Monthly Archives: డిసెంబర్ 2011

రామాయణం

ప్రాప్తే    యూపోచ్ఛ్రయే  తస్మిన్  షడ్ బైల్వాః
తావంతో  బిల్వసహితాః  పర్ణినశ్చ తథాపరే
శ్లేష్మాతకమయస్త్వేకో  దేవదారు మయస్తథా
ద్వానేవ  విహితౌ  తత్ర  బాహువ్యస్తపరిగ్రహౌ

యజ్ఞానికి  అవసరమైన   యూపస్తంభాలను   పైకి  ఎత్తవలసిన  సమయం  ఆసన్నమయింది .  ఆరు  చండ్ర  , ఆరు  మారేడు , ఆరు  మోదుగ  కర్రలతో  చేసిన   స్తంభాలను  యజ్ఞస్థలంలో    నిలిపారు .   ఇవి కాక  శ్లేషాత్మక మనే  కఱ్ఱ  తో   చేసిన ఒక యూపము ,  దేవదారు కఱ్ఱతో   చేసిన   మరి  రెండు  యూపాలను  స్థాపించారు .  యూపాల  మధ్యన  ఉండే  స్థలం  బారెడు  .

రామాయణం

దివసే  దివసే  తత్ర  సంస్తరే  కుశలా  ద్విజాః
సర్వకర్మాణి  చక్రుస్తే  యథాశాస్త్రం  ప్రచోదితాః

నా షడంగ విదత్రా సీన్నావ్రతో  నా బహుశ్రుతః
సదస్యాస్తస్య  వై  రాజ్ఞో   నావాదకుశలా  ద్విజాః

ఆ యజ్ఞ  వాటికలో , బ్రాహ్మణులు ప్రతి చిన్న విషయాన్నీ   నిశితంగా    పరిశీలిస్తూ ,  కర్మలలో లోపంలేకుండా ,  సశాస్త్రీయంగా  యజ్ఞాన్ని నిర్వహించారు .  కార్యక్రమాలను  జాగర్తగా  గమనిస్తూ , అవసరమైనప్పుడు  ప్రోత్సహాన్నందిస్తూ  వసిష్ఠ  మహర్షి   వారికి  అండగా  ఉన్నారు .

యజ్ఞం  చేసే  బ్రాహ్మణులందరూ  శాస్త్రకోవిదులు ,  షడంగవేత్తలు  ( శిక్ష ,  , వ్యాకరణ  ,  నిరుక్త , చందస్సు , జ్యోతిషం ,  కల్పాలను  వేదాంగాలని  లేక   షడంగాలని  అంటారు) .

 

శిక్ష  : శిక్ష   అంటే  స్వర , వర్ణ ,  మాత్ర  ఉచ్చారణ విధానాలను  తెలిపే  శాస్త్రం .

వేదాలు  సుస్వరంగా  చదవాలి . అలా చదవకపోతే   పదాల  అర్థమే  మారిపోయే  ప్రమాదముంది .  సుస్వరంగా  చదివితే  వేదాలను  మననం  చేయడం , జ్ఞాపకముంచుకోవడం లాంటివి  సులభమవుతాయి . పుస్తకాలు  లేని రోజులలో  స్వర  పధ్ధతినుపయోగించి  వేదాలను  లుప్తం  కాకుండా మహర్షులు   మనకందించారని  నాకనిపిస్తుంది . ఉదాత్త ,  అనుదాత్త   స్వరాలనుపయోగించి  భావితరాలవారికి  జ్ఞానాన్నందించిన  మహనీయులు  మనకు చిరస్మరణీయులు . షడంగాలలో  ఒకటైన   శిక్ష  స్వర విజ్ఞానాన్ని  మనకు  నేర్పుతుంది .   శిక్షా శాస్త్రాన్ని  తెలిపే గ్రంధాలు అనేకం ఉన్నాయి .

వ్యాకరణం :  పాణిని  రచించిన  అష్ఠాధ్యాయి  ప్రసిధ్ధమైన  వ్యాకరణ  గ్రంధం . ఈ గ్రంధంలో  రమారమి  8000  సూత్రాలున్నాయి . ప్రపంచంలో  దీనికి  దీటు రాగల  వ్యాకరణ  గ్రంధం  ఇంకొకటి  లేదని ఘంటాపధంగా  చెప్పవచ్చు .

