Monthly Archives: ఏప్రిల్ 2017

రామాయణం

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వసః
ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం

భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః
అత్యద్భుతమచింతంత్యం చ న తర్కితమిదం మయా

జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం

“ఫెళ్ళుమని విరిగింది కదా విల్లు . గుండెగుభిల్లు మని మూర్ఛ పోయారు సభాసదులు” .

కొంత సమయం గడిచాక మూర్ఛిల్లిన వారు యథా స్థితికి చేరుకున్నారు .”ప్ర” అంటే ఎక్కువగా లేక మిక్కిలి అని . ఆశ్వస్త మంటే గడ్డ కట్టడం . ప్రత్యాశ్వాసమంటే ఎక్కువగా ఘనీభవించిన స్థితి నుండి తేరుకోవడం . వాక్యజ్ఞుడైన జనకుడు భయాన్ని వీడాడు . ముకుళిత హస్తుడైనాడు . విశ్వామిత్ర మహర్షితో ” భగవన్ ! రాముని పరాక్రమాన్ని స్వయంగా తిలకించాను . అత్యద్భుతమూ , అచింత్యమూ అయిన ధనుర్భంగం ఈ విధంగా సఫల మవుతుందని నేను ఊహించలేదు . జనక కులంలో జన్మించిన జానకి శ్రీరామచంద్రుని భర్తగా పొందగలదు . జనక కులానికి కీర్తి తీసుకొని రాగలదు .

మమ సత్యా ప్ర్తిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా

భవతోనుమతే బ్రహ్మన్ శ్రీఘ్రం గచ్ఛంతు మంత్రిణః
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః

రాజానం ప్రశ్రితైర్వాక్యై రానయంతు పురం మమ
ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః

ముని గుప్తౌ చ కాకుత్థ్సౌ కథయంతు నృపాయవై
ప్రీయమాణం తు రాజానమానయంతు సు శ్రీఘ్రగాః

కౌశికశ్చ తథేత్యాహ రాజా చా భాష్య మంత్రిణః
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్
యథావృత్తం సమాఖ్యాతు మానేతుం చ నృపం తదా
“సీత వీర్యశుల్క” అని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైన శుభదినమిది . సీత నా ప్రాణం . ప్రాణంతో సమానురాలైన నా సీతను రామునికి ధారాదత్తం చేస్తాను . మహర్షీ ఆజ్ఞాపించు . తమ ఆనతిని శిరసా వహించి నా మంత్రులు రథాలను అధిరోహించి శ్రీఘ్రంగా అయోధ్యా నగరానికి వెళ్ళగలరు . వీర్యశుల్క అయిన సీతను రాముడు వరించిన వృత్తాంతం , శివ ధనుర్భంగ వృత్తాంతం , నేను రామునికి సీతను ధారాదత్తం చేయడానికి నిర్ణయించిన వృత్తాంతం అంతా దశరథ మహారాజుకు సవినయంగా వివరించి ఆ మహానుభావుని నా నగరానికి ఆహ్వానిన్స్తారు . కాకుత్థ్స వంశానికి చెందిన రామ లక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో సురక్షితంగా ఉన్నారని వారు దశరథ మహారాజుకు విన్నవించి ఆ మహానుభావుని ఆనందింప జేస్తారు . సంతోషించిన దశరథ మహారాజును సాదరంగా ఆహ్వానించి తమ వెంట కొని తెస్తారు “అని మహర్షికి నివేదించాడు .

మహర్షి సరేనన్నాడు . జనక మహారాజు మంత్రులతో , సీతా స్వయంవర వృత్తాంతాన్ని దశరథ మహారాజుతో మనవి చేసి ఆ మహానుభావుని తమతో తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు . ఆజ్ఞలను అణుమాత్రం తప్పకుండా పాటించే ఆ అనుచరులు రథాలనధిరోహించి అయోధ్యకు తరలి వెళ్ళారు .

 

రామాయణం

శివ ధనుర్భంగం వల్ల దేవతలకు సంతోషం కలిగింది , రాక్షసులకు భయం వేసింది . రెండు పద్యాలలో ఈ విషయాన్ని వర్ణించారు విశ్వనాథ .

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్ర ప్రసవాక్షి సంకలన దీవ్య త్కంధరాభేద సా
హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ
గ్గీత్యాకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గలోకంబులన్.

