సుందరకాండ

ద్విజాన్ విత్రాసయన్ ధీమానురసా పాదపాన్ హరన్.
మృగాంశ్చ సుబహూన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ

నీలలోహితమాంజిష్ఠపత్రవర్ణైః సితాసితైః.
స్వభావవిహితైశ్చిత్రైర్ధాతుభిః సమలఙ్కృతమ్৷

కామరూపిభిరావిష్టమభీక్ష్ణం సపరిచ్ఛదైః.
యక్ష కిన్నర గన్ధర్వై ర్దేవ కల్పైశ్చ పన్నగైః

సీతను వెదకడానికి సముద్రాన్ని లంఘించడానికి పూనుకున్న హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద అలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయనారంభించాడు . సింహం లాగా తిరుగుతున్న ఆ ధీమంతుని శరీరాన్ని తాకిన మృగాలు మృతిచెందాయి . వృక్షాలు కూలిపోయాయి .
మహేంద్రపర్వతం ధాతువులకు నిలయం . ఆ ధాతువులు ఆకు పచ్చని రంగుతో కొన్ని ఉంటే పసుపు పచ్చని రంగుతో మరికొన్ని . మిరుమిట్లు గొలిపే నీలపు రాళ్ళు కొన్నైతే ఎరుపు రంగులో మిడిసి పడుతున్నాయి మరికొన్ని . రంగు రంగుల ధాతువులు ప్రసాదించిన ప్రకాశంతో అత్యద్భుతంగా అలరారుతున్నది మహేంద్ర పర్వతం . కామరూపులైన యక్ష ,గంధర్వ కిన్నరులకూ , దేవతా సమానులైన పన్నగులకూ నివాస స్థానం మహేంద్ర పర్వతం .

వివరణ : సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్న ఆంజనేయుడు ఆలోచిస్తూ మహేంద్ర పర్వతం మీద తిరుగుతూంటే ఆతని శరీరానికి తగిలి వృక్షాలు కూలిపోయాయి , జంతువులు మృతి చెందాయి , పక్షులు భయంతో ఎగిరిపోయాయి . మనసులో ,మహోన్నతమైన శరీరంతో ఉన్న ఆంజనేయస్వామిని ఊహించుకొని , అత్యద్భుత శరీరంతో ఆ స్వామి అటూ ఇటూ పచార్లు చేస్తుంటే ఆ స్వామి మార్గంలో ఉన్న వస్తువులు ధ్వంసం కావడమూ , ప్రాణులూ మరణించడం సహజమే కదా . . మనం నడుస్తూ ఉంటే మన క్రింద పడి నలిగిపోయిన పిపీలికాల(చీమల) లాగా . అవి మన పాదాల కింద పడి మరణిస్తుంటే మనకు తెలియని విధంగా .

ఈ శ్లోకాలలో రంగు రంగులతో మెరుస్తున్న మహేంద్రపర్వత సౌందర్యాన్నీ , ఆ పర్వతాన్ని ఆసరాగా చేసుకొని నివసిస్తున్న యక్ష ,గంధర్వ ,కిన్నరుల గురించీ  క్లుప్తంగా చెప్పడం జరిగింది .

 

సుందరకాండ

దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః
సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ

అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః
ధీరః సలిల కల్పేషు విచచార యథాసుఖం

ఇతరులకు సాధ్యం కాని పనిని హనుమంతుడు చేయడానికి పూనుకున్నాడు . తలపెట్టిన పని ఏవిధమైన ఆటంకాలు రాకుండా సాధించాలని పూనుకొన్నాడు . తల పైకెత్తి చూసాడు.ఆ విధంగా చూస్తున్న హనుమంతుడు గవాంపతి (గోవులకు పతి–ఆంబోతు)  లాగా భాసించాడు .పిదప వైడూర్య వర్ణంతో పచ్చగా మెరిసిపోతున్న పచ్చిక బీళ్ళలో అటూ ఇటూ తిరిగాడు . ఆ పచ్చిక బీళ్ళలో జలం కూడా ఉన్నది . (అంటే ఆ భూమి చిత్తడి భూమి . సముద్రం దగ్గర చిత్తడి భూమి ఉండడం సహజమే కదా ! )

