Monthly Archives: మార్చి 2017

రామాయణం

తతః పరమ కోపేన రాజానో మునిపుఙ్గవ
న్యరుంధన్ మిథిలాం సర్వే వీర్యసందేహ మాగతాః

ఆత్మా నమవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః
రోషేణ మహతవిష్టాః పీడయన్ మిథిలా పురీం

తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః
సాధనాని మునిశ్రేష్ఠ తతోహం భృశదుఃఖితః

అల్ప బలులైన వారికి సీతను వరించడానికి తగిన బలం లేక పోవడంతో కోపం వచ్చింది . అవమానాన్ని సహించలేక పోయారు . వారంతా కలిసి కట్టుగా మిథిలా నగరాన్ని ముట్టడించారు . కోపంతో మిథిలను దిగ్బంధనం ( పీడించారు ) చేసారు . ఒక సంవత్సరం పాటు నగరంలోకి వస్తువులను రాకుండా కట్టడి చేసారు . మిథిలలో జీవనానికి అవసరమైన వస్తువులకు కొరత ఏర్పడింది . నాకు చాలా దుఃఖం కలిగింది .

తతో దేవగణాన్  సర్వాంస్తపసాహం ప్రసాదయం
దదుశ్చ పరమప్రీతా చతురంగ బలం సురాః

తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః
అవెరిజ్ వీర్యాసందిగ్ధాః సామాత్యాః పాపకర్మణః

ఆ సమయంలో నేను తపస్సు చేసి దేవతలను మెప్పించాను . నా తపస్సు చేత ప్రీతులై వారు నాకు చతురంగ బలాలను ప్రదానం చేసారు . ఆ విధంగా , తమ బలం మీద తమకే నమ్మకం లేని ఆ రాజులు పరాజితులైనారు . నలు దిక్కులకూ పారిపోయారు .

తదే తన్ముని శార్దూల ధనుః పరమ భాస్వరం
రామ లక్ష్మణ యోశ్చాపి దర్శయిష్యామి సువ్రత

యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే
సుతా మయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం

” ముని శార్దూలా ! ప్రకాశంతో వెలిగే ఆ శివ ధనుస్సు దర్శన భాగ్యాన్ని రామ లక్ష్మణులకు కూడా కల్పిస్తాను . అంతే కాదు రాముడు ఈ ధనుస్సును ఎక్కు పడితే అయోనిజ అయిన సీతను రామునికిచ్చి వివాహం చేస్తాను ” అని పలికాడు జనకుడు .

 

రామాయణం

అథ మే కృషతః క్షేత్రం లాఙ్గలా దుత్థితా మయా 
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా

భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజాం
వరయామాసురాగమ్య రాజావో మునిపుంగవ

తేషామ వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం
వీర్య శుల్కేతి భగవన్ న దదామి సుతామహం

తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ
మితెల్ల మభుపాగమ్య వీర్గ జిజ్ఞాసవస్తదా

ఈ విషయం ఇలా ఉండగా , ఒకానొక సమయంలో నేను యజ్ఞం చేయదలచాను . ఆ యజ్ఞం చేయవలసిన భూమిని నాగలితో బాగుగా దున్ని శుభ్రం చేస్తున్న నా నాగలి కి అడ్డు వచ్చింది ఒక చిన్నారి . ప్రస్తుతం ఆ కన్యారత్నం సీత అనే నామంతో విశ్రుతురాలు (పిలవబడుతోంది ) . అయోనిజ అయిన సీత నా కుమార్తెగా పెరిగి పెద్దదయింది . వ్యక్తురాలైన సీతకు వివాహం చేయదలచి , ఆమెను వరించదలచిన వాడు వీరుడై ఉండాలని నేను నిశ్చయించాను .అంటే ఆమె వీర్య శుల్క . సీతను ఆశించి ఎందరో రాజులు నా దగ్గరకు వచ్చారు . సీత వీర్యశుల్క అని వారికి తెలియజేసి ఇప్పటివరకూ ఏ రాజుతో కూడా సీతా వివాహానికి నేను ఒప్పుకొన లేదు .

తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ
మిథిలా మభుపాగమ్య వీర్గ జిౙ్నాసవస్తదా

తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన

DSC02546.JPG
వీర్యశుల్క అయిన సీతను తమ బల ప్రదర్శన చేసి వివాహమాడే తలపుతో ఎంతో మంది నృపతులు మిథిలా నగరానికి విచ్చేసారు . వారికి శివ ధనుస్సును ఎక్కుపెట్టడమే పరీక్షగా నిర్ణయించాను . ఎక్కుపెట్టడం మాట అటుంచి విల్లును కదల్చడానికి కూడా వారి శక్తి చాలలేదు . ఆ రాజుల బలం తేలిపోయింది . వారి బలం అత్యల్పమని తెలుసుకున్న నేను సీతను వారికిచ్చి వివాహం చేయడనికి నిరాకరించాను . మహామునీ ! ఆ విషయం మీరు కూడా తెలుసుకోవలసింది . అల్ప బలులతో సీతా వివాహం జరుగదు .

రాజ్యం వీర భోజ్యం అని అంటారు . జనకుడు మాత్రం సీతను కూడా వీర భోజ్యంగా నిర్ణయించాడు .

రామాయణం

దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్టో మహీ పతిః
న్యాసో యం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా

దక్ష యజ్ఞ పథే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీల మిదమ బ్రవీత్

యస్మాద్భాగార్థినో భాగాన్న కల్పయత మే సురాః
వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వః

తతో విమనసః సర్వే దేవా వై మునిపుంగవ
ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతో భవద్భవః

తతో విమనసః సర్వే దేవా వై మునిపుంగవ
ప్రసాదయంతి దేవేఅశం తేషాం ప్రీతో భవద్భవః

ప్రీతి యుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనాం
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో
” పూజ్యుడా ! నిమి చక్రవర్తికి ఆరవతరం వాడైన దేవరాతుడనే రాజు వద్ద మహాత్ముడైన మహాశివుడు తన విల్లును న్యాసంగా (దాచి అవసరమైనపుడు తిరిగి ఇచ్చే వస్తువుగా) ఉంచాడు . దక్ష యజ్ఞ సమయంలో దేవతలు శివునికి హవిస్సులో న్యాయంగారావలసిన భాగాన్ని ఇవ్వలేదు . అపుడు ఉమాపతి ఈ ధనుస్సును సంధించి ” నాకు యజ్ఞంలో మీరు భాగం ఇవ్వలేదు కనుక ఈ ధనుస్సు
తో  మీ  తలలను ఖండిస్తాను ” అని పలికాడు . భయపడిన దేవతలు  భోలా శంకరుణ్ణి ప్రార్థించి ఆ మహాత్ముని కోపాన్ని నిగ్రహించారు . అనుగ్రహించిన శివుడు ఎక్కు పెట్టిన ధనస్సును దేవతలకే ఇచ్చాడు . ఆ దేవతలు దేవాధి దేవుడైన శివుని ధనుస్సును న్యాస పూర్వకంగానే మా పూర్వ పురుషుల వద్ద వుంచారు . అప్పటి నుండీ ఈ ధనుస్సు మా వద్ద ఉంది “.

IMG_8067

రామాయణం

కటి తూనీర పీత పట బాధే ! కర సర ధనుష బామ బర కాధే
పీత జగ్య ఉపబీత సుహాఏ ! నఖ సిఖ మంజు మహాఛబి ఛాయే
దేఖి లోగ సబ భ్యే సుఖారే ! ఎకటక లోచన చలత న తారే
హరషే జనకు దేఖి దొ ఉ భాయీ ! మునిపద కమల గహే తబ జా యీ
కరి బినతీ నిజ కథా సునాఈ ! రంగ అవని సబ మునిహి దెఖాఈ
జహ జహ జాహి కు అ ర బర దో ఊ ! తహ తహ చకిత చితవ సబు కో ఊ
నిజ నిజ రుఖ రామహి సబు దేఖా ! కొ ఉ న జాన కఛు మరము బిసేషా
భలి రచనా ముని నృప సన కహెఊ ! రాజా ముదిత మహాసుఖ లహెఊ

