Monthly Archives: ఏప్రిల్ 2011

రామాయణం

వీరాశ్చ  నియతోత్సాహా  రాజశాస్త్ర   మనుష్టితాః
శుచీనాం  రక్షితారశ్చ  నిత్యం  విషయవాసినాం

రాజ్యంలోని మంచివారందరకూ రక్షణ కల్పించేవారు . చలించని ఉత్సాహం కలవారూ  , వీరులూ  అయిన ఆ మంత్రులు శాస్త్ర సమ్మతంగా రాజ్యాన్ని పరిపాలించేవారు  .

రాజ్య పాలనలో అతి ముఖ్యమైన అంశం సుజన రక్షణ . విద్యావంతులూ , ఇతరుల క్షేమంకోరేవారూ , సామాన్య ప్రజలూ , నిర్భయంగా జీవనం గడపాలంటే  వారికి రక్షణ అవసరం .రక్షణ లేనప్పుడు సామాన్యులను భయపెట్టి తమ పబ్బం గడుపుకుంటారు దుష్టులు .  భయం వల్ల నోరు మెదపరు శిష్టులు . భయమన్నది మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది . మంచి వారికి గల సామర్థ్యం ఎందుకూ కొరగాకుండా పోతుంది . సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడం మానేసి తమ చుట్టూ రక్షణ వలయాలు నిర్మించుకుంటున్నారు మన నేతలు . ప్రస్తుతం,  మనదేశంలో సామర్థ్యమున్న మంచి మనుష్యులు రాజకీయలలోకి రాకుండా ఉండడానికి కారణం దుష్టులైన రాజకీయ నాయకుల దుష్కృత్యాల కారణంగానేమో అని నాకనిపిస్తుంది . సామాన్యులను భయపెట్టడం దుష్టులకానందం , లాభదాయకం . భయంతో బిక్కు బిక్కు మంటూ బతికే ప్రస్తుతంకన్నా పూర్వకాలపు జీవితమే హాయిగా ఉండేదేమో అన్న సందేహం రాక మానదు.

రామాయణం

కోశసంగ్రహణే  యుక్తా  బలస్య  చ  పరిగ్రహే
అహితం చాపి పురుషం న విహింస్యురదూషకం

భావం :  రాజ్యానికవసరమైన ధనాన్ని సమకూర్చడం , సైన్యాన్ని సమీకరించడం  , న్యాయ  పరిరక్షణ (అపరాధిని మాత్రమే శిక్షించి అమాయకులకు శిక్ష పడకుండా చూడడం )  దశరథుని మంత్రుల విధులు . ఈ కార్యాలను వారు చక్కగా నిర్వర్తించేవారు .తప్పు చేయక పోతే శత్రువును కూడా హింసించని స్వభావం వారిది.

రాజు సత్కార్యాలు చేయాలనుకొంటే ధనమవసరం . ఆ ధనాన్ని సమకూర్చడం అమాత్యుల పని .  మన ధర్మశాస్త్రాల ప్రకారం ప్రజలు  సంపాదించిన  ధనంలో (ధాన్యమైనా కూడా) ఆరవ భాగం సుంకంగా చెల్లించాలి .  వేరే ఏ ఇతర సుంకాలూ ఉండేవి కాదు .  ఈ సుంకం మరీ ఎక్కువ కాదు కనుక ప్రజలందరు కూడా సంతోషంగా చెల్లించేవారు .  ప్రతిఫలంగా రాజు  ప్రజోపయోగమైన పనులన్నీ  చేసేవాడు . ప్రజలకు  రక్షణ కల్పించే వాడు .  ప్రజలను తన స్వంత బిడ్డలవలే చూసుకునే వాడు . తప్పు చేస్తే   తన  కొడుకునైనా శిక్షించకుండా వదిలేవాడు కాదు .  రాజు రాజ్యాన్ని న్యాయ మార్గంలో పాలించేటట్టు చేయడం అమాత్యుల పని .
ప్రస్తుత పరిస్థితులను గమనించండి . పన్నులను విధించడంలో మనవారిని మించిన వారెవరూ లేరు . దేశాభివ్రధ్ధికి ఖర్చు పెట్టల్సిన ధనాన్ని ఇంతవరకూ పరోక్షంగా తమ వశం చేసుకొన్న ప్రజా నాయకులు ప్రస్తుతం జీతభత్యాల పేరుతో తమ ఆదాయాన్ని విపరీతంగా వృధ్ధి చేసుకొనడం మనకందరకూ తెలిసిన విషయమే .   తమ స్వంత సుఖాలను మాత్రమే పట్టించుకొని ఇతర ప్రజల మధ్యలో విద్వేషాలు రగిలించి తమ పబ్బం గడుపుకొనే నాయకుల పరిపాలనలో మనం జీవిస్తున్నాం . ప్రజాస్వామ్యమనే పేరుగల వ్యవస్థలో కొందరు దుర్మార్గుల చేతిలో నలిగి పోతున్నాం . స్వంత లాభం కొంత మానుకొని ఇతరులకు ఉపయోగపడమని  మహనీయులు మొత్తుకున్నా   , ఆ ఆక్రందనలు ఈ దుర్మార్గుల  చెవి సోకవు .
ఇక న్యాయ వ్యవస్థను గూర్చి ఎంత తక్కువగా మట్లాడితే అంత మంచిది . తప్పులు చేసినా  తప్పించుకుంటున్నారు ధనవంతులు .  పదిమంది ప్రజలను పోగు చేసి పదివేలమందిని బాధ పెట్టే పాలకులు మనవారు . డబ్బులకమ్ముడు పోయే న్యాయాధీశులనెంతమందినో మనం చూస్తున్నాం .  ఇక సామాన్యుడికి న్యాయం  చేసేదెవరు . ప్రజాస్వామ్యం ముసుగులో ,  ” మైట్ ఈస్ రైట్ ” అనే ఆటవిక వ్యవస్థలో మనమున్నామని కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది .  ఇంతకంటే రాజరికమే మేలేమో?