दुष्करं निष्प्रतिद्वन्द्वं चिकीर्षन् कर्म वानरः।
समुदग्रशिरोग्रीवो गवांपतिरिवाबभ

अथ वैडूर्यवर्णेषु शाद्वलेषु महाबलः।
धीरः सलिलकल्पेषु विचचार यथासुखम्

Meaning : After deciding to accomplish a task which is difficult for others Hanuman extended his neck and looked at the sky , thinking how to get his job done without encountering obstacles .Then the mighty Hanuman  started pacing up and down on  the marshy grass lands which are shining like Vaidurya , a green coloured precious stone .

“Some individuals when they are thinking deeply about resolving a problem act this way . This behaviour was captured nicely and described by sage Valmiki .Actually you can visualise the picture of Hanuman about to start his jump  across the Ocean” .

DSC02324.JPG

 

 

 

 

 

 

 

సుందరకాండ

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి .

తతో అంటే అటుపిమ్మట , రావణుడు తనతొ కొనిపోయిన సీతాదేవిని అన్వేషించడానికి చారణులు చరించే ఆకాశ మార్గంలో ప్రయాణించడానికి పూనుకున్నాడు శత్రువులను సంహరించే హనుమ .

 

వానరులూ  ,జాంబవంతుడూ , యువరాజైన  అంగదుడూ హనుమతో , వారధిని లంఘించి సీతమ్మను వెదకమని కోరారు . హనుమను ఎంతో ఉత్సాహ పరిచారు . హనుమ అంగీకరించి సముద్రాన్ని ఆకాశ మార్గాన అధిగమించడానికి పూనుకున్నాడు . ప్రయాణానికి ముందు హనుమ ఏ విధగా ప్రవర్తించాడో , ఏవిధంగా కనిపించాడో వాల్మీకి మహర్షి మన కనులముందర సాక్షాత్కరింప జేస్తారు . రామాయణం ఇచట ఒక దృశ్య కావ్యంగా మలచబడింది .

IMG_0735.JPG

రామాయణం : సుందర కాండ

IMG_5021

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి

ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయం

“బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్”

సుందరకాండ రామాయణానికి తలమానిక మైనది . రామాయణానికి ఆయువు పట్టు హనుమంతుడనే విషయం అందరికీ తెలిసిందే . సుందరకాండలో ఎటు చూసినా అంజనేయస్వామే కనిపిస్తాడు . బుద్ధి , బలము , యశస్సు , ధైర్యం , నిర్భయత్వం , వాక్పటుత్వం ఆంజనేయ స్వామికి సహజ గుణాలు . ఈ గుణాలను అతిసుందరంగా వర్ణించారు ఆదికవి వాల్మీకి . అందుకే ఈ కాండ సుందర కాండ .

రామాయణం పారాయణం చేయాలంటే మొత్తం రామాయణమైనా చదవాలి లేకుంటే సుందరకాండ పారాయణమైనా చేయాలి .రామాయణంలో ఏ ఇతరకాండకూ ఈ గౌరవం దక్కలేదు . సుందర కాండలో ప్రతి సర్గా “స ” లేక “త ” అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది . స ,త లను మాతృమూర్తి సీతమ్మకు ప్రతీకగా భావించ వచ్చు . సీత లో ఉన్నవి ఈ రెండక్షరాలే కదా !

నిజానికి సుందర కాండను మంత్ర శాస్త్రంగా భావించ వచ్చు . బ్రహ్మాండపురాణం ఈ కాండాన్ని ” సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః” అని, “బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి” అని, “అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే . ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్” అని ప్రశంసించింది .( This para is from wikepedia ).