శివ ధనుర్భంగం వలన వచ్చిన ధ్వని మనోజ్ఞంగా ఉన్నదట . ఎంత మనోజ్ఞంగా ఉందో వర్ణిస్తున్నాడు కవి .  నృత్యం చేసే సమయంలో జడ కుచ్చులకున్న తార హారాలు మంజులంగా ఊగుతున్నాయి . ఆ సమయంలో కొన్ని ముత్యాలూ , పువ్వులూ జడకుచ్చులనుండి కింద పడ్డాయి . నాట్యం చేస్తూనే తలలు తిప్పి ధరాతలం పైబడ్ద ముత్యాలను ఓరగా  చూసారు నాట్యగత్తెలు . ఆ అభినయం అందంగా ఉంది . ఇంత అందాన్నీ కప్పివేస్తూ మనోజ్ఞంగా ఉంది పాడుతున్న పాట , అందులోని సాహిత్యం . హరుని వింటినుండి వెడలిన నాదం నాట్యాన్ని మరుగుపరిచిన గానంలాగా సుస్వరంగా స్వర్గలోకంలో మారు మ్రోగిందట .

కంటికి కనిపించే దృశ్యాని కన్నా కర్ణాలకు వినిపించే గానం ఇంపుగా ఉన్న విధంగా శివధనుర్భంగ సమయంలో వెడలిన నాదం స్వర్గమంతా వ్యాపించి దేవతలకు ఆనదాన్ని కలిగించినదని చెబుతున్నాడేమో కవిశేఖరుడు . ఈ శబ్దం రాముని శక్తికి ఉదాహరణంగా , రాక్షసుల అంతాన్ని సూచిస్తూ ఉన్న కారణంగా అతులిత ఆనందదాయకంగా వినిపించింది దేవతలకు .

దేవతలకు సంతోషం కలిగితే రాక్షసులకు దుఃఖం కలగడం సహజమే కదా ? దర్పం అంటే గర్వం .

దర్పస్వీకృతహాస విశ్లథనరుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా
కూర్పాస ప్రకటోగ్ర సాధ్వస వధూగుర్విణ్య భద్రాధ్వమై
దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్

రాక్షసులకు సహజంగానే దర్పం ఉంటుంది . శివధనుర్భంగంలో బయల్వెడలిన శబ్దం రాక్షసుల దర్పాన్ని మించి , ఇంకో విధంగా చెప్పాలంటే వారి దర్పాన్ని అణచివేసే విధంగా దైత్య లోకాలలో నినదించింది .

అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని అంటారు . మరి నారికేళ పాకంలో వ్రాసిన విశ్వనాథవారి పద్యాలకు ఏమని పేరు పెట్టాలో ?

స్ఫీతాష్టాపదవిద్యుదుజ్జ్వల పయపీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం
ధాతీర్థంకర (తీర్థాకృతి) మాగధోల్బణము నానా మేదినీరాట్సభా
గీతిస్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్.

‘వంది మాగధుల పొగడ్తల కన్నా , రాజ సభలలో ధ్వనించే గానం కన్నా మధురంగా ఉంది శివధనువునుండి వెడలిన నాదం”అని అంటారు విశ్వనాథ .IMG_0052.JPG

బాల కాండలో శివధనుర్భంగ ఘట్టం అందరికీ ఇష్టమైన ఘట్టం . రాఘవుడు లోకులను రక్షించగల శక్తి తనకుందని ప్రత్యక్షంగా నిరూపించిన ఘట్టం .అందుకే అందరూ ఏక కంఠంతో ఆపదల నుండి కాపాడే ఆ శ్రీరాముని వేడుకొనే

ఆపదా మపహర్తారం , దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం

” లోకాభిరాముడు , ఆపదల నుండి రక్షించేవాడు , సర్వ సంపదలనూ ఒసగేవాడైన శ్రీరామునికి మఱల , మఱల అంజలి ఘటిస్తాను ” అనే శ్లోకం మన పెదాల మీద ఎప్పుడూ ఆడుతూ ఉంటుంది .

శక్తి కొలదీ ఎంతో మంది కవులు ఈ ఘట్టాన్ని రమణీయంగా రాసారు . గాయకులు ఆలాపించారు , వీధి భాగవతులు పాడుతూ నాట్యం చేసారు , భక్తుల పారవశ్యానికి ఇక హద్దే లేదు . అందరు కవుల రచనలు స్మరించుకోవాలని కోరిక . సమయానుకూలంగా వారిని వేరే స్మరించుకోవడానికి ప్రయత్నిస్తాను .

