Monthly Archives: మే 2011

రామాయణం

సంధివిగ్రహతత్వజ్ఞాః   ప్రకృత్యా  సంపదాన్వితాః
మంత్రసంవరణే శక్తాః,  శక్తా సూక్ష్మాసుబుధ్ధిషు
నీతిశాస్త్ర   విశేషజ్ఞ్యాః   సతతం      ప్రియవాదినః

సూక్ష్మంగా అలోచించగల సమర్థులు , రహస్యాలను రహస్యాలుగానే ఉంచగలిగే శక్తిగలవారు , శత్రువులతో  అవసరాన్ని బట్టీ , అవకాశాన్ని బట్టీ  సంధి లేక యుధ్ధం  చేయాలో నిర్ణయించగలిగే సామర్థ్యమున్నవారు ,  ఇతరులమనసును నొప్పించకుండా మాటలాడే వారు , నీతిశాస్త్ర  విశేషజ్ఞ్లులు , విశేషంగా ధనమున్నవారా మంత్రులు .
ఒక సామ్రాజ్యాన్ని శత్రునిర్బేధ్యంగా చేయాలంటే , మంత్రులకుండవలసిన లక్షణాలను వివరించే శ్లోకమిది .  విజ్ఞానం అభివృధ్ధి చెందిన ప్రస్తుత  కాలంలో కూడా  మన పాలకులకు ఈ  గుణాలు కొరవడ్డాయంటే  అతిశయోక్తి  ఏమీ లేదు .

రామాయణం

గురౌ గుణగృహీతాశ్చ  ప్రఖ్యాతాశ్చ  పరాక్రమే
విదేశేష్వపి  విఖ్యాతాస్సర్వతో  బుధ్ధినిశ్చయాత్

ఆ మంత్రులు  విజ్ఙులూ ,పెద్దలూ , గురువులూ అయినవారినుండి ఉత్తమ గుణాలను గ్రహించేవారు . పరాక్రమవంతులూ , బుధ్ధిమంతులూ అయిన వారికి దేశ విదేశాలలో మంచి ఖ్యాతి ఉండేది .

ఎంత గొప్పవారైనా , సమర్థత ఉన్నవారైనా అనుభవం పండిన పెద్దల దగ్గర నుండి నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉంటాయి .  నాకే అన్నీ తెలుసనే అహంకారం  వల్ల , సాధారణ జనులు పెద్దల దగ్గరకు వెళ్ళి విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించరు . ఈ రోజుల్లో కూడా తల్లి తండ్రుల మాట వినే పుత్రులెంత మంది ఉన్నారు  . దశరథుని మంత్రులు అందుకు భిన్నంగా గురువులూ ,గురుతుల్యులూ  అయిన వారి నుండి సద్గుణాలను గ్రహించేవారు . బుధ్ధి బలమూ ,సాహసమూ పెద్దల నుండి నేర్చిన  సద్గుణాలకు తోడై  దశరథుని అమాత్యులు ఉత్తములయ్యారు . అందుకే వారి ఖ్యాతి ఖండ ఖండాంతరాలలో వ్యాపించింది .   

రామాయణం

సువాసనస్సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః
హితార్థం చ నరేంద్రస్య జాగృతో నయచక్షుషా

నయనానదకరంగా ఉండే వస్త్రధారణతో , రూపురేఖలతో , మంచి నడవడికతో , తమను పరిపాలించే రాజు హితంకోరి ఎల్లప్పుడూ మేలుఒని ఉండేవారు .


వస్త్రేణ ,వపు షా,వాచా,విద్యయా,వినయేన చ
వకారైః పంచభి ర్యుక్తః నరో భవతి పూజితః

వస్త్రధారణ , రూపము , నోటినుండి వెలువడే పలుకులూ  ,  చదువూ ,  చదువుతో వచ్చే ఆణకువ , ఇతరులు మనను గౌరవించాడానికి హేతువులు . ఇవన్నీ ” వ ” అనే అక్షరంతో మొదలౌతాయి .

సమాజంలో గౌరవింపబడాలంటే కావలసిన లక్షణాలు ఒక్కచొట క్లుప్తంగా చెప్పిన శ్లోకమిది .మానవుని రూపం నయనాందకరంగా ఉండాలి . లక్షణశాస్త్రంలో ఒక ఉత్తమ పురుషుని రూపం ఎట్లా ఉండాలో వర్ణించారు . రామాయణంలో కూడా దీని వర్ణన కొంతవరకూ ఉంది .
మనిషి ఒడ్డూ పొడవూ సరిగా ఉండి , ముఖంలో వర్చ్చస్సు కూడా ఉంటే చూడగానే ఒకవిధమైన గౌరవ భావం కలుగుతుంది . దానికి తోడు సరియైన వస్త్రాలు ధరిస్తే గౌరవ భావం ద్విగుణీకృతం కావడం మనకు తెలిసిందే . ఫస్ట్ ఇంప్రెషన్ కోసరం ఈ రెండూ అవసరం . కానీ ఇవి సరిపోవు . అందంగా ఉండి నోరు విప్పగానే కంపుగొట్టే వారెంతమందో .
విద్యా వినయాలు  రూపానికి వాసిని కలిగిస్తాయి . గౌరవం పూర్తిగా పొందాలంటే మననోటి మాట తేనెలాగా తీయగా ఉండాలి . జిహ్వాగ్రం నుండి మాట వెలువడుతుంది . సర్వసంపదలూ , మిత్రులూ , బంధువులూ మనం పలికే పలుకుల ఆధారంగా ఏర్పడతాయని ఓ సుభాషితం .

లక్ష్మిర్  వసతి  జిహ్వాగ్రే  జిహ్వాగ్రే  మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే  బంధనం ప్రాప్తం జిహ్వాగ్రే  మరణం ధ్రువం

అయోధ్యానగరంలోని  మంత్రులకు  గౌరవం పొందడానికి కావలసిన విశేషాలన్నీ పుష్కలంగా ఉండేవి . ప్రజలందరూ వారిపట్ల గౌరవంతో ఉండేవారు .

రామాయణం

కశ్చిన్న దుష్టస్తత్రా సీత్పరదారరతో నరః
ప్రశాంతం సర్వమేవాసీద్రాష్ట్రం పురవరం చ తత్

దుర్మార్గపు పనులు చేసేవారికి కఠినమైన శిక్ష విధించే మంత్రులు ఉండటంతో అయోధ్యలో  దుష్టులు ఉండేవారు కాదు .  శాంతి నెలకొని ఉండేది .

రామాయణం

బ్రహ్మ క్షత్రమహింసంతస్తే  కోశం సమపూరయన్
సుతీక్ష్ణదణ్డాః  సంప్రేక్ష్య పురుషస్య బలాబలం

శుచీనామేకబుధ్ధీనాం సర్వేషాం సంప్రజానతాం
నాసీత్పురే  వా  రాష్ట్రే  వా మృషావాదీ  నరః క్వచిత్

సత్పురుషులను సంరక్షించి , దుష్టులనూ , తప్పు చేసినవారినీ  తీవ్రంగా దండించేవారా మంత్రులు. తప్పు చేసినవాడు బలవంతుడైతే శిక్ష కూడా తీవ్రంగా ఉండేది . చక్కని నడవడికతో , ఐకమత్యంతో రాజ్యకార్యాలను సమర్థవంతంగా నిర్వహించేవారు . వీరి పరిపాలన ఎంత సమర్థవంతంగా ఉండేదంటే  , రాజ్యంలో ఎవ్వరూ అసత్యం చెప్పడానికి సాహసించేవారు కారట .