Monthly Archives: జూలై 2011

రామాయణం

ఋష్యశృంగ  మహర్షి విగ్రహం                             కిగ్గా                            శృంగేరీ శారదా పీఠం

శృంగేరి  మంగళూరికి  150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్య క్షేత్రం .  శృంగేరికి  పది  కిలోమీటర్ల దూరంలో  శృంగగిరి పర్వతాలున్నాయి . ఋష్యశృంగ మహర్షి ఈ పర్వతప్రాంతాలలో  జన్మించాడని  ప్రజల నమ్మకం .

ఆది శంకరులు  సనాతన ధర్మాన్నీ  , వేద విద్యనూ వ్యాప్తి చేసే  ఉద్దేశ్యంతో  భారత దేశం నాలుగు మూలల్లో  నాలుగు వేద పీఠాలను స్థాపించారు . వాటిలో మొట్ట మొదటిది    శృంగేరీ పీఠం . ఋష్యశృంగ  మహర్షి  తపస్సు చేసి శివైక్యం చెందిన పుణ్య ప్రదేశంలో నెలకొల్ప బడ్డ పీఠమిది . తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఒక దివ్య జ్యోతి మహర్షి నుండి వెలువడి , అచ్చటి శివలింగంలో కలిసి పోయిందని పురాణ గాథ .  ఆ శివలింగం  శృంగేరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కిగ్గా గ్రామంలో ఈరోజుకూడా మనం చూడవచ్చు .

స వనే నిత్య సంవృధ్ధో మునిర్వనచరః సదా
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్

ద్వైవిధ్యం  బ్రహ్మచర్యస్య   భవిష్యతి  మహాత్మనః
లోకేషు   ప్రతిథం   రాజన్  విప్రైశ్చ  కతిథం  సదా

తస్యైవం  వర్తమానస్య  కాలః    సమభివర్తత
అగ్నిం శూశ్రూషమాణస్య  పితరం  చ యశస్వినం

భవిష్యత్తులో దశరథమహారాజు ఏ విధంగా పుత్రులను  పొందగలడో  సనత్కుమారుడు ఇతర ఋషులకు వివరిస్తాడు . అది విన్నాడు  సుమంత్రుడు . అదే విషయాన్ని దశరథునికి ఈ విధంగా  తెలిపాడు స్వామి భక్తి పరాయణుడైన సుమంత్రుడు .

సనత్కుమార మహర్షి చెప్పిన కథ :

అడవిలో పుట్టి అడవిలో  పెరగబోయే  ఋష్యశృంగుడుకి తన తండ్రి విభాండకుడు తప్ప ఇతర మానవులతో సంపర్కం ఉండదు .  ఋష్యశృంగుడు  వ్రతిత్వము , ప్రాజాపత్యము అని  రెండు  విధాలుగా ఉండే  బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు . తండ్రి విభాండకుడిని  , వైశ్వానరుడైన అగ్నిని  సేవిస్తూ కొద్ది కాలం గడుపుతాడు .

రామాయణము

కాశ్యపస్య తు పుత్రోస్తి విభణ్దక ఇతి శ్రుతః
ఋష్యశృంగ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి

 

సుమంత్రుడు సనత్కుమార మహర్షి చెప్పిన విషయాన్ని దశరథునికి ఈ విధంగా నివేదించాడు :

కాశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు . విభాండక మహర్షికి  భవిష్యత్తులో  ఋష్యశృంగుడనే  పేరు గల  పుత్రుడు జనిస్తాడు .

రామాయణము

ఏతచ్ఛ్రుత్వా  రహః  సూతో  రాజానమిదమబ్రవీత్
ఋత్విగ్భిరుపదిష్టోయం  పురా  వృత్తో  మయా  శ్రుతః
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం
ఋషీణాం సన్నిధౌ  రాజన్  తవ  పుత్రాగమం  ప్రతి .

