Monthly Archives: మే 2015

రామాయణం

తత్ శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః

ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్య కోవిదం

నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం

మయా సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా

విశ్వామిత్ర మహర్షి వాక్యజ్ఞుడు (విద్వాంసుడు ) . ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడు . వాక్య కోవిదుడైన శతానందుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ” చేయవలసిన పనులన్నీ చేసాను . ఏ పనినీ అసంపూర్తిగా వదిలి వేయలేదు , విడువ లేదు . రేణుక ( పరశురాముని కన్న తల్లి ) జమదగ్ని మహర్షిని చేరిన విధంగా అహల్య గౌతమ మహర్షిని చేరింది ” అనే మంగళకరమైన మాటలను పలికాడు .

నోట్ : జమదగ్ని మహర్షికి కోపం వచ్చి భార్య అని కూడా చూడకుండా రేణుకను స్వంత కుమారుడైన పరశురామునిచేత చంపించాడు . తండ్రి తపశ్శక్తితో ప్రాణాలను ఇవ్వగలడన్న సత్యాన్ని తెలిసిన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాలించి తల్లి తలను నరికాడు . ఆజ్ఞ పాలించిన కుమారుణ్ణి చూసి ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు జమదగ్ని . తల్లిని తిరిగి బ్రతికించి ఏలుకొమ్మన్నాడు పరశురాముడు .  కొడుకు కోరగానే ఆ మాతృమూర్తికి  ప్రాణం పోసాడు , తిరిగి స్వీకరించాడు . అదే విధంగా తప్పు చేసిన భార్యను శాపం తీరగానే అక్కున చేర్చుకున్నాడు గౌతముడు . వారిరువురి కుమారుడైన శతానందునికి ఇంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది . చేసిన కార్యాన్ని అలతి మాటలలో చెప్పడం విశ్వామిత్ర మహర్షి వాక్యజ్ఞతను తెలియజేస్తుంది . విశ్వామిత్రుడు చెప్పిన మొదటి మాట ” నాతిక్రాంతం ” , ఏదీ విడవకుండా అన్ని పనులనూ చేసాను అని . హనుమ ” చూసాను సీతమ్మను” అన్న విధంగా . ఈ విధంగా రాయడం వాల్మీకికే చెల్లింది . IMG_5766

రామాయణం

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః
హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః

గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతిత ప్రభః
రామ సందర్శనా దేవ పరం విస్మయ మాగతః
విశ్వామిత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధతో విన్నాడు జనక మహారాజు పురోహితుడు శతానందుడు . శతానందుడు గౌతమ మహర్షి పెద్ద కుమారుడు . తపస్వి , మహాతేజస్వి అయిన శతానందునికి విశ్వామిత్రుని మాటలు వినగనే వెంట్రుకలు నిటారుగా లేచి నిలబడ్డాయి . శ్రీరామ చంద్రుని చ్హూసి విస్మయం చెందాడు . మదిలో ఎన్నో సందేహాలు ఉదయించాయి శతానందునికి . అవి ప్రశ్నల రూపకంగా బయటకు వచ్చాయి .

స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ
శతానందౌ మునిశ్రేష్ఠం విశ్వామిత్ర మథ బ్రవీత్

అపితే మునిశార్దూల మమ మాతా యశస్వినీ
దర్శితా రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతాః

నెమ్మదిగా విశ్వామిత్రుని వద్దకు చేరి రాజకుమారులను చూస్తూ ” మహర్షీ ! దీర్ఘ కాలంగా తపస్సు చేస్తున్న యశస్విని, మా మాతృమూర్తి అహల్యను తమరు రాజకుమారునకు ( శ్రీరామునికి ) చూపించారా ?

అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ
వన్యైరుపాహారత్పూజాం పూజార్హే సర్వదేహినాం
తేజోవంతురాలైన మా అమ్మ , అడవిలో దొరికే వస్తువులు ( ఫలాదులు ) రామునికి అర్పించిందా ? యథా విధిగా పూజించిందా ?