ఆపదా మపహర్తారం , దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం .

 

రామాయణం

అంతఁగడంక రాముడు సమగ్ర భుజాలుల విక్రమోత్సవం
బెంతయు బర్వ మౌర్వి మొరయించె దిగంతర దంతి కర్ణరం
ధ్రాంతర సాగరాంతర ధరాభ్ర తలాంతర చక్రవాళ శై
లాంతర సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్

ఇక రామాయణాన్ని రమ్యంగా రచించిన భాస్కరుని పద్యం పరికించండి . మౌర్విని మొరయించాడు ధనుష్పాణి . ఆ శబ్దం అష్టదిగ్గజాల కర్ణరంధ్రాలలో అలజడి రేపింది . లోతైన సముద్రపు అడుగు భాగం వరకూ వెళ్ళింది . ధరంతా వ్యాపించింది , ఆకాశాన్ని చేరింది , భూమిని వలయంలా చుట్టి ఉండే పర్వతాలన్నిటా వినిపించిందా నాదం , కొండగుహలలో దూరిపోయింది . ఆ శబ్దానికి భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయాయని భావం .

ఆ భావాన్ని రంధ్రాంతర ,సాగరాంతర , తలాంతర , శైలాంతర ,కుహరాంతర పూరితంబుగన్ అని చెప్పడంలో ఉంది కవి చమత్కారం . పద్యం ఒక సారి బిగ్గరగా చదవండి . పదాల కూర్పులోని అందం మనకు కనిపించి మురిపిస్తుంది .

విశ్వనాథ వారి ధనుర్భగం :

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథు షండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్.

దీర్ఘమైన సమాసాలు అదరగొడుతున్నాయి కదూ . అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా ?

వర్షం ఆగకుండా కురుస్తోంది నల్లని మేఘరాసుల అలజడి వలన .ఆ నల్లని మేఘాలలో నుండి వెలువడుతున్నాయి మిరుమిట్లు గొరిపే మెరుపులు . శ్యామ సుందరుడైన రఘురాముని మేఘాలతో పోల్చాడేమో కవి . విల్లు ఎక్కుపెట్టగానేఆ ధనుర్ధారి వింటి నుండి వెలువడ్డాయి వెలుగు పరంపరలు . మేఘాలలోని విద్యుల్లతలలో లాగా ధనువులో నిగూఢంగా ఉన్నాయట ఉరుములు . నారి సారించగానే విరిగింది ధనువు . మేఘాలలొని మెరుపుల చందాన, బ్రద్దలైన ఆ ధనువులో  నిగూఢంగా ఉన్న వెలుగులు విపరీతమైన శబ్దంతో బయటకు వచ్చాయని కవిభావం  (యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్.) ఛటఛ్చట మని వెలుగులు , వాటితో బాటు ప్రపంచాన్ని దిగ్గు మనిపించే శబ్దం సృష్టి అంతా వ్యాపించింది హాలాహలం లాగా . (ఈ శబ్దాన్ని ఆపగలిగిన శివుడక్కడ లేదు . అందుకే అది నిరాఘాటంగా సాగిపోయింది) .

వెలుగు ధనుస్సులో ఉందా ? లేక ఆకృతిదాల్చిన ధర్మమూర్తి , శ్యామసుందరుని  శరీరంలో ఉందా? అని నాకొక చిన్న అనుమానం .IMG_5451.JPG

శివధనుర్భంగం వల్ల వెడలిన శబ్దం పెద్దగా ఉన్న వినాయకుడి చెవులు కూడా సంపూర్ణంగా నిగ్రహించలేక సిగ్గు చెందాయట . వెడలిన కాంతిపుంజాన్ని షణ్ముఖుని పన్నెండు కళ్ళు తమలో నింపుకోలేక పోయాయి . భయంకరమైన ప్రమథ గణాల మాటలు తడబడ్డాయట . ఇంతెందుకు శక్తి స్వరూపిణి జగన్మాత పార్వతి నుదురు చిట్లించిందట .మాత నుదుటి చిట్లింపును విలాసంగా భావించాడు కవి .

