Monthly Archives: మార్చి 2011

రామాయణము

క్రోధాత్కామార్థహేతోర్వా న బ్రూయురనృతం వచః
తేషామవిదితం కించిత్స్వేషు నాస్తి పరేషు వా
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితం
కుశలా వ్యవహారేషు స్పుహృదేషు పరీక్షితాః
ప్రాప్తకాలం తు తే దణ్దం ధారయేయుః సుతేష్వపి

అమాత్యులందరూ  సత్యభాషణులు .  కామ , క్రోధ , ధనాదులకు లొంగని వారు . వారు వ్యవహార దక్షులు . చారచక్షులు .  రాజ్యంలో జరిగే ప్రతి చిన్న సంఘటనా  వారికి తెలిసేది . తరతమ బేధాలు లేకుండా  తప్పు చేసిన వారిని  ( తప్పు చేసిన వారు తమ కుమారులైనా )  దండించేవారు . నిష్పక్షపాతులు వారు .

తమ బంధువుల క్షేమాన్ని మాత్రమే ప్రజల క్షేమంగా పరిగణించే ఈనాటి నాయకులను గమనించండి . సాంకేతికంగా ఎంత అభివృధ్ధి చెందినా శత్రు దేశాల కుయుక్తులను కనుగొనలేని సామ్రాజ్యం మనది . రాజులు చార చక్షులు అన్న ప్రథమ సూక్తి కూడా వంటబట్టించుకోని దేశం మనది . తమ అసమర్థతతో  మనదేశాన్ని మరల విదేశీయులకు ధారాదత్తం చేస్తారేమో అన్న అనుమానం కూడా కలగక మానదు .  శక్తి సామర్థ్యాలను గమనించకుండా పదవులను తమ కుమారులకు , బంధువులకు  కట్టబెట్టే  (అది కూడా ప్రజాస్వామ్యమైన  భారత దేశంలో ) కుమతులూ , కుబుధ్ధులూ   రామాయణాన్ని చదివి అందులో చూపిన సన్మార్గాన్ని అనుసరించే బదులు ,  దాన్ని విమర్శిస్తారు . మీకు ఏదైనా చెడు కనిపిస్తే  దాన్ని వదలి , రామాయణంలోని   మంచిని గ్రహించండి.  పుణ్యమూ , పురుషార్థమూ లభిస్తాయి.

రామాయణము

విద్యావినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః
శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః

కీర్తిమంతః  ప్రణిహితా  యథావచనకారిణః
తేజః క్షమాయశః ప్రాప్తాః స్మితపూర్వాభిభాషిణః

దశరథుని  మంత్రులు విద్యావంతులు , శాస్త్రాలను ఆకళింపు చేసుకొన్నవారు . ఏదైనా  పని మొదలు పెడితే దాన్ని ఏకాగ్ర చిత్తంతో పూర్తిచేసేవారు . మనసా ,వాచా , కర్మణా అన్నట్టు  చెప్పినది  చెప్పినట్టు   చేసేవారు . మాట తప్పడం అనేది లేదు .  తప్పు  చేయడానికి సిగ్గు పడేవారు .  అన్నిటికంటే ముఖ్యం “స్మిత పూర్వాభి భాషణులు”– -నవ్వుతూ మాట్లాడేవారు .

ప్రస్తుత కాలంలో ఉన్న మంత్రులకు ఈ లక్షణాలలో ఎన్ని ఉన్నాయో మీరే ఆలోచించండి .

రామాయణం

ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామృషిసత్తమౌ
వసిష్ఠో  వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే .

ఎనిమిది మంది మహామాత్యులకు తోడుగా వసిష్ఠుడు ,వామదేవుడు  దశరథునకు ఋత్విక్కులుగా ఉండేవారు . ఇతర మంత్రులూ ఉండేవారు . ఏడవ సర్గ లో  మంత్రుల స్వభావాన్నీ , పరిపాలనా దక్షతనూ ఇరవై రెండు  శ్లోకాల్లో  వివరిస్తాడు మహర్షి  . విషయాన్ని వివరంగా ,  కూలంకషంగా , సందేహాలకు తావివ్వకుండా వివరించడం వాల్మీకి మహర్షికి అలవాటు .