నిరుక్తం  : నిరుక్తం :  వేదాలలో  కనిపించే కష్టమైన , లుప్తమైన పదాలకు  వివరణ  ఇచ్చే శాస్త్రం నిరుక్తం .  పురాతనమైన  కారణంగా  వేద   కాలంలోని  భాషనర్థం  చేసుకోవడం  చాలా  కష్టం . శ్రమతో  కూడుకున్న  పని .

శబ్దాల  ఉత్పత్తిని  గురించి  ప్రవచించే  శాస్త్రం , నిరుక్తం . ధాతువుల  ఆధారంగా పదాలు  ఎలా  ఏర్పడ్డాయో  తెలుపడమే  కాకుండా  ,   ఆ పదాల  అర్థాన్ని  తెలుసుకోవడానికి  సహాయపడేది  నిరుక్తం .  యాస్క మహర్షి రచించిన  నిరుక్తం  వేద శబ్దాలను   అర్థం చేసుకొవడానికి మనకు  దోహద  పడుతున్న  గ్రంథం .

 

ఛందస్సు : స్తోత్ర  రచన చేయడానికి ఛందస్సు అవసరం.
అక్షరాలను  ఉచ్చరించడానికి  తీసుకొనే  సమయాన్ని   బట్టి   గురువు లేక  లఘువులుగా  విభజించారు . ఏక మాత్ర కాలం లో ఉచ్చరించ గలిగేది లఘువు అంటారు. ఉచ్చరించడానికి   రెండు మాత్రల  సమయం  అవసరమవుతే  ఆ అక్షరాలను  గురువని అంటారు .  మాత్ర  అంటే  చిటికవేయడాని తీసుకొనే  సమయం .   గురు  లఘువుల  కలయికతో  గణాలేర్పడతాయి .   గణాల  అమరికనే   ఛందస్సని  అంటారు . ఛందస్సు   ఆధారంగా   వేద మంత్రాలు   నిర్మింప బడ్డాయి . వేద మంత్రాలు  గాయత్రి ,  అనుష్ఠుప్ ,  త్రిష్ఠుప్ , జగతి అనబడే  ఛందస్సులలో  రచింపబడ్డాయి . పింగళుడి   ఛందోశాస్త్రం  ప్రామాణ్య  గ్రంధం .

 

 

రామాయణం

కర్మాంతరే  తదా  విప్రా  హేతువాదాన్  బహూనపి
ప్రాహుశ్చ  వాగ్మినో  ధీరాః  పరస్పర  జిగీషయా

బ్రాహ్మణ  పుంగవులు అన్ని విధాలా  సంతృప్తి చెందారు .  యజ్ఞకర్మల  మధ్యన  సమయం  దొరికినప్పుడు  వారు  తమ వాక్చాతుర్యాన్నంతా  ఉపయోగించి , సహేతుకంగా  శాస్త్ర వాదం చేసేవారు .  ఒండొరులను  వాగ్వాదంలో  జయించాలనే   జిగీషతో ( కోరికతో ) తమ తెలివితేటలనంతా  ఉపయోగించి  వాదన చేసేవారు .

రామాయణ కాలంలో  జ్ఞానులైన   పండితుల  మధ్య జరిగే  వాగ్వాదాల  ద్వారా  సత్య నిరూపణ  చేసే  పధ్ధతి  ఉండేది . అప్పుడైనా , ఇప్పుడైనా  యుక్తి యుక్తంగా , సహేతుకంగా మన  భావాలను  వ్యక్తీకరించి , ప్రత్యర్థిని  చిత్తు చేయాలనే  ఆలోచనలలో  మార్పు రాలేదు .  హౌ టు  విన్  యాన్   ఆర్గ్యుమెంట్  ? అన్నది  నిజంగా  ఒక కళ .  విషయ పరిజ్ఞానము ,  సంభాషణా చాతుర్యము , సమయస్ఫూర్తుల  మేలికలయిక  మనలను  విజయపథంలో  నడిపిస్తాయి .

ఇది  ఇంటెలెక్చువల్    ఆక్టివిటీ   . కష్టపడైనా  ఈ కళను విద్యార్థులందరూ  అభ్యసించాలి .ఈ  కళను  అభ్యసించిన  విద్యార్థి   ఇంటర్వూ లలో విజయాన్ని  సాధించడమే   కాకుండా   ఉన్నత పదవులను
అందుకోవడంలో  సఫలీకృతుడవుతాడు .