సుందరమైన సీతమ్మ దుఃఖాన్ని హనుమ ఆగమనంతో తొలగించే కాండ సుందర కాండ . ఆంజనేయ స్వామి సుందర భక్తికి అద్దం పట్టే కాండ సుందర కాండ . బీజాక్షరాలతో నిండి చదివిన వారి మనస్సులను పరిప్లుతం చేసే మంత్ర కాండ ఈ సుందర కాండ .  ” త కారో విఘ్న నాశకః, త కారో సౌఖ్య దాయకః” అని పెద్దల సూక్తి . ఈ కారణం చేతనే రామాయణాన్ని , సుందరకాండను “త” అనే బీజాక్షరంతో ప్రారంభించారు వాల్మీకి మహర్షి . “స” కారం సీతమ్మనూ, సౌందర్యాన్నీ సూచిస్తుంది కనుక  సుందరకాండ ప్రతి సర్గ ప్రారంభంలో ఈ అక్షరాలను ప్రయోగించారు రచయిత . అంతేకాక  అద్భుతమైన ఉపమలూ , అంత్యానుప్రాసలూ గంగా ఝరిలా జ్రాలు వ్రాలినవిచట . అందుకే అత్యంత రమణీయం సుందర కాండ

సుందర కాండలో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం కార్య సాధన . ఆంజనేయ స్వామి సీతమ్మను వెదకడంలో ఎన్నో కార్యాలను సాధించవలసి వచ్చింది . సముద్రాన్ని లంఘించడం హనుమకు తప్ప ఇతరులెవరికీ సాధ్యమయే పనికాదు . రాముని మీద భక్తితో తన శక్తి యుక్తులతో ఈ కార్యాన్ని సాధించాడు హనుమ . లంకా ప్రవేశం చేయగానే అడ్డు తగిలింది లంఖిణి . సామ దానాలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు కనుక దండోపాయంతో లంఖిణి పీచమడిచాడు . సీతమ్మను వెదకడానికి రావణుని అంతఃపురంలో దూరవలసి వచ్చింది . అపురూపమైన ఐశ్వర్య రాసులూ , కనులు మిరుమిట్లు గొలిపే లావణ్యవతులూ కొల్లలుగా కనిపించినా  కార్యసాధనలో నిమగ్నమై ఉన్న హనుమ దృష్టిని ఆకర్షించలేదు . అర్జునుడి దృష్టికి బాణం ఎక్కుపెట్టినప్పుడు లక్ష్యమైన పక్షి తప్ప ఇతరాలేవీ కనిపించలేదు .అలాగే ఆంజనేయ స్వామి దృష్టి అంతా సీతమ్మను వెదకడం మీదనే . అందుకే స్వామి తలపెట్టిన కార్యం సఫలమైంది .  తలపెట్టిన కార్యాన్ని సాధించేవరకూ ఏకాగ్రతతో ఉండడం హనుమకే చెల్లింది . మనకు మార్గదర్శక మయింది . కార్య సాధకుడికుండవలసిన ప్రథమ లక్షణం ఏకాగ్రత . ప్రతి చిన్న పని మొదలు పెట్టే ముందు ఆ పని చేయడం వల్ల కలిగే సాధక బాధకాలను వివరంగా ఆలోచించి మొదలు పెడతాడు . మొదలు పెట్టాక అది సాధించే వరకూ వదలడు . ఇది సాధకుడి లక్షణం . కార్యసాధనకు అవసరమైన విషయాలను నేర్చుకోవాలంటే సుందరకాండ దోహద పడుతుంది . అనుకున్నది సాధించినప్పుడే జీవితం సుందర తర మవుతుంది . అనుకున్న పనిని సాధించే పద్ధతిని ఉదాహరణలతో సహితంగా తెలియజేసే కాండమిది . అందుకే ఈ కాండం సుందర కాండమయింది .

రామాయణానికి మొట్టమొదటగా “సీతాయాశ్చరితం” అనే పేరు పెట్టాలనుకున్నారు వాల్మీకి . సీతమ్మ శీలమూ , నడవడికా , చరిత్రా , రామాయణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి . సుందర కాండలో సీతమ్మ ప్రవర్తనా , మనోభావాలూ అచ్చెరువొందించక మానవు . మధుర మంజుల కోమలాలు సీతమ్మ పలుకులు . సుందరకాండను అవి అతి సుందరంగా మారుస్తాయి .