రామ లక్ష్మణులు జనకుని వద్దకు వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నారో వర్ణిస్తున్నాడు తులసీదాసు . ” కటి భాగంలో తూణీరాలు వ్రేలాడుతున్నాయి  . పీతాంబరాలను ధరించి , ధనుష్పాణులై , యజ్ఞోపవీతాలు వ్రేలాడుతూ ఉండగా నఖ సిఖ పర్యంతమూ అందంగా ఉన్నారు . వారిని చూసిన వారెవరూ రెప్పలు వాల్చలేదట . . ప్రజలందరూ శ్రీ రామచంద్రుడు తమనే గమనిస్తున్నట్లు భావించ సాగారు . ఆ భావన ఎందుకు కలుగుతున్నదో ఎవరికీ అర్థం కాలేదట . వారిని చూసిన జనకుడు ముచ్చట పడ్డాడు . మహాత్ముడైన విశ్వామిత్రుని పాదాలకు ప్రణామం చేసాడు . జనక మహారాజు సంతోషంతో ధనస్సు కథను రామ లక్ష్మణులకు వివరించ సాగాడు .

రామాయణం

ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా
ప్రత్యువాచ మునిర్వ్వెరం వాక్యం వాక్యవిశారదః

పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ
ద్రష్టుకామౌ ధనుః శ్రేష్ఠం యదేతత్త్వయి తిష్ఠతి

ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః

ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిం
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి

దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్ఠో మహీపతిః
న్యాసోయం జ్తస్య భగవన్ ణస్తే దత్తో మహాత్మనా

స్వాగతమందుకున్న విశ్వామిత్రుడు సంతోషించాడు . వాక్య విశారదుడు ,ధర్మాత్ముడు అయిన మహర్షి విశ్వామిత్రుడు జనకునితో ” దశరథుని తనయులు , లోకవిశ్రుతులయిన ( ప్రసిద్ధులు ) ఈ క్షత్రియ కుమారులు తమ వద్దనున్న శ్రేష్ఠ మయిన ధనస్సును చూడాలనే కోరికతో ఉన్నారు . ఆ ధనుస్సు ఈ కుమారులకు చూపించండి . ధనువును చూసిన రాజకుమారులు తిరిగి వెళ్ళిపోతారు . తమకు శుభమగుగాక “అని పలికాడు .

వాక్య విశారదుడయిన బ్రహ్మర్షి పలుకులకు ప్రత్యుత్తరంగా జనకుడు ” బ్రహ్మర్షీ ! ఈ ధనస్సు నా వద్ద ఎందుకు వున్నదో మీకు చెబుతాను . వినండి ” అని అన్నాడు .

శివధనస్సు జనకుని వద్దకు ఏ విధంగా వచ్చిందో వివరిస్తున్నాడు జనకుడు . ధనువును గురించీ , ధనుర్భంగాన్ని గురించీ విన్న ,రాసిన కవిత్వాలూ , కథలూ కోకొల్లలు . కథాక్రమంలో కొన్నింటిని పరికిద్దాం .

IMG_5740.JPG

రామాయణం

తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః
విశ్వామిత్రం మహాత్మానం అజుహావ స రాఘవ

ప్రభాత సమయం . కాలకృత్యాలు తీర్చుకున్నాడు జనక మహారాజు . రామ లక్ష్మణ సహితంగా తన అస్థానానికి రమ్మని విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించాడు .

తం అర్చయిత్వా ధర్మాత్మా శాస్త్ర దృష్టేన కర్మణా
రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్య మువాచ హ

భగవన్ స్వాగతం తేస్తు కిం కరోమి తవానఘ
భవాన్ ఆజ్ఞాపయితు మాం ఆజ్ఞయాప్యో భవతా హి అహం

అరుదెంచిన విశ్వామిత్ర మహర్షిని , రాఘవులను (raama lakshmaNulanu ) శాస్త్ర ప్రకారం పూజించాడు . వినయంగా వారితో ” భగవన్ ! తమకు స్వాగతం . నేనేమి చేయవలెనో , నా కర్తవ్యమేమో తెలియ జేయండి . నేను అజ్ఞాపింప బడవలసిన వాడను కదా . అజ్ఞాపించండి ” అని పలికాడు .

Some thoughts :

అతిథులను , పూజ్యులను ఏ విధంగా గౌరవించాలో మనకు జనకుని ద్వారా తెలియ జేస్తున్నారు వాల్మీకి మహర్షి .
జనక మహారాజు వినయాన్ని గమనించండి , ప్రవర్తనను గమనించండి . విజ్ఞుడైన విశ్వామిత్రుని “భగవన్ ” అని సంబోధించడంలో పెద్దవారిని ఎంతగా గౌరవించాడో మనకు అర్థం అవుతుంది .” స్వాగతం” అన్న శబ్దం మధురంగా లేదూ . ఆదర పూర్వకంగా అతిథులను ఆహ్వానించాలంటే ఈ విధమైన శబ్దాలు పలకాలని . రామాయణ కథ ద్వారా చేస్తున్నారు వాల్మీకి మహర్షి . మంచి భావాలూ , సంస్కృత పదాలూ , అరుదెంచిన పెద్దల మీద పూజ్య భావం మనలను ఆనందడోలికలలో ముంచివేస్తాయి . విశ్వామిత్రమహర్షికి స్వాగతం పలికే జనకుని మనస్సులో మంగళ భావాలు నెలకొని ఉన్నాయి . తమకు ఏమికావాలని అడగడం కంటే ” నేనేమి చేయవలెనో , నా కర్తవ్యమేమో తెలియ జేయండి . నేను అజ్ఞాపింప బడవలసిన వాడను కదా . అజ్ఞాపించండి ” అని పలకడం వినయాన్ని ప్రతిబింబింస్తోంది .

ఇంత వినయంగా మాట్లాడితే మహానుభావులు సంతోషించి మనకు శుభాలు ఒనగూరుస్తారు . ఇంట్లో ఈ విధమైన భాష పిల్లలకు నేర్పిస్తే వారు జీవిత పోరాటంలో విజయాన్ని సాధిస్తారని నా నమ్మకం .సూక్ష్మ దృష్టితో రామాయణాని పఠించడం వలన మనకు చక్కని భాషా , సంస్కారమూ అబ్బుతాయి . చదువుకు పరమార్థమదే కదా .

IMG_7383.JPG

రామాయణం

తృప్తిరాశ్చర్య భూతానాం కథానాం నాస్తి మే విభో
కర్మకాలో మునిశ్రేష్ఠ లంబతే రవి మణ్డలం

శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టు మర్హసి మాం పునః
స్వాగతం తపలాం శ్రేష్థ మామనుజ్ఞాతుమర్హసి

ఏవ ముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభం
విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనస్తదా

ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః
ప్రదక్షిణం చకారాశు సోపాధ్యాయః సబాంధవః

విశ్వామిత్రోపి ధర్మాత్మా సహరామః స లక్ష్మణః
స్వవాస మభి చక్రామ పూజ్యమానో మహర్షిభిః

” మునివరా! అచ్చెరువొందించే తమ కథలు ఎన్ని విన్నా తృప్తి కలుగడం లేదు . ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది . కానీ సాయం సమయమవుతున్నది . కర్మానుష్ఠానం చేయాలి . నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి . రేపు తెల్లవారుజామున నేను తమను మరల దర్శనం చేసుకుంటాను . మరియొకసారి తమకు స్వాగతం పలుకుతూ శలవు తీసుకుంటాను . నాకు అనుజ్ఞ ఇవ్వండి ” అని సవినయంగా మనవి చేసుకున్నాడు జనకుడు .