యజ్ఞంలో వేద తంత్రాన్ని నడిపే ఋషిని ఋత్విక్కుడని అంటారు .  హోత , అధ్వర్యుడు ,  ఉద్గాత , బ్రహ్మలు వరుసగా  ఋగ్వేద ,యజుర్వేద , సామవేద , అథర్వణ వేద తంత్రాలనెరిగిన ఋత్విక్కులు . శాస్త్ర ప్రకారం రాజ్యం  పాలించడమనే యజ్ఞాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి  దశరథునికి సాయం చేసేవారు వశిష్ట ,వామదేవులు .

 

విద్యావినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః
శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః

కీర్తిమంతః      ప్రణిహితా     యథావచనకారిణః
తేజఃక్షమాయశః ప్రాప్తాః  స్మితపూర్వాభిభాషిణః

 

రామాయణం

తస్యామాత్యా  గుణైరాసన్నిక్ష్వాకోస్తు   మహాత్మనాః
మంత్ర జ్ఞాశ్చేజ్ఙ్గితజ్ఞాశ్చ   నిత్యం   ప్రియహితే  రతాః

అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః
శుచయశ్చానురక్తాశ్చ   రాజకృత్యేషు    నిత్యశః

ధృష్టిర్జయంతో విజయః సిధ్ధార్థోహ్యర్థసాధకః
అశోకో  మంత్రపాలశ్చ  సుమంత్ర శ్చాష్టమో భవత్

రాజకార్యాలు సక్రమంగా నిర్వహించడానికి  దశరథుని వద్ద  ధృష్టి , జయంతుడు , విజయుడు , సిధ్ధార్థుడు , అర్థసాధకుడు , అశోకుడు , మంత్రపాలుడు , సుమంత్రుడు అనబడే ఎనిమిది మంది  మంత్రులు ఉండేవారు .వారు సమర్థులు . రాజకార్యాలు చక్కదిద్దడంలో సిధ్ధహస్తులు . ప్రజా హితమే వారి ధ్యేయం , జీవిత లక్ష్యం .వ్యవహారాల్లో న్యాయంగా ఉండేవారు . ముఖ కవళికలను బట్టి  ఎదట ఉన్నవారి మనోభావాలను పసిగట్టగల శక్తి వారి స్వంతం .ఎల్లప్పుడూ  రాజ్యపాలనలో నిమగ్నమై ఉండేవారు .

రాజ్యం సుబిక్షంగా , శత్రునిష్కంటకంగా ఉండాలంటే సమర్థులైన మంత్రులు అవసరం . వారు న్యాయగా ఉంటేనే రాజ్యపాలన చక్కగా సాగి , ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు . సునిశితమైన దృష్టి , సుకుమారమైన మనస్సు , సౌశీల్యత , సాహసము ,  పౌరుషము , పట్టుదల , దేశభక్తి , రాజభక్తి  లాంటి ఎన్నో గుణాలు వారికి స్వభావరీత్యా ఉండాలి .  రాజుయొక్క ప్రజ్ఞ్య మంత్రులనెన్నుకోవడంలో ఉంటుంది .  వీరుడైన రాజూ , విద్వత్తు కలిగిన మంత్రులూ ఉన్న రాజ్యంలోని ప్రజల జీవితం మూడు పువ్వులూ , ఆరు కాయలుగా అలరారుతుంది .