అశ్వమేధ యాగాన్ని చేయడానికి ప్రయత్నాలు చురుకుగా సాగించడానికి , యాగాన్ని నిర్వహించాల్సిన వారందరికీ వారు నిర్వహించవలసిన కార్యాలను  తెలిపాడు దశరథహారాజు . ఇదంతా గమనిస్తున్న సుమంత్రుడు (దశరథుని రథ సారథి) దశరథునితో రహస్యంగా “మహారాజా నీవు  ఏ విధంగా  పుత్రులను  పొందగలవో , పూర్వం  సనత్కుమార మహర్షి ఋషులతో చెప్పగా   నేను   విన్నాను ” అని అన్నాడు .

రామాయణం

అష్టమ సర్గ
దశరథమహారాజు సంతానం కావాలని అనుకోవడంతో మొదలవుతుంది  ఎనిమిదవ సర్గ . సమస్యను పరిష్కరించడానికి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పిస్తాడు. పురోహితులకూ , పెద్దలైన గురువులకూ తన అలోచన చెప్పి వారిని సలహా అడుగుతాడు .వారంతా ఏక కంఠంతో దశరథుని అలోచనను మెచ్చులొని అశ్వమేధ యాగానికి ప్రయత్నాలను మొదలు పెట్టమని సలహా ఇస్తారు . అశ్వమేధం చేయడం సులభం కాదనీ , ఏవైనా తప్పులు జరిగితే యజమాని నశిస్తాడనీ తన మంత్రులకు తెలిపి , శ్రధ్ధగా యాగానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చమంటాడు మహారాజు . రాజాజ్ఞను తమ శక్తి సామర్థ్యాలకొద్దీ పాలిస్తామని మాట ఇస్తారు మంత్రిపుంగవులు . దశరథుడు తన దేవేరులను కూడా యాగ దీక్ష వహించమంటాడు . సంతోషంతో సమ్మతిస్తారు దశరథ పత్నులు . దీనితో సమాప్తమవుతుంది అష్టమ సర్గ .
రాముని ఆవిర్భవానికి నాంది పలికింది అష్టమ సర్గలో . హిందువుల ధర్మం ప్రకారం సంసారం చేయడం సంతానం కోసమే . సంతానం లేకపొతే  కలిగే బాధను చక్కగా చెప్పాడు వా ల్మీకి . సంతానం లేకపొతే దుఃఖిస్తూ కూర్చోకుండా సంతానం పొందే మార్గాలను అన్వేషించాలి . పురాణ కాలంలో యజ్ఞ యాగాల వల్ల అభీష్టాలు సిధ్ధించేవి . అందుకే  అశ్వమేధం చేయాలనే కోరిక కలిగింది దశరథునికి . తను అనుకున్నది సరియైనదా , కాదా అనే సందేహాన్ని గురువులనడిగి , సరియైనదేనని నిర్ణయించుకున్నాడు. అశ్వమేధ యాగాన్ని చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు .  సరయూ నదీ తీరం యజ్ఞానికి అనువైన స్థలంగా నిర్ణయింప బడ్డది . భార్యలకు యజ్ఞం చేస్తున్నానని చెప్పగానే వారి ముఖాలు హేమంత కాలంలో మంచు తొలగిన పద్మాలు ప్రకాశించి నట్లు ప్రకాశించినవట .పుత్రుడు జనిస్తాడంటే సంతోషం కలగని దెవ్వరికి ?

రామాయణము

తథా  ద్విజాస్తే   ధర్మజ్ఞా  వర్ధయంతో   ద్విజోత్తమ
అనుజ్ఞాతాస్తతస్సర్వే      పునర్జగ్ముర్యథాగతం

విసర్జయిత్వా   తాన్     విప్రాన్    సచివానిదమబ్రవీత్
ఋత్విగ్భిరుపదిష్టోయం  యథావత్క్ర తురాప్యతాం

దశరథుని ఉత్సాహాన్నిరెట్టించిన పిదప , రాజానుమతితో తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళారు ద్విజులు . ఋత్విక్కులు చెప్పిన విధంగా యాగాన్ని నిర్విఘ్నంగా చేయడానికి ప్రయత్నాలను కొనసాగించమని మంత్రులకు చెప్పి వారిని కార్య నిర్వహణకోసం పంపించాడు అయోధ్యాధిపతి .

ఇత్యుక్తా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః

తతః స గత్వా తాః  పత్నీర్నరేంద్రో   హృదయప్రియాః
ఉవాచ  దీక్షాం   విశత  యక్ష్యేహం  సుత కారణాత్

తాసాం    తేనాతికాంతేన    వచనేన      సువర్చసాం
ముఖపద్మాన్య  శోభంత   పద్మానీవ  హిమాత్యయే

ద్విజులూ మంత్రులూ నిష్క్రమించాక దశరథుడు తన ధర్మపత్నుల వద్దకు వెళ్ళి  ” పుత్రుల కోసం నేను యాగం చేయుచున్నాను , మీరు కూడా దీక్ష వహించండి” , అని చెప్పాడు . ఆ మాటలు ఆలకించిన దశరథ పత్నుల ముఖపద్మాలు  ”  హేమంత ఋతువులో  మంచు తొలగిన పద్మాలు  ప్రకాశించిన విధంగా ప్రకాశించాయట .

రామాయణము

తద్యధా  విధిపూర్వం  మే  క్రతురేష  సమాప్యతే
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహః

తథేతి చాబ్రువన్ సర్వే మంత్రిణః  ప్రత్యపూజయన్
పార్థివేంద్రస్య  తద్వాక్యం యథాజ్ఞప్తం  నిశమ్యతే

అందువలన  శ్రధ్ధతో శాస్త్రవిహితంగా ఈ అశ్వమేధ యజ్ఞాన్ని  జరిపించండి .  తలపెట్టిన కార్యాలను సాధించడంలో మీరందరూ  సమర్థులే కదా అని పలికాడు దశరథ మహారాజు .  ఆజ్ఞ్య  శిరసా వహిస్తామని మాట ఇచ్చారు మంత్రులు

దశరథుడు తన మంత్రులకు అశ్వమేధయాగం చేయడానికి కారణం తెలిపాడు .  స శాస్త్రీయంగా చేయడం ఎందుకు ముఖ్యమో తెలిపాడు .  ఒక వేళ ఏదైనా లోపం జరుగుతే తనకది  ప్రాణాంతకమౌతుందని తెలిపాడు . చివరగా వారి సామర్థ్యం మీద తనకున్న అపారమైన నమ్మకాన్ని వ్యక్త పరిచాడు .

ఒక నాయకుడు పనిని సాధించాల్సిన విధానం ఇది . తన కేమి కావాలో తనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ( clarity of thought ) , ఏ పని ఎవ్వరు చేయగలరో నిర్ణయించుకోవాలి ( choosing right man for the right job )    చేయదలచుకున్న దానిని చేసే వారికి ఏమాత్రం సందేహం లేకుండా చెప్పాలి ( unambiguous communication ) , పని చేసే వారి ఉత్సాహాన్ని పెంచాలి (Motivation) — ఇవన్నీ ఒక కార్యం సాధించాలంటే  అవసరమైన  నాయక లక్షణాలు .

రామాయణము

శక్యః  ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా
నాపరాధో భవేత్కష్టో   యద్యస్మిన్    క్రతుసత్తమే

ఛిద్రం  హి మృగయంతేత్ర  విద్వాంసో  బ్రహ్మరాక్షసాః
నిహతస్య    చ     యజ్ఞస్య   సద్యః  కర్తా     వినశ్యతి .