రామాయణం

అన్నం  హి  విధివత్స్వాదు  ప్రశంసంతి  ద్విజర్షభా
అహో  తృప్తాః  స్మ  భద్రం  తే  ఇతి  శుశ్రావ  రాఘవః

స్వలఙ్కృతాశ్చ  పురుషా  బ్రాహ్మణాన్  పర్యవేషయన్
ఉపాసతే  చ  తానన్యే  సుమృష్ట మణికుండలా

బ్రాహ్మణులు  భోజన ప్రియులు .  అంతా  సవ్యంగా  ఉంటే  కాని  వారు తృప్తి  చెందరు .  వారికి  చక్కటి  భోజనం  పెట్టి  ” శహబాష్” అనిపించుకున్న వాడిదే   ఘనత . అటువంటి  బ్రాహ్మణులకు మణికుండలాలతో  అలంకరించుకున్న  పురుషులు  సహాయం  చేస్తూ  ఉండగా ,  సుందరంగా అలంకరించుకున్న మరికొందరు   పురుషులు బలవంతం  చేస్తూ  , మధురపదార్థాలను  వద్దనేదాకా  వడ్డించారు .   దశరథుని  ఆతిథ్యం   బ్రాహ్మణ  శ్రేష్ఠులందరికీ  తృప్తి  కలిగించింది . ” అహోతృప్తాః  స్మ  భద్రం తే ”  అంటే  ”  మేము  సంతృప్తి  చెందినాము . నీకు .  నీకు  భద్రమగుగాక ” , అని  పవిత్రులైన  బ్రాహ్మణులు  పలికారు .

రుచికరమైన  భోజనం సంతృప్తి  చెందేదాకా  పెట్టడం  ఆతిథ్యంలో  అతి  ముఖ్య  భాగం . అన్నం  వడ్డించేవారు  శుభ్రంగా ఉండడమే  కాక  చక్కగా  అలంకరించుకోవాలనీ , అతిథుల మనస్సులకు  ఆహ్లాదం  కలిగించేలా  ప్రవర్తించాలనీ  రామాయణం మనకు  తెలియజేస్తోంది .

అన్న కూటాశ్చ  బహవో  దృశ్యంతే  సర్వతోపమాః
దివసే   దివసే    తత్ర    సిధ్ధస్య  విధివత్తదా

నానాదేశాదనుప్రాప్తాః  పురుషాః  స్త్రీగణాస్తధాః
అన్న పానైః   సువిహితాస్త స్మిన్యజ్ఞే   మహాత్మనః

 

భోజనం  చేసేవారు  వేల  సంఖ్యలో  ఉన్నారు .  వచ్చిన  వారందరికీ  భోజనం   వడ్డించమని  ప్రేపిస్తున్నారు   దశరథుని  అమాత్యులు .  వండి  వడ్డించే  భోజనం  పర్వతోపమంగా  కనిపిస్తున్నది .  స్త్రీ  పురుషులందరూ  ఆదరంగా  ఇవ్వబడిన  అహారంతో  తృప్తిచెందారు .

భారతీయ  సంస్కృతిలో  తనకు  లేకపోయినా  ఇతరులకు  ఇవ్వడం తరచుగా  కనిపిస్తుంది .  భాగవతంలో  కనిపించే   రంతిదేవుని  చరిత్ర  దీనికి  తార్కాణం .  ఇక  ఉన్నవారి సంగతి వేరే చెప్పాలా ?

ఉన్నది  ఇతరులతో  పంచుకోవడంలో  ఉండే  తృప్తి  మనకు  అనుభవైకవేద్యం .  పాశ్చాత్య  సంస్కృతి  ప్రవేశించాక  ఇతరులతో  కలిసి  మనకున్నది  అనుభవించాలనే  తత్త్వం  తగ్గుముఖం  పట్టినట్టు  అనిపిస్తోంది .

రామాయణం

వృధ్ధాశ్చ  వ్యాధితాశ్చైవస్త్రియో  బాలాస్తథైవ   చ
అనిశం  భుఞ్జమానానాం   న తృప్తిరుపలభ్యతే

దీయతాం  దీయతామన్నం  వాసాంసి  వివిధానిచ
ఇతి     సంచోదితాస్తత్ర    తథా    చక్రురనేకశః

 

వడ్డించిన  పదార్థాలు  ఎంత  మధురంగా  ఉన్నాయంటే  తిన్నవారికి  ఎంత తిన్నా తృప్తి  తీరదం  లేదు . స్త్రీ , బాల  వృధ్ధులు ఆ  భోజనాన్ని  ఆస్వాదిస్తూ  ఆనందించారు . తినే వారికీ  ,  వడ్డించే వారికీ కూడా తృప్తి  కలిగేలా  ఉన్నాయి  ఆ  మధుర పదార్థాలు .

