Monthly Archives: ఏప్రిల్ 2013

రామాయణం

బలి చక్రవర్తి వామనుని మాయలో పడిపోయినాడు . కోరిన కోర్కెలు తీరుస్తానని మాట ఇచ్చాడు . వామనుడు

ఒంటివాడ నాకు నొకటి రెండడుగులు , మేర యిమ్ము సొమ్ము మేరయొల్ల
గోర్కిదీర బ్రహ్మకూకటి ముట్టెద , దానకుతుకసాంద్ర దానవేంద్ర

ఒంటరిని . రెండుమూడడుగుల భూమిని నాకు దానమివ్వు . ఈ చిన్ని కోరిక తీరితే ” బ్రహ్మ కూకటి ” ముడతాను  (బ్రహ్మానందం పొందుతాను )  అని బలిచక్రవర్తితో  పలికాడు  . అమాయకుడు బలి . తనకు వస్తున్న  ఆపదను గుర్తించలేక పోయాడు . అమాయకంగా  ” విప్రుడా ! నీవు చెప్పేది నిజమే . కొంచెమే అడిగినావు . కానీ ఇచ్చేవాడి గొప్పతనాన్నీ , సంతోషాన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి .

వసుధాఖండము వేడితో ? గజములన్ వచ్ఛించితో ? వాజులన్
వెస నూహించితో ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో  ?
పసిబాలుండవు ; నేర వీ వడుగ ; నీ భాగ్యలీపాటిగా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే ?

నీవు పసిబాలుడవు . భూభాగాన్ని కోరినావా ? ఏనుగులను కోరినావా ? కనీసం  అందమయిన అమ్మాయిలనూ కోరలేదు ? నీకసలు అడగడం తెలియదు . మూడడుగుల నేల నడుగుతావా ? అడిగితే మాత్రం ఇంత పెద్ద   రాక్షస రాజైన నేను  ఇంత అల్పమైన కోరికను తీర్వాలా ? ఇదేమీ బాగాలేదు . ఏదైనా  పెద్ద కోరిక కోరు , అని వామనునికి హితవు పలికాడు .

అడిగేవాడు తనను అతి తక్కువ అడుగుతున్నాడని బాధపడే దాత మొట్టమొదటి సారిగా బలి చక్రవర్తి రూపంలో మనకు కనిపిస్తాడు . బలిచక్రవర్తి  మనస్సులోని మాటలను అలతిమాటలలో , అందమైన పద్యరూపంలో , అడగకుండానే మనకు వరప్రసాదంలాగా తెలిపిన పోతనకు మరోసారి వందనం .

రామాయణం

బలి చక్రవర్తి భగవంతుని నీవెవరు నీకేమి కావాలి అని అడిగాడు కదా . పరమాత్మ జవాబు వినండి .

ఇది నాకు నెలవని ఏరీతి బలుకుదు ? నొకచోటనక యెందు నుండ నేర్తు
నెవ్వనివాడ నం చేమని పలుకుదు ? నాయంతవాడనై నడవనేర్తు
నీ నడవడి యని యెట్లు వక్కాణింతు , బూని ముప్పోఅకల బోవ నేర్తు
నది నేర్తు నిది నేర్తు నని యేల చెప్పంగ , నేరువులన్నియు నేన నేర్తు

నొరులుగారు నాకు నొరులకు నేనౌదు , నొంటివాడ జుట్టమొకదు లేడు
సిరియు దొల్లి గలదు చెప్పెద నా టెంకి , సుజనులందు దఱచు సొచ్చియుందు