రామాయణం

రామాయణంలో ఐదు , ఆరు సర్గలు :
వాల్మీకి రచించిన రామాయణం బాలకాండ  ఐదవ సర్గ ,  ఐదవ శ్లోకంతో ఆరంభమవుతుంది . కోసల దేశంలో  సరయూ నదీ తీరంలో అతి రమ్యంగా నెలకొని ఉన్న నగరం అయోధ్య .  బ్రహ్మ దేవుని సంకల్పం మానస సరోవరంగా రూపుదిద్దుకొన్నది . మానస సరోవరం నుండి ఒక పాయ హిమాలయాల మీదనుండి కిందకు జాలువారింది .అదే సరయూ నది . దాని తీరంలో వెలసిన పుణ్య పట్టణం అయోధ్య . శత్రుదుర్బేధ్యం  కనుక సార్థక నామధేయం కలది  . అయోధ్యా నగర వర్ణనతో అలరారుతుంది  ఐదవ అధ్యాయం . సుందరమూ సువిశాలమూ అయిన నగరం . ఎత్తైన రాజప్రాసాదాలూ ,  రత్నాలంకృతాలైన  రాజవీధులూ ,  ఏడంతస్తుల మేడలూ ,  ఉత్తేజ పరచే ఉద్యానవనాలూ , వాటిలో  చిత్ర గృహాలూ ,  నాట్యగృహాలూ ,  యుధ్ధాశ్వాలూ ,సుందర నారీమణులు ,  అహితాగ్నులూ   దానపరాయణులూ ఐన  బ్రాహ్మణులూ ,  ఉత్తములైన మనుష్యులూ ఒకటనేమిటి  ఇహ పర సుఖాలనందించే సర్వసాధనాలకు నెలవు అయోధ్య . ఆ నగరానికి రాజు దశరథ మహారాజు . దశరథమహారాజు  అయోధ్యను పాలించిన సమయంలో , ఆరాజ్యంలోని  ప్రజల జీవన విధానాన్నీ , సౌశీల్యాన్నీ , విద్యాతురతనూ , సంపాదించిన విద్యతో  న్యాయంగా ధనాన్ని ఆర్జించడాన్నీ , ఆర్జించిన ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించడం లాంటి ఎన్నో విషయాలను ఆరవ సర్గలో  వివరంగా వర్ణించాడు మహర్షి వాల్మీకి  . దశరథుని సైన్యంలోని వీరుల  శౌర్యాన్ని , వారుపయోగించే ఉత్తమాశ్వాలను , మత్తగజాలను కూడా వర్ణించాడు . ఏడవ సర్గలో దశరథుని మంత్రుల గుణగణాదులు  వర్ణింపబడ్డాయి .

రామాయణ రచన ఒక చక్కటి పధ్ధతిలో కొనసాగుతుంది . భావి తరాలరచయితలకది మార్గదర్శకం . కాళిదాసు  మహాకవి  భాషలో  చెప్పాలంటే  ” మణౌ వజ్రసముత్కీర్ణే  సూత్రస్యే వాస్తిమే  గతిః ” . దాని అర్థం –“వాల్మీకి మహర్షి లాంటి మహర్షులు  ,  కఠిన మైన వజ్రానికి బెజ్జం చేసి ,  దారం అనుకూలంగా  ప్రవేశించడానికి మార్గం సుగమం చేసినట్లు వారి కవిత్వం ద్వారా  నా కవిత్వానికి మార్గం చూపారు . నా కవిత్వమంతా వారి బిక్షయే అని అంటాడు . కాళిదాసు కవితకు మార్గం చూపగలిగిన రచనను గురించి  ఇక  చెప్పాల్సిందేముంది  ,  చదివి ఆనందించడం , పుణ్యం సంపాదించుకోవడం తప్ప .

