Monthly Archives: ఫిబ్రవరి 2011

రామాయణము

నాషడఙ్గవిదత్రా    సీన్నావ్రతో   నా   సహస్రదః
న  దీనః  క్షిప్తచిత్తో  నా  వ్యధితో  నాపి  కశ్చివ

షడంగాలంటే వేద విజ్ఞానానికి సంబంధించిన ఆరు అంగాలు . అవి  శిక్ష ,వ్యాకరణము ,చ్ఛందస్సు  నిరుక్తము , జ్యోతిషము , కల్పము . అయోధ్యలో అందరూ విద్యావంతులే ,అందరూ షడంగాలనూ నేర్చినవారే . విద్యావంతులైన కారణంగా వారు నిష్ఠాపరులు ,దానగుణం కలవారు , కలతచెందని మనస్సు గలవారు , కష్టాలు లేనివారు  ,స్థితప్రజ్ఞులు .
నిజమైన   విద్య వలన దుఃఖం  దూరమవుతుంది . మనసు కలత చెందదు . కష్టాలు వచ్చినప్పుడు వాటిని తొలగించుకొనగలిగే సామర్థ్యమేర్పడుతుంది .

రామాయణము

న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః
నాసూయకో న చాశక్తో నా విద్వాన్ విద్యతే తదా

నాస్తికులూ ,అసత్యవాదులూ , శాస్త్రాభ్యాసము చేయని వారూ , విద్య రాని వారూ ,  అశక్తులూ మచ్చుకైనా కనిపించని రాజ్యమది .

వాల్మీకి మహర్షి అయోధ్య ప్రజలను వర్ణించే విధానం ముచ్చటగా ఉంటుంది . సమాజంలోని మనుష్యులకు  అన్ని సుఖాలూ  లబ్ధమైనప్పుడు ఏ విధంగా ఉన్నారో , ఉంటారో , ఉండాలో  వివరించాడు (మహర్షి దృష్టిలో ) . వారు అందంగా అలంకరించుకొనే వారు . ధర్మ స్వభావులు . నియమాలు తూచా తప్పకుండా పాటించే వారు . చదువుకు ప్రాధాన్య మిచ్చే వారు . దానమివ్వడానికి ఉత్సుకత చూపేవారు  , కాని దానం పుచ్చుకోవడానికి కాదు .  వారు కాములూ మోక్షగాములు కూడ .
విద్యా దదాతి వినయం  —– శ్లోకంలో భర్తృహరి వివరించిన విధంగా , అయోధ్యాపుర వాసులు విద్యావంతులై ,   వినయమూర్తులై , కుశలత సంపాదించుకొన్నారు .  ధనాన్ని సంపాదించారు . ధర్మాన్ని అనుష్టించి , తాము సుఖపడి  ,  ఇతరులను సుఖపెట్టారు . జీవిత పరమార్థమింతకంటే ఏముంటుంది .

రామాయణము

నానాహితాగ్నిర్నాయజ్వా  న క్షుద్రో న తస్కరః
కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తసంకరః

నీచులూ , దొంగలూ , యాగాలు చేయని వారూ అయోధ్యలో ఒక్కరైనా  కనిపించేవారు కారు .

స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః
దానాధ్యయన శీలాశ్చ సమ్యతాశ్చ పరిగ్రహే

అయోధ్యా పురి లోని బ్రాహ్మణులు ఆచారవంతులు . విజితేంద్రియులు . దానం చేయడానికి ఎల్లప్పుడూ ఉత్సుకతో ఉండేవారు  . దానాన్ని స్వీకరించడానికి సంకోచించేవారు .  అధ్యయన శీలురు .  పరదారా విముఖులు .

 

రామాయణము

నాకుణ్డలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్

నామృష్టో నానులిప్తాంగో నాసుగంధశ్చ విద్యతే

నామృష్టభోజీ  నాదాతా  నాప్యనఙ్గదనిష్కధృక్
నాహస్తాభరణో  వాపి దృశ్యతే   నాప్యనాత్మవాన్

అయోధ్యలో నివసించే  ప్రజలు ధనవంతులు . కర్ణభూషణాలు ,  కంఠాభరణాలు , శిరోభూషణాలు , హస్తాభరణాలు , పుష్ప మాలలు , సుగంధ ద్రవ్యాలు  అయోధ్యా వాసులందరకూ అందుబాటులో ఉండేవి .

 

రామాయణం

సర్వే    నరాశ్చ    నార్యశ్చ   ధర్మశీలాః   సుసంయుతాః
ఉదితాః    శీలవృత్తాభ్యాం      మహర్షయ       ఇవామలాః
ఉత్తమమైన శీలము , మంచి స్వభావము , అన్నిటికన్నా ముఖ్యమైనది మంచి నడవడిక కలిగిన వారు అయోధ్యా పుర వాసులు . అందువలన  వారు దిదినాభివృధ్ధి చెందేవారు .

కామీ  వా  న  కదర్యో  వా  నృశంసః  పురుషః  క్వచిత్
దృష్టుం శక్యమయోధ్యాయాం నావిద్వాన్న చ నాస్తికః

అయోధ్యా నగర వాసులు విద్యావంతులు . విద్య నేర్చిన వాడికి కొన్ని లక్షణాలుండాలి .వాడు లోభి కాకూడదు . ఇతరులను బాధపెట్టకూడదు . నాస్తికుడు కాకూడదు . కాముకుడు కాకూడదు .  ఈ లక్షణాలన్నీ అయోధ్య ప్రజలకు నిండుగా ఉన్నాయి .