రామాయణం

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్

బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధనుః
మంజూషాం తామసావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పి వా

బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః

జనకుని పలుకులు ఆలకించిన కౌశికుడు , రఘురాముడితో  మంజూషాన్ని తెరిచి మహేశుని కార్ముకాన్ని కనుల పండువగా దర్శించమని ఆనతిచ్చాడు .  బ్రహ్మర్షి ఆదేశానుసారం ధనుస్సు ఉన్న మంజూషాన్ని తెరచి ధనుస్సును దర్శించాడు దాశరథి . చూసిన రఘురామునికి వింటిని ఎక్కుపెట్టాలనే కోరికకలిగింది . గురువుగారితో ” బ్రహ్మర్షీ ! మీరనుమతిస్తే ఈ కోదండాన్ని స్పృశిస్తాను . సాధ్యమైతే ధనువును కదల్చడానికీ ఎక్కు పెట్టడానికీ ప్రయత్నిస్తాను ” అని వినయంతో విన్నవించుకున్నాడు . సరే నన్నారు విశామిత్రుడూ , జనక మహారాజు . గురువు అనుమతివ్వగానే సుకుమారంగా వంగి ఆ ధను మధ్యభాగాన్ని పట్టుకున్నాడా సకల గుణాభిరాముడు . ధనుస్సును స్పృశించాలా అని గురువుగారిని అడగడంలోనే కనిపిస్తుంది దాశరథి వినయం , సౌశీల్యం , తన మీద తనకు ఉన్న నమ్మకం .

పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందన
ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధనుః

స్పృశించడమేమిటి , ధర్మాత్ముడు రామచంద్రుడు కొన్ని వేల జనుల సమక్షంలో ఆ ధనుస్సును అవలీలగా లేపాడు , ఎక్కు పెట్టాడు .

ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః
తద్బభఞ్జ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః

తస్య శబ్దో మహానాసీన్నిర్ఘాత సమనిస్వనః
భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః

నిపెతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ .
విల్లు ఎక్కు పెట్టి నారిని ఆకర్ణాంతం లాగాడు . ధర్మాత్ముడు ,కీర్తి మంతుడు , యశశ్శాలి అయిన రామచంద్రుని ధాటికి ఆగలేక ఆ విల్లు విరిగి పోయింది . ఆ విల్లు విరిగినప్పుడు పర్వతం బద్దలయినట్టు , భూకంపం వచ్చినట్టు ,పిడుగు పడినట్టు పెద్ద శబ్దం వచ్చింది . ఆ ధ్వనిని భరించలేక చూచేవారందరూ మోహితులు అంటే నిశ్చేష్టులైనారు ( మూర్ఛ పోయినారు ) . మూర్ఛపోని వారు విశ్వామిత్రుడు , జనకుడు , రామ లక్ష్మణులు మాత్రమే .

రఘుకుల తిలకుడు గురువుకు నమస్కారం చేసి , జానకిని ఓరకంటితో చూస్తూ , నృపతులందర్రు చూస్తుండగా నారి సారించాడు . ఇంకేముంది జాలువారింది ఒక పద్య రాజం జంధ్యాల వారి కలం నుండి .

“ఫెళ్ళు ” మనె విల్లు — గంటలు “ఘల్లుమనె” __”గు
భిల్లు” మనె గుండె నృపులకు — ఝల్లు మనియె
జానకీ దేహ — మొక నిమేషమ్మునందె ;
నయము జయమును భయము విస్మయము గదుర .

సీతమ్మ తల సిగ్గుతో వంగిపోయింది . రాజుల తలలూ అవమాన భారంతో వంగిపోయాయి . సభలో చేరిన నారీ శిరోమణులు పూల వర్షం కురిపించారు . వారితో బాటు దేవతా స్త్రీలు కూడా కురిపించారు సుమాలను .
ఈ దృశ్యాలను ఎంతో అందంగా చిత్రీకరించారు “సీతాకళ్యాణం “అనే చిత్రంలో .మీరూ చూడండి

రామాయణం

యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే
సుతా మయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం

ధనుస్సు ఒక పెట్టెపైన ఉంది . ఆ పెట్టెకు ఎనిమిది చక్రాలు . ఆ ఎనిమిది చక్రాల బండిని అయిదువేల మంది మంచి పొడగరులైన మహాత్ములు , అయిదు వేల ( పఞ్చాశద్వాయతానాం ) మంది పురుషులు కష్టపడి లాగుకొని వచ్చారు .