“ఇందుగలడందు లేడనే ” సందేహం లేకుండా జగమంతా ఉంటాను . నేనెవరి వాడనూ కాదు , స్వేచ్ఛగా ఉంటాను ( బంధాలేవీ లేవు ) , అది ఇది అనకుండా అన్ని విద్యలూ నాకు తెలుసు . ఇతరులు నాకేమీ కారు . అందరికీ నేనవుతాను . ఒంటరి వాణ్ణి . మొదట్లో సిరి (లక్ష్మి ) ఉండేది . సహజంగా ఎక్కువ కాలం మంచివారితో కలిసి మసలుతుంటాను .
చెప్పాల్సిందంతా నర్మగర్భంగా చెప్పాడు వామనుడు . జవాబు సరియైనదే , కానీ అర్థం చేసుకోవడం కష్టం . అయినా పరమాత్మను అర్థం చేసుకోవడం అంత సులువా ? దానికి ఆ స్వామి అనుగ్రహం ఉండాలి .
“నా విషయం అట్లా ఉండనీ . నీ వంశం మంచి కీర్తి కలది . ధర్మంతో కూడింది . మీ పూర్వీకులు కరుణామూర్తులు , ఘనతత్వమూర్తులు ( ఫిలాసఫర్స్ ) . వీరులూ , దానమూర్తులు కూడ . మీ తాత ప్రహ్లాదుడు గగన మార్గంలో పయనించే చంద్రుని కాంతికన్న మిన్నయైన కాంతితో ప్రకాశిస్తున్నాడు . మీ వంశ కీర్తి సముద్రం పొంగినట్లు పెంపారుతుంది ” అని  చెబుతూ  బలి   దృష్టిని   తన  మీదనుండి  ఇతర  విషయాల వైపు మరల్చాడు .
అని బలి చక్రవర్తినీ , అతని వంశాన్నీ పరిపరి విధాల పొగిడాడు .

రామాయణం

ఆ పొట్టి బ్రహ్మచారి ఒయ్యారంగా వంగుతూ , వాలుతూ , మెల్ల మెల్లగా బలి చక్రవర్తి సమీపానికి చేరాడు . దర్భలతో , పవిత్రాక్షతలతో ఉన్న తన కుడిచేతిని ముందుకు జాచి :
స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు , హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు , నుదారపదవ్యవహర్తకున్ , మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు ,నిర్జరీగళ
న్యస్తసువర్ణ సూత్ర పరిహర్తకు , దానవలోక భర్తకున్

మూడులోకాలను శాసించే రాక్షస సార్వభౌముడికి శుభమగుగాక అని దీవించాడు .
ఆ దానవలోక భర్తను మధురమైన పదాలతో పొగిడి ఆ చక్రవర్తి దృష్టిని ఆకర్షించాడు . పొగడ్తకు పొంగని మానవుడు కాదు కాదు దానవుడు ఎవడైనా ఉంటాడా ? బలి చక్రవర్తి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు . వడుగా నీపేరేమిటి ? నీ తలిదండ్రులెవ్వరు ? నీవు రావడం చేత నా వంశమూ , జన్మమూ సఫలమయ్యాయి . ఈ యజ్ఞమే పవిత్రమయ్యింది . ఈ కాలం నిజంగా కల్యాణ కాలం అని వామనుని పలకరించాడు . అంతే కాదు

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక ఏ మదిగెదో ధాత్రీ సురోత్తమా

వస్త్రాలూ , గోవులూ , ఫలాలూ , ఆవులూ , గుఱ్ఱాలూ , కన్యలూ , కమ్మని ఆహారాలూ , ఏనుగులూ , బంగారమూ , భవనాలూ ,గ్రామాలూ , పొలాలూ, భూభాగాలూ నీ ఇష్టం  . ఇవైనా  ఇవి కాక నీ ఇష్టమైన ఇతర వస్తులేవైనా ఇస్తాను . నీకేమి కావాలో కోరుకొమ్మన్నాడు .

