Monthly Archives: ఏప్రిల్ 2012

రామాయణం

తతో  రామ  జలం  స్పృష్ట్వా  ప్రహృష్టవదనః  శుచిః
ప్రతిజగ్రాహ  తే  విద్యే మహర్షేర్భావితాత్మనః

శ్రీరామచంద్రుడు  ఆచమనం  చేసి , పవిత్రుడైనాడు .   ఆనందంతో , వికసించిన  ముఖారవిందంతో  మహర్షినుండి  బల  అతిబల  విద్యలను  గ్రహించాడు .

బల  అతిబల మంత్రాలు  సావిత్రీ  ఉపనిషత్తులో  కనిపిస్తాయి . అయితే  గురుముఖతః  నేర్చుకుంటేనే  ఈ  మంత్రాలు  ఫలిస్తాయి .

బలాతిబలయోహ్ విరాట్పురుష ఋషిః |
గాయత్రీ దేవతా |
గాయత్రీ చ్ఛన్దః
అకార  ఓకార  మకారా బీజాద్యాః
క్షుధాది నిరసనే వినియోగః |

క్లామిత్యాది షడంగ న్యాసః |
క్లాం అంగుష్టాభ్యాం నమః |
క్లీం తర్జనీభ్యాం నమః
క్లూం మధ్యమాభ్యాం నమః
క్లైం అనామికాభ్యాం నమః |
క్లోం కనిష్టికాభ్యాం నమః |
క్లహ్ కరతలకరపృష్టాభ్యాం నమః ||
క్లాం హృదయాయ నమః |
క్లీం శిరసే స్వాహా |
క్లూం శిఖాయైవషట్ |
క్లైం కవచాయ హుం |
క్లోం నేత్రత్రయాయవౌషట్ |
క్లహ్ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

|| ధ్యానం ||
అమృత  కర తలార్ద్రౌ   సర్వ  సంజీవనాఢ్యా  అవఘహరణ    శుద్క్షౌ  వేద సారే మయూఖే|
ప్రణవమయ   వికారౌ    భాస్కరాకార    దేహౌ   సతతమనుభవేహం తౌ బలాతీబలేశౌ ||

ఓం  హ్రీం   బలే   మహాదేవి   హ్రీం   మహాబలే   క్లీం   చతుర్విధ   పురుషార్థ సిద్ధి ప్రదే   తత్సవితుర్వరదాత్మికే    హ్రీం  వరేణ్యం   భర్గో దేవస్య   వరదాత్మికే |
అతిబలే   సర్వ దయామూర్తే     బలే   సర్వ క్షుద్ భ్రమ   ఉపనాశిని |
ధీమహి ధియో యో నో జాతే ప్రచుర్యః   యా ప్రచోదయాత్   ఆత్మికే   ప్రణవ  శిరస్కాత్మికే   హుం   ఫట్ స్వాహా ||
ఏవం   విద్వాన్    కృత కృత్యో   భవతి |
సావిత్ర్యా   ఏవ   సలోకతాం   జయతి ||
ఇత్యుపనిషత్ ||

|| శాంతి పాఠ ||
ఓం  ఆప్యాయంతు    మమాంగాని   వాక్ప్రాణశ్చక్షుః     శ్రోత్రమథో    బలమింద్రియాణి  చ   సర్వణి |
సర్వం బ్రహ్మౌపనిషదం |
మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోత్ |
అనిరాకరణమస్తు   అనిరాకరణం   మేస్తుః  తదాత్మని   నిరతే  యే    ఉపనిషత్సు    ధర్మాస్తే     మయి   సంతు  తే   మయి సంతు ||
ఓం శాంతి శ్శాంతిశాంతిః |

రామాయణం

విద్యాద్వయ   మధీయానే  యశశ్చాప్యతులం  త్వయి
పితామహసుతే  హ్యేతే  విద్యే  తేజస్సమన్వితే
ప్రదాతుం  తవ  కాకుత్స  సదృశస్త్వం  హి  ధార్మిక

కామం  బహుగుణాస్సర్వే  త్వయ్యేతే  నాత్ర  సంశయః
తపసా  సంభృతే  చైతే  బహురూపే  భవిష్యతః