తామాదాయ తు మంజూషామాయసీం యత్ర తద్ధనుః
సురోపమం తే జనక మూచుర్నృపతిమంత్రిణః

ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః
మిథిలాధిప దర్శనీయం యదిచ్ఛపి

తేషాం నృపో వచః శ్రుత్వా కృతాంజలిరభాషత
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం
రాజభిశ్చ మహావీర్యై రశక్తైః పూరితుం పురా

జనకుని మంత్రులు ధనుస్సు ఉన్న మంజూషాన్ని (పెట్టెను ) కష్టపడి తీసుకొని వచ్చి ” మిథిలాధిపతీ ! తమరు రామునికి చూపించదలచిన , రాజమ్మన్యుల చేత పూజింపబడిన , మహనీయమైన ధనుస్సు ఇదిగో ” అని పలికారు . వారి వాక్యాలు విన్న జనకుడు విశ్వామిత్రుని వైపు తిరిగి ముకుళిత హస్తుడై మహామునితో ,రామలక్ష్మణులు వినుచుండగా ” బ్రహ్మర్షీ ! జనక వంశానికి చెందిన మా పూర్వీకులు పూజించిన మహాకార్ముక మిదిగో .విల్లెత్తి నారి సారించాలని వచ్చిన రాజులు వింటిని ఎక్కుపెట్టలేక పరాజితులైన పిదప , వారిచే పూజింపబడిన కోదండమిదియే .

నైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః
గంధర్వ యక్ష ప్రవరా స్స కిన్నర మహోరగాః

క్వ గతిర్మానుషాణాం చ ధనుషోస్య ప్రపూరణే
ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పి వా

తదే తద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుంగవ
దర్శయై తన్మ్హహాభాగ అనయో రాజపుత్రయో

“(అవక్ర పరాక్రమాలు కలిగిన ) సురులూ , అసురులూ , రాక్షసులూ , గంధర్వులూ ,యక్ష , కిన్నర మహోరగులు నారిని సారిద్దామని వచ్చి విఫలులై వెనుదిరిగారు . ఇక సామాన్యులైన , అల్పబలం గల మనుష్యులకు నారి సంధించడానికి , అసలు కదలించడానికి శక్తి సరిపోతుందా ? మునిపుంగవా ! శివ ధనుస్సును కొనివచ్చారు . ధనుస్సును రాజపుత్రులకు చూపండి “అని పలికాడు .

DSC02312DSC02311

 

 

రామాయణం

తులసీదాసు :

తులసీదాసు కథనం ప్రకారం సభలో ఉన్న ధనుస్సును కొందరు మూర్ఖులైన రాజులు తాకుతున్నారట . కానీ దానిని కదలింపలేక సిగ్గుతో తలవంచుకొని మరలిపోతున్నారు . పిదప పదివేల రాజకుమారులు ఆ వింటిని ఎ
కదలించడానికి ప్రయత్నించారట . వైరాగ్యం లేని సన్యాసి వలె వారి ప్రయత్నాలన్నీ వమ్మయినాయట . జనకుడు రోషంతో ” మేము చేసిన ప్రతిజ్ఞను విని , ప్రపంచంలోని రాజులు ,దేవతలు , దైత్యులు వచ్చారు . విల్లెక్కుపెట్టి శాశ్వత కీర్తి సంపాదించుకోగల వీరుని బ్రహ్మ సృష్టించలేదని నా కనిపిస్తున్నది . పృథ్విలో వీరుడు లేడని నా కనిపిస్తున్నది . మీరందరూ మీ మీ స్వస్థలాలకు వెళ్ళండి . సీతా వివాహాన్ని బ్రహ్మ నిర్ణయింపలేదేమో ? నేను నా ప్రతిజ్ఞను వెనకకు తీసుకుంటే నా పుణ్యాన్ని కోల్పోతాను . లేకపోతే రాజకుమారి కన్యగానే మిగిలిపోతుంది . ప్రపంచంలో వీరులే లేరని నాకు తెలిసి ఉంటే నేనీ ప్రతిజ్ఞ చేసే వాడినే కాదు . ఈ విధంగా నవ్వుల పాలు కాకుండా ఉండేవాణ్ణి ” అని పరి పరి విధాల బాధ పడ్డాడు .