వివరిస్తూ వెడుతూంటే ఈ కాండకు , వాల్మీకి సుందర కాండ అనే పేరు ఎందుకు పెట్టారో అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉదాహరణలతో సహా వివరించవచ్చు . ఇచట కొంత మాత్రం చేప్పడం జరిగింది .

IMG_0584.JPG

 

రామాయణం

రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్య్వర్ధత

తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే
అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా

తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా
దేవతాభిః సమారూపే సీతా శ్రీరివ రూపిణీ

తయా స రాజర్షిసుతోభిరామయా
సమేయివా నుత్తమ రాజకన్యయా
అతీవ రామః శుశుభే ముదాన్వితో
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః

సీతా రాముల దాంపత్యం కమనీయంగా సాగింది . సీత మదిలో రాముడు , రాముడు హృదిలో సీత . తండ్రి అంగీరించాడు కనుక రామునికి సీతపై బహు ప్రేమ . దీనికి తోడు సీత సద్గుణ రాసి . సాటిలేని సౌందర్యవతి . ఈ కారణాల చేత రామునికి సీతపై ప్రేమ ఇంకా అధికమైంది . సీత హృదయంలో రాముడు రెండింతలుగా తిరుగుతున్నాడు . వారు పరస్పరం సంభాషించుకునే అవసరం కూడా లేదు .  ఒకరి హృదయంలోని భావనలు ఇంకొకరికి అర్థమయ్యేవి . వారి హృదయాలు పరస్పరం సంభాషించుకొనేవి . సౌందర్యంలో దేవతా స్త్రీలతో సమానమైన మైథిలి  లక్ష్మీ దేవికి ప్రతిరూపమే  . అందుకే మాత రూపం లక్ష్మీదేవి రూపమే . లక్ష్మీ దేవి అంత అందంగా ఉన్నదని భావన .

బాలకాండ సమాప్తం

 

రామాయణం

గతేతు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః
పితరం దేవసంకాశం పూజయామాసతుస్తదా

పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః
చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితానిచ

మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమ యంత్రితః
గురూణాం గురుకార్యాణి కాలే కాలే న్వవైక్షత

ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తధా
రామస్య శీలవృత్తేన సర్వే విషయ వాసినః

తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః

 

IMG_4788

భరతుడు బయలు దేరి వెళ్ళిన పిదప రాముడు , బలశాలి అయిన అతని తమ్ముడు లక్ష్మణుడు , దేవసమానుడైన తండ్రికి సేవచేస్తూ కాలం గడిపారు . రాజ్యంలోని ప్రజలకు ప్రియమైన కార్యాలను , లాభించే కార్యాలను తండ్రి ఆజ్ఞానుసారంగా చేసారు . నియమ బద్ధుడైన రాముడు తల్లులకు కావలసిన పనులను , గురువులకు చేయవలసిన సేవలను చక్కగా చేసాడు .

రాముని నడవడికను ,శీలాన్ని చూసి దశరథుడు సంతోషంతో పొంగిపోయాడు . నగర ప్రజలు , బ్రాహ్మణులు ఆనందించారు . తన ప్రవర్తనతో సత్య పరాక్రముడు , ఎక్కువగా మంచి గుణాలు కల రాముడు తన ప్రజలకు బ్రహ్మదేవునితో సమానంగా భాసించాడు ( బ్రహ్మ తను పుట్టించిన ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తాడు , కల్పిస్తాడు. ఇది నిజమయిన రాజుకు ఉండవలసిన మొదటి లక్షణం ) .