అపి రామాయ క్థితం యథావృత్తం పురాతనం
మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం

మహాతేజా ! పూర్వం, దైవ కారణంగా ( విధి బలం చేత ) చెడు జరిగిన మా అమ్మ కథను ఉన్నది ఉన్నట్టుగా శ్రీరామునికి చెప్పినావా ?
అపి కౌశిక భద్రం తే గురు మమ సంగతా
మమ మాతా మునిశ్రేష్ఠ రామ సందర్శనాదితః

అపి మే గురుణా రామః పూజిత2హ్ కుశికాత్మజ
ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః

అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ
ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః

మహర్షీ మీకు మంగళమగుగాక ! రామ దర్శనం చేత , రామునికి ఆతిథ్యం ఇచ్చుట చేత పవిత్రురాలైన నా తల్లి నా తండ్రిని కలుసుకున్నదా ? అచటికి వచ్చిన నా జనకుడు ( తండ్రిని గురుణా అని సంబోధించడం గమనించండి ) రాముని పూజించాడా ? ప్రతిగా , శ్రీరాముడు నా తండ్రిని పూజించాడా ?( పూజించడం అంటే మర్యాద చేయడం , గౌరవించడం ) . గౌతముని ఆశ్రమాన్ని చేరిన రఘురాముడు శాంత మనస్కుడై
నా జనకునికి అభివాదం చేసాడా ?

Note :

తన తల్లి తప్పు చేసిందని శతానందునికి తెలుసు . తప్పు చేసిన తల్లి శాప విముక్త అయిందా ,  లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకొనడానికే ఈ ప్రశ్నలు . తప్పు చేసిన తల్లిని రాముడు శాప విముక్తురాలిని చేయడమే కాకుండా , ఆదర భావంతో చుశాడా , చూసి గౌరవించాడా లేదా అనేది ఇంకొక సందేహం ?

శాప విముక్తురాలైన తల్లిని గౌతముడు అక్కున చేర్చుకున్నాడా ? శాప మిచ్చిన తన తండ్రిని రాముడు ఆదర భావంతో చూశాడా ? ఎన్నో ,ఎన్నెన్నో సందేహాలు ముప్పిరిగొన్నాయి శతానందుడిని . అందుకే రాముని చూసిన శతానందుని శరీరం గగుర్పాటు చెందింది .

మనసులోని ఆలోచనలను గ్రహించి , వాటిని అందంగా వ్యక్తీకరించడం వాల్మీకి మహర్షికి వెన్నతో పెట్టిన విద్య . తల్లికోసం , తండ్రి కోసం , వారి గౌరవ మర్యాదల కోసం తనయుడు పడే బాధను పై ప్రశ్నల ద్వారా మధురంగా మనకు తెలిపాడు మహర్షి .

IMG_5765

రామాయణం

తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః
న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ

సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా
తచ్చాగమన మవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం

అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని
” అయోధ్యా నగరాకి రాజైన దశరథుని కుమారులు వీరిరువురు ” అని జనకునికి ప్రత్యుత్తర మిచ్చాడు  విశ్వామిత్రుడు .

అంతే కాకుండా పసి బాలురైనా యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి దశరథుని అనుమతితో నిర్భయంగా వారు సిద్ధాశ్రామానికి రావడం , యాగ రక్షణ భారాన్ని వహించి రాక్షసులను సంహరిచడం , విశాల నగర సందర్శనం , మాతృమూర్తి అహల్య సందర్శనం , గౌతమ మునితో సమాగమం , జనకుని ఆస్థానంలో ఉన్న మహా ధనస్సును చూడాలనే కుతూహలంతో వారు మిథిలకు రావడం వంటి విషయాలు వివరంగా జనకునికి చెప్పాడు కౌశికుడు .

IMG_5739

ఈ శ్లోకంతో బాలకాండలోని ఏబదవ సర్గ సమాప్తమైనది .

రామాయణం

However king Janaka was curious to know about the details of bright and spright  Rama and Lakshmana  who accompanied the revered sage Viswamitra . He queries with modesty .