బలాతిబల  విద్యలనభ్యసిస్తే  నీకు  సాటిలేని  కీర్తి  లభిస్తుంది . ఈ విద్యలు  బ్రహ్మ మానస  పుత్రికలు . (బ్రహ్మ దేవుని పుత్రికలు ) . ఈ  కన్యలను  పొందడానికి  నీవే  అర్హుడవు . ఉత్తమగుణ  సంపన్నుడవు . నాకు  నీ  సమర్థత  విషయంలో  ఏ  విధమైన  సందేహం లేదు . తపస్సుచే   ఈ విద్యలను  పోషిస్తే  వివిధ  రూపాలు  దాల్చి ,   మేలు  చేకూర్చగల   విద్యలివి .

ప్రతి  మంత్రానికీ ,  ఆయుధానికీ  ఒక  అధిదేవత  ఉండటం  మనకు  కనిపిస్తుంది . ఆ  అధిదేవతకున్న  శక్తి  ఆ మంత్రాలలో , ఆయుధాలలో   నిక్షిప్తమయి    ఉంటుంది  .  తపశ్శక్తితో  ఆ  మంత్రాల  శక్తి    ద్విగుణీకృతం  చేయ వచ్చు . ఆ  మంత్రాలు   ఈ  రోజునకూడా  అందుబాటులో  ఉన్నాయి .  లేనిదల్లా  ,  ఆ  విద్యలను  ప్రసాదించగలిగే  గురువు  లేకపోవడమే .   వాటిని  ఉపాసించే  పధ్ధతులు , అంతరార్థం    మనకు  చెప్పేవారు  లేనందువలన  ఈ విద్యలతో  ఫలితాలను  పొందలేకుండా  ఉన్నాము . ఇది  మన  దుర్భాగ్యం .
బల   అతిబల  మంత్రాలకు  అధిదేవతలు   స్త్రీలు . సమర్థుడిన  వాడికి   సరియైన   స్త్రీల   సహవాసంలో    కీర్తి  లభిస్తుంది అనే  భావం  కూడ  మహర్షి  శ్రీ  రామునికి   భావగర్భంగా తెలియజేస్తున్నారేమో ?

రామాయణం

న  శ్రమో  న జ్వరో  వా తే న రూపస్య  విపర్యయః
న చ సుప్తం  ప్రమత్తం  వా  ధర్షయంతి  నైర్ర్తాః
న  బాహ్వోః  సదృశో  వీర్యే  పృథివ్యామస్తికశ్చిన
త్రిషు  లోకేషు  వై  రామ  న భవేత్సదృశస్తవ
న సౌభాగ్యే  న దాక్షిణ్యే  న జ్ఞానే  బుద్ధినిశ్చయే
నోత్తరే  ప్రతివక్తవ్యే  సమో  లోకే  తవానఘ
ఏతద్విద్యాయే  లబ్ధే  భవితా  నాస్తి  తే  సమః
బలాత్వతి బలా  చైవ  సర్వజ్ఞానస్య  మాతరౌ

క్షుత్పిపాసే  నతే  రామ  భవిష్యేతే  నరోత్తమ
బలామతిబలాం  చైవ  పఠతః  పథి  రాఘవ

బల  అతిబల  అనే విద్యల  గొప్పదనాన్ని  రామచంద్రునికి  ఈ  విధంగా  తెలియజేస్తున్నాడు విశ్వామిత్రుడు .

బల  అతిబల  విద్యలు  తెలిసినవారికి  శ్రమ కలుగదు ,  జ్వరమన్నది దరిజేరదు  , రూపంలో  మార్పు  అనేది  ఉండదు ( అంతే  నిత్య యవ్వనులై  ఉంటారు ) . నిద్రలో ఉన్న  ఉన్నా , ప్రమత్తుడవై (ఏమరిపాటు) ఉన్నా   రాక్షసులు నీకు  హాని కలిగించలేరు ,

సౌందర్యంలో , సామర్థ్యంలో  , భుజబలంలో  ,  జ్ఞానంలో  , ఇతరుల   ప్రశ్నలకు   ప్రత్యుత్తరాలనీయడంలో  నీకు  సాటి  వచ్చే వ్యక్తి   మూడు  లోకాలలో ఉండడు .ఈ  రెండు విద్యలను , ప్రయాణం  చేసే  సమయంలో   పఠిస్తే   ఆకలి  , దప్పులు  కలుగవు .