రామాయణం

కస్య చిత్త్వథ కాలస్య రాజా దశరథః స్సుతం
భరతం కైకేయీ పుత్ర బ్రవీద్రఘునందనః

అయం కేకయ రాజస్య పుత్రో వసతి పుత్రక
త్వాం నేతుమాగతో వీర్గ యథాజిన్మాతులస్తవ

ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా
ఋషిమధ్యే తు తస్య త్వం ప్రీతిం కర్తుమిహార్హసి

శ్రుత్వా దశరథస్త్యై తద్భరతః కైకేయీ సుతః
అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణం
గమనాయాభి చక్రాయ శతృఘ్న సహితస్తదా

అపృచ్ఛ్య పితరం శూరో రామం చక్లిష్టకారిణం
మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శతృఘ్నసహితో యయౌ

 

రఘునందనులు తండ్రికి శుశ్రూష చేస్తూ ఉండగా కొంతకాలం గడిచింది . ఒక శుభదినాన దశరథ మహారాజు కైకేయి కుమారుడైన భరతునితో ” నాయనా! కేకయ రాజ కుమారుడు నీకు స్వయానా మేనమామ అయిన యుధాజిత్తు నిన్ను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు . ఓ ధర్మజ్ఞుడా ! మిథిలా నగరంలో ఋషుల మధ్యలో నిన్ను తనతో పంపమని నన్ను ప్రార్థించాడు . ఇప్పుడు అతని వెంట కేకయ రాజ్యానికి వెళ్ళి నీవు నాకు ఆనందాన్ని కలిగించు ” అని పలికాడు .

తండ్రి మాటలు విన్న భరతుడు తండ్రికి , తన ఆన్న అయిన శ్రీరామునికి అభివాదం చేసాడు . లక్ష్మణున్ని ప్రియంగా కౌగిలించుకున్నాడు . శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు . శూరుడు , నరశ్రేష్ఠుడు అయిన భరతుడు , అనాయాసంగా కార్యాలను సాధించే రామచంద్రుని , తన తల్లులనూ అడిగి , వారి అనుమతి గైకొని శత్రుఘ్నునితో సహా కేకయ రాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు .

 

రామాయణం

ననంద సజనో రాజా గృహే కామైః సుపూజితః
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ సుమధ్యమా
వధూప్రతిగ్రహే జుక్త్ యాశ్చాన్యా రాజయోషితః

తతస్సీతాం మహాభాగామూర్మిళాం చ యశస్వినీం
కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః

మంగళాలంభనైశ్చాపి శోభితాః క్షౌమవాసనః
దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్

సుజనులతో తన గృహానికి వచ్చిన దశరథ మహారాజు జనులందరూ కోరుకునే భొగ్య వస్తువుల చేత పూజింపబడ్డాడు . అనందం పొందాడు . మహారాజు భార్యలు కౌసల్య , సుమిత్ర , కైకేయి ఇతర రాజ వంశాలకు చెందిన స్త్రీలు కొత్త కోడళ్ళను సమాదరంగా గృహంలోకి అహ్వానించారు . మహాభాగ్యవంతురాలైన సీతా దేవి , యశస్విని ఊర్మిళ , కుశధ్వజుని కుమార్తెలు మాండవీ శ్రుతకీర్తులు ఎంతో సంతోషంతో అత్తగారింట అడుగు పెట్టారు . కొత్త కోడళ్ళందరూ పట్టు పుటాలు ధరించి , మంగళ ద్రవ్యాలు శరీరానికి పూతగా ధరించి గృహ దేవతలను పూజించారు .

అభివాద్యాభి వాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా
స్వం స్వం గృహమథాసాద్య కుబేర భవనోపమం

గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్
రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః

అటుపిమ్మట పెద్దలందర్కి నమస్కరించారు కొత్త కోడళ్ళు . కుబేర భవనంతో సరి సమానంగా తులతూగే తమ భవనాలలో నివాసం ఏర్పరుచుకున్నారు . బ్రాహ్మణులకు గోవులను , ధనాన్ని ,ధాన్యాన్ని దానంగా ఇచ్చారు . రహస్య భవనాలలో భర్తలతో కలిసి క్రీడించారు ఆ రాజపుత్రికలు .

