Monthly Archives: జూలై 2012

రామాయణం

అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః
ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరం

పరితుష్టోస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః

తాటకా వనంలో రాత్రి గడిచింది . అరుణోదయకాంతులు ఆ అరణ్యాన్ని అలముకొని చీకటిని పారదోలాయి . విశ్వామిత్ర మహర్షి తను మేలుకొని రఘుకుల తిలకుని నిద్రలేపాడు . మందహాసంతో ” మహాయశుడవైన రఘురామా ! నీకు క్షేమమగుగాక . నా సంతోషానికి అవధిలేకుండా ఉంది . ప్రేమపూర్వకంగా నా వశంలో ఉన్న దివ్యాస్త్రాలను నీకిస్తాను ” , అని శిష్యునితో మధురంగా పలికాదు .

రామాయణం

విశ్వామిత్ర వచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః
ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖం

ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని
రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనం

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిధ్ధసంఘైః
ఉవాస తస్మిన్మునినా స హైవ
ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః

 

విశ్వామిత్రుని మధుర వాక్యాలను విన్న రామచంద్రుడు ఆ రాత్రి తాటకా వనంలో సుఖంగా గడిపాడు . రాముడు వసించిన ఆ తాటకా వనం శాపవిముక్తి చెందిన చైత్ర రథమనెడి  పేరుగల కుబేరుని ఉద్యానవనంలాగా , రమణీయంగా ప్రకాశించిందట . దేవతలచేతా సిధ్ధుల చేతా పొగడ్తలందుకొంటూ విశ్వామిత్రుని తో సహా వనంలో  వాసం  చేసిన  రామచంద్రునికివే  కోటి  వందనాలు

 

తెల్లవారుజామున కౌశికుడు రామలక్ష్మణులను నిదురనుండి మేల్కొలిపాడు .

 

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం .

అనే   తేనెలూరే    పల్కులతో .

రామాయణం

తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః
మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్

ఇహాచ్య రజనీం రామ వసేమ శుభదర్శన
శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ

తాటకను  సంహరించిన   రాముని   శిరస్సు   వాసన   చూసాడు   విశ్వామిత్రు   డు . ” శుభదర్శనుడవైన   శ్రీరామా !  రాత్రి   ఈ ప్రదేశంలో   నివసించి   రేపు   నా   ఆశ్రమానికి   బయలుదేరి   వెడదాము ” అని  మధురంగా    పలికాడు .

శిరస్సు  వాసన  చూడడం  అన్నది   అత్యంత    ప్రేమపాత్రులు    విశేషమైన కార్యం  చేసినప్పుడు   ప్రేమతో   పెద్దలు   చేసేపని . తమ   ప్రేమను  వ్యక్తపరిచే  పధ్ధ  తి . కరుణాతరంగుడైన   విశ్వామిత్రు  డు   రాముని  శిరస్సు వాసన   చూసి , రాముడు శుభదర్శనుడని   పలికాడు . ఇది ఒక పెద్ద   అభినందన . రామచంద్రు  డు   వీర్యంచూపి ,   కార్యం సఫల ంగా   నిర్వర్తించి సాధించుకున్న  బహుమతిగా  , మనం   భావించవచ్చు .

రామాయణం

తాం హతాం భీమసఙ్కాశాం దృష్ట్వా సురపతిస్తదా

సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్

 

ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పూరందరః

సురాశ్చ సర్వే సమ్హృస్గ్టా విశ్వామిత్ర మథాబ్రువన్

 

మునే కౌశిక భద్రంతే సేంద్రాస్సర్వే మరుద్గణాః

తోషితాః కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే
ప్రజాపతేర్భృ శాశ్వ స్య పుత్రాన్ సత్యపరాక్రమాన్

తపోబలధృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ

 

పాత్రభూతశ్చ తే బ్రహ్మం స్తవానుగతే ధృతః

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా

 