జనక  మహారాజు మాటలకు ప్రీతి చెందిన కౌశికుడు మహారాజుకు వెళ్ళడానికి అనుమతి నిచ్చాదు . జనక మహారాజు , అతని వెంట వచ్చిన బంధువులు , ఉపాధ్యాయులు మహామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తమ స్థానాలకు మరలి పోయారు .

మహర్షుల పూజలందుకొని రామలక్ష్మణులు తనను అనుసరించి వెంట రాగా స్వవాసం వైపు అభిముఖుడై తన నివాసానికి వెళ్ళాడు .

ఈ శ్లోకంతో అరువది అయిదు అద్యాయాలు ముగిసాయి .

IMG_5312

రామాయణం

కృతకామో మజెం సర్వాం చచార తపసి స్థితః
ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా

ఏష రామ మునిశ్రేష్ఠ ఎష విగ్రహవాంస్తపః
ఏష ధర్మపరో నిత్యం వీర్యస్తైష పరాయణం

ఏవ ముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః
శతానందవచః శ్రుత్వా రామలక్ష్మణ సన్నిధౌ
జనకః ప్రాఞ్జలిర్వాక్య మువాచ కుశికాత్మజం

రామా ! ఈ మహాత్ముడు బ్రహ్మర్షిత్వాన్ని / బ్రాహ్మణత్వాన్ని శ్రమకోర్చి సంపాదించుకున్నవాడు . ఈతడు (విగ్రహవాన్ తపః ) మూర్తీభవించిన తపస్సు . ధర్మపరాయణుడు . వీర్యానికి స్థావరం .

తేజోవంతుడైన శతానందుడు ఈ విధంగా మహాముని కథను రామునికి వినిపించాడు . రామలక్ష్మణులతో శతానందుడు చెప్పిన విశ్వామిత్ర చరిత్ర విన్న జనక మహారాజు బ్రహ్మర్షి విశ్వామిత్రునితో ఈ విధంగా పలికాడు .

ధన్యోస్మ్యనుగ్రహీతో స్మి యస్య మే మునిపుంగవః
యజ్ఞం కాకుత్స సహితః ప్రాప్తవానసి ధార్మికః

పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే
గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా

విస్తరేణ చ తే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః
శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా

సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః
అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బల్మ్
అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజః

 

ధర్మాత్మా ! ధన్యుడనయినాను ! నాయందు అనుగ్రహం చూపారు .  నేను చేస్తున్న యజ్ఞానికి రామలక్ష్మణులతో కలిసి విచ్చేసారు . తమ పావన దర్శనంచేత నాకు పవిత్రత లభించింది . నాకు బహువిధాలైన గుణాలు లభించాయి . తమొనర్చిన తపస్సును శతానందుడు వివరంగా రామునికి తెలిపినప్పుడు నేను కూడా శ్రద్ధగా విన్నాను . యజ్ఞానికి వచ్చిన సదస్యులందరూ తమ కథలను శ్రద్ధగా విన్నారు . మహర్షీ ! తమ తపస్సు , బలము , వీర్యము , గుణాలను  లెక్కించడానికి తగిన కొలమానాన్ని ఎవరూ కనిపెట్టలేదు . అవి అసామాన్యాలు , అప్రమేయాలు , అనితర సాధ్యాలు .