కుమారాశ్చ మహాత్మానో వీర్యేణాప్రతిమా భువి
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః
శుశ్రూష మాణాః పితరం వర్తయంతి నరర్షభాఃDSC02633

భార్యలతో కూడిన పరాక్రమశాలులు , అస్త్రవిద్యలో ఆరితేరిన వారు , ధనంతో తులతూగుతూ మిత్రులతో ఆనందిస్తూ రామ లక్ష్మణ శతృఘ్నులు రాజ్యలక్ష్మిని భోగించ సాగారు . వారు తండ్రికి శుశ్రూష చేస్తూ ఆతడేవిధంగా చెబితే ఆవిధంగా నడుచుకుంటూ ఆతని కనుసన్నలలో ఆనందంగా కాలం గడప సాగారు .

రామాయణం

రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతం
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవం

గతో రామ ఇతి శ్రుత్వా హృష్ట్వః ప్రముదితో నృపః
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవచ

చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీం
పతాకాధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్ట నినాదితాం

సిక్త రాజ పథాం రమ్యాం ప్రకీర్ణ కుసుమోత్కరాం
రాజప్రవేశ సుముఖైః పౌరై ర్మంగలవాదిభిః
సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైస్సమలంకృతాం

పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః
పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః

 

రాముని మాటలు విన్న దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోయాడు . తన పుత్రులకు పునర్జన్మ లభించిందని భావించాడు . రామచంద్రుణ్ణి తనివితీరా కౌగిలించుకున్నాడు .తలను మూర్కొన్నాడు (వాసన చూసాడు) . తన సైన్యాన్ని కదలమని ఆజ్ఞాపించాడు . పరివారంతో సహా అయొధ్యానగరాన్ని చేరాడు . ఆ పట్టణ వాసులు మహారాజుకూ అతని పరివారానికీ తూర్యారవాలతో ( ట్రంపెట్) స్వాగతం పలికారు . పుర వీధులన్నిటా పతాకాలు (జెండాలు ) ఎగుర వేసారు . రాజమార్గాలను జలంతో తడిపి పుష్పాలతో అలంకరించారు . మంగళ వాయిద్యాల ఘోష ప్రతిధ్వనిస్తుండగా దశరథ మహారాజు అయోధ్యలో ప్రవేశించాడు . శ్రీమంతుడైన రాజు శ్రీమంతులైన తన పుత్రులు తనను పరివేష్టించి రాగా నగర వాసులు ఎదురేగి స్వాగతం పలికారు . నగరంలో ప్రవేశించిన మహారాజు హిమాలయాలతో పోటీపడగల తన స్వగృహంలోకి అడుగుపెట్టాడు .

రామాయణం

బాలకాండంలో చివరిదైన డెబ్బదిఏడవ సర్గ :

గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం

అభివాద్య తతో రామో వసిష్ఠ ప్రముఖాన్ ఋషీన్
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన

జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ
అయోధ్యా భిముఖీ సేనా త్వయా నాథేన పాలితా

సందిశస్వ మహారాజ సేనాం త్వచ్ఛాసనే స్థితాం
శాసనం కాంక్షతే సేనా చాతకాళిర్జలం యథా

పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనుస్సును స సాయకంగా (బాణాలతో సహా ) అప్రమేయుడైన వరుణుని హస్తంలో ఉంచాడు పుణ్యుడు శ్రీరామచంద్రుడు . ప్రముఖులైన వసిష్ఠాది ఋషులకు వందనం చేసాడు . విహ్వలుడై ఉన్న తండ్రికి అంజలి ఘటించి ” పరశురాముడు వెళ్ళిపోయాడు . నీచేత పాలింపబడే చతురంగ బలాలతో కూడిన సేన అయోధ్యాభిముఖంగా బయలుదేరవచ్చు . మహా రాజా ! బయలుదేరమని తమ సైన్యాన్ని ఆజ్ఞాపించండి . చాతక పక్షి జలాన్ని కోరినట్లుగా సైన్యం అయోధ్యాభిముఖంగా బయలు దేరడానికి తమ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నది “అని మధురంగా పలికాడు .