ఇమౌ కుమరౌ భద్రం తే దేవ తుల్య పరాక్రమో
గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ

పద్మ పత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ
అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ

యదృచ్ఛయైన గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే
మహామునీ ! మీకు క్షేమమగుగాక . ఖడ్గ పాణులై , ధనస్సును ధరించి గజ సింహ గమనం కలిగి కాలి నడకన మిమ్ములను అనుసరించి వచ్చిన ఈ ఇరువురు బాలురు ఎవరు . శార్దూల వృషభాల వలె కనిపిస్తూ , దేవతలకు తుల్యమైన పరాక్రమంతో ఒప్పారుతూ , అశ్వినీ దేవతలవలె సుందరంగా కనిపించే ఈ బాలురు ఎందుకు మీవెంట వచ్చారు . యౌవనంతో శోభిస్తూ , పద్మ పత్రాల వంటి నేత్రాలు కలిగి దేవలోకం నుండి స్వేచ్ఛగా భూమిమీదకు దిగివచ్చిన దేవతలలాగా ఉన్న ఈ బాలురు ఎవరికి చెందిన వారు .
వరాయుధ ధరౌ వీరౌ కస్య పుత్రే మహామునే
భూషయంతావిమం దేశం చంద్రసూర్యా వివాంబరం

పరస్పరస్య సదృశౌ ప్రమాణేఙ్గిత చేష్టితైః
కాక పక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః
” అతి శ్రేష్టమైన ఆయుధాలను ధరించి , కాక పక్షధరులైన ( జునపాలు కలిగిన  / locks of hair above and in front of ears) ఈ వీరులు ఎవరి కుమారులు . ఇరువురి పోలికలూ ఒకేలాగ ఉన్నాయి . సూర్య చంద్రుల గమనం చేత ఆకాశం ప్రకాశిస్తున్న విధంగా , ఈ వీరుల ఆగమనం ఈ ప్రదేశాన్ని ప్రకాశింపజేస్తున్నది . నాకు వీరిని గురించి వివరంగా తెలుసుకోవాలని కోరిక కలుగుతున్నది ” అని జనకుడు విశ్వామిత్ర మహర్షిని వినయంగా ప్రశ్నించాడు .

IMG_5740

Lord Ram’s idol at Salar jung museum

రామాయణం

అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా
అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా

ధన్యోస్మి అనుగృహీతోమి యస్య మే మునిపుఙ్గవ
యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోపి మునిభిః సహ

ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః
తతో భాగార్థినో దేవాన్ దృష్టుమర్హసి కౌశిక

ఇత్యుక్తా మునిశార్దూలం పృహృష్ట వదనస్తదా
పునస్తం పరిపప్రచ్ఛ ప్రాఞ్జలిః ప్రణతో నృపః

అందరూ ఆసీనులయిన పిదప జనక మహారాజు ” మహర్షీ ! దేవతలు  నేను చేసిన యజ్ఞానికి ఫలాన్ని ఇచ్చారు . ( అంతకంటే ముఖ్యంగా ) భగవత్ స్వరూపమైన తమ దర్శనంతో నా యజ్ఞం సఫలమైనది . మునిపుంగవా ! మునులతో కలిసి నా యజ్ఞాన్ని పావనం చేసారు . తమ అనుగ్రహానికి పాత్రుడనైనాను . ధన్యత చెందాను . యజ్ఞం పరిసమాప్తి కావడానికి ఇక పండ్రెండు దినములే ఉన్నవని పండితులు చెబుతున్నారు . అటు పిమ్మట తమ తమ హవిస్సులను స్వీకరించడానికి వచ్చే దేవతలను తమరు చూడగలరు ” . అని పలికి ప్రసన్న వదనంతో మహర్షికి అంజలి ఘటించాడు .

నోట్ : మహర్షులు గృహానికి ఏతెంచితే ఏ విధంగా ఆహ్వానించాలో స్పష్టంగా తెలియజేసే శ్లోకాలివి . వచ్చినవారికి అర్ఘ్య పాద్యాలు సమర్పించాలి . రాజులైతే తమ పురోహితులనూ , మంత్రులనూ వెంటబెట్టుకొని వచ్చిన మహానుభావులకు అభి ముఖంగా వెళ్ళి పూర్ణకుంభంతో స్వాగతం పలకాలి . ఆసనాన్ని సమర్పించి , వారు ఆశీనులైన పిదప తీయని మాటలతో గౌరవించాలి . క్షేమ సమాచారాలు అడగాలి . ఏవైనా అవసరాలున్నాయేమో కనుక్కోవాలి . (వస్త్రాలా ! , డబ్బా ! పండ్లా ! అడవి సంపదలా ! ఆవులా ! గుఱ్ఱాలా ! రథాలా ! మంచి ఆహారాలా ! ఏనుగులా ! బంగారమా! పొలాలా ! ఇవి కాకుండా ఇంకేవైనా కావాలా అని తమ తాహతను బట్టి అడగాలి ) . ఒక్క మాటలో చెప్పాలంటే అతిథి దేవోభవ అనే పదానికి ప్రాక్టికల్ రూపమిది .