రామాయణం

తతః ప్రసాదితో దేవైర్వసిష్ఠో జపతాం వరః
సఖ్యం చకార బ్రహ్మర్షిరేవ మస్త్వితి చాబ్రవీత్

బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ
ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతం

విశ్వామిత్రోపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమం
పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరం
విశ్వామిత్రుని కోరిక ప్రకారం దేవతలు వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి ఆ బ్రహ్మర్షి అనుగ్రహాన్ని సంపాదించారు . దేవతల కోరిక మేరకు వారి వెంట వచ్చి విశ్వామిత్రుని పై స్నేహ భావాన్ని కనబరిచాడు బ్రహ్మమానస పుత్రుడు వసిష్ఠుడు . “బ్రహ్మర్షి మేవ మస్త్వితి ” ( తమరు బ్రహ్మర్షి అగుదురు గాక )  అనే వాక్యం వసిష్ఠ మహర్షి ముఖ కమలం నుండి వెలువడింది . “బ్రహ్మర్షిస్త్వం న సందేహః ” అని పలికారు దేవతలు .అంటే సందేహం లేకుండా తమరు బ్రహ్మర్షి అని . ఉత్తమమైన బ్రాహ్మణ్యాన్ని శ్రమతో సంపాదించిన విశ్వామిత్ర మహర్షి , వసిష్థ మహర్షిని పూజించి తరించాడు .

OLYMPUS DIGITAL CAMERA

రామాయణం

తతః సురగణాః సర్వే పితామహ పురోగమాః
విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్

బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసా స్మ సుతోషితాః
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక

దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దీదెం సమరుద్గణః
స్వేత్స్ ప్రాప్నుహి భద్రం తే ఘచ్ఛ సౌమ్య యథాసుఖం

పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసం
కృత్వా పనమ ముదితో వ్యాజహార మహామునిః

యద్యయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః

సురగణాలతో అరుదెంచాడు సారసగర్భుడు .” బ్రహ్మర్షే స్వాగతం తే స్తు ” బ్రహ్మర్షీ తమకు స్వాగతం అని విశ్వామిత్రునితో మధురంగా పలికాడు . ఉగ్రమైన తపస్సు చేత తమరు బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకున్నారు . దేవతాగణంతో కూడిన నేను తమకు బ్రహ్మర్షిత్వతం తో బాటు , దీర్ఘమయిన ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తున్నాను . స్వస్తి . తమకు క్షేమం కలుగుతుంది . తమరు తమ ఇష్టం వచ్చిన విధంగా సంచరించండి .

పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసాం
కృత్వా పనమ ముదితో వ్యాజహార మహామునిః

బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ
ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం

క్షత్రవేద విదాం శ్రేష్ఠో బ్రహ్మవేద విదామపి
బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు దేవతాః

పితామహుని మాతలు విన్న విశ్వామిత్రుడు సంతోషించాడు. బ్రహ్మదేవునితో ” నాకు బ్రాహ్మణత్వము , దీర్ఘాయుర్దాయము లభించినవి కనుక ఓంకార , వషట్కారాలు నన్ను వరించాలి .  వేదాలు కూడా నాకు లభించాలి . బ్రాహ్మణులకు ఉండే అధికారాలు నాకు ఉండాలి .క్షాత్ర విద్యను , బ్రహ్మ విద్యను తెలిసిన వారిలో శ్రేష్ఠుడయిన వసిష్ఠ మహర్షి వచ్చి నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించాలి . తమరు ఈ నా గొప్ప కోరిక తీరుస్తే , వరాన్ని ఇచ్చి తమ తమ స్థానాలకు వెళ్ళవచ్చు :” అనితనకు కావలసినదేమో స్పష్టంగా చెప్పాడు .

వసిష్ఠ మహర్షి తనను బ్రహ్మర్షిగా గుర్తిస్తేనే తను చేసిన తపస్సుకు సార్థకత లభిస్తుందనే విషయాన్ని గ్రహించి అలాటి కోరిక కోరాడు . చేసిన పనికి గుర్తింపు లభిస్తేనే ఆనందం . అందునా బ్రహ్మర్షి వసిష్ఠునితో , బ్రహ్మర్షి అని పలికించుకోవడం కన్నా ఆనందమేముంటుంది ?

IMG_4965.JPG