Monthly Archives: మే 2013

రామాయణం

కేరళ  రాజ్యంలోని ” కొచి” వద్ద   ” త్రిక్కక్కర”  అనే  ప్రదేశం  ఉంది . ఈ ప్రదేశాన్ని ,  వామన  మూర్తి    బలి చక్రవర్తిని  పాతాళలోకానికి  పంపివేసిన  ప్రదేశంగా   ప్రజలు  భావిస్తారు  . ఇచట  వామనమూర్తి  ఆలయం   కూడా ఉంది . విచిత్రంగా  ఈ  ప్రదేశానికి  ఇరవై  మైళ్ళ  దూరంలో  పాతాళమనే  ప్రదేశం  ఉంది .  త్రిక్కాళ్ కర అంటే  పవిత్రమైన  పాదమని  అర్థం .  

 

భూమిని దానమిచ్చిన వానికీ , దానిని ప్రీతితో పుచ్చుకొన్న వానికీ పాపాలు నశిస్తాయి . అటువంటివారు స్వర్గలోకంలో నూరేండ్లు సుఖంగా ఉంతారు . ఏ దానమూ భూదానానికి సరికాదు . నీకు కీర్తీ , పుణ్యమూ లభిస్తాయి అని వామనుడు బలితో పలికి దానాన్ని గ్రహించడానికిముందు తన శరీరాన్ని పెంచాడు . పెరిగిన ఆ శరీరం విరాట్స్వరూపమయింది . పొట్టివాడైన ఆ చిట్టివడుగు శరీరం బ్రహ్మాండాన్నంతా ఆక్రమించింది . ఈ విశ్వస్వరూపం పెరిగిపోయిన విధాన్ని పోతన్న మాటలలో కాదు కాదు పద్యంలో :

ఇంతింతై వటుడింతయై , మరియు దా నింతై , నభో వీధిపై
నంతై , తోయదమండలాగ్రమున కంతై , ప్రభారాసిపై
నంతై , చంద్రునికంతయై , ధ్రువునిపై నంతై , మహర్వాటిపై
నంతై , సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై

ఈ విధంగా బ్రహ్మాండమంత పెరిగిపోతూ ఉంటే పొట్టిగా ఉన్న విష్ణుమూర్తి తలమీద గొడుగులాగా ఉందేది కాస్తా శిరోరత్నమైంది . చూస్తూ ఉండగానే చెవికుండలంగా కనిపించసాగింది . అరే అని చూసేవాళ్ళు విస్తుపోతూ చూసే లోపే కంఠాభరణంగా కనిపించసాగింది . కంఠాభరణం క్షణంలో మాయమయి భుజకీర్తిగా కనిపించసాగింది . సూర్యబింబమే కాంతులీనే కంకణంగా , మొలలోని ఘంటగా , కాలి అందెగా , చిట్టచివరన బ్రహ్మాండనాయకుని పద పీఠంగా మారింది .

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై , శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్

విశ్వరూపాన్ని వర్ణించడంలో అద్వితీయమైన ప్రతిభ చూపాడు పోతనామాత్యుడు . పుణ్యమూ , పురుషార్థమూ , వీనులకు విందూ కావాలనుకునే వారు తప్పక చదవాలి బహుపసందైన బలి చక్రవర్తి కథ .

 

 

రామాయణం

శుక్రాచార్యుడు రాక్షస గురువు . వచ్చినవాడు వామనుడనీ , బలి చక్రవర్తి సామ్రాజ్యాన్ని కపటోపాయం చేత కబళింపడానికి వచ్చాడనీ గ్రహించాడు . బలి చక్రవర్తి   వామనునికి  దానమివ్వకుండా అడ్డుపడడానికి శతవిధాలా ప్రయత్నించాడు .వచ్చినవాడు  వామనుడని చెప్పాడు .ఆపత్సమయంలో ఆడి తప్పవచ్చుననే రాక్షస ధర్మాన్ని బోధించాడు . శుక్రనీతిని వివరించే అందమయిన పద్యం