విద్య  నేర్పే ముందు  ,  ఆ  విద్య  నేర్చుకుంటే  కలిగే  లాభాలను  చెప్పడం  అవసరం . ఏ పని చేసినా  “why am  I doing this ? ”    అన్నది  స్పష్టంగా  తెలియాలి .   ఇది  తెలిస్తే  శిష్యుడు  ద్విగుణీకృతోత్సాహంతో  విద్యను గ్రహిస్తాడు . నేర్చుకున్నది  వంటికి పడుతుంది . ఫలితాన్ని  ఇస్తుంది . అందువలననే   మహర్షి  ,  బల  అతిబల  విద్యలు  నేర్చుకుంటే  కలిగే లాభాలను  శ్రీరామచంద్రునికి  తెలియజేస్తున్నాడు .

రామాయణం

గృహాణ  వత్స  సలిలం  మా  భూత్కాలస్య  పర్యయః
మంత్రగ్రామం   గృహాణ  త్వం  బలామతిబలాం  తథా

వత్సా  రామా ! ఆచమనం చేయవయ్యా .  బల ,  అతిబల   విద్యలను నీ కిస్తాను , పుచ్చుకో  మన్నాడు  విశ్వామిత్రుడు .

ఏ పని చేసినా  దేహాన్నీ , మనస్సునూ  పవిత్రంగా  ఉన్నప్పుడే  చేయాలి . ఆచమనం  ఈ  పవిత్రతను  కలుగజేస్తుంది .  వైదిక  కర్మలన్నీ  ఆచమనం   చేసాకే  ప్రారంభిస్తారు . ఆచమనం వల్ల  ఆరోగ్యం ,   మనశ్శాంతి కలుగుతాయి .

 
http://teluguone.com/devotional/content/achamanam-means-107-6330.html  లో  ఆచమనాన్ని  ఎందుకు చేయాలి ? అన్న  ప్రశ్నకు  సైంటిఫిక్  సమాధానం  ఇచ్చారు . మీరూ చదవండి .

” మన గొంతు ముందుభాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం V ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలినుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

“కేశవాయ స్వాహా” అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటిద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పెగులవరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి “.

Reproduced with thanks  from
http://teluguone.com/devotional/content/achamanam-means-107-6330.html .( if there is any objection I may please be informed , the contents will be immediately removed ).

 

ఆచమనంలో  భగవంతుని నామాలు స్మరించడం  వల్ల మనస్సుకు  పవిత్రత  ఏర్పడుతుంది . దృష్టి  బాహ్య  ప్రపంచ  విషయాలవైపు  మళ్ళకుండా  ,  ఏకాగ్రత ఏర్పడుతుంది .   నేర్చుకునే  విద్య  స్థిరంగా  నాలుగు  కాలాలపాటు  మదిలో ఉండిపోతుంది . ఏ పని చేసినా శ్రధ్ధా  భక్తులతో  చేస్తే ఫలితం  లభిస్తుంది .
అందుకే  ఏ వైదిక  కర్మ అయినా  ఆచమనంతో  ప్రారంభమవుతుంది . అందుకే  మహర్షి  విశ్వామిత్రుడు , మంత్రాలను  రామునికి  ఇవ్వాలని  నిశ్చయించుకున్నాక   , ఆచమనం  చేయమని  ఆదేశిస్తాడు .

రామాయణం

మూడులోకాలను  మోహింపజేసే  నీలకాంతితో  విశ్వామిత్రుని  లాంటి తేజోవంతుణ్ణి  కూడా  ప్రకాశింపజేసిన  శ్రీరామచంద్రుని  పయనం  ఆరంభమయింది . లోకాలనావరించిన  చీకట్లను  పోకొట్టినాక  మాత్రమే  అది అంతమవుతుంది .