ఏవముక్తా సురాః సర్వే హృష్టా జగ్ముర్యథాగతం

విశ్వామిత్ర పురస్కృత్య తతః సంధ్యా ప్రవర్తతే

 
భయాన్ని కలిగించే తాటకను , నూనూగు మీసాల నూత్న యవ్వనుడు అవలీలగా తునుమాడిన వైనం చూచి అపరిమితంగా సంతోషించారు దేవతలు , దేవేంద్రుడు కూడా . దేవేంద్రుడు రామునికి మేలు చేయాలని తలచాడు . కౌశికునితో , ” మహామునీ ! తమకు క్షేమమగుగాక . తమరు తలపెట్టి  , సక్రమంగా నిర్వహించిన తాటక వధ  మాకందరకూ సంతోషం కలిగించింది . ప్రత్యుపకారంగా  తమరు రామునియందు  స్నేహాన్ని చూపి భృశాశ్వుని అస్త్రాలను అతనికి ఉపదేశించండి . ఆ అస్త్రాలు నిజమైన పరాక్రమం కలిగినవి . తపోబల కారణంగా అవి అజేయాలు . తమరు చూపే మార్గంలో పయనిస్తూన్న సౌమిత్రి    పవిత్రాలైన   ఆ    అస్త్రాలను పొందడానికి అన్నివిధాలా  అర్హుడు . ముందు ముందు ఈతడు ముఖ్యమైన దేవ కార్యాలను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది ” అని పలికాడు . అటుపిదప విశ్వామిత్రుని సముచిత రీతిలో పూజించి దేవతలు తమ స్వస్థానాలకు మరలిపోయారు .

రామాయణం

ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మ వృష్ట్యా భివర్షతీం
దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః
సా రుధ్ధా శరజాలేన మాయాబలసమన్వితా
అభిదుద్రావ కాకుత్సం లక్ష్మణం చ వినేదుషీ

తామాపతంతీం వేగేన విక్రాంతామశనీమివ

శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ

విశ్వామిత్రుని మాటలు విన్న రామచంద్రుడు , తాటక కనిపించకుండా శిలావర్షం కురిపిస్తున్నది కనుక తన శబ్దవేధి సామర్థ్యాన్ని చూపుతూ తాటక తమ మీద కురిపిస్తున్న శిలలను తన శరాలతో అడ్డుకున్నాడు . బాణాలచే అడ్డుకొనబడిన తాటక పెద్దగా గర్జిస్తూ రామలక్ష్మణుల పైకి పరుగెత్తుకొచ్చింది . పిడుగువలె మీద పడుతున్న తాటకను ఒక బాణంతో వక్షస్థలంపైన కొట్టాడు . అంతే తాటక విగతజీవురాలై కిందపడిపోయింది .
శబ్దవేధి అంటే , శత్రువు కనిపించక పోయినా ఆతడు వేసే అస్త్రాల శబ్దాన్ని బట్టి ( ఇక్కడ శిలలు వేస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఆధారంగా ) శత్రువు మీద శరాలను ప్రయోగించే సామర్థ్యం .

రామాయణం

కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః
అంతర్ధానం గతా యక్షీ మోహయంతీవ మాయయా
అశ్మవర్షం విముఞ్చంతీ భైరవం విచచారః

తాటక మాయావి . ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన శక్తి కలది . ముక్కూ , చెవులూ కోల్పోయినా ఉధ్ధ్రతమేమీ తగ్గలేదు . మాయా బలం చేత వేరు వేరు రూపాలను ధరించి , రామలక్ష్మణుల మీద రాళ్ళ వర్షం కురిపించింది . భయంకరంగా ఆ యుధ్ధ భూమిలో తిరిగింది . నలు దిశలనుండీ రాళ్ళచేత కప్పబడుతున్న  రామలక్ష్మణులను చూచిన విశ్వామిత్రుడు ఈ విధంగా పలికాడు :

 

తతస్తావశ్మవర్షేణ  కీర్యమాణౌ  సమంతతః
దృష్ట్వా  గాధిసుతః  శ్రీమానిదం  వచనమబ్రవీత్
అలంతే  ఘృణయా   రామ  పాపైషా  దుష్టచారిణీ
యజ్ఞవిఘ్నకరీ  యక్షీ  పురావర్ధతి   మాయయా
వధ్యతాం  తావదేవైషా  పురా  సంధ్యా  ప్రవర్తతే
రక్షాంసి  సంధ్యాకాలేషు  దుర్ధర్షాణి  భవంతివై

రామా !  యజ్ఞాలకు  విఘ్నం  కలిగించేదీ  , దుష్టచారిణి  , పాపాత్మురాలూ అయిన  ఈ  యక్షిణిపై  జాలి  చూపించవద్దు .  సంధ్యా  సమయంలో  యక్షిణులకు  బలం  ద్విగుణీకృతమవుతుంది . మాయాబలం  చేత  ఈ  యక్షిణి  వృధ్ధి  పొంది  ,  ఎదిరించడానికి  సాధ్యం  కాకుండా  అవుతుంది . సంధ్యా సమయం సమీపిస్తోంది . సంధ్యాసమయం  రాకమునుపే  ఈ యక్షిణిని  వధించు .