జానకి వైపు అందరూ జాలిగా చుసారు . ఈ మాటలు విన్న లక్ష్మణునికి కోపం వస్తోంది . భరించలేక పోయాడు . అన్నగారి పాదాలకు ప్రణమిల్లి “రఘుకుల తిలకుడు రామచంద్రుడు ఈ సభలో విరాజిల్లి ఉన్నాడని తెలిసీ జనకుడు ఈ విధంగా పలకడం
సరి కాదు . శ్రీరాముని వరకూ ఎందుకు ? మా అన్న అనుమతిస్తే ఈ ధనువునే కాదు ఈ బ్రహ్మాండాన్నే బంతివలె ఎత్తగలను . మేరు పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా చేసే శక్తి నాకున్నది . ప్రభువు ఆజ్ఞ ఇస్తే ఈ క్షణమే ఈధనువును తామర తూడులాగా వంచగలను . దానిని ధరించి వంద యోజనాలు పరుగెట్టగలను ” అని అన్నాడు .

లక్ష్మణుని మాటలకు జనకుడు సిగ్గు పడ్డాడట . సీతాదేవి సంతోషించింది . విశ్వామిత్రుడు , శ్రీరాముడు సంజ్ఞలతో లక్ష్మణుని శాంత పరచారట . ప్రేమతో తమ పక్కన కూర్చుండ బెట్టుకున్నారు . విశ్వామిత్రుడు ప్రేమతో ” రామా ! శివ ధనుర్భంగానికి పూనుకో . జనక మహారాజు శోకాన్ని తొలగించు ” అని ఆజ్ఞాపించాడు . శ్రీరాముడు గురువు పాదాలకు వందనం చేసి లేచి నిలబడ్డాడు .”

భక్తుని మనోభావాలు ఈ విధంగా ఉంటాయి . ప్రభువును కీర్తిస్తూ , ప్రభువు పరాక్రమాన్ని ఎవరైనా అవమానిస్తే సహించకుండా బాధ పడుతూ ఉండడం వారికి సహజ లక్షణం . ఆ భావాలు వారి కవిత్వంలో ప్రయత్నం లేకుండానే జాలువారుతాయి . వాల్మీకి రామాయణంలో లేని భావాలెన్నో భక్తుల రచనలో కనిపిస్తాయి .

 

రామాయణం

జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః
ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం

తతః స రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశ హ
ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితం

జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీం
తద్దమః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞ్య యా

నృణాం శతాని పఞ్చాశద్వాయతానాం మహాత్మనాం
మఞ్జూషామష్ట చక్రాం తాం తాం సమూహస్తే కథంచన

జంకుడు ధనుస్సును చూపిస్తానని చెప్పడంతో చూపించమన్నాడు మహాత్ముడు విశ్వామిత్రుడు . గంధమాల్యాదులతో విభూషిత మైన ఆ దివ్య ధనువును కొని తెమ్మని తన సామంతులకు ఆజ్ఞ ఇచ్చాడు జనకుడు . ప్రభువు ఆజ్ఞానుసారం మంత్రులు ,సామంతులు నగరంలో ప్రవేశించి దివ్య ధనుస్సును తమ ముందత పెట్టుకొని బయలుదేరి వచ్చారు .

ధనుస్సు ఒక పెట్టెపైన ఉంది . ఆ పెట్టెకు ఎనిమిది చక్రాలు . ఆ ఎనిమిది చక్రాల బండిని అయిదువేల మంది మంచి పొడగరులైన మహాత్ములు , అయిదు వేల ( పఞ్చాశద్వాయతానాం ) మంది పురుషులు కష్టపడి లాగుకొని వచ్చారు .

ధనుర్భంగాన్ని వర్ణించిన కవులెందరో .అన్నీ అందమైన వర్ణనలే . వాటిలో కొన్ని కవిత్వాలను మన ఆనందం కోసం . 