 

అధ్యర్థయోజనం  గత్వా  సరయ్వా  దక్షిణే  తటే
రామేతి  మధురాం  వాణీం  విశ్వామిత్రోభ్య  భాషత

 

“కాలినడకన  ఒకటిన్నర యోజనం  ప్రయాణించి   సరయూ  నదీతీరం  చేరారు  గురు శిష్యులు .  శిష్యులకు  ఉపకారం  చేయడానికి  పూనుకున్నాడు  విశ్వామిత్రుడు . విశ్వామిత్ర  మహర్షి  విశ్వానికే  మిత్రుడు . ఓ రామా ! అని  మధురంగా   రామచంద్రుని  పిలిచాడు” .
మాట్లాడే  మాట మధురంగా  ఉండాలంటే ముఖ్యమైనవి   మనసులో  అవతలి  వ్యక్తిమీద  ప్రేమ , గౌరవం . తనకు  సహాయం  చేయడానికి వస్తున్న  శ్రీరామచంద్రునిపై   కృతజ్ఞతా భావం  కూడా  ఉందేమో  మహర్షికి  ? ఇవన్నీ  కలగలిపి , పలికే  పలుకులు మధురంగా  మారాయేమో ? సహాయం  చేయడానికి  వస్తున్న  శిష్యునికి   ప్రతిసహాయం  చేయడానికి  నిశ్చయించుకున్నాడు .

మహాత్ములకు  సహాయం  చేయడానికి  ఉద్యుక్తులైతే  చాలు , వారి  కృపా   కటాక్షాలు  మనమీద  ప్రసరిస్తాయి .   మనకు  ఎనలేని  మంచి  జరుగుతుంది .  శ్రీరామచంద్రుడికి  తను ఎంతో   కృషి  చేసి    సంపాదించుకున్న  శక్తులను రెండో  అలోచన  లేకుండా దత్తం  చేసాడు  మహర్షి .

రామాయణం

తదా కుశికపుత్రం  తు ధనుష్పాణీ  స్వలంకృతౌ
బధ్ధగోధాఙ్గులిత్రాణౌ   ఖడ్గవంతౌ  మహాద్యుతీ
కుమారౌ  చారువపుషౌ  భ్రాతరో  రామలక్ష్మణౌ

అనుయాతౌ   శ్రియా  దీప్తౌ   శోభయేతా మనినిదితౌ
స్థాణుం  దేవమివాచింత్యం  కుమారావివ పావకీ

రామలక్ష్మణులు  ధనుర్బాణాలు  ధరించారు .  చేతివేళ్ళకు  ఉడుము  చర్మంతో  చేసిన  తొడుగులు ( గ్లవ్స్) ధరించారు . భుజాలమీదనుండి   ఖడ్గం  వేలాడుతూ  ఉంది . చూడచక్కని  అకారం . లక్ష్మీ కళతో  ప్రకాశిస్తున్న  దేహం . వారి  దివ్యతేజం నలుదిక్కులనూ కాంతితో నింపివేసింది .   ఈ  దృశ్యం ఎలా  ఉందంటే  : అత్యంతకాంతితో  వెలిగే  స్కంధ  (కుమారస్వామి )   విశాఖులు  ఈశ్వరుణ్ణి  అనుసరిస్తుంటే  ,  వారి   శరీరకాంతితో   ఈశ్వరుడు   ప్రకాశించిన  విధంగా —  రామలక్ష్మణులు   తమ   ప్రకాశంతో ,   తపశ్శక్తితో    జ్వలిస్తున్న   విశ్వామిత్రమహర్షి   లాంటి   వాడికే    కాంతిని  చేకూర్చారట .

గొప్ప వ్యక్తులను చుట్టుముత్టి  ఒక రకమైన  కాంతి  ఉంటుంది . దీనిని  aura  ” ఆరా ” అని అంటారు .  మనిషి  ఎంత  గొప్పవాడైతే  అంత  ఎక్కువగా  ఈ  కాంతి  ఉంటుంది .  తపస్సు  స్వతఃసిధ్ధమైన   ఈ కాంతిని  ఇనుమడింప  చేస్తుంది . విశ్వామిత్రుడు  తపస్సు  చేసిన  వారిలో  అగ్రగణ్యుడు . అతని   కాంతికే  , కాంతి  చేకూర్చే  కాంతితో  ఒప్పుతున్నారు   రామలక్ష్మణులు .  Light makes other objects to shine .  Imagine   adding shine to light itself  .

aura is the luminous radiation surrounding an object . Lord Rama’s aura is adding shine to sage viSwaamitra’s aura , making him look like burning fire .