In day to day living we require soft skills . In India  When a guest arrives at your door he is supposed to be treated like God . After welcoming the guest with a smile , he is offered a chair and pleasantries are exchanged . No harsh or unpleasant words are spoken . He is offered the best food and also presents . A detailed explanation as to how king Janaka received sage Viswamitra  is given in the above verses .

IMG_5119

రామాయణం

ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః
పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం

స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోధసః
యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ ప్రహృష్టవత్

అథ రాజా మునిశ్రేష్ఠం కృతాఞ్జలి రభాషత
అసనే భగవానాస్తాం సహైభిర్మునిపుఙ్గవైః

జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః
పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః
జనక మహారాజు చేసిన పూజలను అందుకున్న విశ్వామిత్రుడు ” మహారాజా ! తమరు కుశలంగా ఉన్నారా . తలపెట్టిన యజ్ఞం ఏ ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతోందా ? ” అని ప్రశ్నించాడు . అదేవిధంగా జనకుని అనుసరించి వచ్చిన ఇతర మునులను , ఉపాధ్యాయులను , పురోహితులను కుశల ప్రశ్నలడిగాడు . వారితో సంభాషిస్తూ ఆనందం చెందాడు మహర్షి .

అటుపిమ్మట చేతులు జోడించి అంజలి ఘటిస్తూ జనక మహారాజు , విశ్వామిత్ర మహర్షిని ఆతని అనుసరించి వచ్చిన మునులను ఆసన గ్రహణం చేయమని ( ఆసనంపై కూర్చుండమని) వినయంగా విన్నవించుకున్నాడు .

రామాయణం

జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః
పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః

ఆసనేషు యథాన్యాయ ముపవిష్టాన్ సమంతతః
దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్ర మథాబ్రవీత్

జనకుని కోరిక మన్నించి ఆసనగ్రహణం చేసాడు మహాముని . వెనువెంటనే పురోహితులు , ఋత్విక్కులు , జనక మహారాజు ,మంత్రులు కూడా తమ ఆసనాలపై కూర్చున్నారు . అందరూ ఉచితాసనాలపైన ఉపవిష్టులయిన పిదప జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా పలికాడు .

రామాయణం : పూర్ణకుంభ స్వాగతం

ఊరక రారు మహాత్ములు , వారధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు , నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా

మన పూర్వపుణ్యం కొద్దీ మహాత్ములు మన ఇళ్ళకు రావడం జరుగుతుంది . వారు వచ్చినప్పుడు విశేషంగా గౌరవించాలి . సన్యాసులనూ , బ్రహ్మచారులనూ , జ్ఞాన వృద్ధులనూ ఘనంగా గౌరవించి స్వాగతమివ్వడానికి ఏర్పరచిన విధానం పూర్ణకుంభ స్వాగతం . చూసేవారికి చూడ ముచ్చటగా , అరుదెంచిన వారికి ఆహ్లాదంగా , అతిథి దేవోభవ అన్న పదానికి అర్థమిదేనేమో అనిపించే రీతిలో గౌరవించే పద్ధతి  పూర్ణకుంభ స్వాగతం . శుభం శకున సూచకాలను ముందు పెట్టుకొని , మధురమైన స్వరంతో మంత్రాలు చదువుతూ  ఇచ్చే స్వాగతం మన దేశవాసులకే చెల్లింది .