రామాయణం

ఉద్దూనానా   రజో  ఘోరం  తాటకా  రాఘవావుభౌ
రజోమోహేన  మహతా  ముహూర్తం  సా  వ్యమోహయత్
తతో  మాయాం  సమాస్థాయ  శిలావర్షేణ  రాఘవౌ
అవాకిరత్సు మహతా  తతశ్చుక్రోధ   రాఘవః

శిలావర్షం  మహత్తస్యాః  శరవర్షేణ  రాఘవః
ప్రతిహత్యోపధావంత్యాః   కరౌ  చిఛ్చేద   పత్రిభిః

తతశ్ఛిన్నభుజాం   శ్రాంతామభ్యాశే  పరిగర్జితీం
సౌమిత్రిరకరో త్క్రోధాద్ధృత  కర్ణాగ్ర  నాశికాం

 

తాటక ,  వేగంతో  రామలక్ష్మణులపైకి   పరుగెత్తి   వస్తున్నప్పుడు  పరాగం (దుమ్ము ,ధూళి )  రామలక్ష్మణులను  కమ్మివేసి , ఒక క్షణంపాటు వారిని   ఏమిచేయాలో  తోచని  స్థితిలోకి  తీసుకొని  వెళ్ళింది .  అంతేకాదు  ఆ రాక్షసి   వారిపై  పెద్ద   శిలావర్షం (రాతివర్షం )  కురిపించింది . సహజంగానే రామునికి  కోపం  వచ్చింది . అతివేగంగా  శరాలను  వదలగలిగిన  శక్తి  కల  రామచంద్రుడు  బాణాలను  సంధించి  శిలలను  ఆపాడు .  తాటక  చేతులనూ  ఖండించాడు . చేతులు కోల్పోయిన  తాటక  ముక్కు  చెవులను  లక్ష్మణుడు  ఛేదించాడు .

 

రామాయణం

ఏవం  బ్రువాణే   రామే   తం  తాటకా    క్రోధమూర్ఛితా
ఉద్యమ్య  బాహూ  గర్జంతీ  రామమేవాభ్యధావత
విశ్వామిత్రస్తు  బ్రహ్మర్షిర్హుం కారేణాభి భర్త్స్య  తాం
స్వస్తి  రాఘవయోరస్తు   జయం   చైవాభ్య భాషత

శ్రీరాముడు  తమ్ముని తో ,  తాటకను  సంహరించకూడదని   చెప్పే  మాటలు  పూర్తి  కాక మునుపే  ,    అత్యంత కోపంతో  తన రెండు  చేతులూ  పైకెత్తి  రాముని  మీదకు  పరుగెత్తింది  తాటక .  అతివేగంతో   రాముని మీద పడుతున్న   తాటకను  హుంకారం  చేసి  భయపెట్టాడు  విశ్వామిత్రుడు . ( పెద్దగా  శబ్దం  చేస్తే , లేక అరిస్తే  ఒక  క్షణం పాటు  ఉలికిపడడం  సహజం . దానివలన  మీదకు  దూసుకు  వచ్చే  వారి  గమన శక్తి  ముహూర్త  మాత్రం  తగ్గుతుంది . ఎదుర్కోవడానికి  సమయం  లభిస్తుంది . అది చాలు  శత్రువును  ఎదుర్కోవడానికి ) .  రామలక్ష్మణులకు   స్వస్తి  కలగాలనీ  ,  జయం  కలగాలనీ  పలికాడు .
విశ్వామిత్రుడు  , తాటక   క్రోధంతో  మీద పడడానికి  వస్తున్నా  , చలించలేదు . అంతేకాదు   హుంకారం  చేసాడు .  అటువంటి  విపత్కర  సమయంలో  కూడా  రామలక్ష్మణులను  దీవించడం  మరచిపోలేదు .  హుంకరించి  శత్రువును  అదలించడం   క్షత్రియ  లక్షణమైతే , ఆశీర్వచనం  పలకడం  బ్రాహ్మణ  లక్షణం . విశ్వామిత్రుడొక్కడే  రాజర్షీ , బ్రహ్మర్షీ  కూడా . ఆ  గౌరవం  ప్రపంచంలో  మరెవ్వరికీ  దక్కలేదు , దక్కదు కూడా .