రామాయణం

సా యోజనే చ  ద్వే  భూయః   సత్యనామా   ప్రకాశతే
యస్యాం దశరథో    రాజా  వసన్  రాజ్యమపాలయత్

తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్
శశాస    శమితామిత్రో   నక్షత్రాణీవ  చంద్రమా

తాం   సత్యనామాం  దృఢ  తోరణార్గలాం
గృహైర్విచిత్రై రుపశోభితాం   శివాం
పురీ  మయోధ్యాం  నృసహస్రసంకులాం
శశాస వై     శక్రసమో     మహీపతిః

 

అయోధ్యానగరమే కాక సరిహద్దుల నుండి  రెండు యోజనాల దూరం వరకూ శత్రువులు ప్రవేశించకుండా  నిర్మించబడ్డ   ఆ నగరాన్ని  ఇంద్ర సమానుడైన    దశరథ మహారాజు శత్రునిష్కంటకంగా , ప్రజారంజకంగా చంద్రుడు నక్షత్రాలను  పాలించిన రీతిగా   పరిపాలించేవాడు . నిజంగా ” అయోధ్య” ఆ పట్టణానికి సార్థకమైన  నామధేయం .

రామాయణము

వింధ్యపర్వతజైర్మత్తైః  పూర్ణా హైమవతైరపి
మదాన్వితైరతిబలైర్మాతంగైః పర్వతోపమైః

ఐరావతకులీనైశ్చ మహాపద్మ కులైస్తథా
అంజనాదపి నిష్పన్నైర్వామనాదపి చ ద్విపైః

భద్రైర్మం ద్రైర్మ్ర గైశ్చైవ  భద్రమంద్రమృగైస్తథా
భద్ర మం ద్రైర్భద్రమృగైమృగైర్మృగ మంద్రైశ్చ సా పురీ
నిత్యమత్తైస్సదా పూర్ణా  నాగైరచల సన్నిభైః

 

ఉత్తమమైన  అశ్వాలే  కాకుండా హిమవత్పర్వతాలలో జనించిన శ్రేష్ఠమైన   ఏనుగులు అయొధ్యా నగరాన్ని రక్షించేవి .  ఆ దిగ్గజాలు ఐరావత , అంజన , మహాపద్మ వామన జాతులకు చెందినవి . ఆ ఐరావతాలు మదించినవై , పర్వత సమానములై , మహాబలసమన్వితములైనవి .

మన శాస్త్రాలప్రకారం అష్టదిగ్గజాల పేర్లు :
ఐరావతం ,పుండరీకం , వామనం , కుముదం , అంజనం , పుష్పదంతం , సార్వభౌమం , సుప్రతీకం .

భారత దేశాన్ని విదేశీయులు చాలాకాలం వరకూ జయించలేక పోవడానికి కారణం , భారత దేశానికి మాత్రమే స్వంతమైన గజ సైన్యం  అని చరిత్రకారులంటారు .

రామాయణము

యోధానామగ్నికల్పానాం పేశలానామర్షిణాం
సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ

కాంభోజవిషయే జాతైర్బాహ్లికైశ్చ హయోత్తమైః
వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః

కేసరి అంటే సింహం . సింహాలతో ఉన్న గుహలో ఇతర  జంతువులు   ప్రవేశించగలవా . అలాగే అయోధ్య  పౌరుషమూ , శస్త్రవిద్యా నైపుణ్యమూ గల యోధులతో నిండి శత్రు దుర్బేధ్యమై ఉండేది . కాంభోజాది దేశాల ఉత్తమాశ్వాలు  వీరులకందుబాటులో ఉండేవి .

కాంభోజ , బాహ్లిక సింధు దేశాలు పూర్వకాలం నుండీ  అశ్వాలకు ప్రసిధ్ధి .  అరబ్బు దేశాలు అశ్వాలకు ప్రసిధ్ధి అని తెలిసిన విషయమే . అర్మీనియా , టర్కీ  లాంటి దేశాలు   ఈ అశ్వ సంపద కారణంగానే   దండయాత్ర చేసి భారతదేశాన్ని కొల్లగొట్టాయి . మాటలో మాట ఆర్మీనియా  దేశాన్ని  హయాస్తాన్ అని కూడా అంటారు . గుర్రాన్ని సంస్కృతం లో హయమంటారని మనకు తెలిసిన విషయమే . అంటే సంస్కృత భాష అరబ్బు దేశాలు దాటి పూర్వకాలపు సోవియట్ రాజ్యాల  వరకూ వాడుకలో  ఉండేదని  తెలుస్తుంది .