రామాయణం

గుజగుజలు వోవువారును , గజిబిజి బడువారు జాల గలకల పడుచున్
గజిబిజి యైరి సభాస్థలి , బ్రజలెల్లను బొట్టివడుగు బాపని రాకన్

గట్టివాడైన పొట్టి బాపడు బలి చక్రవర్తి సభలో ప్రవేశిం చాడు . సభాసదులందరూ వామనుని వైపు ఆకర్షితులయ్యారు . కొందరు గజిబిజి పడ్డారట . ఇంకొందరు గుసగుసలాడారట . కొందరు తికమకపడితే కలకల శబ్దం చేసిన వారు మరికొందరు .

పుట్టుకే లేని ఆ పొట్టివడుగు సభలో సామవేదం పఠించే ఉద్గాతల గానం విన్నాడు , మంత్రార్థాలను వివరిస్తూ హోమం చేస్తున్న హోతలనూ కలుసుకున్నాడు , హోమకుండాన్ని వెలిగిస్తున్న ఋత్విజులను పలుకరించాడు , యోగవిధులను నేర్పిస్తున్న సభాపతులను చూచాడు . కొందరితో వాదం చేసాడు , కొందరితో కలిసి వేదాన్ని చదివాడు , ఇంకొందరితో నవ్వుతూ చక్కగా మాట్లాడాడు . అందరినీ హాస్యోక్తులతో నవ్వించాడు .
సభలో చతురతతో సభాసదుల దృష్టిని ఆకర్షించడానికి చేయవలసిన కార్యాలన్నీ చేసాడు వామనుడు — మరి బలి చక్రవర్తి దృష్టిలో పడాలి కదా !

వెడవెడ నడకలు నడచుచు , నెడనెడ నడుగిడగ నడరి యిల దిట బడగా
బుడి బుడి నొడవులు నొడవుచు , జిడిముడి తడబడగ వడుగు సేరెన్ రాజున్ .

బుడబుడ నడతలు నడుస్తూ , కొన్ని ప్రదేశాలలో భూమి కుంగి పోతూండగా అడుగులు చక్కగా వేయలేక కష్టపడినట్లు నటిస్తూ , తడబడుతూ , బలి చక్రవర్తి సమీపానికి చేరాడు ఆ మాయా బ్రాహ్మణ బాలుడు .
ఈ పద్యం నడక పొట్టివాడైన వామనుడు నడిచినట్లే ఉంటుంది . లఘువులతో తడబడుతూ , చదవడానికి అంత అనుకూలంగా వుండకుండా , వామనమూర్తి బుడ బుడ నడతలాగా నడుస్తుంది ఈ కంద పద్యం . కింద పడుతూ లేస్తూ నడిచే వామన మూర్తిని మనకు సాక్షాత్కరింప జేస్తాడు పోతనామాత్యుడు . పోతన తప్ప ఇటువంటి పద్యాన్ని ఎవరూ రాయలేరని నా ప్రగాఢ విశ్వాసం . ఆ మహానుభావునికి మరోసారి వందనం .

రామాయణం

రామాయణంలో వాల్మీకి మహర్షి వామనకథను క్లుప్తంగా చెప్పారు . కానీ తెలుగువారి భాగ్యం కొద్దీ పోతన ఈ ఘట్టాన్ని తేనెలూరే పద్యాలలో మనకందించాడు . కొన్ని పద్యాలను మననం చేసుకొని జన్మను ధన్యం చేసుకుందాం .

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రవణద్వాదశినాడు శ్రోణ నభిజిత్సంజ్ఞ్జాత లగ్నంబునన్
భువనాధీశుడు పుట్టె వామనగతిన్ బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకున్ బరమ పాతివ్రత్య విఖ్యాతకున్

“మిట్టమధ్యాన్నం . శ్రావణ మాసం . శ్రవణా నక్షత్రం . ద్వాదశి . అభిజిత్ లగ్నం . పట్టపగలు . గ్రహాలూ , తారలూ ఉచ్చదశలో ఉన్నాయి . నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి , చెవులమీద మకరకుండలాలు మెరుస్తూ ఉండగా వక్షం మీద శ్రీవత్స చిహ్నంతో , ఇంకా ఎన్నో అలంకారాలతో అదితి గర్భంలోనుండి అవతరించాడు ఆదిదేవుడు