పాప పుణ్యాలను గురించి చెబుతూ “పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ” అని అంటారు మనవారు .పాప పుణ్యాలను ఇంత సూక్ష్మంగా , సుస్పష్టంగా చెప్పిన వారు మనకెక్కడా కానరారు .ఈ వాక్యాలను పాప పుణ్యాలకు   నిర్వచనంగా ( డెఫినిషన్ ) గా భావించవచ్చు . విద్యావంతులందరూ పుణ్యకార్యాలు ఆచరించాలని  మన శాస్త్రాలు వక్కాణిస్తాయి . ఒకవేళ చదువు నేర్చిన వాడెవడైనా  క్రూరత్వమూ ,కాముకత్వమూ  లోభీ అయివుంటే వాడు విద్యావిహీనుడి కిందే లెక్క . ఈ శ్లోకంలో అయోధ్యాపుర వాసులందరూ నిజమైన విద్యావంతులూ ,  పరులను బాధించని ఉత్తమ పురుషులూ , దుర్గుణాలు లేని వారు  అని చెప్పబడింది .

రామాయణము

తస్మిన్  పురవరే  హృష్టా ధర్మాత్మనో బహుశ్రుతాః
నరాస్స్తుష్టా   ధనైః   స్వైః   స్వైరలుబ్ధాః  సత్యవాదినః

నాల్పసన్నిచయః  కశ్చిదాసీత్తస్మిన్  పురోత్తమే
కుటుంబీ యో హ్యసిధ్ధార్థో  గవాశ్వ్ధనధాన్యవాన్

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్

అన్న విషయాన్ని గ్రహించిన దశరథుడు తన ప్రజల సుఖ సంతోషాలకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు . అయొధ్యాపురిలోని ప్రజలందరూ తృప్తి చెందిన వారు , ఆశ లేని వారు , సత్యవంతులు .  ధనధాన్యాలు , గవాశ్వాలు ( ఆవులు , గుర్రాలు ) ,  ఐశ్వర్యము  లేనివాడు అయోధ్యలో ఒక్కడు కూడా లేడు . అచటి ప్రజలు చక్కగా చదువు నేర్చినవారు . ధర్మాత్ములు కూడ .

రామాయణం

తేన     సత్యాభిసంధేన        త్రివర్గమనుతిష్ఠతా
పాలితా  సా  పురీ  శ్రేష్టా   ఇంద్రేణేవామరావతీ .

త్రివర్గాలంటే ధర్మార్థ కామాలు . తన పాలనలో త్రివర్గాలకూ , సత్యానికీ అమితమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి , అమరావతిని ఇంద్రుడు పాలించినట్లుగా  అయోధ్యను పరిపాలించాడు దశరథ మహారాజు .

రామాయణం

బలవాన్నిహతామిత్రో  మిత్రవాన్విజితేంద్రియః
ధనైశ్చ  సంగ్రహైశ్చాన్యైః    శక్రవై  శ్రవణోపమః

యథా మనుర్మహాతేజా  లోకస్య పరిరక్షితా
తథా   దశరథో   రాజా వసన్  జగదపాలయత్

 

శత్రుసంహారం చేసి రాజ్యాన్ని నిష్కంటకంగా పాలిస్తున్న మహారాజు దశరథుడు .విజితేంద్రియుడాతడు . ధన ధాన్యాలలో కుబేరునితో సమానుడు . అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖులై జీవించారు .

రామాయణం

అయోధ్యను వర్ణించాక దశరథమహారాజు గొప్పతనాన్నీ ఆ రాజ్యంలో నివసించే ప్రజల సుఖసౌఖ్యల్నీ ఆరవ సర్గలో వివరిస్తాడు వాల్మీకి .

తస్యాం పురమయోధ్యాయాం వేదవిత్సర్వసఙ్గ్రహః
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః

ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ
మహర్షికల్పో రాజర్షిస్త్రిషులోకేషు విశ్రుతః

రాజ్యాన్ని పరిపాలించే రాజుకు కొన్ని లక్షణాలుండాలి . రాజ్యంలో ఉండే శక్తిమంతులైన ప్రజలను , విద్యావంతులను తనకు సర్వదా విధేయులుగా ఉండేవిధంగా చూసుకోవాలి . వారిని మంచి మాటలతో , దానాదులతో తృప్తిపరచి , అవసరమైతే తన కోసం వారు ప్రాణాలైనా ధారపోయడానికి సిధ్ధంగా ఉండే లాగా తయారు చేయాలి . ఆంగ్లంలో దీనిని లాయల్టీ (Loyalty ) అని అంటాము . ఇది అసలు సిసలైన  నాయకత్వపు   (Leadership quality) లక్షణం .  చెప్పడానికి సులభమే కాని , సమర్థులైన వారిని తనకనుకూలంగా మార్చుకోవడం చాలా కష్టంతో కూడుకొన్న పని . రాజు దీర్ఘదర్శి అయి ఉండాలి . (దీర్ఘ దర్శి అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో  ఊహించగలిగే శక్తి) . స్వయంగా పరాక్రమవంతుడై ఉండాలి . ప్రజలందరూ ఇష్టపడే వాడై , వారిని తన వశంలో ఉంచుకొనగలిగే శక్తి కలిగి  ఉండాలి .

రామాయణంలోని నాయకత్వ లక్షణాలను గురించి మనం మరోసారి ముచ్చటించుకొందాం. వీలైతే ప్రస్తుత రాజకీయాలను రామాయణ దృష్టికోణంలోంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం .