి వెళ్ళగలవు . యజ్ఞం చేయడానికి సహయం కోసం పుణ్యకర్ములైన మహర్షులకు నేను స్వయంగా నిమంత్రణం చేస్తాను . నీవు ఆనందంగా యాగాన్ని నిర్వహించగలవు ” అని అభయమిచ్చాడు కౌశికుడు .

తన తపస్సుతో ఏ కార్యాన్నైనా సాధించగలననే ధీమా విశ్వామిత్రుడిలో మనకిక్కడ కనిపిస్తుంది . శరణు కోరిన వాడిని రక్షించడానికి తన సర్వ శక్తులూ ధారపోయడానికి , తన తపశ్శక్తిని వినియోగించడానికి వెనకాడని వ్యక్తిత్వం విశ్వామిత్ర మహర్షిది .

ఏవముక్త్వా మహాతేజాః పుమ్రాన్ పరమధార్మికాన్
వ్యాదిదేశ మహా ప్రాజ్ఞాన్ యజ్ఞసంభార కారణాత్

వర్వాన్ శిష్యాన్ సమాహూయే వాక్యమే తదువాచహ
సర్వానృషిగణాన్వత్సా ఆనయధ్వం మమాజ్ఞ్యయా
స శిష్య సుహృదశ్చైవ సర్త్విజః సబహుశ్రుతాన్

యదన్యో వచనం బ్రూతే మద్వాక్యబలచోదితః
తత్సర్వ మఖిలేనోక్తం మమాఖ్యేయ మనాదృతం
మంచి బుద్ధి కల తన కుమారులతో మహా తేజస్కుడైన మహర్షి విశ్వామిత్రుడు , యజ్ఞానికి వలసిన సంభారాలను సమకూర్చమని ఆనతిచ్చాడు . పిదప తన శిష్యులను సమావేశ పరిచి ” వత్సలారా ! ఋషులందరినీ , సపరివారంగా నేను తలపెట్టిన యాగానికి ఆహ్వానించండి . శిష్యులతో , బంధుమిత్రులతో , ఋత్విక్కులతో , శాస్త్రాలు తెలిసిన విద్వాంసులు మహాత్ములతో సహా రమ్మని ఆహ్వానించండి . నా సందేశాన్ని విన్న వారిలో ఎవరైనా అనాదరంగా పలికితే ఆ విషయమంతా నాకు తెలీయజేయండి ” అని అజ్ఞాపించాడు .

ఆలోచన : తను తలబెట్టిన కార్యాన్ని విమర్శించేవారుంటారని విశ్వామిత్రుడికి తెలుసు . తన వారెవరో , పరవారెవరో తెలుసుకోవాలని ఆ మహాత్ముడి కోరిక . తనను ఎవరైనా విమర్శిస్తే సహించలేని స్వభావం . బ్రహ్మర్షి కాక ముందు విశ్వామిత్రుని స్వభావాన్ని మనకు చక్కగా విశద పరుస్తున్నాడు మహర్షి వాల్మీకి .

 

img_5090

 

రామాయణం

ఉక్త వాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చణ్డాల రూపిణం

ఐక్ష్వాక స్వాగతం వస్త్ జానామి త్వాం సుధార్మికం
శరణం తే భవిష్యామి మా భైషీర్నృప పుంగవ

చణ్డాల రూపంలో ఉన్న మహారాజు పలికిన మాటలు విని జాలిపడి మధురమైన మాటలు ఈ విధంగా పలికాడు .” ఐక్ష్వాక మహారాజా ! నీకు స్వాగతం . నీవు మంచి ధర్మ నిష్ఠ కలవాడవని నేనెరుగుదును . భయపడవలసిన అవసరం లేదు . నీకు నేను అభయాన్ని ప్రసాదిస్తాను .”

” నీవే తప్ప వితః పరంబెరుగ ” అని విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు త్రిశంకుడు . ఆశ్రయించిన వారిని వదలి పెట్టడు ఆ మహర్షి .శరణు కోరిన వారికి అభయమివ్వడం క్షత్రియ ధర్మం . విశ్వామిత్రునికి బ్రాహ్మణత్వం ఇంకా లభించలేదు . తన స్వధర్మాన్ని పాటిస్తూ అభయ మిచ్చాడు . ఇది సహజమే .

IMG_9867

రామాయణం

కిమాగమన కార్యం తే రాజపుత్ర మహాబలం
అయోధ్యాధిపతే వీర శాపాచ్చణ్డాలతాం గతః

అథ తద్వాక్య మాజ్ఞ్యాయ రాజా చణ్డాలతాం గతః
అబ్రవీత్ ప్రాఞ్జలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్య కోవిదం

” మహాబలా! అయోధ్యాధిపతీ ! రాజపుత్రా ! అయ్యో ! శాపవశాన చండాలుడవయినావు గదా ? నా దగ్గరకు రావడానికి కారణమేమి ” అని జాలితో ప్రశ్నించాడు విశ్వామిత్రుడు . వాక్యజ్ఞుడైన విశ్వామిత్రునికి నమస్కారం చేసాడు త్రిశంకుడు .

ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రస్తథైవచః
అనవాప్యైన తం కామం మయా ప్రాప్తో విపర్యయః

స శరీరో యాయామితి మే సౌమ్య దర్శనం
మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలం

అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కథాచన
కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే

యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజాధర్మేణ పాలితాః
గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః

ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః
పరితోషం న గచ్ఛంతి గురవో మునిపుంగవ

దైవమేవ పరమ్మన్యే పౌరుషంతు నిరర్థకం
దైవేనాక్రమ్యతే వర్వం దైవం హి పరమాగతిః

తస్య మే పరమార్తస్య ప్రసాదమభికాఙ్ క్షతః
కరతె మర్హసి భద్రం తే దైవోపహతి కర్మణః

నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే
దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి

మహాత్మా ! గురువు , గురుపుత్రులు నేను కోరిన కోర్కె తీర్చలేదు . కోరిక తీరలేదు కానీ నాకీ చండాలత్వం ప్రాప్తించింది .ఈ విపరీతమైన ఫలం లభించింది . సశరీరుడనై స్వర్గానికి వెళ్ళవలెనని నా చిరకాల వాంఛ . నూరు యజ్ఞాలు చేసాను .కానీ నాకు స్వర్గం లభించలేదు .

మహర్షీ ! నేను పూర్వమెప్పుడూ అసత్యాన్ని పలుకలేదు . ఇక ముందర అసత్యం పలుకను . నా క్షత్రియ ధర్మం సాక్షిగా చెబుతున్నాను . ఎన్నో యజ్ఞాలు చేసాను . ధర్మానుసారంగా ప్రజలను పరిపాలించాను . పెద్దలను సేవించాను . వారిని నా  శీలంచేత ,  నడవడిక చేత , సంతోష పెట్టాను .ధర్మాన్ని అనుసంధిస్తూ సశరీరుడనై స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞాన్ని చేయించమంటే గురువులు సంతోషించడం లేదు   అయినా దైవబలం ముందు నా ప్రయత్నం సాగడం లేదు . నా ప్రయత్నమంతా విఫల మయింది  . దైవమే పరమ గతి అని నమ్మిన వాడను . దైవమనుకూలించక , విఫలుడనైన నేను మీ శరణాగతుడనైనాను . మీ ప్రసాదం (అనుగ్రహం ) కోసం వేడుకుంటున్నాను . కరుణించి అనుగ్రహించండి . నేనిక ఎవ్వరి వద్దకూ వెళ్ళను . తమకంటే నాకిక వేరు దిక్కు లేదు . పురుష ప్రయత్నం చేత దైవాన్ని అనుకూలంగా మార్చి ,నా కోరికను సఫలీకృతం చేయండి ” అని దీనంగా వేదుకున్నాడు త్రిశంకుడు .

DSC02215

 

 

 

 

రామాయణం

విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతం
చణ్డాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః

కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మికః
ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపిణం

కోరిక తీరక పోగా , చణ్డాలత్వాన్ని పొందిన త్రిశంకు మహారాజును చూసి  కౌశికుని హృదయం కరిగిపోయింది . ధర్మమూర్తి , తేజంతో ప్రజ్వరిల్లుతున్న మహామహితాత్ముడు కౌశికుడు కరుణ ముప్పిరి కొనగా ” భద్రం తే ” ( నీకు మంగళం ) ” అని పలికాడు .

మహామహుల వాక్కు ఎప్పుడూ మంగళకరంగానే ఉంటుంది . ఆశ్రయించిన వారికి శుభాలు కలగాలని వారు మనసా , వాచా ,కర్మణా కోరుకుంటారు . అందుకు అనుగుణంగానే వారి పలుకులుంటాయి . శుభం , మంగళం లాంటి మాటలు వారి నోటినుండి వస్తుంటాయి .

DSC02193