వారిజాక్షులందు వైవాహికములందు , బ్రాణమానవిత్త భంగమందు
జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు , బొంకవచ్చునఘము వొంద దధిప

” సత్యాన్నాస్తి పరోధర్మః , సత్యే సర్వంప్రతిష్ఠితం ” ( మహాభారతం ) అని గాఢంగా నమ్మిన మతం మనది . శుక్రాచార్యుడు సత్యాన్ని కొన్ని సమయాలలో పాటించకపోతే అధర్మం కాదన్నాడు . తను చెప్పింది నిజమేమోననిపించేంత విధంగా వాదించాడు . వాదనా పటిమతో నిజాన్ని అబధ్ధంగా , అబధ్ధా న్ని నిజంగా నిరూపించడానికి చేసిన ప్రయత్నమిది . నిజానికి పైన పేర్కొన్న సందర్భాలలో తప్పితే అబధ్ధం చెప్పాల్సిన అవసరం మనకు ఉండదేమో ?  వెయ్యబధ్ధాలు చెప్పైనా ఒక పెళ్ళి చేయాలనే అలోచన ఇక్కడనుండి వచ్చిందే . కానీ ఆవిధంగా చేసిన పెళ్ళి కలకాలం నిలుస్తుందా అన్న విషయం వారికక్కర లేదు . ఒక సారి అబధ్ధం చెబితే , అబధ్ధం చెప్పిన వాడి మీద నమ్మకం పోతుందనీ , అది దుష్పరిణామాలకు దారి తీస్తుందనీ కూడా వీరు అలోచించరు . పైన చెప్పిన పద్యం పాటించ తగిందా కాదా అనే విషయాన్ని మీరూ ఆలోచించండి .

వచ్చినవాడు విష్ణువని శుక్రాచార్యులవారు చెబితే ” మహాత్మా నీవు చెప్పింది నిజమే . ఎటువంటి క్రతువులూ , వ్రతాలూ ,పుణ్యకార్యాలూ , చేసినా విష్ణుమూర్తి దర్శనమే కాదు . నామీద కరుణతో దర్శనమీయడమే కాదు నాముందు  చేయి చాచి తన కోరిక తీర్చమని అడుగుతున్నాడు . విష్ణుమూర్తి తన కోరిక తీర్చమని అదిగిన సందర్భం ఇదివరకూ లేదు . నిజంగా నాకిది మహా భాగ్యం కాదా ? ” ఈ సందర్భంలో పోతన చెప్పిన పద్యం :

ఆదిన్ శ్రీ సతి కొప్పుపై , దనువుపై , నంసోత్తరీయంబుపై
బాదాబ్జంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట , మీదై నా కరంబుండుట మేల్
గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే ?

లక్ష్మీ మాత శరీరంపై , పాదపద్మాల పై , పాలిండ్లపై , చెక్కిళ్ళపై గౌరవాన్ని పొందిన చేయి కింద ఉండి , నా చేయి మీద ఉండటం నా అదృష్టం కాదా ? ఈ రాజ్యం శాశ్వతమా ? లేక నా ఈ శరీరం శాశ్వతమా ?
శ్రీనాథునికి దానమిచ్చే ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను . ఆడిన మాట తప్పను . ఏం జరిగినా నాకు భయం లేదు . నా నాలుక అబధ్ధం పలుకదు అని నిర్ద్వందంగా శుక్రాచార్యునికి చెప్పాడు .

భక్తితో పాదాలకు నమస్కరించే లక్ష్మీదేవి నొసటి కస్తూరీ తిలకంతో పసుపుపచ్చగా మారి , మిసిమితో మెరిసిపోతూ , ఆశ్రితుల కష్టాలు తొలగించే వామనుని కాళ్ళు కడిగాడు . ఉపనిషత్తులకే అలంకారాలుగా భాసిల్లి , భవబంధాలనుండి విముక్తి గావించి మోక్షాన్ని కరతలామలకం చేసే భగవంతుని పవిత్రమైన పాదాలు కడిగిన పావన జలాలను శిరస్సు పైన జల్లుకున్నాడు . పరమ పవిత్రుడైనాడు బలి .

“విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి ” యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుందు వదుగున్ జేసాచి పూజించి ‘ బ్ర
హ్మప్రీత ‘ మ్మని ధారవోసె భువనం బాశ్చర్యమున్ పొందగన్ .

వెనువెంటనే ,   వేదాధ్యయనం చేసి  విష్ణుస్వరూపంతో   వెలుగొందుతున్న   విప్రోత్తమా  ఇదుగో   నీకు  మూడడుగుల నేల  ధారాదత్తం  చేస్తున్నాని  తెలిపి  ” బ్రహ్మప్రీతమ్మని  పలికి ” ( పరమాత్మకు ప్రీతి  కలుగుగాక )  జలాన్ని  ధారగా  వామనుని  హస్తాలపై  విడిచాడు బలి .

పట్టువీడని  శుక్రాచార్యుడు  జలధార పడకుండా  కలశరంధ్రానికి  అడ్డం పడ్డాడు .   వామనుని  ముందరా  కుప్పిగంతలు . చేతిలోని  దర్భతో  కలశరంధ్రానికి  అడ్డంగా   ఉన్న  శుక్రాచార్యుని  కన్ను  పొడిచాడు .  శుక్రాచార్యునికి  ఒక కన్ను  పోయింది . ఆ  రోజునుండీ  ఏకాక్షిగా  మారాడు  రాక్షస  గురువు .

 

 

 

 

రామాయణం

కావలసినదిస్తానని కోరుకొమ్మని ప్రార్థిస్తున్న బలి చక్రవర్తితో కపట నాటక సూత్రధారి వామన మూర్తి .

గొడుగో , జన్నిదమో , కమండలువో , నాకున్ ముంజియో ,దండమో
వడుగేనెక్కడ ? భూములెక్కడ ? కరుల్ , వామాక్షు లశ్వంబులె
క్కడ ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితంబైన   మూ
డడుగుల మేరయ త్రోవ కిచ్చుటదె బ్రహ్మాండంబు నా పాలికిన్

“బ్రహ్మచారిని . నాకు కావలసినవి యజ్ఞోపవీతమూ , చిన్న కమండలమూ , దండమూ మొదలయిన వస్తువులు . కరులు , కామాక్షులు , రయాన వెళ్ళే హయాలూ , పెద్ద పెద్ద భూభాగాలూ నాకెందుకు . నాకు ఉచితమైన నిత్యకర్మలకు అవి పనికి రావు . నేను కోరిన విధంగా మూడడుగుల మేర నాకిస్తే బ్రహ్మాండాన్ని నాకిచ్చినట్టే . అదే నాకు పదివేలు . అయినా లభించిన దానితో తృప్తి చెందని వాడికి సప్త ద్వీపాలలోని సంపంద ఇచ్చినా తృప్తి కలగదు కదా . ఆశాపాశం పొడవైనది .దానికి అంతులేదు .
ఉన్నదానితో సంతోషపడేవాడు మూడు లోకాలలో పూజింపబడతాడు . సంతోషంగా ఉండేవాడు సుఖపడతాడు . ఇంతెందుకు సంతోషంగా ఉన్నవాడికి మోక్షం లభిస్తుంది . సంతోషం లెకుందా ఉండటం సంసారానికి హేతువవుతుంది . సంతోషికేమో తేజస్సు పెరుగుతుంది . నేనడిగిన మూడడుగులు నాకిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయమన్నాడు ” వామనుడు .
తనకు కావలిసిన దానిని యుక్తియుక్తంగా అడిగి సాధించుకున్నవాడు వామనుడు . నాకొక అనుమానం . అసలు మూడడుగుల నేలను ఏమి చేసుకుంటాడని బలి చక్రవర్తి అడగక పోవడం . ఈ భూభాగంకూడా నిత్యోచిత కర్మలకు పనికి రాదు కదా ?