The image showing an aura surrounding an enlightened soul is taken  from :

http://dailywicca.com/2011/04/02/aura/

రామాయణం

విశ్వామిత్రో   యయావగ్రే  తతోరామధనుర్ధరః
కాకపక్షధరో  ధన్వీ  తం  సౌమిత్రిరన్వగాత్


కలాపినౌ   ధనుష్పాణీ    శోభయానో   దిశోదశ
విశ్వామిత్రం  మహాత్మానం   త్రిశీర్షావివ    పన్నగౌ

అనుజగ్మతురక్షుద్రౌ  పితామహమివాశ్వినౌ

విశ్వామిత్రుడు    మునుముందు  ,  మధ్యలో   రామయ్య  ,  చివరగా   ధనుష్పాణియైన   లక్ష్మణుడు  — రాక్షస  సంహారానికి  బయలుదేరారు .   అమ్ముల పొదలు   రెండు   భుజాలమీద ,  చేతిలో  ధనస్సు ,  ధరించిన     రామలక్ష్మణులు   మూడుతలల    సర్పాలలాగా   కనిపించారు   వాల్మీకి   మహర్షికి .  బ్రహ్మదేవుని  వెంట  వెళ్ళే  అశ్వినీ  దేవతల  లాగా  ఉన్నారట   ఆ  అన్నదమ్ములు . వారు   వెడుతూ  ఉంటే   పది   దిక్కులు  శోభించాయట  .  దిక్కులు  ఎనిమిదే  కదా ?  మరి పది  దిక్కులెక్కడనుండి  వచ్చాయి . ఎనిమిది  దిక్కులకు  భూమ్యాకాశాలను  కలుపుకున్నాడేమో  మహర్షి . ( తూర్పు , ఆగ్నేయం , దక్షిణం , నైరుతి ,  పశ్చిమం ,  వాయవ్యం ,  ఉత్తరం , ఈశాన్యం ,  భూమి  , ఆకాశం — వీటిని  పది  దిశలని  అంటారు ) .

The picture is taken from  http://www.balagokulam.org/teach/festivals/ramayana1.php

రామాయణం

తతో   వాయుః   సుఖస్పర్శో   నీరజస్కో   వవౌ  తదా
విశ్వామిత్రగతం  దృష్ట్వా    రామం  రాజీవలోచనం .
పుష్పవృష్టిర్మహత్యా   సీద్దేవదుందుభినిస్వనైః
శఙ్ఖ దుందుభి  నిర్ఘోషః   ప్రయాతేతు  మహాత్మని

కదిలాడు   కోదండపాణి   లోకాలను  రక్షించడానికి .  మెల్ల మెల్లగా  వీచింది  చల్లగాలి . దాని  స్పర్శ  సుఖాన్నిస్తుండగా  విశ్వామిత్రుని  వెంట  బయలుదేరాడు    రాజీవలోచనుడు   రఘురాముడు .

సుందర    సుకుమారుడైన    అందాల   రామునిపై    అలరించే  పూలసోనలను  కురిపించారు  అమరవరులు  .   దుందుభులు   మ్రోగించారు   దేవతలు . దశరథుని    ప్రాసాదంలో   మిన్ను   ముట్టాయి   పటహ కాహళ   ధ్వనులు . అంతటా   ఆనందం   వెల్లి    విరిసింది .

రామాయణం

కృత   స్వస్త్యయనం  మాత్రా పిత్రా   దశరథేన  చ
పురోధసా   వసిష్ఠేన  మఙ్గళైరభిమంత్రితం

స పుత్రం  మూర్ధ్న్యుపాఘ్రాయ  రాజా  దశరథః  ప్రియం
దదౌ   కుశికపుత్రాయ    సుప్రీతే   నాంతరాత్మనా

స్వస్తి  వాక్యాలు  పలికారు  తల్లీ , తండ్రీ  . మంగళకరమైన  మంత్రాల  చేత  అభిమంత్రించాడు వసిష్ఠ మహర్షి  .  పిదప   పుత్రుని  శిరస్సును  వాసన  చూశాడు  దశరథమహారాజు . సంతోషంతో  , ప్రశాంత చిత్తంతో  శ్రీరామచంద్రుని  విశ్వామిత్రునికి  అప్పగించాడు .