రామాయణము

క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యాః క్షత్రమనువ్రతాః
శూద్రాః   స్వధర్మ  నిరతాస్త్రీన్  వర్ణానుపచారిణః

అన్ని వర్ణాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు అనుకూలులై , స్వధర్మాలను ఆచరిస్తూ ఉండేవారు .

సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా ,
యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమతా

ఇక్ష్వాకు వంశజుడైన దశరథుడు రాజధర్మం   ప్రకారం   అయోధ్యను చక్కగా రక్షించేవాడు .

దశరథుని కాలానికి వర్ణాశ్రమాలు ఏర్పడ్డాయి . వర్ణాశ్రమ ధర్మాలూ పాటించేవారు . అయితే వివిధ వర్ణాల ప్రజల మధ్యన  ద్వేషభావాలు ఉన్నట్లు మనకు కనిపించదు. ఇక్కడ మనమొక విషయం గమనించాలి . రామాయణం రచించింది వాల్మీకి మహర్షి . తపశ్శీలుడూ ,  ధర్మనిరతుడూ , బోయకులానికి చెందినవాడూ  అయిన వాల్మీకి వర్ణాశ్రమాలను ఎందుకు సమర్థించాడు . అవి నిజంగా ప్రజలను అణగదొక్కేవే అయితే అత్యుత్తమమైన ఆలోచనా శక్తి గల మహర్షి ఈ ధర్మాలను ఎందుకు నిందించలేదు ? రామాయణ కాలంలోని వర్ణవ్యవస్థకూ , రామాయణకాలం   పిదప వచ్చిన వ్యవస్థకూ ఏమైనా భేదం ఉందా ? ఇటువంటి ప్రశ్నలెన్నిటికో సమాధానం దొరకదు . అన్నీ ఏమో ఏమోలే కదా .

ఒక్కటి మాత్రం నిజం . ప్రస్తుతం ఉన్న  వర్ణవ్యవస్థ మనిషికీ మనిషికీ మధ్య విభేదాలు , వ్యత్యాసాలు , ద్వేషాలు కల్పించింది . మూర్ఖత్వాన్ని పెంచింది .  ప్రశ్నలు వేసుకొని సమాధానాలను అన్వేషించి నిజా నిజాలను తెలుసుకునే పూర్వీకుల ఉత్తమ విధానాన్ని మంటగలిపింది .

రామాయణము

కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్య రూపవాన్
ద్రష్టుం  శక్యమయోధ్యాయాం  నాపి రాజన్య భక్తిమాన్

వర్ణేగ్ర్య   చతుర్థేషు   దేవతాతిథిపూజకాః
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః

దీర్ఘాయుషో నరాస్సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః
సహితాః పుత్రపౌత్రైశ్చ  నిత్యం  స్త్రీభిః పురోత్తమే

 

అయోధ్యావాసుల విద్యావంతులనీ , విద్య ఒసగే ఫలాలన్నీ అనుభవించే వారనీ చెప్పాక , ఈ శ్లోకాల్లో వారి సుందరతనూ , స్వభావాన్నీ ,  సౌశీల్యాన్నీ  వర్ణించాడు మహర్షి . ఐశ్వర్యము , సౌందర్యము , రాజభక్తి , దైవ భక్తి , కృతజ్ఞత , ఉదారత ,  పరాక్రమము , అతిథిసత్కారము ,లాంటి గుణాలు  కలిగినవారు  అయోధ్యా నివాసులు . దీర్ఘాయుష్మంతులై ,సత్య భాషణులై  పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు .

ఐశ్వర్యం  సుఖజీవనాన్ని ప్రసాదిస్తుంది .   విద్యా వినయాలు , సౌశీల్యము  ,   సత్య సంపద , శౌర్యము ,  ధర్మాచరణము  తోడయితే   ఇహమూ , పరమూ   లభ్యమౌతాయి . జీవితంలో కోరదగింది  ఇంకేముంటుంది .