ఈ అశ్వమేధ యాగం సులభమైనది కాదు . యే విధమైన అపచారం కలగకుండా ,సులభంగా చేయగలిగినదైతే అందరు రాజులూ దీనిని చేసి ఉండేవారు . ఒకసారి మొదలు  పెట్టాక , యజ్ఞానికి భంగం కలుగుతే యజ్ఞం చేసే యజమాని నశిస్తాడు .

రామాయణం

సరయ్వాశ్చోత్తరే  తీరే  యజ్ఞ భూమిర్విధీయతాం
శాంతయశ్చాభివర్ధనాం  యథాకల్పం  యథావిధి

సరయూనదీ తీరంలో యాగ భూమిని సిధ్ధం చేయమన్నాడు . శాస్త్రోక్తంగా శాంతి కార్యాలను జరపమన్నాడు .
ఏ పుణ్య కార్యాన్నైనా జరపడానికి ముందు శాంతి మంత్రాలు చదవడం ఆనవాయితీ . ఈ కాలంలో కూడా వివాహాది శుభకార్యాలలో    మనమీ పధ్ధతులను పాటిస్తున్నాం . ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః  అనే పదాలు ప్రతి వేద పాఠం  చివరన  వినిపిస్తాయి . మన   పూర్వీకులు  శాంతికి యెంత ప్రాధాన్యత ఇచ్చేవారో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు .  భారత దేశ   సంస్కారానికీ ,  సంస్కృతికీ  , మనోభావనలకూ ఈ పధ్ధతులు ఒక మచ్చు తునక .

రామాయణం

సంభారాః  సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ
సమర్థాధిష్టితశ్చాశ్వస్సోపాధ్యాయో    విముచ్యతాం

తాను అనుకున్నదానికి పెద్దల ప్రోత్సాహం రావడంతో అశ్వమేధ  యజ్ఞ్యానికి  కావలసిన పదార్థాలను  సమకూర్చమని తన మంత్రులను
ఆదేశించాడు . జైత్ర యాత్ర సాగించడానికి అశ్వాన్ని  వదలమన్నాడు .  అశ్వాన్ని రక్షించడంకోసం సమర్థులైన వారిని  వెంట పంపించమన్నాడు .

రామాయణం

తతః ప్రీతో  భవద్రాజా   శ్రుత్వా  తద్ద్విజ  భాషితం
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్ష పర్యాకులేక్షణః

తన అభీష్టానికి పెద్దలు వత్తాసు పలకడంతో దశరథుడు ఆనంద పరవశుడైనాడు .
మనసులో జనించే మధురోహలను పెద్దల ముందుంచి  ,  వారు ఆ ఆలోచనలను బహు బాగు అంటుంటే కలిగే ఆనందం వర్ణించడం కష్టం .  దశరథుని విషయంలో అదే విధంగా జరిగిది . ఒక పుణ్య కార్యానికి నాంది అయింది . ఇక్కడ మనం నేర్చుకోవలసినవి  విషయాలు .
1  . ఒక సమస్య ఎదురైనప్పుడు స్వంతంగా ఆలోచించి పరిష్కారం వెదుక్కోవడం .
2 . పరిష్కార మార్గాన్ని అనుభవజ్ఞు లైన వారితొ చర్చించడం .
3 . పెద్దలైన వారు ఆలోచించి పరిష్కారమార్గం  సరైన దయితే దానికి  తమ సమ్మతి తెలుపడం , ప్రోత్సహించడం .
4 . అనుకున్న కార్యాన్ని సమయం  వ్యర్థం చేయకుండా మొదలు పెట్టడం .
స్వయంగా అలోచించ గలగడం చాలా  ముఖ్యం , పెద్దలతో సాధ్యాసాధ్యాలను ,  ఇతర విషయాలనూ కూలంకషంగా చర్చించడం , ఒక నిర్ణయానికి వచ్చినాక దానిని అమలు పరచడం — ఇదీ పనిమంతుడి లక్షణం .