కుంభమంటే కుండ . పూర్ణకుంభ మంటే జలంతో నిండిన కుండ . ఇది ఇచ్చేవారి తాహతును బట్టి మృత్తికతోనైనా ,రాగితోనైనా , వెండితోనైనా , బంగారంతోనైనా చేస్తారు . కుంభంలో పవిత్ర జలాన్ని నింపి , ఆ జలంలో రావి , మఱ్ఱి , పనస , పొగడ , మామిడి చెట్ల కొమ్మలను ఉంచుతారు . పిదప కుండ ముఖభాగాన్ని మామిడి ఆకులతో అలంకరించి  దానిపై  కొబ్బరికాయను ఉంచుతారు .లభ్యమైతే అలంకరణలో కమలాన్ని ఉపయోగించడం జరుగుతుంది .( ఇవన్నీ లేక పోయినా మామిడి ఆకులు , కొబ్బరికాయ మాత్రం తప్పకుండా ఉండాలి ) .

కుంభాన్ని భూదేవిగా , కొబ్బరికాయను పరమాత్మకు ప్రతీకగా , జలాన్ని ప్రాణ శక్తిగా , మామిడి ఆకులను జీవశక్తిగా భావిస్తారు . పైవిధంగా  అలంకరించిన  కుంభాన్ని మాతృమూర్తి మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు . సకల శుభాలకూ ఆలవాలం మహా లక్ష్మే కదా !

పూర్ణ కుంభాన్ని ఈ విధంగా నిర్మించి రెండు చేతులలో దానిని ముందిడుకొని వేదమంత్రాలు వల్లిస్తూ తమ గృహాన్ని పావనం చేసిన జ్ఞానులకు ఎదురుగా వెడతారు . మహాలక్ష్మీ స్వరూపమైన పూర్ణకుంభం  కంటే  శుభశకునం వేరేముంటుంది .  కుంభం మీద స్వస్తిక చిహ్నం , గజ లక్ష్మి స్వరూపం ఉండడం సర్వ సాధారణం . ఈ చిహ్నాలు శుభ సూచకాలు . మంగళాలను ప్రసాదిస్తాయని మన పూర్వీకుల నమ్మకం . శుభానికి , పవిత్రతకు,మన సంస్కృతికి చిహ్నం పూర్ణ కుంభం .స్వాగతం సమర్పించిన వారికీ , పుచ్చుకున్నవారికీ శుభాలను ప్రసాదిస్తుంది

పిదప  వారి క్షేమ సమాచారాలను అడగాలి . తీయని మాటలతో గౌరవించాలి . ఆసనంపై కూర్చుండ బెట్టాలి .ధర్మ పత్ని కలశంతో నీళ్ళు / పన్నీరు పోస్తుంటే అతిథి పాదాలను కడిగి తలపై ప్రక్షాళన చేసుకోవాలి . జ్ఞానియైన జనక మహారాజు రామ లక్ష్మణులతో కూడిన విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఈ విధంగా పూజించి తరించాడు .

సమంత్రకంగా ఇచ్చే పూర్ణకుంభ స్వాగతాన్ని చూసి ఆనందించండి

రామాయణం

రామాయణం

విశ్వామిత్ర మనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా 

శతానందం పురస్కృత్య పురోహిత మనిందితం

ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః

ఋత్విజోపి మహాత్మానస్త్వర్ఘ్య మాదాయ సత్వరం

విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం

బాలుడు రామచంద్రుని మాటలు విన్న విశ్వామిత్రుడు జనం తక్కువగా ఉండి జలం సమృధ్ధిగా ఉన్న ప్రదేశాన్ని తన విడిదిగా ఎన్నుకున్నాడు . మహర్షి స్వయంగా వచ్చి తన రాజ్యాన్ని పావనం చేసాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడు శతానందుడు ముందు నడువగా మహర్షికి స్వాగతం పలుకడానికి సవినయంగా ఎదురు వెళ్ళాడు .

ఋత్విక్కులు పూజాద్రవ్యాలు తీసుకొని జనక మహారాజు వెంట వెళ్ళారు . ( వచ్చిన అతిథికి స్వాగతం పలుకడానికి చేయవలసిన ) ధర్మాన్ననుసరించి మంత్రపూర్వకంగా పూజాద్రవ్యాలను ఆ ఋత్విక్కులు విశ్వామిత్ర మహర్షికి సమర్పించి పూజించారు .

నోట్ : మహాత్ములకు పూర్ణకుంభంతో స్వాగత మివ్వడం మన ఆచారం . పూర్ణకుంభ స్వాగతాన్ని గురించి ఇక్కడ కొద్దిగా తెలుసుకుందాం .