మొల్ల :
గురు భుజ శక్తి గల్గు పదికోట్ల జనంబుల పంప వారు నా
హరుని శరాసనంబు కొనియాడుచు గొంచు వచ్చి సు
స్థిరముగ వేదిమధ్యమున జేర్చిన దానికి ధూప దీపముల్
విరులును గంధమక్షతలు వేడుక నిచ్చిరి చూడ నొప్పగన్

ఆ ధనస్సును చూసిన రాజ కుమారులు

విల్లా ఇది కొండా యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగు నృపనందను
లెల్లరు దొడవుల నుండి రెంతయు భీతిన్

ఎంత అందంగా ఉన్నదీ పద్యం .” విల్లా ఇది కొండా ” అన్నంత పెద్దగా ఉందట ఆ విల్లు . ఒక కవయిత్రి మదిలో కలిగిన భావం . ధనుస్సు ఎంత పెద్దగా ఉందో మన కళ్ళముందు కనిపించడం లేదూ . ఆ విల్లును చూసిన కొందరు రాజులు దాని ప్రయత్నించి ఓడితే అవమానం కలుగుతుందేమో దగ్గరకు పోవడానికే భయ పడ్డారట , కొందరు ధైర్యం చేసి కోదండంతో పెనగి ఓడిపోయి సందులలొ , గొందులలో దూరారట , సత్త్వం లేని కారణాన . రాజులను మోసపుచ్చడానికీ , అవమానించడానికీ జనకుడీ మాయ పన్నాడని మరికొందరన్నారట .

“ఇది పర్వతాకార మీ విల్లు కనువిచ్చి తేఱి చూడగ రాదు దేవతలకు —దీని దగ్గఱ నేల , దీని కోడగ నేల ” అని అనుకొంటూ రాజనందనులు తలగి పోయారట .

మొల్ల పద్యాల అందమే వేరు . చదవడానికి , అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంటాయి . చదివిన కొద్దీ రుచులు జాలువారుతుంటాయి .

భాగవతం :

“ఒక మున్నూఱు కదల్చి తెచ్చిన లలాటోగ్రక్షు చాపంబు బా
ల కర్రెంద్రంబు సులీలమై జెఱుకుగోలం ద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు జూడగా విఱిచె దోశ్శక్తిన్ విదేహ క్షమా
పక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్  

ఉదయశ్రీ :

అది మహాసభ – సీతా స్వయంవరార్థ
మచట గూడెను ; తళతళ లాడు భూష
ణాలతో ఖండ ఖండాతరాల దొరలు

శివధనుర్భంగమునకు విచ్చేసినారు”

బారులు తెరెచి భూపతులు బంగరు గద్దెలమీద గూరుచు
న్నారు — వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు , శృం
గార మధూకమాలికను గైకొని జానకి చూచువారి నో
రూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై

స్వాగతమో స్వయంవర రస కుమారులార ! మీ
యాగమనమ్ముచే హృది ప్రహర్ష ప్రప్లుత మయ్యె – ఈ ధను
ర్యాగమునందు శంకర శరాసన మెక్కిడు నెవ్వ ! డా మహా
భాగు వరించు నా యనుగు పట్టి సమస్త సభాముఖమ్మునన్

తులసీ దాస్ :

జనక మహారాజు ఆహ్వానం అందుకొన్న విశ్వామిత్ర మహర్షి ” మనం కూడా సీతా స్వయంవరానికి వెడదాము . . భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో చూద్దాము ” అని రామలక్ష్మణులతో అన్నాడు . లక్ష్మణుడు మహామునితో ” మీ కృప ఎవరి మీద వుందో వారికే సీత లభిస్తుంది ” అని ప్రత్యుత్తరమిచ్చాడు . లక్ష్మణుని వినయానికి సంతోషంచెందిన మునులు రామలక్ష్మణులను ఆశీర్వదించారు . అందరూ ధనుర్యాగశాలకు వెళ్ళారు .

కహి మృదు బచన బినీత తిణ , బైఠారే నర నారి
ఉత్తమ ,మధ్యమ ,నీచ ,లఘు , నిజ నిజ థల అనుహారి .

అతిథుల తారతమ్యాలు చూడకుండా వచ్చిన వారికి ఆతిథ్య మిచ్చి ,సుఖాసీనులను జేసారు జనకుని భటులు .
మూర్తీభవించిన సౌందర్య మూర్తులు , అస్త్ర విద్యా విశారదులు , మహావీరులు రామ లక్ష్మణులు . తారల మధ్య చంద్రునిలా ప్రకాశించారా రాజ సభలో . సభాసదులకు రామచంద్రుడు కోటి మన్మథులకు మించిన అందంతో , శరత్పూర్ణిమనాటి చంద్రుని కన్నా మించీన శోభతో నయన మనోరంజకంగా కనిపించాడు . తులసీదాసు రాముణ్ణి వర్ణిస్తూ మైమరచిపోతాడు . IMG_0581.jpg

Sea water in turquoise blue : Phuket /Thailand .