భారతీయా  సంస్కృతిలో   అతిథి  మర్యాదకూ  ,  ఆహారాన్ని  అతిథికి  సమర్పించడానికీ  అధిక  ప్రాధాన్యం  ఇచ్చేవారు .

రామాయణం

న   తేష్వహస్సు   శ్రాంతో  నా   క్షుధితో   వాపి   దృశ్యతే
నా విద్వాన్    బ్రాహ్మణస్తత్ర    నా శతానుచర   స్తథా

బ్రాహ్మణా   భుఞ్జతే   నిత్యం   నాథవంతశ్చ   భుఞ్జతే
తాపసా  భుఞ్జతే     చాపి    శ్రమణా    భుఞ్జతే   తథా

యాగానికి  విచ్చేసిన  వారందరకూ   భోజనాన్ని  అతి శ్రధ్ధతో  పెట్టిన  కారణంగా , ఆకలితో  ఉన్నవాడు  ఆ పరిసరాలలో  కనిపించలేదు .

యాగానికి  విచ్చేసిన  బ్రాహ్మణులందరూ  విద్యావంతులే .  ప్రతి  బ్రాహ్మణుని   వెనక    వందమంది   అనుచరులు ఉన్నారు .  ఏ  బ్రాహ్మణుడూ   వందమంది  కంటే  తక్కువ  అనుచరులు  లేకుండా  కనబడలేదు . ( అనుచరులంటే  శిష్యులని  కొంతమంది  అభిప్రాయం ) .

బ్రాహ్మణులు ,  తాపసులు  , శ్రమణులు ,  పనిచేసే మనుష్యులు  ఆ యాగశాలలో  తృప్తిగా  భోజనం  చేసేవారు .
శ్రమణ  శబ్ద ప్రయోగం  చూసి  , శ్రమణులంటే  బౌధ్ధ సన్యాసులు  కనుక  రామాయణ  రచనాకాలం  బుధ్ధుని తరవాతదని  కొంతమంది  భావన .   కానీ స్మృతి వాక్యం ప్రకారం “చతుర్థాశ్రమం  ప్రాప్తాః  శ్రమణా  నామ తే స్మృతాః ”  సన్యాసులను  శ్రమణులని అంటారు . ఈ శబ్దం  బుధ్ధునికంటే  పూర్వమే ఉండేది .

 

రామాయణం

తృతీయసవనం  చైవ  రాజ్ఞోస్య  సుమహాత్మనః
చక్రుస్తే  శాస్త్రతో  దృష్ట్వా  తథా  బ్రాహ్మణపుంగవాః
న  చాహుతమభూత్తత్ర  స్ఖలితం  వాపి  కించన
దృశ్యతే బ్రహ్మవత్సర్వం  క్షేమయుక్తం  హి  చక్రిరే

ఆ  బ్రాహ్మణ  పుంగవులు  యజ్ఞాన్ని  శాస్త్రోక్తంగా ,  సమంత్రకంగా ,  క్షేమకరంగా  ,  దోషాలు  లేకుండా ,   పొరపాటు జరగకుండా   ,  సఫలంగా       నిర్వర్తించారు .

రామాయణం

ఐంద్రశ్చ  విధివద్దత్తో  రాజా  చాభిషుతో నఘః
మాధ్యందినం  చ  సవనం  ప్రావర్తత  యథాక్రమం

యజ్ఞవిధులను  క్లుప్తంగా  వివరిస్తున్నారు  వాల్మీకి  మహర్షి . సోమలతను  నలగగొట్టి  రసాన్ని  తీసారు . హవిర్భాగాలను  ఇంద్రునికి  సమర్పించారు . మాధ్యందిన  సవనాన్ని  క్రమపధ్ధతిలో  నిర్వర్తించారు .

యజ్ఞవిధానాలను  వివరంగా  తెలుసుకొనాలనుకొనేవారికి        ( http://athirathram2011.com/items-used.html )  లింక్  కొంతవరకూ  ఉపయోగపడుతుంది .  రామాయణంలో   అశ్వమేధ  యాగంలో  నిర్వహించిన కొన్ని విధులను మనం  ఈ  లింక్ కు వెళ్ళి  అర్థం  చేసుకోవచ్చు . ఉదాహరణకు   ప్రవర్గ్యమంటే ,  ఉపసదమంటే , సవనమంటే  ఏమిటో  ఇక్కడ  తెలిపారు .