గోవు  వెంట  వెళ్ళే  కోడెదూడ  లాగా   విశ్వామిత్రుని   వెంట   కదిలాడు  రామచంద్రుడు (లోకకళ్యాణానికి)  .

కమనీయమైన దృశ్యమది . మనసులో  ఒకసారి  విశ్వామిత్ర  మహర్షినీ ,  ఆతని వెనకగా  రామచంద్రుణ్ణీ ,  ఆతనివెనుకగా  లక్ష్మణున్నీ , చెమ్మగిలిన కళ్ళతో ఉన్న కౌసల్యనూ ,దశరథుణ్ణీ .  ఈ దృశ్యాన్ని  కనుల  పండువగా  తిలకిస్తున్న  అయోధ్యావాసులనూ .  మీ  జన్మ  ధన్యమవుతుంది .

రామాయణం

ఇతి  మునివచనాత్ప్రసన్న   చిత్తో
రఘువృషభస్తు  ముమోద  భాస్వరాఙ్గః
గమనమభిరుఇరోచః   రాఘవస్య
ప్రథితయశాః  కుశికాత్మజాయ  బుధ్ధ్యా

తథా  వసిష్ఠే  బ్రువతి  రాజా  దశరథః  స్వయం
ప్రహృష్టవదనో  రామమాజుహావ  స  లక్ష్మణం

 

వసిష్ఠుని  మంగళ  వాక్యాలు  విన్న  దశరథుని  మనస్సు  కుదుట  పడింది .  హృదయం   ప్రశాంతమయింది .  చిత్తం  ప్రసన్నమయింది . రామునికి  రక్షగా  విశ్వామిత్రుడుంటే  అపాయంకలగకుండా  ఉండటమే  కాదు , మంగళాలు సిధ్ధిస్తాయన్న  నమ్మకం  కుదిరింది .  మరి  ఆలస్యం  చేయకూడదనిపించింది .  సకలగుణాభి  రాముడైన  సాకేత  రాముణ్ణి   కౌశికుని   వెంట  పంపడానికి ఒప్పుకున్నాడు .   దీనికంతటికీ  కారణం  వసిష్ఠమహర్షి  వాక్చాతుర్యం .
అందుకే  అంటారు   ”  జిహ్వాగ్రే   వర్తతే   లక్ష్మీ ,   జిహ్వాగ్రే   మిత్రబాంధవా ” అని . వాదనను  యుక్తియుక్తంగా  ప్రదర్శించే  సామర్థ్యమున్నవాడికి   సాధ్యం  కానిది ఏదీ లేదు .  భయంతో , అనుమానంతో , పుత్రప్రేమతో  తల్లడిల్లుతున్న  దశరథుని   హృదయాన్ని   తన  మాటల  చాతుర్యంతో  , యుక్తి యుక్తమైన  మాటలతో  ఒప్పించాడు .  ఇది  నేను చేయను అనే  వారిని  ఒప్పించడం  ఎంత  కష్టమో  మనకు  తెలిసిన  విషయమే . ఈ  విధమైన  వాక్చాతుర్యాన్ని  అలవరచుకుంటే  తలపెట్టిన  కార్యాలను  అవలీలగా , ఇతరులను బాధపెట్టకుండా  సాధించుకోగలం .

 

విశ్వామిత్రుని   వెంట    పంపడానికి  ,  దశరథుడు  రామలక్ష్మణులను  స్వయంగా  సభాస్థలికి  తీసుకొని వచ్చాడు . లేకలేక  కలిగిన  నా   కుమారుణ్ణి    నీవెంట    ససేమిరా   పంపను   అన్న    దశరథుడు ,   విశ్వామిత్రుని    వెంట పంపడానికి       రామ  లక్ష్మణులను     తానే    స్వయంగా     రాజ  సభకు  తీసుకొని వచ్చాడు .  మహాత్ముల  మాటల  ప్రభావం  ఈ విధంగా  ఉంటుంది .