Monthly Archives: జూలై 2014

రామాయణం

విశ్వామిత్రవచః శ్రుత్వా కథాంతే రఘునందనః
ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలం
శ్రోతుమిచ్ఛామి భద్రం తే విస్తరేణ కథామిమాం
పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్

 

విశ్వామిత్రుడు కథ చెబుతుంటే రఘురాముడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు .అగ్నిదేవునిలా వెలిగిపోతున్న విశ్వామిత్రునితో ” బ్రహ్మన్! నా పూర్వీకుడైన సగర మహారాజు యాగాన్ని ఏవిధంగా చేసాడో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది ” అని సవినయంగా విన్నవించుకున్నాడు .

పసిపిల్లవాని మనస్తత్వం రఘురామునిది . కథలు చెబుతుంటే వినాలని ఏ పిల్లవాడికి ఉండదు . వాల్మీకి మహర్షి చిన్నపిల్లవానిలా ఆలోచించే రామయ్య మనస్తత్వాన్ని మన కనుల ముందర ప్రత్యక్షం చేయిస్తున్నాడు .కథ వింటున్నకొద్దీ   ఇంకా  ఇంకా కావాలనిపించని బాలకుడుంటాడా ?

విశ్వామిత్రుడు రామునికి కథ చెబుతూ ముచ్చటగా పలికిన పలుకులు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యంలో
చిన్న కథ జెప్పి నీకు నీ చేత నొక్క
యే మహాకార్యమేను జేయింతు నింత
యల్ప సంతోషివేమి రామాయటంచు
నవ్వె ఋషి , యెల్ల ఋషులును నవ్వినారు

 

 

రామాయణం

తతః కాలేన మహతా మతిః సమభిజాయత
సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా

స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే

 

అంశుమంతుని అందరూ అభిమానించేవారు . ఇది ఈ విధంగా ఉండగా సగర చక్రవర్తికి ఏదైనా యజ్ఞం చేయాలనే కోరిక కలిగింది . రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ! ఆలోచన రావడమే ఆలస్యం . సగర మహారాజు వేదజ్ఞులను పిలిచి యాగం చేయడానికి పూనుకున్నాడు .

దీనితో ముప్పది యెనిమిది సర్గలకు వ్యాఖ్యానం రాసే అదృష్టం నాకు లభించింది .