శంభుండో హరియో పయోజభవుడో చండాశుడో వహ్నియో
దంభాకారత వచ్చెగాక , ధరణిన్ ధత్రీసురుం డెవ్వదీ
శుంభద్యోతను డీ మనోజ్ఞతను డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబుగన్

” పరమేశ్వరుడా ? పయోజభవుడా (బ్రహ్మ) ? పద్మనాభుడా ? గర్భంలో అగ్ని నింపుకొన్న సూర్యభగవానుడా ? లేక స్వయంగా అగ్నిదేవుడే కాదుకదా ? కాంతితో కమనీయంగా కనిపిస్తూ నేత్రాలకు విందుచేసే ఈ బ్రహ్మచారి ఎవరబ్బా ? ” అని గుసగుసలాడారట వామనుని చూసిన వారంతా .

నిజ నేత్రాలతో చూడలేకపోయినా మనోనేత్రంతో వామనమూర్తిని చూపించాడు మహానుభావుడు పోతన . వామనమూర్తి రూపం మన కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు పోతన . ఒక సారి కళ్ళు మూసుకొని పద్యపాదాలను మననం చేసుకొంటే మనకు దర్శనమిస్తాడు వామన మూర్తి . దర్శనం చేసుకున్న వారికి అనంతమైన సుఖమూ , అంతులేని ఆనందమూ కలుగుతాయి .

 

అయం  సిధ్ధాశ్రమో  నామ  ప్రసాదాత్తే   భవిష్యతి
సిధ్ధే   కర్మణి  దేవేశ   ఉత్తిష్ఠ భగవన్నితః
అథ విష్ణుర్మహాయేజా  ఆదిత్యాం  సమజాయత  
వామనం  రూపమాస్థాయ   వైరోచనిముపాగమత్
త్రీన్  క్రమానథ  భిక్షిత్వా   ప్రతిగృహ్య   చ మానదః
అక్రమ్య  లోకాన్  లోకాత్మా   సర్వభూతహితే  రతః
మహేంద్రాయ  పునః   ప్రదాన్నియమ్య   బలిమోజసా
త్రైలోక్యం  స మహాతేజాశ్చక్రే  శక్రవశం  పునః
” నా  తపః  ఫలంగా  నీవు  అదితి గర్భాన  చేరావు . నా  తపస్సు  సిధ్ధించిన కారణంగా  ఈ  ఆశ్రమం  సిధ్ధాశ్రమంగా  ప్రసిధ్ధి  చెందుతుంది ”  అని కశ్యప మహర్షి  పలికాడు . మహర్షికి  ఇచ్చిన  మాట  ప్రకారం  పుట్టుకే లేని  నారాయణుడు  వామన  మూర్తిగా  అదితి  గర్భాన  ఉదయించాడు .  బలిచక్రవర్తిని  మూడడుగులు  యాచించాడు . మహా  దాత  బలి   మూడడుగులు   దానమివ్వగానే  విశ్వరూపాన్ని  దాల్చి  ముల్లోకాలలో  వ్యాపించాడు . అదితికి ఇచ్చిన  మాట ప్రకారం ,  దానంగా  గ్రహించిన  లోకాలను  మహేంద్రుని  వశం  చేసాడు .

శ్రీమద్రామాయణంలో  వామన  చరిత్ర  సూక్ష్మంగా  ప్రస్తావించబడ్డది .  విపులంగా  వామన కథను  ఆనందించాలంటే   పోతన  రాసిన  భాగవతాన్ని  చదవాలి . చదివిన  వారి  జన్మ చరితార్థమవుతుంది .  భాగవతంలోని  కొన్ని పద్యాలు  రేపటి దినాన మనం  మననం  చేసుకుందాం .